- సొంత సుఖము చూసుకుంటే, పనికిరారు ఎవ్వరికి!
పరుల సుఖము కోరుకుంటే, ధన్యజీవులెన్నటికి!! - ప్రతిఫలమును కోరకుండగ, బ్రతుకు తరువే ధన్యము!
దోచుకుంటే పరుల ధనము, బ్రతుకున మిగులు శూన్యము!! - నైతిక విలువలు కొరవడిన, బ్రతుకులు గాడి తప్పును!
వ్యక్తి పద్ధతిగ బ్రతికితే, సంఘము గౌరవించును!! - మనుషులు దూరమైనపుడే, మనసులు దగ్గరవునులె!
కోల్పోకనే విలువనెరిగి, నిలుపుకొనుము బంధములె!! - దుఃఖము అనుభవించవలె, ఒంటిరిగానె యెప్పుడు!
సుఖమును పంచుకోవలెలే, పదిమందితోనెప్పుడు!! - నమ్మినవారినే మనుజుడు, వెన్నుపోటు పొడుచునుగ!
జంతువైనను సాకినచో, విశ్వాసము చూపునుగ!! - ప్రణాళికలు లేని యోజన, నడిసంద్రంలో నావ!
వ్యాపకమన్నది లేకుంటే, బ్రతుకొక చిల్లుల పడవ!! - జ్ఞానము లేని వాడినెపుడు, పండితునిగ చూడకుము!
మాయల ఫకీరులనెపుడూ, దైవములని తలచకుము!! - నలుగురితో కలిసి నడచుట, నాయకత్వ లక్షణము!
తానడిచినదె దారియనుట, అవివేకుల లక్షణము!! - కులమత వర్గములు మనిషే, సృజన చేసేను నాడు!
జాతిని కాల్చు నిప్పులవని, తెలిసి వగచేను నేడు!! - దేశ భాషలన్నిటియందు, తెలుగు భాషే మధురము!
భాషలెన్ని నేర్చుకున్నను, మాతృభాష మరువకుము!!
Posted in April 2024, సాహిత్యం