Menu Close
పెళ్ళిసందడి (నాటిక)
-- గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం --

రాకేష్ - " సర్, ఫంక్షన్సులో మేం తీసిన ఫోటోల ఆల్బమ్ చూపించమన్నారా."

ప్రసాద్ - " తెండి; చూద్దాం."

(రాకేష్, ఆల్బమ్ ను వినయంగా ప్రసాద్ కు అందించి పక్కనే తనూ ఆల్బమ్ లోనికి చూస్తూ నిలబడతాడు.)

ప్రసాద్ - (ఒక్కొక్క పేజీ తిరగేసి  చూస్తూ) ఈ ఆల్బంలో పేజీలు ఏదో ప్లేస్టిక్ వాటిలా ఉన్నాయి. వాటి మీదే  డైరెక్టుగా ప్రింటు చేసినట్టున్నారు.”

రాకేష్ - "అవును సర్. ఇది లేటెస్టు టెక్నాలజి సర్.  "

ప్రసాద్ - " ఫోటోలు బాగున్నాయి. టెక్నాలజీ చాలా ఫాస్టుగా మారిపోతోంది." (ప్రసాద్ ఆల్బమును మూసి రాకేష్ కు అందజేస్తాడు)

(రాకేష్ ప్రసాద్ చేతిలో ఆల్బమ్ అందుకొని తన సీటులో కూర్చుంటాడు)

రాకేష్ - " సర్, పెళ్లి ఫంక్షన్ని లైవ్ స్ట్రీములో పెట్టగలమండి. పెళ్ళికి రాలేని బంధువులు, ఫ్రెండ్సు; ఇండియాలో ఎక్కడ ఉన్నా; ఏ కంట్రీలో ఉన్నా; ఫంక్షను అంతా చూడగలరండి. మేం లింకు ఇస్తాం సర్. అది వాళ్లకు పంపిస్తే; వాళ్ళ i Pad లో గాని TV స్క్రీను మీదగాని ఫంక్షను అంతా చూడగలరండి."

ప్రసాద్ - "అది చాలా అవసరం. ఆర్గనైజు  చెయ్యండి. రిజర్వేషన్సుకు టైము చాలక చాలామంది బంధువులు, ఫ్రెండ్సు పెళ్ళికి రాలేక  పోతారు. వాళ్లకి useful గా ఉంటుంది."

( అంతలో సంతోషి ప్రవేశిస్తుంది)

సంతోషి  - "ఇదేదో చాలా బాగుందండి. సీతాలు పెళ్ళికి కూడా ఇటువంటిదే పెట్టిస్తే దాని పెళ్ళికి రాలేక పోయినవాళ్ళు కూడా పెళ్లి చూడగలరండి."

ప్రసాద్ - " సంతోషీ దాని పెళ్లి ముహూర్తం కుదరనీ, ఆ తరవాత దాని పెళ్లి విషయం మాట్లాడుకోవచ్చు."

సంతోషి  - " సరేలెండి; పనిలో పని అయిపోతుందని చెప్పేను. మీ విషయాలేవో చూసుకోండి. నాకు పని ఉంది. వెళతాను."

(సంతోషి వెటకారంగా పెదిమలు తిప్పి లోపలకు నిష్క్రమిస్తుంది)

రాహుల్ - " మా  కేటరింగు మెనూ చూపించమన్నారా, సర్."

ప్రసాద్ - "తెండి; చూద్దాం."

(రాహుల్ ప్రసాద్ కు దగ్గరగా వెళ్లి తన I pad లో మెనూ ఓపెన్ చేసి ప్రసాద్ కు అందిస్తాడు. )

రాహుల్ - " ఇది బ్రేక్ఫాస్ట్  మెనూ సర్. ఇడ్లి.. వడ.. పొంగల్.. చట్ని..సాంబారు, సర్. మీకు అవసరమయితే బ్రెడ్.. బటర్.. జాం.. కూడా యాడ్ చెయ్యగలమండి."

ప్రసాద్ - "మెనూ బాగుంది. బ్రెడ్.. బటర్.. అవి కూడా యాడ్ చెయ్యండి. మన ఇడ్లి వడ తినలేనివాళ్లు అవైనా తింటారు."

రాహుల్ - "అలాగే  సర్... సర్. లంచ్ మెనూ చూస్తారా."

ప్రసాద్ - "చూపించండి."

(రాహుల్ I pad లో నుండి లంచ్ మెనూ చూపిస్తాడు)

ప్రసాద్ - "ఇది బాగానే ఉంది; కాని, పెళ్ళివారు ట్రెడిషనల్ పెళ్లి భోజనం ఏర్పాటు చెయ్యమన్నారట."

