Menu Close

Science Page title

అవకాడోలు

Avacadoఅమెరికాలో విరివిగా దొరికే పండ్లలో ఒక దాని పేరు అవకాడో. దీని శాస్త్రీయ నామం Persea americana. దీనిని అలిగేటర్ పెయిర్ అని, బటర్ ప్రూట్ అని కూడ అంటారు.

నా చిన్నతనంలో నేను ఎప్పుడూ ఈ పండుని భారతదేశంలో చూడలేదు. ఇటీవలి కాలంలో కూడ ఇది ఎప్పుడూ నా కంట పడలేదు. ఆశ్చర్యం వేసింది. ఎందుకంటారా? మన దేశంలో వాడే పొగాకు, బంగాళా దుంపలు, మొక్కజొన్న, టొమేటోలు, మిరపకాయలు, బొప్పాయి, సపోటా, సీతాఫలం, రామాఫలం, వగైరాలన్నిటినీ మనం మధ్య అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతాల నుండి తెచ్చుకుని పెంచుకున్నవే. దేవుడికి నైవేద్యం పెట్టడానికి వాడకపోయినా వీటిని తరచుగా ఆత్మారాముడుకి నైవేద్యం పెడుతూనే ఉన్నాం. ఇవన్నీ మన సంస్కృతిలో ఒక భాగం అయిపోయాయి. కాని దక్షిణ, మధ్య అమెరికా వాస్తవ్యురాలైన అవకాడో ఎందుకనో మన దేశంలో నిలదొక్కుకోలేదు. ఆరోగ్యాన్ని కొల్లగొట్టి గుల్ల చేసే పొగాకు మనలో తేలికగా ఇమిడిపోయింది కాని ఎన్నో పోషక పదార్థాలు ఉన్న అవకాడో ఆహ్వానం లేక గుమ్మం అవతలే నిలబడిపోయింది.

స్వస్థానమైన మధ్య అమెరికాలో అవకాడో వాడకం రెండు వేల సంవత్సరాల నుండీ ఉన్నప్పటికీ అమెరికాలో సా. శ. 1900 తరువాతనే ఇది ఆదరణ పొందడం మొదలెట్టింది. ఒక్క లాస్ ఏంజిలిస్ నగరంలో, 2013 లో, 300 మిలియన్ పళ్లు ఖర్చయేయిట. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అమెరికా వాడు ఏ పని చేస్తే ఆ పని మనం మరొకసారి ఆలోచించకుండా, నిర్మొహమాటంగా అనుకరిస్తాము కనుక అమెరికాలో ఎంతో ఆదరణ ఉన్న ఈ పండుకి మన దేశంలో కూడ ఆదరణ లభిస్తుందనే ఆశతో ఈ వ్యాసం రాస్తున్నాను.

Avacadoఅవకాడో చూడడానికి కోలగా ఉన్న జామకాయలా కాని, కోలగా ఉన్న మామిడికాయలా కాని, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. జామపండు కంటె తొక్క దళసరి; రసాల మామిడి పండు తొక్కలా కాసింత దళసరిగానే ఉంటుంది. లోపల పీచు ఉండదు. నడి మధ్యలో, మన పనస పిక్క ప్రమాణానికి మూడు రెట్లు ఉన్న నున్నటి టెంక ఉంటుంది. (బొమ్మలు చూడండి.) పండిన తరువాత తొక్క మీద తొనల ఆకారంలో కత్తితో గాట్లు పెట్టి, చేత్తో తొక్కని తీసేస్తే సులభంగా వచ్చేస్తుంది. లోపల లేతాకు పచ్చ రంగులో మెత్తటి గుజ్జు ఉంటుంది. ఈ గుజ్జుని చిన్న చిన్న ముక్కలుగా కోసి తినెయ్యవచ్చు, లేదా సాలడ్ లో వేసుకోవచ్చు, లేదా రెండు రొట్టె ముక్కల మధ్య పెట్టుకుని తినొచ్చు.

