Menu Close
Page Title

నా మదిలో మాట

“మన” అనుకొన్న దానిని గూర్చి ఎంత తెలుసుకొన్నప్పటికీ మరింత తెలుసుకోవాలనిపిస్తుంది. మనం తెలుగువారం లేక ఆంధ్రులం. కాబట్టి మన పుట్టు పూర్వోత్తరాలను, జాతిని, చరిత్రను, సాహిత్య చరిత్రను, సంస్కృతీ సంప్రదాయాలను – ఇలా అన్ని విషయాలను తెలుసుకోవాలని చాలా మందికి ఉన్నప్పటికి, తగిన మార్గం తెలియక ఈనాడు చాలామంది తెలిసిన దానితో తృప్తి పడుతున్నారు. అయితే ప్రస్తుతం సెల్ ఫోన్, ఇంటర్నెట్ మొదలైన వాటి ద్వారా ప్రజలు కొంతకు కొంత సమాచారం గ్రహిస్తున్నారు. ఇది సంతోషించదగ్గ విషయం.

పండితులు, చరిత్రకారులు మొదలైన వారు పైన మనం చెప్పుకొన్న విషయాలను గూర్చి ఎంతో వివరణాత్మకమైన గ్రంధాలను కోకొల్లలుగా వ్రాసి ఉన్నారు. అయితే ఆ గ్రంథాలను చదవడానికి నేటికాలంలో సమయం సరిపోదు. ఎందుకంటే వందలు, వేల పేజీల్లో వ్రాయడం జరిగింది. అందుకే ‘సిరిమల్లె’ వంటి పత్రికల ద్వారా కొద్ది సమయంలోనే మనకు సంబంధించిన విషయాలను నెమ్మదిగా పాఠకులు తెలుసుకొంటారన్న ఆశతో నేను ఆంధ్ర సాహిత్య చరిత్రను పాఠకోత్తముల ముందు ఉంచుతున్నాను. దీనికై నేను ప్రముఖ కవి, విమర్శకుడు డా. ఆరుద్ర వ్రాసిన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ అనే గ్రంథాన్ని ఎన్నుకొన్నాను. మీ అందరి ఆదరణ ఉంటుందని ఆశిస్తూ – డా. సి. వసుంధర.

“సమగ్ర ఆంధ్ర సాహిత్యం” గ్రంథ ప్రచురణ వివరాలు.

“సమగ్ర ఆంధ్ర సాహిత్యం” రచయిత డా. ఆరుద్ర. ఈ గ్రంథాన్ని ఎమెస్కో (EMESCO) వారు పన్నెండు సంపుటాలుగా మొదట ప్రచురించారు. ఈ 12 సంపుటాలను తెలుగు అకాడమీ, హైదరాబాద్ వారు 4 సంపుటాలుగా revised edition పేరుతో 2002 లో ప్రచురించారు. ఈ నాలుగు సంపుటాలను 2005 లో పునర్ముద్రించారు.

ఈ నాలుగు సంపుటాలలో గల పేజీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

మొదటి సంపుటం - 1100 పేజీలు.

రెండవ సంపుటం – 1062 పేజీలు

మూడవ సంపుటం – 658 పేజీలు

నాల్గవ సంపుటం – 1030 పేజీలు.

ఈ నాలుగు సంపుటాల మొత్తం పేజీలు 3850.

ప్రథమ సంపుటిలో యుగ విభజన ఈ క్రింది విధంగా ఉంది.

అ) ఆదిమయుగం ఆ) చాళుక్య యుగం ఇ) కాకతీయ యుగం ఈ) పద్మనాయక, రెడ్డిరాజుల యుగం మరియు ఉ) గజపతుల, తొలిరాయల యుగం.

ఇన్ని వేల పేజీలు ఉన్న ఈ గ్రంథం గురించి నేను వ్రాస్తున్న నా వ్యాస రచన మొదటగా ప్రథమ సంపుటిలోని ఆదిమయుగం తో ప్రారంభమవుతున్నది.

