Menu Close
అత్తలూరి విజయలక్ష్మి
దూరం (ధారావాహిక)
అత్తలూరి విజయలక్ష్మి

మంచం మీద అడ్డంగా వాలిపోయాడు.. మెదడు పని చేయడం మానేసింది. మాలతి మళ్ళి వచ్చిందా? పెద్దమ్మకి ఏమైంది? మాలతి ఇక్కడే ఉంటుందా... అయితే తనని కలుసుకునే అవకాశం కలగడం చాలా కష్టం.. ఒక్కసారి ఆమెతో మాట్లాడాలి అని బలంగా అనిపించసాగింది. చాలాసేపు అలాగే ఉండిపోయాడు. తల పగిలిపోతున్నట్టు అనిపించింది. కనీసం బట్టలు కూడా మార్చుకోలేదు.. కాఫీ తాగాలని ఉంది.. హటాత్తుగా అడుగుల చప్పుడు వినిపించి దిగ్గున లేచాడు. మాలతి లోపలికి వచ్చింది.. ష్ అంటూ నోటి మీద వేలేసుకుని అడుగులో అడుగు వేస్తూ దగ్గరగా వచ్చి రహస్యం చెప్పినట్టు చెప్పింది. “పెద్దమ్మ గారు పెరట్లో పడ్డారు.. కాలు బెణికింది.. మర్దన చేసి, వేన్నీళ్ళ కాపడం పెట్టమని తనని తీసుకుని వచ్చి ఆవిడ దగ్గర దింపి వెంకన్న గారు పని మీద బయటకు వెళ్ళారు.” ఇది ఆమె చెప్పిన సారాంశం.

“పెద్దమ్మ పడుకుందా” అడిగాడు.

తలూపి అంది “మీరు ఏమి తినలేదు కదూ.. పరీక్షలు బాగా రాసారా...”

“బాగా రాసాను మాలతీ... నీ కోసమే బాగా రాసాను. తప్పకుండా పాస్ అవుతాను. ఉద్యోగం వస్తుంది.. పెళ్లి చేసుకుందాం ... నిన్ను ఇక్కడ చూస్తుంటే ఒక విధంగా సంతోషంగా ఉంది.. మరో విధంగా బాధగా ఉంది. ఇక్కడే ఉండిపోతావా....”

“లేదు... పెద్దయ్య గారు రాగానే ఇంట్లో దింపేస్తారు..వెళ్ళిపోతాను ..”

కణతలు నొక్కుకుంటూ అన్నాడు.. “నాకు కాఫీ కావాలి...ఇస్తావా..”

“అయ్యో... తలనొప్పిగా ఉందా...నేను వంటగదిలోకి వెళ్ళలేను... వంటావిడ పడుకున్నారు.. పోనీ మర్దన చేయనా” అడిగింది.

అతను ఆమె చేతుల వైపు చూసాడు.. నాజూకైన చేతులు.. ఇప్పటిదాకా పెద్దమ్మ కాళ్ళు పట్టి నొప్పి పెడుతున్నాయేమో ... అతను సమాధానం చెప్పెలోగానే ఆమె అతని తలవైపు వచ్చి రెండు చేతుల చూపుడువేలు, మధ్యవేళ్ళతో సున్నితంగా మర్దనా చేయసాగింది.. నెమలి ఈకలతో రాస్తున్నట్టు అనిపించింది .. ఆ స్పర్శ, ఆ సాన్నిహిత్యం కోరికలను రెచ్చగొడుతుంటే అమాంతం రెండు చేతులతో తన వైపు తిప్పుకుని దగ్గరగా లాక్కున్నాడు. ఆ ఊపుకి దాదాపు అతని ఒళ్లో పడిపోయింది.

“మాలతీ!” కంగారుగా వినిపించింది కాంతమ్మ స్వరం..

“అమ్మగారు...” భయంతో వణికిపోతూ అతన్ని తోసేసి బయటకు పరిగెత్తింది.

“ఎక్కడికెళ్ళావే ... కాస్త రెప్పలు మూసుకోగానే పారిపోతావా.. కూర్చో ఇక్కడే.... అయ్యగారు వచ్చిందాకా కాళ్ళు పట్టు... “

ఆవిడ స్వరంలో కాఠిన్యం విన్న ఆంజనేయులుకి మనసు చివుక్కుమంది.. పాపం మాలతిని సేవకురాలిగా ఉపయోగించుకుంటోంది పెద్దమ్మ.. ఆవిడకి మాలతి తనకి కాబోయే కోడలు అని తెలిస్తే ఎలా ఉంటుంది పరిణామం... త్వరలో ఈ సేవకురాలు కోడలిగా వస్తుందంటే సంతోషిస్తుందా ! ఆంజనేయులు ఒక్కసారిగా తనని ఎవరో గట్టిగా కుదిపినట్టు అయాడు.

