Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

మన జీవన ప్రమాణాలను అన్ని విధాల మెరుగు పరుచుకోవాలంటే మనం నివసించే ప్రదేశం పూర్తిగా గాలి, వెలుతురు మరియు పచ్చదనం తో నిండి ఉండాలి అని మన పెద్దలు చెబుతుంటారు. అందుకు కారణం శాస్త్రీయంగా కూడా మనకు తెలుసు. అయితే నేటి దైనందిన యాంత్రిక మరియు పోటీ జీవన విధానంతో మంచి ఆరోగ్యానికి కారణమైన ప్రాధమిక సూత్రాలను పూర్తిగా విస్మరిస్తున్నాము. సూర్యుడు లేకుండా ఒక నాలుగు రోజులు ఉంటే మనం భౌతికంగా, మానసికంగా ఎంత వ్యాకులతకు లోనౌతామో అందరికీ ఎరుకే. సహజమైన పిల్లగాలికి మన మనసు పొందే ఆనంద పరవశం, ఎయిర్ కండిషన్ ద్వారా కృత్రిమంగా జనించే గాలికి లభిస్తుందా? లభించదు కానీ నేటి వాతావరణ పరిస్థితులు మనలను ఆ ప్రకృతి మాత  సహజ వనరులను వాడుకునే విధంగా అనుకూలించడం లేదు. ఉదాహరణకు ఇక్కడ కాలిఫోర్నియా లో ప్రస్తుతం వైల్డ్ ఫైర్స్ హవా నడుస్తున్నది. ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. పైపెచ్చు గాలిలో ధూళి, కర్బన  శాతం పెరిగిపోయి ఆనారోగ్య వాతావరణం బయటున్నది. ఇక ఇంట్లోనే యాంత్రిక జీవనం. కృత్రిమ చల్లదనం.

ఇప్పుడు మరో అంశం ప్రస్తావిస్తాను. మనం సాధారణంగా బాగా అలసిపోతే నిద్ర దానంతట అదే వస్తుంది. అందుకు తగినట్లుగా మనం నిద్రించే ప్రదేశం కూడా ఉండాలి. ఆ సమయంలో ఎక్కువ కాంతివంతంగా ఉండకూడదు అట్లుంటే మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యి నిద్రపోవడానికి కారణమైన మెలటోనిన్ (Melatonin) ను మన మెదడు ఉత్పత్తి చేయదు. అందుకే నేటి స్మార్ట్ ఫోన్, ఇతర పరికరాలు మనకు నిద్రలేకుండా చేస్తున్నాయి. మన మెదడులో ఆలోచన్ల ప్రవాహం కూడా మరొక కారణం. కొన్ని విషయాలలో మన బ్రెయిన్ ను కట్టడి చేసి ఆలోచనలను నియంత్రించే సామర్ధ్యం మనం పెంచుకోవాలి. దానికి ధ్యానం, మంచి స్నేహితుల సాంగత్యం మనకు అవసరం. ఇంటిలోని వారిని కూడా మనం స్నేహితులుగా పరిగణించవచ్చు. అంతే కానీ నిద్ర పోవడానికి మాత్రలు వేసుకునే అవసరం రాకూడదు. అయితే ఆనువంశికత్వముగా వచ్చే కణజాల ప్రభావం కారణంగా మన నిద్ర సైకిల్ లో మార్పులు జరుగుతుంటాయి. అది వేరే  విషయం. చేజేతులా మనమే మన నిద్ర పోయే విధానాన్ని రూపుమాపుతూ అందుకు ప్రత్యామ్నంగా మరల మందుల మీద ఆధారపడటం అనేది ఒక విధంగా మూర్ఖత్వమే అవుతుంది.

మనిషి సంఘజీవి కనుక తన ఉనికిని కోల్పోయి ఒక మూలన నిలువ వుండడం వలన ఏమాత్రం ప్రయోజనం లేదు. అటకమీద పడివున్న వస్తువులు కూడా ఏదో ఒక సందర్భంలో ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే మనకున్న విద్యను, ప్రావీణ్యతను  బహిరంగంగా ప్రదర్శిస్తూ ఉంటేనే దానికి గుర్తింపు మరియు ఉపయోగం ఉంటుంది. అట్లని లేని టాలెంట్ ఉన్నట్లు చూపించడం కూడా తప్పే. ఉదాహరణకు నాకు సంగీతం మీద ఎంతో పరిజ్ఞానం ఉందని అందరికీ చెబుతూ స్వర విజ్ఞానం కూడా లేకుండా పిల్లలకు గీతాలు నేర్పిస్తే అది మంచిది కాదు. అందుకొరకు కృషి చేసి సాధనతో పట్టు సాధించి అది అందరికీ పంచితే అప్పుడు అది నిజమైన సేవ అవుతుంది. మన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటివారిలో తప్పులు పడుతూ పబ్బం గడుపుకోవడం ఈ మధ్యకాలంలో సాధారణమైన ప్రక్రియగా మారుతున్నది. అసందర్భ ప్రేలాపనలతో తను అనుకున్నదే నిజం అనే భ్రమలో ఉంటూ ఒకవిధమైన మానసిక లోపంతో ప్రవర్తిస్తే అందరినీ వదులుకోవలసి రావచ్చు. సమాజంలో ఉన్నప్పుడు పదిమందికి అనువైన మార్గమే మన విధానం కూడా అవ్వాలి. అపుడే మనం, మనతో ఉన్నవారు కూడా ఆనందంగా జీవించగలం. నిజం నిర్భయంగా చెప్పడం తప్పుకాదు. కాకుంటే ఆ చెప్పే విధానం అందరినీ ఆలోచింపజేసే దిశలో ఉండాలి. అందుకు ఎంతో సహనం, సామాజిక స్పృహ అవసరం.

అలాగే సంపదలు ఒనకూరిన తరువాత మనిషిలో సహజంగా కీర్తి కండూతి కలగడం మొదలవుతుంది. అందరూ తనను గుర్తించాలనే ఆరాటం ఆరంభమౌతుంది. అందుకు సరైన మార్గాలు ఎంచుకొని ప్రజల సమస్యలను అవగతం చేసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ఏమీ ఆశించకుండా సమాజ సేవ చేస్తుంటే గుర్తింపు దానంతట అదే వస్తుంది. మనలో మానవత్వం పరిమళించిన వేళ మన మనసులో కలిగే ఉద్వేగాలు మనకు మాత్రమె సొంతం.

పదవుల కోసం పాకులాటలు ఉండవచ్చు కానీ అమాయకులను పావులుగా వాడుకొనడం తగదు. అది లాంగ్ రన్ లో మనకు మంచి చేయకపోగా చెడును కలిగించవచ్చు. అలాగే కష్టపడే వానికి తగిన గౌరవం, గుర్తింపు ఉన్నప్పుడే ప్రగతిలో నాణ్యత, నిజమైన నాగరికత కనిపిస్తుంది.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in September 2020, ఆరోగ్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!