Menu Close
PrakriyalaParimalaalu_pagetitle

అందరికీ నమస్కారం! నా పేరు గుడిపూడి రాధికారాణి. మచిలీపట్నం, కృష్ణాజిల్లా వాస్తవ్యురాలిని.

వృత్తిరీత్యా గణిత ఉపాధ్యాయురాలిని. పుస్తకపఠనం నాలుగో ఏటనుండే ప్రధాన అభిరుచిగా కల నేను సహజంగానే ప్రవృత్తిరీత్యా రచయిత్రిగా మారాను. నా ఆరోతరగతిలో బాలజ్యోతి మాసపత్రికలో 5రూ. పారితోషికంతో తొలి రచనను, నా పేరును అచ్చులో చూసుకున్న ఆనందం బాల్యంలోనూ, తర్వాత అక్షరాన్ని ప్రేమిస్తూ నాలోని భావజాలాన్ని కాగితంపై పెట్టకుండా ఉండలేని సాహితీ పిపాసను యవ్వనం నుండీ కొనసాగించాను.

2012వరకు ప్రధానంగా బాలసాహిత్య రచయిత్రినైన నేను తర్వాత వ్యాసాలు, సమీక్షలు. ఇంతలో గజల్స్ వైపు ఆకర్షింపబడ్డాను. ఆ క్రమంలోనే పద్యాల రుచి చూశాను. ఛందస్సును తెలుసుకునే క్రమంలో వాట్స్ ఆప్ వేదికగా కొన్ని ఛందోబద్ద మాత్రానియమ సహితమై లయాత్మకమైన ప్రక్రియలకు ఆహ్వానింపబడ్డాను. నాకు మాత్రాగణనపై పట్టుపెరగడం కోసం వాటిని కొనసాగించి ఒక్కో ప్రక్రియలో వందలు వేలుగా రచనలు చేశాను. ఇదే క్రమంలో ఇటీవల పుట్టుకొస్తున్న అనేక ప్రక్రియలనూ గమనించాను.

కుప్పలుతెప్పలుగా ప్రక్రియలు పుట్టుకొస్తున్నాయనీ, అవి ఒకటే వాక్యాన్ని విరగ్గొట్టి ముక్కలుగా చేసి ప్రక్రియ అని పేరు పెడుతున్నారనీ సాగే విమర్శనాత్మక విశ్లేషణలు గమనించాను. అప్పుడు పరిశీలిస్తే నాకు ప్రక్రియ నియమాలు మంచివేనని, వాటి ఆత్మ తెలుసుకుని కవి రచిస్తే అందమైన మినీ కవితలుగా రూపొందుతాయనీ అనిపించి ఒక్కో ప్రక్రియలో వంద వరకు ప్రయత్నం చేశాను.

తెలుగుభాషా ప్రేమికులకు, భాషోపాధ్యాయులకు, కవిత్వం సరళంగా వినూత్నంగా రాయాలని ఆశపడే ఔత్సాహికులకు, తెలుగు విద్యార్థులకు వీటిని పరిచయం చేయడం ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను. సాహితీసంబంధ జ్ఞానాన్ని, విషయాన్ని అందరికీ పంచడం నా ధర్మంగా, బాధ్యతగా భావిస్తున్నాను.

ఛందోబద్దంగా కవిత్వం సృజించాలని ఆసక్తి ఉన్నా కష్టమని భావించి సనియమంగా సరళంగా ఉండే కవిత్వం రాయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం కాగలదు.

ఈ మంచిపనికి సిరిమల్లె వేదికగా సహకరిస్తున్న సంపాదకులు మధుగారికి వందనాలు తెలుపుకుంటున్నాను.

ప్రతినెలా ఒక ప్రక్రియ విశేషాలు, నియమాలు, ఉదాహరణగా నా స్వీయ కవితలతో కలుద్దాం. ధన్యవాదాలు.

గుడిపూడి రాధికారాణి
భాషాక్రీడాకారిణి, బాలకథానిథి.

కవితా ప్రక్రియల పరిమళాలు-1

తెలుగు కవిత్వంలో ఎన్నో ప్రక్రియలు పలకరిస్తుంటాయి.కొన్ని పులకరింపజేసి కాలానికి నిలిచేవైతే కొన్ని కనుమరుగయ్యేవీ ఉంటాయి. విశేషంగా ఇటీవల ఎన్నో ప్రక్రియలు వెల్లువెత్తుతున్నాయి.అందరిలోనూ కవిత్వం సృజించాలనే ఆశనూ, రాయగలమనే భరోసానూ కల్పిస్తున్నాయి. ప్రక్రియల ఆత్మను కవి గ్రహించి నవ్యతను చూపినపుడే అవి మన్నన పొందుతాయి.

ఈ ప్రక్రియలను మూడు విభాగాలుగా అనుకోవచ్చు.

  1. అక్షరాలు, పాదాల(పంక్తులు) సంఖ్యలో మాత్రమే పరిమితులు కలిగినట్టివి.
    ఉదా: నానీలు, హైకూలు మొ. (ఇవి అందరికీ తెలిసినవే. ఇటీవల వచ్చే ప్రక్రియలను తర్వాతి నెలలలో చెప్పుకుందాం.)
  2. మాత్ర, అంత్యప్రాస/ఆదిప్రాస నియమం కలిగినవి. ఇవి లయాత్మకంగా ఉండి పాడుకోవడానికి అనువుగా ఉంటాయి
    ఉదా: మణిపూసలు,ఇష్టపదులు మొ. ఇలా ఏ ప్రక్రియ గమనించినా అక్షరాలు/పదాల సంఖ్య లేదా శబ్దాలంకారములలో ఒకటైన అంత్య/ఆదిప్రాస నియమం లో ఇమిడిపోక తప్పదు.
  3. ఇక ఈ నెల నేను మొదటగా పరిచయం చేయబోయేది, పై రెండిటికీ భిన్నమైనది. అదనంగా ముక్తపదగ్రస్తాలంకారాన్ని ఇముడ్చుకున్నట్టిది.
    ముక్త అంటే విడిచిన; పద అంటే పదాన్ని; గ్రస్త అంటే తిరిగి గ్రహించడం.
    అంటే ఏ పదంతో అయితే మొదటిపాదం ముగుస్తుందో అదే పదంతో రెండో పాదం మొదలవాలి. రెండో పాదంలో ముగిసే  పదంతో మూడో పాదం ప్రారంభమవాలి.

ఇది ఎంతో రమ్యతను కలిగుండి పాఠకులను శ్రోతలను కూడా రంజింపజేస్తుంది. ఇలా ముక్తపదగ్రస్తాలంకారాన్ని అంత్యప్రాస అలంకారాన్ని మాత్రా నియమంతో ఇమిడ్చి "సమ్మోహనాలు" అనే లఘుకవితా ప్రక్రియను రూపొందించారు శ్రీ నాగమోహన్ యెలిశాల. వీరు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నారు. పేరుకు తగినట్లు ఇవి నిజంగా సమ్మోహనాలే. ప్రకటింపబడిన నెల వ్యవధిలోనే అద్భుతమైన స్పందనతో ఒక్కొక్కరిచే మూడు వందలపైగా సమ్మోహనాలు రాయించిన ప్రక్రియ.

"సాహిత్యంలో ఇలాంటి కవిత్వం నిలబడుతుంది. దీనిలో ప్రయోగం ఉంది, కవిత్వం ఉంది, మరలా మరలా చదివించే రమ్యత ఉంది" అని విమర్శకుల ప్రశంసలనందుకున్నది.

సమ్మోహనాల నియమాలు:

  1. మూడు పాదాలు
  2. మొదటి రెండు పాదాలకు అంత్య ప్రాస, పదేసి మాత్రలు (గురువు రెండు మాత్రలు,లఘువు ఒక మాత్ర)
  3. మూడో పాదానికి అంత్యప్రాస లేదు
  4. ముక్తపదగ్రస్త రీతి
  5. మూడో పాదంలో 20 మాత్రలు. వాటిలో చివరి 5 మాత్రలు కవినామ ముద్ర ఉండాలి.

చూడడానికి కష్టం అనిపించినా ఉదాహరణలు పరిశీలిస్తే సులువు తెలుస్తుంది.  ఈ ప్రక్రియ ప్రత్యేకత ఏమిటంటే అన్ని అంశాలనూ రాయగల్గడం. రాయడం మొదలుపెడితే కలం ఆపడం కష్టం కూడా.

నేను ఈ ప్రక్రియలో 340పైగా రచించి వాటిలో 250 సమ్మోహనాలతో "తుషారికలు" అనే పుస్తకం వేశాను. ఈ ప్రక్రియలో వచ్చిన తొలి పుస్తకం ఇదే. ఇందులో క్షీరసాగర మథనం, శ్రీకృష్ణ తులాభారం, గజేంద్ర మోక్షం వంటి పౌరాణికాంశాలనూ, శ్రీశ్రీ, శంకరంబాడి వంటి ప్రముఖుల జీవన రేఖలనూ, సైనికులు, బాల కార్మికులు వంటి సామాజికాంశాలనూ, ఎంకి, రాధ వంటి ప్రేమమూర్తుల అంతరంగాలనూ.. ఇలా అనేక అంశాలను మేళవించాను.

కొన్ని సమ్మోహనాలు:

నింగికుండిన సొగసు
సొగసు చూసెను మనసు
మనసులో హరివిల్లు విరిసెనే రాధికా!

మాట ఎంతో చురుకు
చురుకైన పిడిబాకు
బాకులా బాధింప పొరపాటు రాధికా!

అందమైనవి కలలు
కలలు సాకారాలు
సాకారమవగ కృషి చేయాలి రాధికా!

కరోనా మాటేయు
మాటేసి కాటేయు
కాటునే తప్పించుకోవాలి రాధికా!

గోధూళి వేళలో
వేళలో దారిలో
దారంత గోపాల బాలురే రాధికా!

సైనికుడు వీరుడై
వీరుడై శూరుడై
శూరుడై
దేశాన్ని రక్షించు రాధికా!

ఆలుబిడ్డలనొదిలి
ఒదిలి రణమున కదిలి
కదిలి పెను ఉప్పెనగు శత్రువుకు రాధికా!

--  రాధికారాణి, మచిలీపట్నం

తృప్తి లేనిది పరుగు
పరుగుకలసట కలుగు
కలిగినా ఆశకంతము లేదు మోహనా!

అలనాటి పందిళ్ళు
పందిళ్ళ సందళ్ళు
సందడిగ ముంగిళ్ళ వేడుకలు మోహనా!

-- నాగమోహన్ యెలిశాల, ఖమ్మం (ప్రక్రియ సృష్టికర్త)

అతిచిన్న విషపురుగు
పురుగుకెంతటి పరుగు
పరుగుతో జగతినే చుట్టేసె వీరుడా!

వాలు చూపుల భాష
భాష ఎదలో ఘోష
ఘోష వినగా నీదు నామమే వీరుడా!

-- శాడ వీరారెడ్డి, సిద్దిపేట

తాళింపు పరిమళము
పరిమళపు వ్యాపనము
వ్యాపించి ఆకలిని రేపునే ఓఉమా!

కాకమ్మ కథలెన్ని
కథలోని నిధులెన్ని
నిధులన్ని ఏరుకొను బాల్యమే ఓఉమా!

-- ఎం.వి. ఉమాదేవి, నెల్లూరు

(5 5 కానీ 3 4 3 కానీ తీసుకుంటే మూడు పాదాలూ ఒకే లయతో వస్తాయి.)
ఔత్సాహికులు ప్రయత్నించగలరు. వచ్చేవారం మరో ప్రక్రియతో కలుద్దాం. ధన్యవాదాలు.

***సశేషం***

Posted in September 2020, సాహిత్యం

1 Comment

  1. కస్తూరి శివశంకర్

    నమస్కారం. చాలా చక్కని సూచనలు చేశారు రాధికా రాణి గారు
    మీకు అనేకానేక నమస్సులు

    ఇక్కడ నేను వ్రాసిన ఛందోభరితమైన పద్యాలు, వ్యాసాలు పంచుకోవాలంటే ఏమి చేయాలో తెలుపగలరు 🙏🙏

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!