ఆదిమయుగం

ఆరుద్ర రచించిన “సమగ్ర అంధ్ర సాహిత్యం” (ఇక మీదట స.ఆం.సా) ఆంధ్ర సాహిత్యాన్ని గూర్చి సమగ్రంగా తెలిపే గ్రంథం. ఆంధ్ర సాహిత్యాన్ని గూర్చి సమగ్రంగా రచించిన వారు ఇద్దరే. ఒకరు శ్రీ చాగంటి శేషయ్య గారు రెండవ వారు శ్రీ ఆరుద్ర.

నన్నయతోనే ఆంధ్ర సాహిత్యం ప్రారంభమయింది అనే వాదనను పూర్వపక్షం చేస్తూ ఆరుద్ర తన రచనలో ‘ఆదికవి’ అనే శీర్షికలో ఇలా వివరించారు.

“మనకు లభ్యమైన ఆంధ్ర వాఙ్మయమంతటికిని ప్రాచీనతమ గ్రంథము నన్నయ భట్టు భారతమే. కాని ఇది ఆంధ్రమున ప్రథమ కావ్యం కాదు. నన్నయ నాటికి ఆంధ్ర కవిత్వము చక్కగా పెరిగి వికసించినది...” (స.ఆం.సా 1వ సంపుటి – 95)

నన్నయకు ముంది కాలాన్ని పాఙ్మన్నయ యుగం అంటారు. ఈ యుగంలోని రాజులు, రాజ్యాలు, సాహిత్యం మొదలైనవి ఎంతో అభివృద్ధి చెంది ఉన్నాయని చెప్పే ప్రయత్నంలో ఆరుద్ర తన “సమగ్ర అంధ్ర సాహిత్యం” లో ఆదిమయుగం అనే పేరుతో  పాఙ్మన్నయ యుగ వైభవ విశేషాలను లోతుగా, శ్రద్ధగా పరిశోధించి మనకు అందించారు. ఇది ఆరుద్ర చేసిన గొప్ప కార్యం.

గ్రంథారంభంలో ఆరుద్ర తన పేరు తాను మరిచి పోయిన ఒక ఈగ కథ చెప్పి “తెలుగువాడనే తేనెటీగ తన సంగతి తానే మరిచిపోవడం జరిగింది” అని తెలుగు ప్రజల దుస్థితి గుర్తుచేశారు.

సమగ్ర అంధ్ర సాహిత్యాన్ని రచనా సౌలభ్యం కోసం ఆరుద్ర కొన్ని శీర్షికలుగా విభజించారు. ఆ శీర్షికలను నేను నా వ్యాసాన్ని క్లుప్తపరిచే ప్రయత్నంలో ఆరుద్ర ఏర్పరిచిన శీర్షికలను కాక సందర్భానుసారంగా వాటిని మార్చడం జరిగింది. గమనించగలరు.

ఆంధ్రులు : ఆంధ్రము

ఆంధ్రం, తెలుగు పదాలు రెండూ ప్రస్తుతం మనం సమానార్థకాలుగా వాడుతున్నాం. అయితే ఆ రెండు పదాలు వేరు వేరు జాతికి చెందినవి. జాతి, దేశ, భాషా పరంగా అవి వేరు వేరుగా ప్రప్రధమంలో చూపబడ్డాయి.

జాతిపరంగా ఆంధ్రుల ప్రసక్తి మొట్టమొదటగా ఐతరేయ బ్రాహ్మణంలో కనపడుతుంది. ఐతరేయ బ్రాహ్మణం క్రీ.పూ. 600-500 మధ్యకాలం నాటిదని ఆరుద్ర అభిప్రాయం. పురాణాలలో ఆంధ్రుల ప్రసక్తి ఉంది. రామాయణంలో సీతాన్వేషణ సందర్భంలోనూ, భారతంలో సహదేవుని దక్షిణ దేశ దిగ్విజయ యాత్ర సందర్భంలోనూ ఆంధ్రదేశ ప్రసక్తి ఉంది.

ఆంధ్రులు ఆర్యజాతి వారు. విశ్వామిత్రుని పుత్రులు. వీరు నూరు మంది. ఆంధ్రులు తమ తండ్రి విశ్వామిత్రుని శాపానికి గురై ఉత్తర భారతాన్ని వదిలి దక్షిణ భారత దేశంలో గల కృష్ణా గోదావరి నదుల మధ్య గల విశాల భూభాగానికి చేరి అక్కడ స్థిరపడ్డారు. అయితే ఆంధ్రులు రాకముందే కృష్ణా గోదావరీ నదుల మధ్య, ఇంకా ఆ చుట్టూ ప్రక్కల ప్రదేశాలలో ‘తెలుగులు’ అనేవారు నివసిస్తున్నారు. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని మౌర్యులు పరిపాలిస్తుండేవారు.

మౌర్యుల ఆస్థానానికి మెగస్తనీస్ అనే గ్రీకు రాయబారి వచ్చి, అతను మన దేశ విశేషాలను ‘ఇండికా’ అనే గ్రంథంగా రచించాడు. అందులో మెగస్తనీస్ ఆంధ్రులను గూర్చి ప్రస్థావించాడు పొగిడాడు. ఆరుద్ర మాటల్లో-

“మౌర్యుల తర్వాత ఆంధ్రులే లెక్కలోని వస్తారని, ఆంధ్రులకు బోలెడన్ని పల్లెలు పట్టణాలు ఉండేవని మెగస్తనీస్ రాతలవాళ్ళ తెలుస్తుంది. అంతేకాదు మౌర్య చక్రవర్తి సేనలో లక్ష కాల్బలం, రెండువేల గుర్రాలు, వేయి ఏనుగులను ఆంధ్రులు సప్లయ్ చేసేవారని కూడా ఆ గ్రీకు రాయబారి చెప్పాడు” (స.ఆం.సా. 1 వ సం. పుట 63)

తెలుగులు నివసించే భూభాగానికి చేరిన ఆంధ్రులు రాజకీయంగా, ఆర్థికంగా బాగా పుంజుకొన్నారు. ఈ ఆంధ్రజాతికి సంబంధించిన ఒక కుటుంబం సొంతంగా రాజ్యాన్ని స్థాపించింది. అదే శాతవాహన లేక శాలివాహన సామ్రాజ్యం. శాతవాహన రాజులు ముప్పై మూడు మంది ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలను పాలించారు. వీరిని గూర్చి ఆరుద్ర గారి వివరణ లోని ముఖ్య సారాంశమిది – ప్రాచీన తెలంగాణా వీరి పరిపాలనకు జన్మభూమి.  ఈ వంశానికి మూల పురుషుడు చిముకుడు. 30 మంది రాజులు క్రీ. పూ. 230 - క్రీ.శ.210 దాకా నాలుగు వందలా నలభై సంవత్సరాలు పాలించారు. మౌర్యులకు అరిగాపులుగా, సామంతులుగా ఉండి చివరకు స్వతంత్రులై సామ్రాజ్యాధిపతులైనారు. ఔన్నత్యదశలో వీరి రాజ్యం పది రాష్ట్రాలకు విస్తరించింది. శాతవాహనుల పరిపాలనా భాష ప్రాకృతం. భారతదేశంలో మొట్టమొదట వెండి నాణాలు వేయించిన వారు శాతవాహనులే (స.ఆం.సా. 1 వ సం. పుటలు -22-25).

తెలుగువారి పుట్టు పూర్వోత్తరాలు

తెలుగు -వ్యుత్పత్తి

సి.పి.బ్రౌన్ తన తెలుగు-ఇంగ్లీషు నిఘంటువులో వ్యుత్పత్తి కి రెండర్థాలిచ్చాడు. 1) శబ్ద సంభవ ప్రకారం 2) శబ్ద సాధన జ్ఞానం. వ్యుత్పత్తి ని ఇంగ్లీషులో ETYMOLOGY అంటారు.

తెలుగు అనే పదానికి వ్యుత్పత్తిని వివరించిన కొంతమంది ప్రముఖుల అభిప్రాయాల సారాంశం –

ఖండవల్లి లక్ష్మీరంజనం గారు, తలైంగ్ అనే జాతి వారు నివసించిన భూమిని తెలుగు, తెలుగు దేశమని పిలిచి ఉండవచ్చని, తలైంగ్ పదమే తిల్లింగ, త్రిలింగ శబ్దాలకు మూలమని అభిప్రాయపడ్డారు.

