
జీవితమంటే అర్థం తెలవకముందే
జీవిత గమనానికి
బండరాయి తాకింది
ఓటి పడవ మునగలేక
బరువు మోయలేక
మునగనా తేలనా అని సతమతమవుతూ
మునక సుఖం కాదు
ముందర చాలా పనులున్నాయని గుర్తొచ్చి
వ్రాసి ఉంచిన వీలునామా ప్రతిసారీ చింపేసి
గట్టు ఆసరా కోసం
ఆగాలని కాసేపు
మునుముందుకి సాగాలని కాసేపు
తేల్చుకోలేని సందిగ్ధంలో ఊగిసలాట....
రేపుందో లేదో అనుమానం
అప్పటికి ఏదందొస్తే
అది తీసుకోవాలని తపన
ఆరాటపడే అదను కాదు
అవకాశం పోతే మళ్ళీ రాదు
ఏ పూట ఏ నిషాదమో
దాని వెంట నక్కి నడుస్తున్న
ఏ విషాదమో
పూలకంటే ముళ్ళే ఎక్కువ మోయాల్సి వచ్చినప్పడు
ఎదకు ఎప్పుడూ గాయాలే
మలాము రాసి మందేస్తే
అప్పటికప్పుడు ఉపశమనం అంతే
రక్తమోడే పచ్చిగాయాలు
మానీమానకముందే ఈదరగాలి
ఇంకొన్ని ముళ్ళకంపల్ని
మోసుకొచ్చి పడేస్తుంటుంది
అన్నీ సర్దుకునేలోపు
ఉసురు లాగే యమభటులు
వాకిట వేచియుంటారు
వాళ్ళని పలకరించి ఆతిథ్యమిస్తూనే
ఖేల్ ఖతం అనుకునేలోపు
చిన్ని చిగురు
కనులు తెరచి చూస్తుంది
ఈ ఊగిసలాటకి అంతం లేదని
అభినందిస్తూ..