Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం - 115 వ సమావేశం
కాళ్ళకూరి భక్త చింతామణి నాటకం- పరమార్థం & ఉగాది కవిసమ్మేళనం
-- వరూధిని --
vikshanam-115

వీక్షణం-115వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా మార్చి13, 2022 న ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశంలో ముందుగా "కాళ్ళకూరి భక్త చింతామణి నాటకం- పరమార్థం" అనే అంశం మీద శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు ప్రసంగించారు.

సమాజంలోని వ్యసనాలను ఎత్తి చూపుతూనే, నైతిక విలువలు బోధించే సందేశంతో పాటూ రసవత్తరంగా ఉండేలా రాసిన సాంఘిక నాటకాల్లో తెలుగునాట విశేష ఆదరణ పొందినవాటిలో చింతామణి కూడా ఒకటి. ఒక కులానికి చెందినవారిని అనుకరిస్తూ, హేళన చేసేలా ‘చింతామణి’ నాటకంలో ఒక పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నాటక ప్రదర్శనలను నిషేధించింది. అయితే ఒక పాత్ర విషయంలో సమస్య ఉంటే మొత్తం నాటకాన్నే నిషేధించడం సరికాదని నాటక రంగ అభిమానుల మాట. ఈ నేపథ్యంలో వీక్షణం ఈ అంశంమీద ప్రసంగించవల్సిందిగా నాటక రంగ ప్రముఖులు శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారిని కోరారు. అక్కిరాజు సుందర రామకృష్ణ గారు పద్యకవి, రంగస్థల సినిమా నటులు, గాయకులు, అధ్యాపకులు, మంచి వక్త. వీరి తండ్రి అక్కిరాజు రామయ్య, తల్లి అన్నపూర్ణమ్మ. గుంటూరు జిల్లా నరసరావుపేట లో 23 ఏప్రిల్ 1949లో జన్మించారు. ప్రముఖ రచయిత అక్కిరాజు రమాపతిరావు గారు వీరి సోదరులు. సుందర రామకృష్ణ హైదరాబాద్‌లో ఎం.ఎ., ఎం.ఓ.ఎల్.,ఎం.ఫిల్ చేశారు. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి వేంకటపార్వతీశకవులు - రామాయణ పద్యకృతులు అనే అంశం పై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. థియేటర్ ఆర్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు. అమ్మతోడు, కేశవామాధవా, కోనేటి రాయనికి, బాపూరమణా, తేనీటి విందు, కవీశ్వరా, శంకరనారాణీయము,రాజేశ్వరీ శతకము,శ్రీ శనీశ్వర శతకము,అమెరికాలో కవిసుందర్ - శ్యామసుందర్, కవితాశరథి దాశరథి,ఆంజనేయ శతకం, భీమన్న, భీమలింగ శతకం మొదలైన కావ్యాలు వ్రాశారు. వీరు గాయకులు, సంగీత దర్శకులూ కూడా. అనేక రంగస్థల నాటకాల్లో, సినిమాల్లో నటించారు.

సుందర రామకృష్ణ గారు తమ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఎన్నో సార్లు తాను ఏకపాత్రాభినయంగా కూడా  ప్రదర్శించిన ఈ నాటకం మీద ప్రసంగించడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు.

ముందుగా నాటక కథని, చింతామణి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ "చింతామణి నాటకం తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక నాటకం. ఇది ప్రథమాంధ్ర ప్రకరణముగా గుర్తింపుతెచ్చుకొన్నది. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా శ్రీ కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ప్రధానంగా వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకం లీలాశుకచరిత్ర ఆధారంగా రచించబడినది.

చింతామణి వేశ్య. ఆమె తల్లి శ్రీ హరి, చెల్లి చిత్ర. భవాని శంకరుడనే నియోగ బ్రాహ్మణుడు, సుబ్బిశెట్టి అనే వ్యాపారి ఆమె విటులు.ఆమె వారి ఆస్తి నంతా అపహరిస్తుంది. భవాని శంకరం ద్వారా అతని స్నేహితుడు, ధనవంతుడు, శీలవంతుడు, విద్యావంతుడు అయిన బిల్వమంగళుని ఆకర్షిస్తుంది. బిల్వమంగళుడు, ఆమె వలలో పడి భార్యను, వార్ధక్యంతో అనారోగ్యం పాలైన తండ్రిని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ఒక రోజు బాగా వర్షం పడుతున్న వేళ బిల్వమంగళుడు అర్ధరాత్రి నీటిలో తేలివచ్చిన ఒక దుంగ ఆధారంతో వాగు దాటి చింతామణి గృహం చేరుకొని తలుపులు వేసి ఉంటే గోడమీద వ్రేలాడుతున్న తాడు సాయంతో ఇంట్లో ప్రవేశిస్తాడు. దీపం తెచ్చి చూస్తే అది తాడు కాదు పాము. అదే విధంగా వాగు దాటడానికి సహకరించింది దుంగ కాదు బిల్వమంగళుని భార్య రాధ శవం. భర్త వాగు దాటడానికి పడవని పిలిచే ప్రయత్నంలో వాగులో పడి మరణిస్తుంది రాధ. చింతామణి బిల్వమంగళునికి తనపై ఉన్న వ్యామోహానికి విస్తుపోతుంది. ఆ సంఘటన తరువాత బిల్వమంగళునిలో పరివర్తన వస్తుంది. ఆ రాత్రి చింతామణికి శ్రీకృష్ణుడు కనబడతాడు. దానితో ఆమెలో వైరాగ్యం కలిగి సన్యసిస్తుంది. బిల్వమంగళుడు కూడా సోమదేవ మహర్షి పిలుపువల్ల ప్రభావితుడై ఆశ్రమ స్వీకారం చేసి అనంతర కాలంలో లీలాశుక యోగీంద్రుడుగా మారి శ్రీ కృష్ణ కర్ణామృతం అనే సంస్కృత గ్రంథాన్ని రాస్తాడు.

చింతామణి అందాల రాశి. సకల విద్యలు నేర్చిన నెరజాణ. సంగీత, సాహిత్యాల్లో నిష్ణాతురాలు. నాట్యంలో మయూరి. లోకానుభవానికి కొదవే లేదు.అయినా కులవృత్తి రీత్యా వేశ్య కాక తప్పలేదు. వేశ్యాకులంలో పుట్టినా సంస్కారవంతురాలు. కాబట్టే మంచీ చెడులవిచక్షణను గుర్తెరిగి ప్రవర్తించేది. తన వ్యామోహంలో పడి సర్వం సమర్పించుకొని, ఉత్తచేతులతో మిగిలిన భవానీ శంకరాన్ని బయటకు గెంటేయమంటుంది తల్లి శ్రీహరి. అయితే చింతామణి ఇందుకు ఓ పట్టాన అంగీకరించదు. తల్లికి నచ్చ జెప్పబోతుంది. నిజానికిచింతామణికి వేశ్యా కుల సహజ లక్షణాలు ఒంటబట్టలేదు. వేశ్యకు కూడా నీతి వుంటుందని చింతామణి నిరూపించింది. అందుకే చింతామణి ప్రియవస్య, సర్వాంగ సుందరి అంటాడు భవానీ శంకరం." అన్నారు.

అలాగే ఈ నాటకంలోని  అనేక విశేషాంశాల్ని తెలియజేసి, "కష్టభరితంబు బహుళ దుఃఖ ప్రదంబు", "వారాసి నడుమ", "అర్ధాంగ లక్ష్మి యైనట్టి ఇల్లాలిని", "అత్తవారిచ్చిన అంటుమామిడి తోట" వంటి ప్రసిద్ధ పద్యాల్ని రాగయుక్తంగా ఉదహరిస్తూ, ఆలపిస్తూ సభలోని వారికి వీనుల విందు చేసారు.

ఆ తర్వాత జరిగిన శుభకృత్ నామ సంవత్సర ఉగాది కవిసమ్మేళనంలో స్థానిక కవులు విశేషంగా పాల్గొని తమ కవితల్ని చదివి, పద్యాల్ని రాగయుక్తంగా ఆలపించి, గీతాలు పాడి ఉగాదికి స్వాగతం పలికారు. శ్రీ రావు తల్లాప్రగడ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉగాది కవిసమ్మేళనం లో శ్రీ రావు తల్లాప్రగడ "నీ తలపే" గజల్ ని, డా||కె.గీత "యుద్ధప్రశ్నలు" కవితని, "జంగమయ్యా" అనే అనుసృజన గీతాన్ని, శ్రీ మధు ప్రఖ్యా "పులిహోర" అనే హాస్య కవితని, శ్రీ మారుతి తన్నీరు "నా పైన నర్తించె నాగభూషణుడు" పాటని, శ్రీ సాయికృష్ణ మల్లవరపు విఘ్నేశ్వర స్తోత్ర పద్యాల్ని, శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ ఉగాది పద్యాల్ని, శ్రీమతి స్వాతి ఆచంట "హనుమంతుడు" కవితని, శ్రీ కృష్ణకుమార్ పిల్లలమఱ్ఱి ఉగాది పద్యాల్ని, శ్రీ దాలిరాజు వైశ్యరాజు"నిరాశ్రయుల వేదన" కవితని , శ్రీ తాటిపర్తి బాలకృష్ణారెడ్డి "కాలచక్రం" కవితని, శ్రీమతి నీహారిణి కొండపల్లి"రసహృదయాలు-రాగరంజితాలు" కవితని , శ్రీమతి గునుపూడి అపర్ణ"తాండవించె లక్ష్మి" గీతాన్ని, శ్రీ వెంకట సోమయాజి ధవళ "తెలుగువాడిని నేను" కవితని వినిపించారు.

స్థానిక సాహిత్యాభిలాషులు ఆసక్తిదాయకంగా పాల్గొన్న ఈ సభ జయప్రదంగా ముగిసింది. వీక్షణం-115వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో చూడవచ్చు.

Posted in April 2022, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!