రాతి యుగం నుండి నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన నాగరిక యుగం వరకు మనిషి జీవన సోపానం ఎన్నో మార్పులకు, సిద్ధాంతాలకు ఆలవాలమైనది. కాలంతో పాటు సామాజిక అభ్యున్నతికై, సామరస్య పూర్వక మనుగడ కొరకై ఎన్నో సంప్రదాయ బద్దమైన ధర్మాలు విరచించడం జరిగింది. మొట్టమొదటి మూగ భాష మొదలు మనిషి పరిజ్ఞాన పటిమతో ఎన్నో భాషలను సృష్టించాడు. మన వేదాలు ఆవిర్భవించినది సంస్కృత భాషలో కానీ కాలక్రమేణా వాటి విశిష్టతను, అందులోని ధర్మసూత్రాలను అనేక భాషలలోకి తర్జుమా చేసి సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా రూపొందించి తద్వారా స్వచ్ఛమైన నాగరిక ప్రపంచాన్ని సృష్టించేందుకు అన్ని సాహిత్య, శాస్త్రీయ, సామాజిక రంగాలలో ఎంతోమంది మేథావులు అవిరళ కృషి సల్పారు. నేటికీ చేస్తూనే ఉన్నారు.
‘ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం’ అని మహాకవి శ్రీ శ్రీ అన్నారు. ఒక విధంగా నిజమే. భాష అనేది మన జీవన సోపానం సమాజంతో కలిపి సాగించేందుకు ఉపయోగించే అనువైన సాధనం. పుట్టగానే మనిషికి రంగు రుచి వాసన అబ్బినట్లు, పెరుగుతున్నప్పుడు తన చుట్టూ ఉన్న కుటుంబం, సమాజం, వాతావరణానికి తగ్గట్లు కులం, మతం, వర్గం అనే పదాలను ఆపాదించడం జరుగుతుంది. కానీ నిజానికి మానవత్వం, జాలి కరుణ, సామాజిక స్పృహ వున్న వారి ఆలోచనలలో ఈ పదాలకు స్థానం ఉండదు. తమ ఉనికిని అందరూ గుర్తించాలనే స్వార్థ ముసుగుకి మతం రంగు అద్ది తద్వారా ఇతర మతాల ప్రాభవాన్ని తక్కువ చేసి చూపాలనే ఆతృత నేటికీ మన సమాజంలో కొంతమంది పండితులకు కూడా ఉన్నదంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ అది వాస్తవము. కనుకనే అనేక విధములైన చర్చా గోష్టులు, వాదోపవాదాలు సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్నాయి. ఆ మాధ్యమాల యజమానుల జేబులు నిండుతున్నాయి. ఎవ్వరికీ ఆ గోష్టుల పర్యవసానం గురించిన ఆలోచన లేదు. నిజానికి ఎటువంటి వైషమ్యాలు లేనివారికి కూడా వారు కొంచెం మానసికంగా స్థిరంగా లేకుంటే ఇటువంటి ప్రలోభాలకు లోనై వారి ఆలోచనలకు విషపూరిత లేహ్యం అద్దినట్లు అవుతుంది. నిజమైన దైవత్వం ఉన్నవారు నా దృష్టిలో ఎవరంటే, ఎటువంటి లాభాన్ని ఆశించకుండా సొంత ఖర్చుతో తమ దేశం నుండి ఉక్రెయిన్ దేశ సరిహద్దులకు వెళ్లి ఆపదలో ఉన్న ఆశ్రితులను అక్కున చేర్చుకుని వారికి కొండంత మానసిక ధైర్యాన్ని అందిస్తూ ఉచితంగా వారని తమ వాహనాలలో వేరే సురక్షిత ప్రదేశాలకు చేర్చే మానవతా మూర్తులు. వారికి నిజంగా చేతులెత్తి నమస్కరించ వచ్చు.
ఏది ఏమైనా, కాల గమనంలో జీవిత చట్రంతో, మంచి చెడుల వివక్షతతో మనుగడ సాగించే ప్రతి ఒక్కరికీ మన జీవన కాలంలో ఎన్నో ఒడిదుడుకులు, ఒత్తిడులు, ఆర్ధిక, సామాజిక, వర్ణ వివక్షలు, ఎన్నో విధములైన దైనందిక బాధలు తప్పవు. అయితే వాటన్నింటినీ ధైర్యంతో ఎదుర్కొని తెలివిగా పరిష్కరించుకొనే విధానం మనకు తెలిసి ఉండడం ఎంతో ముఖ్యం.
