Menu Close
ప్రకృతి వరాలు పుష్పాలు
ఆదూరి హైమావతి

బ్రహ్మ కమలము

Brahma Kamalam

బ్రహ్మ కమలము అనగా శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించిన కమల పుష్పము. దీని నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడని తెలుస్తున్నది. బ్రహ్మ ఉద్భవించినదే బ్రహ్మకమలము. ఈ బ్రహ్మకమలము ఒక  చిత్రమైన పుష్ప రాజము. ఈ పుష్పములతో భగవతుని పూజించిన ఐహికాముష్మిక  ఫలములన్నీ లభ్యమవుతాయని పెద్దల వాక్కు.

లక్ష్మీ, సరస్వతీ మాతలు ఆశీనులయ్యేది ఈ బ్రహ్మ కమలముమీదే. దేవతలు సాధారణ కమలాలమీద ఆశీనులు కారు కదా!

Brahma Kamalamదేవ లోకాల్లోని బ్రహ్మ కమలాలకు ప్రతీకగా ఈ భూమి మీద హిమాలయాల్లో ఈ బ్రహ్మకమలాలు ఉంటున్నాయట..సుమారు 12 వేల అడుగుల ఎత్తులో వున్న హిమాలయాల్లో సంవత్సరానికి ఒకే ఒక్కమారు ఈ బ్రహ్మకమలం పూస్తుందిట. ఈ బ్రహ్మకమలం రాత్రి సమయంలోనే వికశిస్తుంది.

ఇది వికసించేప్పుడు చాలా మంచి వాసన వస్తుందిట. హిమాలలయాల్లో సాధకులు, ఋషులు, మహాత్ములు ఈ బ్రహ్మకమలం వికసించటాన్ని చూడను ఎంతో ముందుగా అక్కడికి చేరుకుంటారుట. అత్యంత అద్భుతమైన ఈ కమలం వికసించటాన్ని చూడను రోజుల తరబడి, నెలల తరబడి అక్కడ ఉండి నిరీక్షిస్తారుట. చాలా చిత్రంగా ఉంది కదూ!

శరదృతువు నుండి వసంత ఋతువు వరకు ఈ మొక్క హిమాలయాల్లోని మంచులో కూరుకుపోయి ఉంటుంది. హిమం గడ్డకట్టి ఉంటుందికదా! చైత్ర మాసం అనగా ఇంచుమించు వేసవి ప్రారంభంకాగానే మంచుకాస్త కాస్త ద్రవీభవిస్తుండగా ఈ మొక్క బయటికి వచ్చి శక్తిని కూడగట్టుకుని పెరుగుతూ శ్రావణ శుద్ధ పూర్ణిమ అర్థరాత్రిన పూర్తిగా వికసిస్తుందిట. సాధకులు, మహాఋషులు, సిద్ధ పురుషులైన మహానుభావులు మాత్రామే దీన్ని దర్శించగలరట. వారి కోసం మాత్రమే హిమాలయల్లో ఈ అద్భుత మైన బ్రహ్మ కమలం ఇప్పటికీ పుష్పిస్తుంటుందిట. ఈ కమల వీక్షణంతో సమస్త పాపములు నశిస్తాయట. ఈ కమలం సూర్యోదయానికి ముందే తిరిగి ముకుళిస్తుంది. కేవలం పూర్ణిమ రోజున అర్ధరాత్రి వికసించి ఉదయానికల్లా ముడుచుకుపోవడం నిజంగా చిత్రమే.

Brahma Kamalam

బ్రహ్మ కమలము శాస్త్రీయ నామం: Saussurea obvallata. ఇది సన్ ఫ్లవర్ అంటే సూర్యకాంతం [పొద్దుతిరుగుడు] జాతికి చెందిన పూల మొక్క. ఇది హిమాలయ పర్వతాలు మరియూ ఉత్తర ప్రదేశ్, ఉత్తర బర్మా, టిబెట్, నేపాల్, దక్షిణ చైనా దేశాలలో కనబడుతుంది. బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ రాష్ట్రీయ పుష్పము. ఈ మొక్కను 'కింగ్ ఆఫ్ హిమాలయన్ ఫ్లవర్’ అంటారు. ఈ మొక్కపై ఆకులే పువ్వుగా రూపాంతరం చెందుతాయి. ఇది ఈ మొక్కలోని చిత్రాతి చిత్రమైన విషయం. మందంగా ఉండే ఈ తీగలాంటిమొక్క ఆకు బాగా వృద్ధి చెంది ఆకు బలంగా, మందంగా వచ్చాక ఆకు అడుగుభాగం నుంచి చిన్న మొగ్గ వచ్చి పెరిగి బాగా పెద్దయ్యాక అది రాత్రిపూట వెన్నెల రోజుల్లోనే వికసించి, తెల్లవారేసరికి ముకుళించుకు పోతుంది. ఈ ప్రక్రియను వీక్షించాలంటే మనం రాత్రిపూట ఆ మొక్క వద్ద వేచి చూడాల్సిందే. వికసించేప్పుడు ఈ బ్రహ్మకమలంనుండి వచ్చే సువాసన అంతా ఇంతా కాదు. మన నాశికారంధ్రాలు ఆ వాసనను పీల్చినపుడు మన మనస్సులు ఎంతో ఆనందంగా ఉంటాయి. చాలా మంచి వాసన. ఏ ఇతర పూలకు ఈ వాసన ఉండదనడంలో అతియశయోక్తిలేదు.

ఇందాక మనం చెప్పుకున్నట్లుగా హిందూ పురాణాల ప్రకారం మహావిష్ణువు నాభి నుండి వెలువడిన బ్రహ్మ కమలంపై బ్రహ్మదేవుడు ఉద్భవించి అక్కడే కూర్చుని ఉంటాడు. మనం చాలా చిత్రాల్లో ఇది చూస్తాం.

ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్కను కాలు-చేతి వ్రేళ్ళ పక్షవాతానికి, మెదడు సంబంధిత వ్యాధులనివారణకూ వాడతారు. ఉత్తరాంచల్ రాష్ట్రంలో బ్రహ్మకమలం ఆకులు, వేళ్ళు ఎండబెట్టి పొడిగా చేసి, 200 గ్రాముల పొడిని దేవదారు 20 మి.లీ నూనెలో కలిపి గుజ్జుగా చేసి విరిగిన ఎముకల భాగాల మీద పూస్తారు. ఐతే ఈ వైద్య విధానం ఆయుర్వేద వైద్యులనుండి మాత్రమే మనం పొందాలి.

మధ్య హిమాలయాల్లో భోటియా తెగవారు తలనొప్పి, మానసిక సమస్యలకు బ్రహ్మకమల విత్తనాల నుండి తీసిన నూనెను తలకు రాచుకుంటారు. మూత్ర సంబంధిత సమస్యలకు బ్రహ్మకమల పువ్వులను మందుగా సేవిస్తారుట. దీనితో కొన్ని రకాల నేత్రసంబంధమైన వ్యాధుల నివారణకూడా ఉందని చెప్తారు. ఆయుర్వేద వైద్యులు మాత్రమే ఇది చేయగలరు.

Brahma Kamalam

ఈ పుష్పాలుకొన్ని ఊదారంగులో కూడా పూస్తాయంటారు. బద్రీనాథ్ వంటి కొండశిఖరాల్లో ఉండే ఆలయాల్లో ఈ పుష్పాలను నైవేద్యంగా భగవంతునికి నివేదిస్తారు. ఈ పుష్పానికి గుర్తుగా భారత తపాలా శాఖ ఒక పోస్టల్ స్టాంపును కూడా జారీ చేసింది.

సాధారణంగా నేడు మన ఇళ్ళలో లభ్యమయ్యే బ్రహ్మకమలాలు తెల్లని వర్ణంలో మాత్రమే ఉంటాయి. జాగ్రత్తగా పోషించుకుంటే ఇవి ఒక్కో మారు పది పన్నెండు వరకూ పూస్తుంటాయి.

సీతా మాతకు అమ్మవారిని పూజించను లవకుశలు తెచ్చింది ఈ బ్రహ్మకమలాలనే అని అంటారు.

ఏది ఏమైనా ఈ బ్రహ్మకమలం, ఆకుకు మాత్రమే పూసే ఒకే ఒక్క చిత్రమైన పువ్వు. చిన్న క్లిప్పుతో ఆకుకు పువ్వు గుచ్చినట్లుండే ఈ పుష్పం తీరే వేరు.

Posted in September 2020, వ్యాసాలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!