వీక్షణం 134వ సాహితీ సమావేశం జూమ్ వేదికగా డాక్టర్ కె.గీతామాధవి గారి అధ్యక్షతన అక్టోబర్ 14 వ తేదీ శనివారం సాయంత్రం సుమారు మూడు గంటలపాటు జరిగింది. కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. వివిధ దేశాలనుండి వక్తలు, కథకులు, కవులు, కవయిత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ కవి శ్రీ వసీరా, ప్రముఖ యువ కథా రచయిత శ్రీ వి.మల్లికార్జున్ పాల్గొన్నారు.
“వసీరా” గా ప్రసిద్ధి చెందిన వక్కలంక సీతారామారావు పుట్టింది, చదివింది కోనసీమ లోని అమలాపురం. జర్నలిస్ట్ గా వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లలో దాదాపు 30 స.రాలు పైనే పనిచేసారు. లోహనది, మరోదశ, సెల్ఫీ కవితా సంకలనాలు రాసారు. “లోహనది” కి ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డు, గరికపాటి అవార్డులు వచ్చాయి.
ముందుగా ప్రత్యేక ఆహ్వానితులు ప్రముఖ కవి, జర్నలిస్ట్ 'వసీరా' గారు తమ కవితాపఠనంతో హృదయాలని ద్రవింపచేశారు అంటే అతిశయోక్తి కాదేమో! కవితాసృజనలోని మెలకువలు, సూచనలు, సలహాలు వర్ధమానరచయితలకు ఉపయోగపడేలా సోదాహరణంగా వివరించారు.
ఇటీవల విడుదలైన వారి కవితా సంపుటి "సెల్ఫీ" నించి మొత్తం మూడు కవితల్ని వినిపించారు. మొదటిది హథ్రాస్, ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ అనే చోట ఒక దళిత బాలిక మీద అగ్రవర్ణాలకు చెందిన వారు అతి క్రూరంగా అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటనని ఖండిస్తూ రాసిన కవిత. హథ్రాస్ కవిత 2020 లో నెచ్చెలి అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది. ఇందులో బాలికని కాళికతో పోలుస్తూ రాసిన కవితాత్మక వాక్యాలు ఇలా ఉన్నాయి.
"విస్ఫోటించే నేల లోంచి కొత్త కాళిక ఆవిర్భవిస్తోంది.
సత్యానికి నోరిచ్చేందుకు సహస్రబాహువుల్లో
కొత్త ఆయుధాలు ధరించి
పరపరా సరసరా నాలుకలు కోస్తోంది
కోసిన నాలికలు మొల చుట్టూ అలంకరించుకుంది
......
అచ్చంగా పరపరా కలుపు మొక్కలు కోసినట్లుగా
పురుషాంగాలు కోసి మొలచుట్టూ అలంకరించుకుంటోంది"
అని ఆక్రోశాన్ని వ్యక్తం చేసారు. తరువాత "బంగారుపాప", "ఏమో ఎవడికి తెలుసు" కవితల్ని వినిపించి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు.
ఆ తర్వాత డా.గీత గారు వర్ధమాన కవులకు ఉపయోగపడేలా వచన కవితాసృజనలోని మెలకువలు, సూచనలు, సలహాలు తెలియజెయ్యమని వసీరా గారిని అడిగినప్పుడు అత్యంత ఆసక్తికరంగా, సోదాహరణంగా వివరించారు.
తరువాత శ్రీ వి.మల్లికార్జున్ గారి కథా పఠనం జరిగింది. 1992లో నల్లగొండ పట్టణంలో పుట్టి పెరిగిన మల్లికార్జున్, ఇంజినీరింగ్ చదివి కథల మీద ఇష్టంతో సాహిత్యరంగం వైపు వచ్చారు. 2014 నుంచి కథలు రాస్తున్నారు. ఇప్పటివరకు ‘ఇరానీకేఫ్’, ‘కాగితం పడవలు’, ‘నల్లగొండ కథలు’ కథాసంపుటాలు వెలువరించారు. గతంలో సాక్షి, వెలుగు దినపత్రికల సండే మ్యాగజైన్లలో పనిచేసి, ఆ తర్వాత సొంతంగా ‘అజు పబ్లికేషన్స్’ పేరుతో పుస్తక ప్రచురణ సంస్థను నెలకొల్పి పది పుస్తకాలు ప్రచురించారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. 2023లో మల్లికార్జున్ తన రచనలకు గానూ డా. వి. చంద్రశేఖరరావు సాహిత్య పురస్కారం అందుకున్నారు.
