ఎవేవో గత కాలపు జ్ఞాపకాలు మదిని కలవర పెడుతుంటే
ప్రకృతి ఊరడింపు కోసం ఏకాంతం కోరుతుంది వయసు.
గడిచి పోయిన కాలపు మధురమైన తీపి గుర్తులు మెదులుతుంటే
అనిర్వచనీయమైన పులకింత కలిగిన ఏకాంతం కావాలి.
కొందరు పదిమంది ఓదార్పు కోరుకుంటూ నా వొక్కడిదే ఈ బాధ అనుకుంటారు
కష్టానికి సుఖానికి కూడా నేను ఏకాంతాన్ని ఇష్టపడతాను.
కొన్ని విషయాల్లో ఎవరి బాధను ఎవరు తీర్చలేరు కనుక
మనకు మనమే మానసిక ధైర్యం తెచ్చుకోవాలి.
ఆ ధైర్యం ఇచ్చేది చల్లని వెన్నెల చక్కని తారలు స్వచ్ఛమైన ఆకాశం
ఇంతకన్నా వేరేవారు అవసరం లేదు.
వచ్చిరాని వయసు చేసే గారడి ఇంగితానికి ఒక సవాలుఅయితే
నిదానంగా చేసే ఆలోచన ఆత్మవిమర్శా మంచి దారి చూపుతాయని నా నమ్మకం .
కట్టుబాట్లు బంధనాలు కావు మంచీ- చెడుల వివేకాన్ని చెప్పేవి
అది గ్రహించి గౌరవిస్తే మనకే మంచిది.
చదువు సంపాదన జీవనానికి ఆసరా ..ఆత్మ గౌరవం ఇవ్వాలి
నైతిక విలువలను కాపాడాలి జీవితం ఛిద్రం చేయకూడదు.
ఎప్పుడూ ఆనందము శాశ్వతంకాదు వేదనా శాశ్వతంకాదు
అది గుర్తు పెట్టుకుని మసలుకుంటే ఉండదు వేదన.
తోడులేనిరోజు ఎప్పటికి తోడుగా ఉండేది ప్రకృతి కాదా?
అందుకే శాశ్వతంగా వుండే తోడు కోరుకుంటాను.
కావలసినవాళ్ళు పిల్లలూ ఎందరున్నా ఒంటరితనం ఎప్పుడూ ఉంటుంది
అందులోనే ఆనందము వ్యాపకమూ వెదుక్కోవాలి.
నిజానికి ఒక సమయంలో ఏకాకిగా మనలోకి మనం చూసుకుంటే
ఎన్ని పొరబాట్లు ఎన్ని దిద్దుబాట్లు ఎన్ని కర్తవ్యాలు గుర్తించగలమో కదా!
ఊరడించు నేస్తం నీవే!
Posted in August 2022, కవితలు