అవకాడోలో పోషక పదార్థాలు బాగా దట్టించి ఉన్నాయి; మరే పండులోనూ లేనన్ని పోషకాలు దీనిలో ఉన్నాయి. టెంకని, తొక్కని మినహాయించగా, 100 గ్రాములు తూగే పండులో ఉరమరగా 160 కేలరీలు, 2.0 గ్రా. ప్రాణ్యములు (proteins), 8.5 గ్రా. కర్బనోదకాలు (carbs), 14.4 గ్రా. కొవ్వులు (fats), 6.7 గ్రా. ఫైబర్ ఉంటాయి. అవకాడోలో రాగి, ఇనుము, పొటాసియం, మొదలైన ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. కొవ్వులు ఎక్కువ ఉన్న మాట నిజమేకాని, వీటిలో ఎక్కువ భాగం ఆరోగ్యానికి మంచివైన ఏక అసంతృప్త (monounsaturated) కొవ్వులు. ఇంతే బరువున్న ఏ ఇతర శాకాహారంలోనూ ఇంతగా ప్రాణ్యములు (ప్రోటీనులు) లభించవు.

భారతదేశంలో అవకాడోల పెంపకం, వాడకం అంత ఎక్కువగా లేకపోవడం శోచనీయం. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర లలో మొత్తం 1500 చెట్లు ఉన్నాయట!  సాలుకి మూడు లక్షల పండ్లు ఉత్పత్తి అవుతున్నాయట. హోటళ్లల్లో పాశ్చాత్యులు తింటారేమోనని పెంచడం తప్ప ఈ పండుకి ప్రజలలో పెద్దగా పలుకుబడి లేదు. ఇది మామిడి, పనస, సపోటా పండ్లలా అతి మధురంగా ఉండకపోవడం ఒక కారణం కావచ్చు; పండుకి తీపిదనం చాల తక్కువ. మన వంటకాలకీ, అలవాట్లకి వీలుగా ఈ పండుని మలుచుకోగలిగితే దీని వల్ల  లాభాలు ఉన్నాయి.

అవకాడో చెట్ల పెంపకం మీద Indian Council of Agricultural Research, New Delhi, India వారు పరిశోధన చేసి భారతీయుల నోటికి ఈ పండు అంతగా రుచించకపోవడం విచారకరం అని తేల్చిపారేసేరు. అమెరికాలో అవకాడో అంటే ఇష్టపడని భారతీయుడిని నేను ఇంతవరకు చూడలేదు. అమెరికనైజేషన్ తో  “యా” అనడం, పిజ్జా తినడంతోపాటు అవకాడో తినడం కూడ ఒక సూచిక అని తెలిసిననాడు మన యాసతోపాటు ఆరోగ్యం కూడ మెరుగవుతుంది!

అవకాడోలని పచ్చిగా ఉన్నప్పుడు తినరు; పండిన తరువాతే తింటారు. అవకాడోని వాడుకునే విధివిధానులు రెండింటిని దిగువ చెబుతున్నాను.

Guacamoleగ్వాకమోలె: తొక్క, టెంక తీసేసిన రెండు పండిన అవకాడోలని చిన్న చిన్న ముక్కలుగా కోసి, అందులో చిన్నగా తురిమిన ఒక టొమేటో, ఒక ఉల్లిపాయ, కాసింత కొత్తిమీర వేసి, చెంచాడు నిమ్మ రసం, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసి కచ్చా పక్కాగా కలిపితే గ్వాకమోలె అనే పచ్చడి వస్తుంది. చిప్స్ (ప్రత్యేకించి మొక్కజొన్న పిండితో చేసినవి) ముంచుకు తినడానికి చాల బాగుంటుంది. గాలి తగలకుండా దాచినంతసేపూ నలుపెక్కిపోకుండా ఆకుపచ్చగా, అక్కడక్కడ ఎర్రగా కనిపిస్తూ చూడడానికి, తినడానికి బాగుంటుంది. పచ్చడి మీద అవకాడో పిక్కని ఉంచితే గాలి తగిలినా నలుపెక్కిపోదు. (ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరయినా శాస్త్రీయమైన వివరణ ఇస్తే బాగుంటుంది!)

మామిడి-అవకాడో సాల్సా: తొక్క, టెంక తీసేసిన ఒక పండు అవకాడోని, ఒక మామిడిపండుని చిన్న చిన్న ముక్కలుగా కోసి, అందులో చిన్నగా తురిమిన నాలుగు టొమేటోలు, గింజలు తీసేసి, చిన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ, చిన్నగా తరిగిన వెల్లుల్లి రేకలు, ఉల్లిపాయ ముక్కలు, రెండు చెంచాల నిమ్మ రసం, చెంచాడు ఉప్పు, చెంచాడు నూనె, కాసింత కొత్తిమీర వేసి, కచ్చా పక్కాగా కలిపితే మామిడి-అవకాడో సాల్సా అనే పచ్చడి వస్తుంది.

Posted in Science, September 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *