మిఠాయిపొట్లం మల్లెపూలు తెస్తానని నన్ను
బులిపించి కూలి పైసలన్ని గుంజుకు పోతే,
మురిసి పోయి శెట్టి అంగడిలో ఖాతా రాయించి,
సెంటు వాసన సబ్బు తెచ్చుకొని
కట్టెల పొయ్యి మీద నీళ్లు సలసలా కాచుకొని
సగం సబ్బు ఆరిగేదాక తానమాడి
సంతలో ఇన్నూరు రూపాయలెట్టి కొన్న సరిగంచు సీరగట్టి,
పైస పైసా దాసుకొని మూటల ఎనకన్న తాను కొన్న
అద్దాల జాకెట్టు మురిసి పోతు తొడిగి,
పాండ్స్ పోడరు పది సార్లు ముఖానికి పూసుకొని,
పూసాల ఫున్నెమ్మ దగ్గర గీసి గీసి బేరమాడిన
కాజల్ కాటుక కనులకు ఇంపుగా రాసుకొని
శింగారు తిలకం చంద్రవంకలా దిద్దుకొని,
మావ మల్లె పూవులు తెత్తాడని
ఒత్తుగా కొబ్బరి నూనె రాసి గట్టిగా సిగ ముడిసి,
పండక్కని దాసిన సన్న బియ్యం తీసి కూడండి,
ఉట్టి మీది నుంచి అట్టి సేపలు దించి
ఘుమఘుమలాడే చారు కాసి
నులక మంచం బిగించి చారల చెద్దరు పరిచి...
అలసిపోయి నా పెనిమిటి వస్తాడని
ముసిముసిగా నవ్వుకుంటూ
నీళ్లు మరగ కాసి
గోరంచు ధోతి మురిపంగా గుండెకత్తుకొని
గడప దగ్గర సందు మలుపు దాక సూపు పారించి
సిలకలా కూకుంటే,
కాలు కదపలేనంతగా తూలుతూ
ఇప్ప సారా ఫుల్లుగా తాగి తూలుకుంటు వచ్చి,
నీకెందుకే ఈ సిన్నేలు అంటూ
బొక్కలన్ని ఇరిగేటట్టు దొర్లించి దొర్లించి కొట్టి
తూగుతూ నడిమింట్లో పడిపోయే..
సరిగంచు సీర మట్టి కొట్టుకుని నలిగిపోయే,
జాకెట్టు లోని అద్దాలన్ని రాలి నేలపాలయే
శింగారు తిలకం సెమటతో తడిసి ముక్కు మీదకు పారే
అద్దిన కాటుకు కళ్ల నీళ్ళతో తడిసి
కాలువలై సెంపల మీదికి దిగి పౌడరంత కొట్టుకు పోయే
సన్నబియ్యం కూడు సప్పగా సల్లారి పోయే,
అట్టి సేపల కూర మూకుట్లో ఉండీ పోయే
మంచం మీది సారల సెద్దరు నన్ను సూసి
ఇదేమి నీకు కొత్త కాదు కదా అని ననెక్కిరించే!
అవును. ఇది రోజు ఉండే భాగోతమే కదా!
ఇక గింతే ఈ బతుకు అంత నా తలరాత..
పెయ్యిఅంత నొప్పులతో అట్లనే ఊసురుమంటూ
ఎన్నెలంక సూస్తూ ఉండీపోతి కోడి కూసే జాముదాకా...