Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం-126 వ సమావేశం
-- వరూధిని --
vikshanam-126

వీక్షణం-126 వ సమావేశం ఫిబ్రవరి 11, 2023 న  ఆన్ లైనులో జూమ్ సమావేశంగా ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది. ఇందులో అమెరికాతో బాటూ, భారతదేశం నుంచి కూడా అతిథులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా వీక్షణం సంస్థాపక అధ్యక్షులు డా.కె.గీతామాధవి ప్రారంభోపన్యాసం చేసి, సభలోని వారందరికీ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె. సత్యవతి గారిని అధ్యక్షులు మృత్యుంజయుడు తాటిపామల వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానించారు.

తరువాత అపర్ణ తోట సత్యవతి గారిని పరిచయం చేసి ఆత్మీయ ఉపన్యాసం చేసారు. సత్యవతి గారు ఏ విషయంలోనైనా ఎంత నిరాడంబరంగా ఉంటారో సభకు తెలియజేసి కొనియాడారు. తరువాత సత్యవతి గారి రచనల గురించి, వ్యక్తిగతంగా వారితో ఉన్న అనుబంధాన్ని గురించి అన్వర్, కొండవీటి సత్యవతి, వసుధారాణి, కొండేపూడి నిర్మల తదితరులు సభతో పంచుకున్నారు.

ముఖ్య అతిథి కె. సత్యవతి గారు తను అనువాదం చేసిన "ఒక హిజ్రా ఆత్మకథ" ని గురించి మాత్రమే కాక, మొత్తం అనువాద ప్రక్రియలో తను నేర్చుకున్న అనేక అంశాల గురించి ప్రస్తావిస్తూ కొత్తగా అనువాదాలు చేసే వారికి మార్గదర్శకంగా మాట్లాడేరు. తన మొదటి అనువాదంగా ఇండియన్ లిటరేచర్ నించి తీసుకున్న "ఆయిల్ ప్రెస్" కథని  పేర్కొన్నారు. మొదటి నించి అనువాద ప్రక్రియలో భాగంగా తాను ఎవరెవరిని సంప్రదించారో, తెలియని పదబంధాలకు అర్థాలు ఎలా అడిగి రాసుకుంటూ వచ్చారో మొ.న విషయాలు ఎన్నో జ్ఞాపకం చేసుకున్నారు. అందులో ముఖ్యంగా గీతా నంబియార్, ఖాదర్ మొహియుద్దీన్, వై. వి. సత్యనారాయణ, మాలతీ చందూర్, సురేష్ కొలిచాల, గీతా రామస్వామి, గౌరీ కృపానందన్ తదితరుల సహకారాల్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేసారు. "ఒక హిజ్రా ఆత్మకథ" ని చదువుతూ అందులో రేవతి అనుభవించిన కష్టాలకి కన్నీరు మున్నీరయ్యానని అన్నారు. ఈ నెల నెచ్చెలి అంతర్జాల మాస పత్రికలో ప్రచురించబడిన ఆ పుస్తక సమీక్షని గుర్తుచేసుకున్నారు. సమీక్షకులు వి. విజయకుమార్ గార్ని అభినందించారు. అనువాదాల ఆవశ్యకతని గురించి చెప్తూ, ప్రతి ఒక్కరూ కొత్తభాష ఏదైనా ఒకటి తప్పకుండా నేర్చుకోవాలి అని చెప్తూ నిత్య విద్యార్థిగా ఇప్పటికీ తను అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటాననడం విశేషం.

తర్వాత జరిగిన చర్చ కార్యక్రమంలో హిజ్రా ఆత్మకథ అనువాదంలో సత్యవతి గారికి సహకరించిన గౌరీ కృపానందన్ ముందుగా తమ అనుభవాల్ని పంచుకున్నారు. ఆ తర్వాత మృత్యుంజయుడు తాటిపామల, డా.కె.గీత, హిమబిందు, డా. కె.వి రమణారావు, సుభద్ర, కందుకూరి శ్రీరాములు, దేశరాజు, నీహారిణి కొండపల్లి, ఇంద్రాణి పాలపర్తి, దాలిరాజు వైశ్యరాజు, దాసరాజు రామారావు, ప్రసాదరావు గోగినేని , కోటి, డా. లక్ష్మీ నరసమ్మ మున్నగు వారు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు.

ఆ తరువాత జరిగిన 'సాహితీ కదంబం' కార్యక్రమంలో జరిగిన కవిసమ్మేళనంలో ఇంద్రాణి పాలపర్తి, నీహారిణి కొండపల్లి, డా.కె.గీత, కందుకూరి శ్రీరాములు, దేశరాజు, వసుధారాణి, శ్రీధర్ రెడ్డి బిల్లా, దాలిరాజు వైశ్యరాజు, ప్రసాదరావు రామాయణం, రాజేంద్ర ప్రసాద్ గుండ్లపల్లి, దాసరాజు రామారావు, విశ్వైక, డా. అరుణ కోదాటి, డా. పోలా సాయి జ్యోతి, డా పల్లా అన్నయ్య సరస్వతి, డా. సరికొండ రమాదేవి తదితరులు పాల్గొని తమ కవితల్ని వినిపించారు. ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

Posted in March 2023, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!