ఇంతకాలం మాలతిని ఒక అందమైన అమ్మాయిగా, తన మనసు దోచుకున్న నెచ్చెలిగానే భావిస్తూ వచ్చాడు.. ఆమె సాన్నిహిత్యం, ఆమె చూపించే ప్రేమాభిమానాలు, తన వయసు చేస్తున్న అలజడి వీటితో ఆవేశంగా ఆమెని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు.. ఆమె కుటుంబ నేపధ్యం, కులం, అంతస్తు, ఆచారాలు ఇవన్నీ ఆమెని ఇంటి కోడలిగా అంగీకరిస్తాయా.. అసలు పి.యు.సి. తో తను చదువాపి ఉద్యోగం చేస్తానంటే అటు నాన్న, ఇటు పెదనాన్న ఇద్దరూ ఊరుకోరు.. ఎలా? ఏం చేయాలి?

వెంకన్నగారి స్వరం “ మాలతీ! ఏం చేస్తున్నావు... వెళ్దాం రా“ అని వినిపించడంతో ఉలిక్కిపడ్డాడు.

మాలతి వెళ్ళిపోతోంది.. ఇప్పుడు ఇద్దరూ కలుసుకోలేరు.. రేపు సాయంత్రం వరకూ ఆగాలా..

ఆంజనేయులు ఆ రాత్రి మొత్తం మాలతి ఆలోచనలతో కలత నిద్రపోయాడు. తెల్లవారి పెదనాన్న లేపుతుంటే మెలకువ వచ్చి కళ్ళు తెరిచాడు..

“లేవరా... త్వరగా లేచి బట్టలు సర్దుకుని సిద్దం అవు ... మీ నాన్న నిన్ను పంపించమని కబురు చేసాడు.. ఫస్ట్ బస్సు లో వెల్దువుగాని” అన్నాడు..

ఇంత హటాత్తుగా నాన్న రమ్మనడం ఏంటి? ఈయన ఫస్ట్ బస్సు కి వెళ్ళు అనడం ఏంటి? ప్రశ్నలు ఏవీ కూడా గొంతు పెగిలి రావు అని తెలుసు.. అందుకే కిమ్మనకుండా తయారు అయాడు.

ఆ క్షణంలో మాలతికి చెప్పి వెళ్ళాలన్న ఆలోచన కన్నా ఎందుకు తనని ఇంత అకస్మాత్తుగా ప్రయాణం చేయించారో అన్న ఆలోచనే బుర్రలో మెదులుతోంటే ఆమెకి చెప్పకుండానే బస్ ఎక్కాడు. బస్సు కదిలాక చెప్పలేనంత దిగులు మబ్బులా కమ్మేసింది.. అయ్యో.. మాలతికి చెప్పలేదు.. అనుకుంటూ సీట్లోంచి లేచాడు. అప్పటికే బస్ వేగం అందుకుంది. ఆ వేగం పెంచిన దూరం..... నేటికీ తరగలేదు..

ఆంజనేయ ప్రసాద్ కళ్ళనిండా నిండిన నీళ్ళు చెంపల మీదికి జారాయి.. అప్పుడే స్మరణ అక్కడికి వచ్చింది.

విశాలమైన ప్రాంగణంలో బాగా పెద్ద అభయాంజనేయ స్వామి విగ్రహం ఒకవైపు, షిరిడీ సాయి జీవిత చరిత్రలోని కొన్ని ఘట్టాలకు సంబంధించిన విగ్రహాలు కొన్ని ప్రశాంతంగా, చాలా ఆహ్లాదంగా ఉంది వాతావరణం. కారు పార్క్ చేసి “రా తాతయ్యా” అంటూ చేయి అందించింది స్మరణ.

అందంగా పెంచిన పూలతోట, జీవం ఉట్టిపడుతున్న బాబా విగ్రహాలు, తక్కువ మంది జనంతో ప్రశాంతంగా ఉంది. బాబా విగ్రహం చుట్టూ పాము పుట్ట.. దానికి సిమెంటు తో చుట్టూ తాపడంలా వేసారు.

బాబా విగ్రహానికి నమస్కరించి చెప్పింది స్మరణ.. “నీకు తెలుసా తాతయ్యా ఈ పుట్ట రోజు, రోజుకి పెద్దగా అవుతోంటే ఇంకా పెరగకుండా ఈ సిమెంటు వేశారు. ఈ పుట్టలో నిజంగానే ఐదు తలల పాము ఉంది. అదిక్కడ యధేచ్చగా తిరుగుతుంది పగలూ, రాత్రీ. జనం కళ్ళ బడినా ఎవరూ పట్టించుకోరు. బాబాగారే పాము రూపంలో తిరుగుతారని అంటారు.”

