కొండల్లో వానలు కొట్టి కురిశాయి,
వాగులూ వంకలూ ఏకమైనాయి
మెండుగా నదులకు వరదలొచ్చాయి.
ఏరులూ ఊర్లూ ఒక్కటైపోయాయి,
పోటెత్తి గోదారి పరవళ్లు తొక్కింది!
ఉరుకుతూ వచ్చి ఊళ్లను ముంచింది.
చేలు మునిగాయి, చెట్లు ఒరిగాయి
గోడుగోడున జనులు గోలెత్తిపోయారు,
పవలు రేయీ అనక ప్రార్థనలు చేశారు ...
"గోదావరమ్మా! కరుణించవమ్మా!!
కరమెత్తి మ్రొక్కెదము కాపాడు తల్లీ!!
గోదారి తల్లికి కొట్టరే టెంకాయ,
పసుపు కుంకా లిడుదు పాలించవమ్మా!"
గోదావరమ్మకి వచ్చింది కోపమ్ము,
పరవళ్లు తొక్కుతూ ప్రవహించి వచ్చింది.
"హా హా" రవముల జనులు అల్లాడిపోయారు.
దిక్కు తోచక వారు దీనులయ్యారు,
కకావికలై తుదకు కాందిశీకులయ్యారు.
అనదలై అందరూ అల్లాడిపోయారు.
ఆదిదేవుని ప్రార్ధించి అభయమడిగారు ...
'శివమెత్తి గంగమ్మ చిందులేస్తుండగా
శివయ్యా! నీవేమి చేస్తుంటివయ్య ?
దీనజనులకు చూడ దిక్కు నీవేనయ్యా,
కనికరమున దీవించి కాపాడు తండ్రీ!"