ఈ సమావేశంలో 'నల్లగొండ కథలు' అనే కథా సంపుటి నుండి మా అమ్మ ముత్యాలు, మా నాన్న మారయ్య అనే కథల్ని చదివి వినిపించారు. తమ బాల్యం, ఊరు, అమ్మ, నాన్నలతో అనుబంధాన్ని తెలియజేస్తూ, ప్రత్యేకంగా మాండలిక యాసలో సాగిన కథాపఠనం విశేషంగా ఆకట్టుకుంది. శ్రోతలని తమ తమ బాల్యపు అనుభవాలను నెమరువేసుకునేలా చేసింది.
"అప్పట్నించి మా అమ్మ మళ్లా చెవులు కుట్టిచ్చలేదు. ఎడమపక్క చెవి గింతంత తెగి పక్కకి జరిగి ఉంటది. నాకు ఆ గింతంత చెవి ముక్క పట్టుకొని మా అమ్మ పక్కన కూసొని ముచ్చట చెప్పుడంటే పిచ్చి ఇష్టం."
"‘‘ఏం పేరే ఆయనది?’’ అనడిగిన. ‘‘ఏమో పేరుండెనేరా?’’ అని చానాసేపు ఆగిండు. ‘‘ముసిలిమోల్ల పిల్లగాడురా, చానా మంచోడు, చూసినవుగా!’’ అన్నడు మా నాన్న."
వంటి ఆర్ద్రమైన వాక్యాలు సభలోని వారికి కంట తడి పెట్టించాయి. ఈ కథలన్నీ ఆశువుగా చెప్పినట్టు అల్లడం ప్రత్యేకత. అలాగే ఈ కథల్లో ఎత్తుగడ, ముగింపులు అలవోకగా కనిపించినా కథ చెప్పే మంచి టెక్నిక్ ని ఔపోసన పట్టినట్టు ఉంటాయి.
ఆ తరువాత జరిగిన కవిసమ్మేళనంలో శ్రీధరరెడ్డి బిల్లా, దాలిరాజు వైశ్యరాజు, బాలకృష్ణారెడ్డి తాటిపర్తి, డా.కె.గీత, డా.సంధ్యారాణి కొండబత్తిని, మండ వీరస్వామి గౌడ్, గుర్రం మల్లేశం, ఆకుల అయోధ్య, గడిపె మల్లేశు, షేక్ రహీం సాహెబ్, మచ్చా రాజమౌళి, సరస్వతి రాయవరపు, చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, విజయలక్ష్మి మల్కని, అరుణ జ్యోతి, సత్యవతి యెడ్ల, షేక్ అమీనా కలందర్,
సావిత్రి రంజోల్కర్, అమృతవల్లి అవధానం, డాక్టర్ దేవులపల్లి పద్మజ, డాక్టర్ ఎం.ఎన్.బృంద, దేవి గాయత్రి, నారోజు వెంకటరమణ, పిళ్ళా వెంకట రమణమూర్తి, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, మేడిశెట్టి యోగేశ్వరరావు, ప్రసాదరావు రామాయణం, గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, సాదనాల వెంకటస్వామి నాయుడు, డాక్టర్ మోటూరి నారాయణరావు మొ.న కవులు, కవయిత్రులు వైవిధ్య భరితమైన అంశాలపై కవితాపఠనంతో అలరించారు.
సరస్వతీ పుత్రిక డాక్టర్ గీతామాధవి గారు శతవిధాలా నిరంతరం ఎంతో శ్రమకోర్చి, వృత్తిని ప్రవృత్తిని సమన్వయo చేస్తూ సాహిత్యాభిలాషులను ప్రోత్సహిస్తూ క్రమం తప్పకుండా ప్రతినెలా అద్భుతమైన సాహితీ సమావేశాల్ని నిర్వహిస్తున్న వారి కృషికి అభినందన చందనాలు.
శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల గారు, శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గార్ల ఆత్మీయ సహకారాలు, స్పందనలతో సభ దిగ్విజయంగా ముగిసింది. అత్యంత విశేషంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.