ఆయన కుతూహలంగా పుట్టవైపు చూసాడు. పాము వెలుపలికి, లోపలికి తిరగడానికి ఐదు దారులు కనిపించాయి. చీమలు పెట్టిన పుట్ట పాము ఆక్రమించుకుని, తనకు అనుకూలంగా విస్తృతం చేసుకుంది భూఆక్రమ దారుడిలా. పేదవాడి కష్టార్జితంతో ఏర్పరచుకున్న చిన్న గూటిని కబ్జా చేసే రాజకీయ నాయకుడిలా.. అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకుని, అప్పుడప్పుడూ విహారం చేస్తోంది. నమ్మకం అనేది ఎంత బలంగా ఉంటుంది! తత్వవేత్తలకే లభ్యం కాని జ్ఞానం నమ్మకం.. ఈ జ్ఞాన మీమాంస తోటే ఈ ప్రపంచం అనేది మిధ్యనా, వాస్తవమా అనే విషయం తెలుసుకోడానికి పరిశోధనలు జరిపారు... తపస్సు చేసారు... ప్రపంచ యాత్ర చేసారు.. ఈ ప్రపంచం అనేది నిజమైతే దీన్ని సృష్టించింది దేవుడు అనుకోడం నమ్మకం. ఈ నమ్మకం తోటే మనిషి మనుగడ సాగుతోంది. నమ్మకానికి పరాకాష్ట మూఢనమ్మకం. సాంద్రత, గాఢత పెరిగే కొద్దీ  నమ్మకం బలంగా నాటుకుపోతుంది. ఒక పుట్టపర్తి సాయిబాబాను, స్వామిజీలను, సాధువులను నమ్మడం ఒక విధంగా బలహీనత కానీ అది బలహీనత అని ఎవరూ ఒప్పుకోరు.. వాళ్ళల్లో మహిమ ఉందని అది తమ సమస్యలకి పరిష్కారం చూపిస్తుందని భావిస్తారు. స్వయం కృషిని, స్వయంశక్తిని నమ్ముకుంటే వీళ్ళందరి అవసరం ఏముంది? దేవుడుకి ఒక ఆకారాన్ని ఇచ్చి బాబాగా, ఏడుకొండలవాడిగా, కృష్ణుడిగా, రాముడిగా కొలిచే కన్నా సమస్త ప్రపంచాన్ని నడిపించే శక్తి ఒక జ్యోతి స్వరూపమైన పరమాత్మే ఆ శక్తి అనుకుంటే బాధే లేదు.

అక్కడ నుంచి మెట్లు ఎక్కి బాబా విగ్రహం ఉన్న విశాలమైన హాల్లోకి వెళ్ళారు. చిన్న పాలరాతి విగ్రహం.. ప్రశాంతంగా ఉంది. స్మరణ మూడు ప్రదిక్షిణలు చేసి, మోకాళ్ళ మీద కూర్చుని నడుం వరకూ ఒంగి నమస్కరించింది. ఆయన రెండు చేతులూ జోడించి మౌనంగా నిలబడి పోయాడు. అక్కడి నుంచి ధుని దగ్గరకు వెళ్ళారు.

స్మరణ పీచు ఉన్న కొబ్బరికాయ తీసుకుని వచ్చింది. “తాతయ్యా! మన మనసులో ఉన్న కోరిక కోరుకుని ఈ కొబ్బరికాయ ధునిలో వేస్తే కోరిక తప్పకుండా తీరుతుందిట. ఇదిగో వేయి.. నీ ఫ్రెండ్ కలవాలని కోరుకో... నేనూ వేస్తున్నా” అంటూ కొబ్బరికాయ, అగరుబత్తులు ధునిలో వేసి కళ్ళు మూసుకుని నమస్కరించింది. ఆయన చేతిలో కొబ్బరికాయ వైపు చూసాడు.. నాకేం  కోరికలున్నాయి! ఆయన పెదవుల మీద చిరునవ్వు మెరిసింది... ఒక్క కోరిక కూడా నెరవేరకుండానే జీవితం చరమదశకు చేరుకున్నాడు.. మిగిలిఉన్నది ఒకటే కోరిక.. అది నెరవేరుతుందన్ననమ్మకం లేదు ..కానీ గుండెల్లో అణగారిన చిన్న ఆశ కొడిగట్టిన దీపం చివర వెలుగుతున్న చిన్న రవ్వలా...ఆరనా! వద్దా అన్నట్టుంది. ఆ ఆశ తనలోని వివేకాన్ని, విచక్షణ ని చంపేస్తోంది.. అవును... ఆశ.. ఆశే లేకపోతే మనిషి బతికేదెలా? ఆశే భగవంతుడిని గుడ్డిగా నమ్మమని చెపుతుంది.. ఆ ఆశే పుట్టల చుట్టూ, చెట్ల చుట్టూ ప్రదిక్షణ చేయమని ఆదేశిస్తుంది. ఆంజనేయస్వామి గుడి అర్చకుడు కృష్ణమూర్తి జాతకాలు, ముహూర్తాలు, వాస్తు అన్నీ చూస్తాడు. ఒకసారి ఆయన దగ్గరకు ఇద్దరు యువకులు వచ్చి జాతక చక్రం చూపించారు.. ఆయన వాళ్ళు పుట్టిన ఘడియల దగ్గరనుంచి జరిగినవి, జరగబోయేవి చెబుతుంటే వాళ్ళు మేము ఒకమ్మాయిని ప్రేమించాము.. ఆ అమ్మాయి మా ఇద్దరిలో ఎవరికీ దక్కుతుంది! అని అడగడం ఆయనకి గుర్తొచ్చింది.. అప్పుడే తనలో కూడా ఒక ఆశాకిరణం మాలతి ఎక్కడుంది? అని అడగాలని అనుకున్నాడు. అంజనం వేసి వెదికి చెప్పలేడు కృష్ణమూర్తి.. బహుశా చెప్పి ఉంటె! కృష్ణమూర్తిని తన జాతకం చూసి మాలతి ఎక్కడుందో చెప్పమని అడగడం లాంటిదే స్మరణ చెప్పిందని ఫేస్ బుక్ లో మాలతిని వెతకడం కూడా.. హోమంలో కొబ్బరికాయ వేస్తూ మాలతిని ఒక్కసారి కలుసుకోవాలని ఉంది.. మా ఇద్దరినీ కలుపు బాబా అని కోరుకుంటే కలుపుతాడా!