మన ఆలోచనల ప్రవాహం పారదర్శకంగా ప్రవహించాలి. మన ఆలోచనలకు, ఆచరణలకు, మనం మాట్లాడే మాటలకు మధ్యన సరైన పొంతన ఉండాలి. ఎదుటివారి ప్రవర్తన గురించి మనసులోని ఆలోచనే మాటల రూపంలో వెలువడాలి. అంతే కానీ మాట్లాడే మాటల్లో వ్యంగార్థం గోచరించకూడదు. ఎదుటివారి మనసు కష్టపెట్టే విషయాన్ని కూడా మనం వెలువరించే విధానంలో ఉంటుంది. ఇంకొక విషయం కూడా మనం గమనించవచ్చు. మనముందు మన గురించి మంచిగా మాట్లాడుతూ, వేరే వారి ముందర మనలను చులకన చేసి మాట్లాడే విధానం. దానివల్ల ఎవరికీ మంచి జరగదు.
నా స్వీయ అనుభవం లో నేను పొందిన పరివర్తన గురించి ఇప్పుడు చెబుతున్నాను. నాకు చాలా విషయాలు తెలుసనే భావన ఉంటుండేది. కానీ అంతులేని ఈ విశ్వంలో ఆలోచనలకు అందని అనంతమైన విజ్ఞానం దాగివున్నదని ఇప్పుడిప్పుడే అవగతమౌతున్నది. దానర్థం నేను మేరు పర్వతం ముందు నిలబడి చిన్న చిన్న ఇసుక రేణువులు ఏరుకుంటూ ఉన్న ఒక గుర్తింపులేని, గుర్తించలేని ఇసుమంత అణువుని. అయితే నిత్య విద్యార్థిగా నేను నేర్చుకుంటున్న విషయాలు నాకు ఎంతో ఆనందాన్ని అందిస్తున్నాయి. మనకు ఒక వ్యక్తిమీద ఏర్పడిన అభిప్రాయం అంత సులువుగా మారదు. ముఖ్యంగా మనకన్నా చిన్న వాళ్ళు ఏదైనా విశ్లేషించి చెప్పిననూ మన మనసు ఒప్పుకోలేదు. అయితే వ్యక్తిగా కాకుండా ఒక మేధస్సు అనుకొని గుర్తిస్తే అప్పుడు అందులోనుండి వచ్చిన మంచి ఆలోచనలు, సూచనలు, విశ్లేషణలు మనకు సరైనవే అనిపించి వాటిని అనుకరించవచ్చు. అయితే ఇక్కడ మనలో ఉన్న సహజమైన ఇగో (స్వాభిమానం) ని పక్కన పెట్టాలి.
ఆధునిక వైద్య పరిజ్ఞానంతో దీర్ఘకాలిక రోగాలకు సరైన మందులను కనిపెట్టి, ఆధునిక వైద్య విధానాల ద్వారా అనేక రుగ్మతలను తగ్గించడం ద్వారా మనిషి ఆయుష్ ప్రమాణం, పరిమాణం పెరిగింది. అది నిజంగా శుభ పరిణామమే. అయితే డబ్బు ఉంటేనే ఆనందంగా బతక గలము అనే అపోహలో మనిషి ఆలోచనలు సాగినంత కాలం ఎన్ని శాస్త్రీయ ఆవిష్కరణలు చేసినను ఫలితం శూన్యం. ముదివయసులో కూడా మన దిన చర్యలను మనమే చేసుకుంటూ వైద్య విధానాలను వాడుకొని మరింత ధారుడ్యాన్ని పొంది మన ఉనికికి ఒక ఉపయోగాన్ని నిర్మిస్తే అది నిజంగా గొప్ప విషయమే. అంతేకాకుండా సరైన ఆరోగ్య సూత్రాలను చిన్న వయసునుండే అవగాహనతో పాటిస్తూ, దేహానికి కావలిసిన కనీస వ్యాయామాన్ని చేస్తూ సంరక్షించుకుంటే అది మన రోగనిరోధకశక్తిని పెంపొందించి తద్వారా పెద్దవారమైన తరువాత సంజీవినిలా పనిచేస్తుంది. అట్లని పూర్తిగా డైట్ కంట్రోల్ సూత్రాలు ఏవీ అమలుపరచ నవసరం లేదు. ఎంత కావాలో అంత మాత్రమె తీసుకోవాలి తగిన వ్యాయామం ఉండాలి. సమయాన్ని వెచ్చించేందుకు డబ్బును ప్రధాన వేదికగా మలుచుకోకూడదు. ఇది నా అభిప్రాయం మాత్రమే.
‘సర్వే జనః సుఖినోభవంతు’