రాహుల్ - "మేం ట్రెడిషనల్ మెనూ కూడా ఏర్పాటు చెయ్యగలం సర్. అది చూపిస్తాను సర్."

(రాహుల్ I pad లో ట్రెడిషనల్ మెనూ చూపిస్తాడు )

ప్రసాద్ - " ముద్దపప్పు.. ముక్కలపులుసు... ఆ.. ఇదే వాళ్లకు కావలిసింది."

రాహుల్ - "అయితే ఇది ఓకే యా సర్."

ప్రసాద్ - "ఆ.. this is okay."

రాహుల్ - (I pad లో చూపిస్తూ) "ఇది డిన్నరుకు ట్రెడిషనల్ మెనూ సర్."

ప్రసాద్ - "ఇది బాగానే  ఉంది... రాత్రిపూట గోధుమరొట్టెలు తినేవాళ్లు కొందరు ఉండొచ్చు. వాళ్లకి గోధుమరొట్టెలు, వాటితో వెళ్లే రెండు కూరలు కూడా ఎవైలబులుగా ఉంచండి.”

రాహుల్ - "అలాగే సర్."

(ప్రసాద్ I pad ను రాహుల్ కు అందిస్తాడు. అది అందుకొని రాహుల్ తన సీటుకు వెళ్లి కూర్చుంటాడు.)

ప్రసాద్ - "భోజనాలకు కూడా ట్రెడిషనల్ పద్ధతిలో ఏర్పాట్లు చెయ్యాలి. నీటుగా విస్తరాకుల్లో వడ్డించాలి."

(అంతలో సంతోషి ప్రవేశించి)

సంతోషి - "విస్తరాకులు.. అంటారేమిటండి. లక్షణంగా అరిటాకులలో వడ్డించాలి."

రాహుల్ - "ట్రెడిషనల్ భోజనాలు; మేం అరిటాకులలోనే వడ్డిస్తాం మేడం."

రమేష్ - "సర్, వేరే బఫె ఎరేంజ్మెంట్సు కూడా చెయ్యమన్నారా."

సంతోషి - "అది చాలా అవసరం. అది కూడా చెయ్యాలి."

ప్రసాద్ - "అవును; పెళ్ళికి వచ్చిన కొందరు; ట్రైనో.. ఫ్లయ్టో.. కేచ్ చెయ్యడానికి తొందరలో ఉంటారు. వాళ్లకు అది అవసరం. బఫె ఎరేంజ్మెంట్సు కూడా చెయ్యండి."

రాహుల్ - "అలాగే సర్."

సంతోషి - "వంటల్లో ఉప్పు, కారాలు ఎక్కువగా ఉండకూడదు."

రాహుల్ - "మీడియం లెవెల్ లో ఉంటాయి మేడం గారు."

ప్రసాద్ - "That is okay."

సంతోషి - "వంటింట్లో పని ఉంది; నేను వెళతాను. భోజనాల విషయంలో మీకు ఏదయినా డౌటు ఉంటే నన్ను కాంటేక్టు చెయ్యండి."

(సంతోషి నిష్క్రమించును)

ప్రసాద్ - (చిరు నవ్వుతో) " నిజమే, ఆవిడ నంబరు ఇస్తాను; భోజనాల విషయంలో ఏ డౌటు వచ్చినా ఆవిడనే అడగండి. వడ్డన్లు చేస్తున్నప్పుడు; విస్తరాకులో.. ఆవకాయ.. కుడి వైపు వడ్డించాలా.. ఎడమవైపు వడ్డించాలా అని మీరు నన్నడిగితే; నేను ఆవిడనే కనుక్కోవాలి."

సంతోషి - (తొందరగా ప్రవేశించి) "మళ్ళీ, విస్తరాకులంటున్నారేమిటండి. చెప్పేనుగా ..అరిటాకులు..అని. మీరు ఇలా వాళ్ళని కన్ఫ్యూజు చెయ్యకండి."

రాహుల్ - "సారు తొందరలో విస్తరాకులు అని ఉంటారు మేడం. అరిటాకులనే నోట్ చేసుకున్నాం మేడం."

సంతోషి - "అయితే ఫరవా లేదు."

(సంతోషి నిష్క్రమించును)

రమేష్ - "సార్, మేం ఒక స్పెషల్ సర్విస్ కూడా ఆఫర్ చెయ్యగలం. అది లేడీస్ కి చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది సార్. మీరు టైము ఇస్తే అది చెప్తాను సర్."

ప్రసాద్ - "లేడీస్ కి యూజ్ఫుల్ అంటున్నారు; చెప్పండి; ఏమిటో అది."