“వేసేయ్ తాతయ్యా!” స్మరణ స్వరం విని ఆలోచనల నుంచి బయటపడి రెండుచేతులూ ఎత్తి కొబ్బరికాయ ధునిలో వేసాడు.  పైకి లేచిన జ్వాల ఆయన అంతరంగంలో దాగిన చీకటి తెరలను చీల్చుకుంటూ వెలుగు పరదాలు వేలాడేసింది.. “మనసా! ఎంత పిచ్చిదానివి... అసంభవాలను సంభవాలు అనుకునేలా చేసే శక్తి నీకు మాత్రమె ఉంది.. ఆ తరవాత విస్ఫోటించి విస్ఫులింగాలు వెదజల్లే శక్తి నీకే ఉంది.. భావోద్వేగాలతో చెలగాటం ఆడడం కూడా నీకే చెల్లుతుంది.. కారణం నువ్వో ప్రభంజానివి.. ఓ శక్తివి...”

“రా తాతయ్యా..” ఆయన చేయి పట్టుకుని లాన్ లోకి నడిచింది. సిమెంట్ బెంచీ మీద కూర్చుని ప్రసాదం ఇచ్చింది ఆయనకి.

చలికాలం కావడంతో ఎండలో పదునులేదు.. నులివెచ్చగా ఉంది.

స్మరణ ఆయన మొహంలోకి చూస్తూ “బాబా గారిని ఏం కోరుకున్నావు తాతయ్యా...” అడిగింది.

ఆయన చిరునవ్వు నవ్వాడు... “నువ్వేం కోరుకున్నావు?” అడిగాడు.

స్మరణ మాట్లాడలేదు.. అప్పటివరకూ గల,గల మాట్లాడుతూ, చలాకీగా సెలయేరులా ఉన్న మనవరాలు అకస్మాత్తుగా గంభీరంగా ప్రవహించే నదిలా మారడంతో ఆయన అనుభవం ఆమె మనసుని పసిగట్టింది.

“ధునిలో కొబ్బరికాయ వేస్తూ ఏం కోరుకున్నావు” మళ్ళీ అడిగాడు.

నవ్వింది ... “ఏం కోరుకుని ఉంటాను చెప్పు...”

“మంచి ఉద్యోగం వచ్చేసింది కదా ఇంక త్వరగా మంచి అబ్బాయిని కూడా ప్రసాదించి నా పెళ్లి చేసేయ్ అని అడిగి ఉంటావు.. అవునా!”

“అబ్బా! అది తప్ప మీ పెద్దవాళ్ళకి ఇంకేం దొరకదా తాతయ్యా!” విసుగ్గా అడిగింది.

“నీకు పెళ్ళంటే ఎందుకమ్మా అంత విముఖత ...”

“విముఖత లేదు తాతయ్యా! కానీ,” స్మరణ ఆగిపోయింది.

“చెప్పమ్మా... నాకు చెప్పడానికేం !” మృదువుగా అన్నాడు.

“తాతయ్యా! నా మనసులో మాట చెప్పనా! మరి నువ్వు అమ్మకీ, నాన్నకీ చెప్పనని ప్రమాణం చేస్తావా!”

ఆయన మనవరాలి మొహంలోకి పరీక్షగా చూసాడు. ఏదో మధన.. ఏదో బాధ అణచుకుంటున్నదానిలా గంభీరంగా ఉంది. ఏమైంది ఈ పిల్లకి.. ఎందుకింత ఆవేదనగా ఉంది.. మనసంతా వాత్సల్యంతో నిండిపోయింది. ఆమె భుజం మీద చేయెసి వాగ్దానం చేస్తున్నట్టు అన్నాడు.. “చెప్పను... సరేనా!”

స్మరణ ఎదురుగా గాలికి ఊగుతున్న గులాబీ కొమ్మవైపు చూస్తూ చెప్పసాగింది. “నా మనసు విప్పి మొదటిసారిగా నీకు మాత్రం చెబుతున్నాను. నేను తొమ్మిదోతరగతి చదువుతున్నప్పుడు నల్లకుంటలో ఒక ఇంట్లో అద్దెకుండేవాళ్ళం.. నీకు గుర్తుందిగా.. నువ్వు రెండు సార్లు వచ్చావు. అక్కడ పైన ఒక సింగల్ రూమ్ ఉండేది. అందులో ఒక తల్లి, కొడుకు ఉండేవాళ్ళు. అతనప్పుడు ఇంటర్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. రోజూ నేను స్కూల్ కి వెళ్ళే టైం అతను కాలేజీకి వెళ్ళే టైం ఒకటే కావడంతో మేము తరచూ కలుస్తూ ఉండేవాళ్ళం. కొన్నాళ్ళకు మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అతని కన్నా నేను చిన్నదాన్ని కానీ వాళ్ళమ్మ కష్టపడి పెంచుతూ, ఒక క్రమశిక్షణతో పెంచడం వల్ల కావచ్చు.... వాళ్ళ కుటుంబ పరిస్థితులు  కావచ్చు. వయసుకి మించి గంభీరంగా, హుందాగా ఉండేవాడు. చాలా తెలివైనవాడు.. చురుకైన వాడు కూడా. ఎప్పుడూ డిస్టింక్షన్ లో వస్తుండేవి మార్క్స్.. నేను లెక్కల్లో పూర్.. అతను నాకు లెక్కలు అరటిపండు ఒలిచి నోటికి ఇచ్చినంత వివరంగా చెప్పేవాడు. అప్పటి నుంచీ నాకు లెక్కలు ఇష్టమైన సబ్జెక్టు అయింది. నాకు అతనంటే ఇష్టంగా ఉండేది. అతనితో తరచూ మాట్లాడాలని అనిపిస్తుండేది. ఆదివారాలు మాత్రం అతను అసలు మాట్లాడేవాడు కాదు.. వాళ్ళమ్మకి ఇంటి పనుల్లో సాయం చేస్తూ బిజీగా ఉండేవాడు. అందుకే నాకు ఆదివారాలు అంటే ఇష్టం ఉండేది కాదు.. సోమవారం కోసం ఎదురుచూసేదాన్ని. అప్పుడు నాకు ప్రేమంటే ఏంటో తెలియదు.. నా వయసు ప్రేమించే వయసు కూడా కాదు.. అది ప్రేమో! అభిమానమో, అనురాగమో, ఆరాధనో తెలియదు కానీ అతన్ని చూడాలని, అతనితో మాట్లాడాలని అనిపిస్తూ ఉండేది. ఒక్క లెక్కలే కాదు.. సైన్సు.. హిస్టరీ ఏది అయినా అతని నాలిక చివరన ఉండేవి. ఏడాది మాత్రం ఉండి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు.. ఇల్లు ఖాళీ చేస్తున్నాం, చాలా దూరం వెళ్తున్నాం మళ్ళీ కలుస్తానో లేదో తెలియదు అని చెప్పాడు వెళ్లేముందు. నాకు బాగా ఏడుపొచ్చింది.. అతను పెద్దరికంతో ఓదార్చాడే కానీ నన్ను వదిలి వెళ్తున్నందుకు బాధ పడుతున్న సూచనలు కనిపించలేదు. నాకు మాత్రం అతను వెళ్ళిపోగానే అంతా శూన్యంగా అనిపించింది..” స్మరణ స్వరం రుద్ధమైంది.

“ఇప్పుడు అతనెక్కడ ఉన్నాడు?” అడిగాడు ఆంజనేయులు.

“అది తెలిస్తే నాకీ బాధ దేనికి తాతయ్యా! అతని కోసమే నేను ఫేస్ బుక్ లో ఎంటర్ అయాను. అప్పటి నుంచీ అతని కోసం వెతుకుతూనే ఉన్నాను.. ఎంతో మంది స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ కనిపించారు.. మరెందరో కొత్త ఫ్రెండ్స్ అయారు. కానీ, అతను మాత్రం ఇంతవరకూ నాకు కనిపించలేదు..”

“అతనేం చేస్తున్నాడో తెలుసా..”

“లేదు..” కన్నీళ్లు తుడుచుకుంది.. ఎప్పుడూ చలాకీగా, అల్లరిగా కనిపించే ఆ అమ్మాయి స్థానంలో కొత్త స్మరణను చూస్తుంటే ఆయనకీ అభిమానం వెల్లువలా పొంగింది. ఇంత వేదన దాచుకుని అంత గుంభనగా ఎవరికీ ఎలాంటి అనుమానం కాకుండా ఎలా ఉంటోంది ఈ పిల్ల అనుకున్నాడు..

“ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు” అడిగాడు. స్మరణ మాట్లాడలేదు.. గోరు వెచ్చని సూర్యకిరణాలు పడి వెండిరేకుల్లా  మెరుస్తున్న గడ్డిపరకలు చూస్తూ మౌనంగా ఉండిపోయింది.

“చెప్పమ్మా..”

ఆమె కళ్ళ నుంచి జల,జలా రాలాయి కన్నీళ్లు. ఆ కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు “బాధపడకు.. నీ కళ్ళల్లో నీటి చుక్క చూడలేను తల్లి... నేనేదన్నా సాయం చేయగలనా చెప్పు..”

నిట్టూర్చింది. “అతను కనిపించకపోతే ఎవరు మాత్రం ఏం సాయం చేయగలరు! కనిపిస్తే నీ సాయమే నాకు కావాలి.. ఒకవేళ, ఒకవేళ అతను పెళ్లి చేసుకోకపోతే నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను.. అప్పుడు అమ్మా, నాన్నల్ని ఒప్పించే బాధ్యత నువ్వే తీసుకోవాలి..”

సానుభూతిగా చూసాడు. “చిన్నప్పుడెప్పుడో కలిసి, కొంత కాలం స్నేహం చేసిన అతన్ని నువ్వింకా ప్రేమించడంలో వింతలేదు కానీ స్మరణా! అతని నుంచి నువ్వు ఆశించే స్పందన లభించకపోతే!”

“తెలియదు..ఇప్పుడు నేనేమి  చెప్పలేను ...”

ఆయన నవ్వాడు.. “అతను కూడా ప్రేమిస్తున్నాడా.. నువ్వంటే ఇష్టం అని ఎప్పుడన్నా చెప్పాడా!”

“ లేదు.. అలా చెప్పే తత్వం కాదు.. అతనికి వాళ్ళ అమ్మ, తన చదువు తప్ప మరో లోకం ఉండేది కాదు.”

ఆయన చిత్రంగా చూసాడు. “అతను ఎన్నడూ నిన్ను ప్రేమిస్తున్నట్టు మాటల ద్వారా కానీ, చేతల ద్వారా గానీ, సంజ్ఞల ద్వారా కానీ వ్యక్తం చేయనప్పుడు నీ మనసులో ఇంత ప్రేమ ఎలా అంకురించిందమ్మా?”

స్మరణ నవ్వింది.. “తాతయ్యా! అడవిలో పెరిగే చెట్లకి ఎవరు నీళ్ళు పోసి పెంచుతున్నారు? ప్రకృతి అప్పుడప్పుడూ ప్రసాదించే తీర్థాన్ని పుచ్చుకుని కదా అవి ఏపుగా పెరుగుతాయి. లేత వయసులో నా మనసులో అతను స్నేహం పేరుతొ నాటిన విత్తనం నా వయసుతో పాటు ఎదిగి, ప్రేమగా పరిణామం చెంది, సహజంగానే ఎదుగుతోంది. దీనికి ఎవరూ ప్రత్యేకంగా నీళ్ళు పోయక్కర్లేదు.. ఎరువులు వేయక్కరలేదు.. మందులు చల్లక్కర్లేదు.. ఆ భగవంతుడు నాటిన విత్తనం ఇది.. నా ప్రేమని దేవుడు తప్పకుండా ఫలవంతం చేస్తాడని నా విశ్వాసం తాతయ్యా!..అంతవరకు నా ప్రార్ధన ఒక్కటే నన్ను పెళ్లి విషయంలో బలవంతం చేయకండి.”

ఇది చాలా విషమ  సమస్య.. ఒక పక్క సంధ్య తనని హైదరాబాద్ తీసుకొచ్చింది స్మరణ ని పెళ్లి విషయంలో ఎలా అయినా ఒప్పించి ఈ ఏడాది పెళ్లి చేసేయాలని... ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి విషయంలో బలవంతం చేయద్దు అంటోంది.. ఇద్దరూ తనకి రెండు కళ్ళు.. ఎవరిమాట కాదనగలడు! ఎవరిని సమర్ధించ గలడు!

“ఒకవేళ అతను కనిపించకపోతే!” అడిగాడు.

“కనిపిస్తాడు.. తప్పకుండా కనిపిస్తాడు.. నాకు ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి.. ఆ తరవాత అతను కనిపించకపోతే మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను.”

“ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియని అతనిని ఎలా వెతికి పట్టుకోగలవమ్మా! నీ అరచేతిలో ఉన్న అంతర్జాలమే అతన్ని పట్టివ్వలేనప్పుడు ఎల్లా చేరుకుంటావు? ఇది తెలివితక్కువనిపించడం లేదా నీకు? పైగా అతను నిన్ను ప్రేమించలేదని, నిన్ను వదిలి వెళ్ళేటప్పుడు బాధపడలేదని నువ్వే చెబుతున్నావు.. అలాంటప్పుడు అతను ఈ పాటికి జీవితంలో సెటిల్ అయి ఉండడా! ఎవరినో  పెళ్లి చేసుకుని సుఖంగా ఉండే ఉంటాడు.. అతని కోసం నువ్వు పెళ్లి ఒద్దు అనడం మూర్ఖత్వం కాదూ..”

“లేదు... అతను నా కోసం ఎక్కడోక్కడ ఎదురుచూస్తూ ఉంటాడని నా అంతరాత్మ చెబుతోంది. అతని పరిస్థితులు, అతని ఆశయాలు అడ్డుపడి ఉండచ్చు.. కానీ నేనంటే మాత్రం ఇష్టం ఉందని నాకు అంతరాంతరాల్లో అనిపిస్తోంది.”

“పిచ్చితల్లీ! ఎలా పెంచుకున్నావు ఇంత ప్రేమ! ప్రతిస్పందన లేని ప్రేమ... ఇలా ఎంతకాలం అన్వేషిస్తావు?”

“తాతయ్యా! ఒక ఉషాకిరణం విరుస్తున్న పూవులని ప్రేమగా స్పృశిస్తుంది.. ఒక పిల్ల తెమ్మెర ఆ పూవుని ఆదరంగా నిమురుతుంది.. ఓ ఆకు నేల రాలగానే భూమి ఆప్యాయంగా అదుముకుంటుంది.. ఇదంతా ప్రేమతోటే.. సృష్టి మొత్తం ప్రేమ మయం..  ప్రేమను సృష్టికి ఎవరూ నేర్పలేదు. సృష్టి ప్రేమకి ప్రతిస్పందన లేదు.. అయినా ఆ ప్రేమ తర,తరాలుగా చెదరకుండా అలాగే మానవాళి మనుగడలో లీనమై  ఉంది. అంతే... నా మనసులో చిగురించిన ప్రేమ కూడా అలాంటిదే.. అతను ప్రేమిస్తాడా లేదా అని నేను ఆలోచించడం లేదు. ముందు మేము కలుసుకోవాలి.. అతను నువ్వన్నట్టు పెళ్లి చేసుకుని సెటిల్ అయాడనుకో...ఫర్వాలేదు సమాధాన పడతాను. అలా కాకుండా నా కోసం తను కూడా అన్వేషిస్తూ ఉంటే నా దారిన నేను పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించడం అతన్ని మోసం చేసినట్టు కాదా!”

ఆయన ఉలిక్కిపడ్డాడు.. స్మరణ మాటలు చెళ్ళున చెంపమీద కొట్టినట్టు అనిపించాయి. తనకన్నా సుమారు యాభై ఏళ్ళు చిన్నది.. ఎంతటి సత్యం చెప్పింది? ప్రేమ పట్ల ఈ అమ్మాయిలో ఉన్న నిజాయితీ తనలో లేకపోయిందే ..... ఆమె పట్ల ప్రేమే కాదు... అభినందన, గౌరవం కలిగాయి ఆ క్షణంలో... ఈమె ఈ కాలం పిల్ల... ఈమెలో ఆత్మ స్థైర్యం ఉంది.. తన మీద తనకి అంతులేని విశ్వాసం ఉంది. పెద్ద వాళ్ళు కాదంటే ఎదిరించే సాహసం ఉంది.. సాంకేతిక అభివృద్ధి తనకి అందించిన అవకాశాలను ఉపయోగించుకుని ఈ విశాల విశ్వంలో తనకి కావాల్సిన వాడు ఎక్కడ ఉన్నా పట్టుకునే తెలివితేటలు ఉన్నాయి. అందుకే లేప్రాయంలో చిగురించిన ప్రేమని బతికించుకోడానికి కృషి చేస్తోంది. శభాష్ స్మరణా! నీ ప్రేమ ఫలించాలి.. నీ అన్వేషణ విజయవంతం కావాలి..” మనసులోనే దీవించాడు.

ఆనాడు తనకి ధైర్యం లేదు.. సామాజిక కట్టుబాట్లను ఎదిరించి కోరుకున్న అమ్మాయిని పొందాలన్న ఆలోచనా లేదు..  తను ప్రేమిస్తున్నా అనే భావనని ప్రేమించాడు..వయసు ప్రభావంలో ఎదురుగా అందుబాటులో ఉన్న అమ్మాయిని ప్రేమ అనే మాయాజాలంలో పడేసి ఆడుకునే అనేక మంది మగవాళ్ళ కన్నా అతీతుడేం కాదు...అందుకే తండ్రి నిర్ణయానికి తలవంచి మరొక స్త్రీ మెడలో, భావరహితంగా మూడు ముళ్ళు వేసాడు.. జీవిస్తున్నా అనుకుంటూ జీవచ్చవంలా బతుకుతుంటే అర్థం అయింది తను తప్పు చేసాడని.. ఆ తప్పుని దిద్దుకునే అవకాశం లేకపోయినా, కనీసం క్షమార్పణ అయినా అడగకపోతే నిష్కృతి లేదని భావించి ఆమెని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె ఎక్కడుందో తెలియక చెదిరిన గుండెతో  గోదావరి ఒడ్డుకి వెళ్లి కడివెడు కన్నీళ్లు ఆ తల్లి ఒడిలో పోసి ఎప్పుడన్నా ఆమె కనిపిస్తే ఈ నీటితో నాకు తర్పణం విడవమని చెప్పు అని వేడుకున్నాడు. మరి ఆ తల్లి గోదారి ఆమెకి ఇచ్చిందో, లేదో ఆమె మాత్రం మళ్ళి తన జీవితంలో కనిపించలేదు.. ఆమె జ్ఞాపకాలు నీడల్లా వెంటాడుతూనే ఉన్నాయి. యవ్వనపు తొలినాళ్ళలో ఒక అమాయకురాలి పట్ల తన మనసులో పూసిన ఆ ప్రేమ పుష్పం యాభై ఏళ్ళు దాటినా ఇంకా నవనవలాడుతూ గుబాళి స్తూనే ఉంది. గుండెల్ని చీల్చుకుంటూ వచ్చిందో నిట్టూర్పు.. ప్రేమ అనే  రెండక్షరాలు జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పుతాయో కదా!

స్మరణ ఎవరినో ప్రేమిస్తోందేమో అనే అనుమానం కలిగింది... కానీ ఇలా అజ్ఞాతంలో ఉన్న వ్యక్తిని ఇంత గాఢంగా ప్రేమిస్తోందని ఇప్పుడే తెలిసింది. ఆమె మీద ఆయనకీ కోపం రాలేదు.. పిచ్చిదా ఈ పిల్ల అనే తేలిక భావమూ కలగలేదు.. ఎంతో గౌరవం కలుగుతోంది. కారణం.. ఆయనకీ ప్రేమ విలువ తెలుసు.. స్వచ్చమైన ప్రేమలో గొప్పదనం తెలుసు.. ప్రేమ ఫలించి పరిణయం దాకా వస్తే వాళ్ళంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. చరిత్ర తిరగేస్తే అలాంటి అదృష్టవంతులని వెళ్ళ మీద లేక్కపెట్టచ్చు. ఫలించని ప్రేమలకి శాశ్వతత్వం రచయితలు ఆపాదించారో లేక ప్రకృతే ప్రేమ అనే ఏడో ఋతువు సృష్టించిందో తెలియదు.. కానీ ప్రకృతిలో ఒక భాగం అయింది ప్రేమ. ఒక మనసులో ప్రేమ అనేది జనించడానికి ఎవరూ విత్తనాలు నాటరు.. నారు పోయరు.. నీరూ పోయరు .. హృదయం ఉన్న ప్రతి మనిషీ ప్రేమిస్తాడు..ఇది సత్యం... జీవన సత్యం.. ఈ సత్యాన్ని తెలుసుకోడానికి తను ఎంత దూరం ప్రయాణించాడు! ఆశ్చర్యంగా అనిపించింది ఆయనకి.

ఆయన మార్దవంగా అన్నాడు “నిన్ను నేను అర్థం చేసుకోగలను తల్లీ! కాకపొతే మీ అమ్మావాళ్ళకి ఏమని చెప్పను! అడ్రెస్స్ తెలియని వాడిని మీ కూతురు ప్రేమిస్తోంది అని చెప్పలేను కదా! అందుకే నువ్వు కోరుకుంటున్న వ్యక్తి లభించేవరకూ మీ అమ్మని ఆపాలంటే ఏదన్నా మార్గం చూడాలి. నువ్వు ఏదన్నా పై చదువు చదువుకో.. కనీసం ఒక సంవత్సరం నీ పెళ్లి వాయిదా వేయచ్చు.”

మెరిసే కళ్ళతో అంది స్మరణ.... “ఓ ... నాకీ ఐడియా రాలేదు.. నువ్వు నాకన్నా ప్రోగ్రెసివ్ తాతయ్యా..థాంక్స్ ... థాంక్ యూ వెరీ మచ్... తప్పకుండా చదువుకుంటాను..” అంది ఉద్వేగంగా.

ఆయన కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి.. స్మరణని దగ్గరకు తీసుకుని తల మీద చెయ్యేసి ఆశీర్వదిస్తూ అన్నాడు “నీ విశ్వాసం, నీ ఆశ సఫలం కావాలని నీకు విజయం చేకూరాలని దీవిస్తున్నాను తల్లి.”

స్మరణ చటుక్కున ఒంగి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆయన కళ్ళ నుంచి రాలిన రెండు కన్నీటిబొట్లు ఆమె తల మీద అక్షితల్లా రాలాయి.

“మనం మంచి రెస్టారెంట్ కి వెళ్లి టిఫిన్ చేద్దాం తాతయ్యా.. పద” అంటూ లేచింది.. ఆయన కూడా లేచాడు.

కారు రోడ్డు మీదకి వచ్చాక నెమ్మదిగా తన మనసులో మాట బయట పెట్టింది స్మరణ.. “తాతయ్యా! నిన్న నేను నీ రూమ్ లోకి వచ్చేసరికి ఎందుకు బాధపడుతున్నావు?”

ఆయన ఆపాదమస్తకం కంపించింది.. ఈ ప్రశ్నే రాకూడదని నిన్నటి నుంచి కోరుకుంటున్నాడు.. వచ్చేసింది.. ఏం సమాధానం చెప్పాలి! మనవరాలికి నాకో ప్రేమ కథ ఉందమ్మా... నేను కూడా ఒక అమాయకురాలిని వంచించాను అని చెప్పడం అంత సిగ్గుచేటైన విషయం ఉందా!..తనని తాను నిగ్రహించుకుంటూ అన్నాడు..” ఏమి లేదమ్మా.. ఏదో గుర్తొచ్చింది...చిన్నప్పటి సంగతి”

స్మరణ తలతిప్పి ఆయన మొహం లోకి చూసింది.. ఆయన మొహం పాలిపోయింది. స్మరణ తిరిగి మొహం తిప్పుకుని రోడ్ వైపు చూసి కారు స్పీడ్ పెంచింది.

****సశేషం****

Posted in April 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!