‘త్రికళింగ’ అనే పదంలో ‘కళింగ’ అనే పదాన్ని గూర్చి గొడపర్తి రామదాసు గారు తన ‘కళింగ’ అనే పత్రికలో చర్చించిన దాని సారాంశం.

‘కళింగ’ కు ‘కుళింగ’ అనే పర్యాయపదం ఉంది. కుయి భాషలో వడ్లను ‘కుళింగ’ అంటారు. వడ్లను తినే ఈ కోయవారిని గూర్చి చెప్తూ రామదాసు గారు ‘ఇట్లు కులింగలు, కళింగలు అని వారికి నామకరణమైనది’ అని అన్నారు.

లింగం లక్ష్మాజీ కోడు భాషకు వ్యాకరణ గ్రంధం వ్రాశారు. కోడు భాషను గూర్చి చెప్తూ లక్ష్మాజీ ఈ భాష తొల్లింటి తెలుగు యొక్క అపభ్రంశమో తొల్లింటి తెలుగో అయి ఉంటుందన్నారు.

ఆరుద్ర గోండులు తమను ‘కు’ అని పిలుచుకొన్నారని, వారిలో కొందరు దక్షిణ భారతానికి (తెన్) రాగా ‘తెన్+కు’ = తెన్+ఉన్+కు’ అని అదే తెనుగు అయిందని అభిప్రాయపడ్డారు. అంటే, ‘తెన్’ దిశన ఉండే ‘కు’ భాష అనే అర్థంతో ‘తెనుగు’ అయివుంటుంది అని చెప్పి తెనుగు రూపాన్ని ఆరుద్ర గారు సాధించారు (స.ఆం.సా. 1 వ సం. పుటలు -15-17).

తెలుగు ప్రాచీనత: ఒకప్పుడు ‘తల్లి సంస్కృతంబు సకల భాషలకు’ అనే అభిప్రాయం అందరిలో స్థిరంగా ఉండేది. ఇప్పుడు కూడా చాలా మంది అలాగే అనుకుంటున్నారు.

డా. చిలకూరు నారాయణరావు గారు తెలుగు, సంస్కృత-ప్రాకృత జన్యమని నిరూపించడానికి విశ్వప్రయత్నం చేశారు (స.ఆం.సా. 1 వ సం. పుటలు -10). కానీ భాషా శాస్త్రజ్ఞులు విస్తృత పరిశోధనలు జరిపి తెలుగు స్వతంత్ర భాష అని నిర్ధారించారు.

ద్రావిడ భాషలను భాషా శాస్త్రజ్ఞులు మూడు కుటుంబాలుగా విభజించారు. ఉత్తర, మధ్య, దక్షిణ ద్రావిడ కుటుంబాలని వాటికి పేరు పెట్టారు. తెలుగు మధ్య ద్రావిడ కుటుంబానికి చెందింది. సోవియట్ యూనియన్ కు చెందిన ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుడు ఎం.ఎస్. ఆండ్రనోస్ ఒక భౌగోళిక పటంలో ఈ విషయం తెల్పి తెనుగును గుర్తించాడు – ఈ పటాన్ని ఆరుద్ర తన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ లో పొందు పరిచారు. క్రీ.పూ.1000 నాటికే తెలుగు మూల ద్రావిడ భాష నుండి విడిపోయి తన ప్రత్యేకతను చాటుకొన్నది.దీనిని గూర్చి చెప్తూ ఆరుద్ర గారు “స్వయానా స్వతంత్ర భాష” అనే శీర్షికలో “అందువల్ల తెలుగు కూడా ఒక స్వతంత్ర భాషేనని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. అది ద్రావిడ భాషా కుటుంబంలో ఒక ముఖ్యమైన భాష...” అని అన్నారు (స.ఆం.సా. 1 వ సం. పుటలు -10-11).

**** సశేషం ****

Posted in September 2020, సమీక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *