Menu Close
సామెతలతో చక్కని కధలు
- ఆదూరి హైమావతి
విద్యాశోభ

ఆనందు, సునందు విద్యాభ్యాసం ముగించుకుని స్వగ్రామమైన ప్రశాంతిపురం దారిపట్టారు. వారు తమ స్వగ్రామం చేరను కొన్ని క్రోసుల దూరం నడవవలసి ఉంది. అడవిదారిన నడుస్తున్నవారిని ఒక వ్యక్తి వచ్చి కలసి "మిత్రులారా ! ఎందాకా మీ ప్రయాణం?" అని పలకరించాడు.

ఆనందు "మేము విద్యారణ్యుల వారి వద్ద విద్యాభ్యాసం పూర్తిచేసుకుని మా నగరమైన ప్రశాంతిపురానికి బరల్దేరాం. మరి తమరో..?" అన్నాడు.

"చాలా సంతోషం. నేనూ ప్రశాంతిపురానికే! అన్నట్లు ఆ నగరాధీశులు ఏవో కొన్ని కొలువులకై వ్యక్తులను ఎంపిక చేయబోతున్నట్లు తెల్సి, నేనూ పయన మయ్యాను. మీరూ నాతో ఎందుకు రాకూడదూ!" అని అడిగాడు.

ఆనందు సునందు వైపుచూసి "మనమూ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాము కనుక వీరితో కల్సి మహారాజు గారిని  కలిస్తే బావుంటుందేమో!" అన్నాడు.

"తప్పక మనకు తగిన పని లభిస్తే అంతకంటే మరేంకావాలి?" అని సునందు అన్నమీదట "మీరు మాతో కలవడం యాధృఛ్ఛిక మనుకోను, చూద్దాం ఏం కానుందో! అన్నట్లు తమ నామధేయం.." అనడిగాడు ఆనందు.

"నన్ను అంతా బంధూ! అని పిలుస్తారు.." అని వారి విద్యాభ్యాసం గురించీ, వారి గురువు గారి గురించీ, అనేక విషయాలు చర్చించుకుంటూ నడక సాగించారు ముగ్గురూ. దారిలో ఒక ముళ్ళ పొదనుండి ముందుకు వచ్చిన కొమ్మ ఒకటి బంధు కాలికి తగిలి గీరుకుని రక్తం కారడం చూసిన సునందు, తన మొలకున్న మందుల సంచిలోంచి ఒక లేపనంతీసి పూశాడు.

అక్కడినుండీ బంధు చేయిపట్టుకుని ఆసరాయిచ్చి నడవసాగాడు. నడచి నడచి అలసి సొలసి వారు విద్యానగరం  చేరగానే నగర దేవత ఉత్సవం జరగనుండటం చూశారు. రధం పైకి అమ్మవారిని ఎత్తాల్సి ఉండగా యువకులకై ఎదురు చూస్తున్నారు పూజారిగారు.

అది గమనించిన సునందు బంధును అక్కడే ఉన్న అరుగుపై కూర్చుండమని చెప్పి, వెంటనే కోనేట్లో స్నానం చేసి, విభూదిరేఖలు ధరించి, దట్టీ కట్టి ముందుకొచ్చాడు. ధృఢంగా ఉన్న ఆ యువకుని చూసి చిరునవ్వుతో ఆహ్వానించాడు ప్రధాన పూజారి.

అమ్మవారిని రధంపైకెత్తి, రధాన్ని లాగడంలో సాయంచేస్తూ ఊరేగింపుతో పాటు ప్రధాన వీధులన్నీ తిరిగి వచ్చాడు సునందు.

ఆనందు ఆ రధోత్సవం చూడను వచ్చేవారిలో ముదుసలులకు, పసి పిల్లలున్న స్త్రీలకు సాయంచేస్తూ, చిన్న పిల్లలను పైకెత్తి అమ్మవారి దర్శనం చేయిస్తూ, వీధులు దాటి రధోత్సవం చూడను వచ్చే భక్తులకు చేసాయమిచ్చి దాటిస్తూ తానూ ప్రధాన వీధులన్నీ తిరిగి చివరికి ఊరేగింపుతో పాటు ఆలయం చేరాడు.

ఆనందు, సునందు, తిరిగివచ్చి బంధు ను కలిశారు. కాలి బాధ గురించి అడిగిన సునందు తో "నొప్పి మాయమైంది మిత్రమా! నీ మందు ప్రభావం" అన్నాడు నవ్వుతూ.

ఆరాత్రి పూజారి మిగిలిన యువకులతో పాటుగా వారికీ భోజనంపెట్టి బస చేయను వసతి కల్పించాడు.

ఉదయాన్నే వారు ప్రయాణ మవుతుండగా, ఓవ్యక్తి వచ్చి "అయ్యలారా! రాత్రి రధోత్సవంలో మీలో ఎవరో మా అమ్మను  రధం క్రింద పడ కుండా పట్టుకుని కాపాడారుట! లేకపోతే ఈ పాటికి నేను మాతృహీనుడి నయ్యేవాడిని, మా అమ్మ చెప్పిన గుర్తుల ప్రకారం మీలో ఒకరు మా అమ్మను కాపాడినవారై ఉంటారు. తప్పక మీరిక్కడే ఉంటారని వచ్చాను. ఈ ఫలహారాలు దారిభత్యంగా స్వీకరించండి" అని వినయంగా చేతులు జోడించి ప్రార్ధించాడు.

ఆనందు ఆ మూట అందుకుని "మంచిది అది మేమే" అని నమస్కరించాడు.

సునందు ఆ వ్యక్తి వెళ్ళాక "ఎవరో తెలీని వారి వద్ద ఫలహారాలు స్వీకరించడం బాగాలేదు” అనగా, "ఎవరైనాగానీ మనల్ని వెతుక్కుంటూ వచ్చి, ఇవ్వజూపినపుడు కాదని అతడ్ని బాధించడం నా అభిమతం కాదు, వుండనీ దార్లో అవసరపడవచ్చు" అని ఆ ఫలహారాలను తన భుజంమీది కండువాలో కట్టుకున్నాడు. తిరిగి ముగ్గురూ నడక సాగించారు.

ఉదయం నుండీ మధ్యాహ్నం వరకూ అడవిమార్గంలో నడిచి, అలసి పోయి, అక్కడ ప్రవహిస్తున్న నదిని చూసి ఆగి స్నానంచేసి సంధ్యా వందనం చేసుకున్నాక ఆనందు భుజంపైని మూట విప్పాడు ఏదైనా కొంత తిందామని, ఇంతలో ఎక్కడినుండో మూల్గు విన్పించింది. ఆనందు లేచి చుట్టూ చూశాడు, పక్కగా ఉన్న ఒక చెట్టు క్రింద నుండి మూల్గు రావడం గమనించి ఆ వైపు నడిచాడు.

ఒక వ్యక్తి చెట్టు మొదలు వద్ద కూర్చుని బాధతో మూల్గుతున్నాడు. దగ్గర కెళ్ళిన ఆనందు "ఏమైంది!?" అని అడిగాడు. ఆ వ్యక్తి తల పైకెత్తి చూసి "నేను కట్టెలు కొట్టి అమ్మి నాకుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఈరోజున నా గొడ్డలి జారి కాలిపై పడి గాయమైంది.." అంటూ రక్తం కారుతున్న కాలు చూపాడు. ఆనందు వెంటనే పక్కనే ఉన్న పొదల్లోకి జొరబడి కొన్ని ఆకులుతెచ్చి అరచేతులతో నలిపి ఆ రసాన్ని అతడి కాలిపై పిండి, మరి కొన్ని ఆకులు కాలికి చుట్టి తన పై కండువాను కొంత చింపి కట్టు కట్టాడు.

తన వద్ద ఉన్న తినుబండరాలు సునందు, బంధులతో పాటుగా అతడికీ ఇచ్చి, ఆకుదొన్నెతో నీరు తెచ్చి ఇచ్చాడు. అతడి గొడ్డలి తీసుకుని, ఆ చెట్టు ఎండుకొమ్మలు కొట్టి, తాడుతో మోపుగా కట్టి, చెట్టు కాండం కొంత పచ్చిగా ఉండటాన్ని గమనించి, తన మొలలోని రంపపు బాకు ను తీసి ఆ మొదలును చకచకా కోసి  మూడు చక్రాల బండిగా తయారు చేశాడు. పక్కనే ఉన్న అడవి తీగలను తాడుగా పేని ఆ బండికి కట్టి ఆ వ్యక్తి ని కూర్చుండ బెట్టాడు. తాను ఆ కట్టెల మోపును తలపై పెట్టుకుని మోస్తూ సునందు, బంధులను ఆ బండిని లాగమని కోరి అంతా కల్సి నడుస్తూ కొంత సేపటికి  నగరం చేరారు.

ఆ వ్యక్తిని ఇంటివద్ద దింపి వచ్చాక సునందు, విసుగ్గా "ఆనందూ! నీకు ఇలా కనిపించిన వారికంతా సేవలు చేయడం అవసరమా!, మన ప్రయాణం మరచి  ప్రతివారి పనీ నెత్తికెత్తుకుంటావేం? ఇలా ఐతే మనం మెప్పటికి గమ్యం చెరేట్టు? మీరైనా చెప్పండి బంధూ!" అన్నాడు.

"సునందూ! కష్టంలో ఉన్న మనతోటి వారిని వదలి మనం వెళ్ళిపోడం ధర్మమా! మనవిద్యకు సార్ధకత ఏముంటుంది అలా వెళితే!" అన్నాడు చిరునవ్వుతో ఆనందు.

ముగ్గురూ ఆ నగరంలోని సత్రంలో ఆ రాత్రికి తలదాచుకుని, ఉదయాన్నే స్నాన సంధ్యాదులు ముగించి, బయల్దేరుతుండగా, ఒక పదేళ్ళ బాలుడు పరుగు పరుగున వచ్చి "అయ్యలారా! మీరేనా రాత్రి మా నాయన గారి కాలికి కట్టుకట్టి, బండి తయారుచేసి దానిపై మా నాయన గారినే కాక కట్టెల మోపునూ, మోసి తెచ్చి ఆదుకున్నారు! మీరేం మందు వేశారో గాని ఉదయానికల్లా అంతగాయం మానింది, నొప్పితగ్గింది. మా తండ్రిగారు ఈ ఫలాలను తమకు సమర్పించి రమ్మన్నారు, కాదనక స్వీకరించగలరు" అంటూ నమస్కరించాడు.

ఆనందు "మంచిది, కృతఙ్ఞులము" అని వాటిని తీసుకుని తన కండువాలో కట్టుకున్నాడు. ముగ్గురూ తిరిగి ప్రయాణం సాగించారు.

"మనం ఒక్క పూట నడిచామంటే మన రాజధానీ నగరం చేరుకుంటాం. ఈరాత్రికి మనం మన తల్లిదండ్రులను దర్శించగలం. వారిని చూసి ఎంతకాలమైది!" అన్నాడు ఆనందు, తన అమ్మనాన్నలను గుర్తుచేసుకుంటూ.

"ఔనౌను. వారు మనలను గురుకులంలో వదలి వెళ్ళాక ఒక్కమారు మాత్రమే వచ్చారు, మన స్వగ్రామం చూసి పదిహేనేళ్ళు అవుతున్నది." అన్నాడు సునందు.

ఇద్దరూ తమ చిన్ననాటి స్మృతులతో నడవసాగారు.

"మరి మీరు స్వగ్రామంచేరి ముందుగా మీ తల్లిదండ్రులను చూశాకే మహారాజు దర్శనం చేసుకుంటారా? నేనైతే ముందుగా రాజుగార్ని కలిసి, ఏదో ఒక పనిలో చేరాకే స్వగ్రామంవెళతాను. ఆ వార్త కూడా నా తల్లిదండ్రులకు తెలియజేస్తే వారూ సంతోషిస్తారు మరి." అన్నాడు బంధు.

వారు అడవి మధ్యగా నడుస్తుండగా, దూరంగా పులిగాండ్రింపు వినిపించింది. సునందు చెవులు రిక్కించి విని, ఆనందును హెచ్చరించాడు. వెంటనే ఆనందు సర్రున మొలలో ఉన్న కత్తి దూసి ఒడిసిపట్టుకుని, పులి దాడి చేస్తే ఎదురుదాడికి సిధ్ధంగా ఉన్నాడు. పులి దూరం నుండే మనిషి  వాసన గుర్తించి గుట్టగా ఉన్న పొదలమాటునుంచి  ఒక్కసారి లంఘించింది వెనగ్గాఉన్న బంధు పైకి.

ఆనందు గిర్రున వెనక్కు తిరిగి ఒడుపుగా పట్టుకున్న కత్తితో పులి వీపు పై ఒక్కపోటు పొడిచాడు. సునందు తన రెండుచేతులతో బంధును వెనక్కు లాగి పట్టుకున్నాడు. ఆనందు తిరిగి కత్తితో ముందు నుండీ పొడిచిన మరో పోటుకు క్రిందపడి గిలగిలా తన్నుకుని ప్రాణాలు విడి చింది పులి.

ఊహించని ఈ పరిణామానికి విస్తుపోయిన బంధు, ఆనందు ధైర్యంగా పులిని ఎదుర్కున్న తీరుకు, సునందు చాకచక్యంగా తనను వెనక్కు లాగి కాపాడినందుకు ఎంతో ఆశ్చర్యపడ్డాడు.

"భేష్! మితృలారా! మీ సాహసం ఎన్నదగినది. మహారాజు తప్పక మీకు తన కొలువులో పని ఇచ్చి గౌరవిస్తాడు. మీరు బ్రాహ్మణ యువకులైనా క్షత్రియ యువకుల్లా ఎంత చాకచక్యం చూపారు!" అని వారి సహాయానికి కృతఙ్ఞతలు తెలిపాడు.

వారు చక చకా నడచి అడవిదాటి నగరంలో ప్రవేశించారు. ఒక వీధిలో ఒక చెట్టు క్రింద పాదరక్షలు కుడుతున్న ఒక ముదుసలి ఎండవేడికి సోలి పక్కకు వాలిపోవడం గమనించిన ఆనందు ఒక్క ఊపున వెళ్ళి అతడ్ని పట్టుకుని, తనవద్ద కొమ్ము బూరలో ఉన్న నీరు ముఖంపై చిలకరించి, అతగాడు ఆకలితో ఉన్నట్లు గ్రహించి, తన వద్ద మిగిలి ఉన్న పండ్లు అతడికి తినిపించాడు.

అతడు తయారు చేస్తున్న పాదరక్షలు తీసుకుని చకచకా పూర్తిచేసి, "తాతా! ఇంత వయస్సులోనూ ఎందుకింత కష్టపడుతున్నావు? నీకెవరూ లేరా!" అని అడిగాడు. ఆ ముదుసలి నవ్వి ఊరుకున్నాడు. ఆనందు తనవద్ద ఉన్న కొద్దిపాటి ధనాన్నిఅతడికి ఇచ్చి తనకై వేచి చూస్తున్న, బంధు, సునందుతో కలసి ముందుకు కదిలాడు.

బంధు "మిత్రులారా! నేను ముందుగా రాజ మందిరానికే వెళ్ళదలచాను" అనగా, సునందు "మిత్రమా! నీవు మాతో కలసి ప్రయాణించడం మాకెంతో ఆనందంగా ఉంది, మనం తిరిగి కలిసే సమయం త్వరలోనే వస్తుందని ఆశిస్తాను" అన్నాడు.

ఆనందు "అన్నట్లు మీరు ముందుగా మహారాజును కలుస్తున్నారు గనుక, తమ రాజ్యంలోని ముదుసలులకు వసతి కల్పించమని, అడవి దారుల్లో వన్యమృగాలనుండి ప్రయాణీకులకు రక్షణ కల్పించమని ప్రభువుల వారికి విన్నవించు. శలవు మిత్రమా!" అని చెప్పాడు.

ఇరువురూ ముందుకు సాగి తమ స్వగ్రామం చేరారు. తల్లిదండ్రులను చూసి వారి ఆశీస్సులు అందుకుని మరునాడు సునందు, ఆనందు మహారాజు కొలువుతీరి ఉండగా దర్శనార్ధం వచ్చారు.

మహారాజు వారిని చూడగానే "ఆనందూ! నిన్ను ప్రజారక్షకుని గాను, సునందును నాకు అంగ రక్షకుని గానూ నియమిస్తున్నాను. మీరు మీమీ పనులను చక్కగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకుంటారని నమ్ముతున్నాను. ‘వెతకబోయిన తీర్థం ఎదురైనట్టు’ నేను ఈ రెండు పదవులకు తగిన వ్యక్తులకోసం ఎదురుచూస్తుండగా మీరు అలా తటస్తపడి నా శ్రమ తగ్గించారు." అన్నాడు నవ్వుతూ మహారాజు.

మహారాజు స్వరం గుర్తించిన ఆనందు, సునందు 'తమతో ప్రయాణం చేసిన 'బంధు' ‘మహావీరబంధు’ అనే ఆ దేశ మహారాజే!' అని గుర్తించారు.

తెలివైన మహారాజు, ఎవరో తెలీని వారిని కూడా అవసరమైన రీతిలో ఆదుకున్నఆనందు ప్రజలందరినీ కాపాడే హృదయమున్నవానిగా గుర్తించి 'ప్రజారక్షకునిగా నియమించడం, సునందు మొదటినుండీ తన వెంట వున్న బంధును కాపాడుతూ కాలికి ముల్లు గుచ్చుకోగానే లేపనం వ్రాయడం, పులి దాడినుండి కాపాడటం గమనించి,తనతో ఉన్నవాని  యోగ క్షేమాలు గమనించే వానిని అంగరక్షకునిగా నియమించుకుంటే నిరంతరం తన పనిలో నిమగ్నమై ఉంటాడని విశ్వసించి మహారాజు వారికి తగిన పనులు అప్పగించాడు.

అలా నేర్చిన విద్యను ఆచరణలో పెట్టే వారిద్దరికీ తగిన వ్యాపకాలు కొలువులో లభించాయి. కేవలం అభ్యసించడంకాక ఉపయోగిస్తేనే శోభిస్తుంది విద్య.

Posted in September 2020, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!