రమేష్ - "పెళ్ళిళ్ళకి చాలా మంది లేడీస్; వాళ్ళ దగ్గర ఉన్న ఖరీదయిన లేటెస్ట్ సారీస్ తెచ్చుకొంటారు సర్."

ప్రసాద్ - " అవును. మీరు బాగా అబ్జర్వు  చేసినట్టున్నారు."

(అంతలో అది విని సంతోషి ప్రవేశించి భర్త పక్కన కూర్చుంటుంది)

రమేష్ - "ఆ చీరలు మార్చి మార్చి కట్టుకోడానికి వాళ్లకు చాలా టైము పడుతుంది సార్. మార్చుకోడానికి టైము లేక.. తెచ్చుకొన్న చీరలన్నీ కట్టుకోలేక.. డిసిపోయింట్ అయిపోతారు సర్.”

ప్రసాద్ - "మీరు లేడీస్ సైకాలజి బాగా స్టడీ చేసినట్టున్నారు.”

సంతోషి  - "అతను చెప్పింది నిజమేనండి. ఇదివరకయితే పెళ్లిళ్లు మూడు రోజులయ్యేవి. తెచ్చుకొన్న చీరలు కట్టుకోడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదుగా. పెళ్లిళ్లన్నీ ఒక్క రోజులో అయిపోతున్నాయ్. తెచ్చినవన్నీ ఏదో ఒకలాగా చుట్టపెట్టీసుకున్నా బాగుండదు కదా.”

ప్రసాద్ - "అది నిజమే. కాని; ఇందులో మీరేమిటి చేస్తారు."

రమేష్ - "మా దగ్గర బాగా ఎక్సపీరియెన్సుడు లేడీస్ ఉన్నారండి. వాళ్ళు కట్టుకొన్న చీర మార్చి; మరో చీర అయిదు నిమిషాలలో అందంగా కట్టగలరండి."

(తన దగ్గర ఉన్న I pad ను ప్రసాద్ కు అందించి)

రాకేష్ - “ఇది, మన వాళ్ళు సాధారణంగా కట్టుకొనే పధ్ధతి సర్."

ప్రసాద్ - ( సంతోషితో ) "ఇవేవో నువ్వు చూడు.”

( సంతోషి I pad లోనికి దగ్గరగా చూడనారంభిస్తుంది )

సంతోషి - "చాలామంది ఆడవాళ్లు ఇంత చక్కగా కట్టుకోలేరు."

రాకేష్ -  ( మరొకటి చూపిస్తూ ) "ఇది రాజస్తానీ స్టయిల్ మేడం. పల్లూ వెనకనుండి ముందుకు వేసుకొంటారు మేడం. పల్లూ బాగా డిస్ప్లే అవుతుంది."

సంతోషి - "ఇది బాగుంది. కాని పెద్దవాళ్లకు బాగుంటుందా… అని."

రాహుల్ - "పెద్దవాళ్ళు కూడా; కొందరు కట్టుకొంటున్నారు మేడం."

సంతోషి - "అవును; రోజులు మారేయి."

రాకేష్ -  "ఇది మరో పధ్ధతి మేడం..... ఇది మరొకటి మేడం."

సంతోషి - (భర్తతో) "ఈ సర్వీసు ఎక్కువ ఆడవాళ్లు ఇష్టపడొచ్చండి. ఇది కూడా ఎరేంజ్ చేయించండి."

ప్రసాద్ - "మేడం గారు రికమెండు చేస్తున్నారుగా. ఇది కూడా ఆర్గనైజు చెయ్యండి.”

రాకేష్ - "అలాగే సర్. Thank you మేడం గారు.”

(రాకేష్ I pad తో తన సీటు చేరుకొంటాడు)

సంతోషి  - "నాకు వంటింట్లో పని ఉంది; వెళతాను."

( సంతోషి నిష్క్రమించును )

రమేష్ - " సార్, మా దగ్గర మరో స్పెషల్ సర్వీస్ ఉందండి. అది ముఖ్యంగా మినిస్టరుగారు వంటి పెద్దవాళ్లు లైక్ చేస్తారండి.”

ప్రసాద్ - " ఏమిటా  సర్వీసు."

రమేష్ - " ఇమేజ్ బిల్డింగ్ అని; ఈ మధ్యనే స్టార్ట్ చేసేమండి."

ప్రసాద్ - " ఇమేజ్ బిల్డింగా! పెళ్లిళ్లలో ఆ సర్వీస్ ఏమిటి. ఎప్పుడూ వినలేదు. సరే; అదేమిటో చెప్పండి."

****సశేషం****

Posted in March 2023, నాటికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!