Menu Close
చెదరని బంధం
-- మధుపత్ర శైలజ ఉప్పలూరి

పక్షుల కిలకిలారావాలతో కోయిలమ్మల కుహుకుహు రాగాలతో రాజ్యలక్ష్మి గారికి అప్పుడే మెలకువ వచ్చింది. పక్కనే నిద్రపోతున్న భర్తను నిద్ర లేపుతూ, “వాకింగ్‌కు వెళ్ళాలని 05.00 గంటలకే అలారం పెట్టుకున్నారు. ఇప్పుడు ఆరవుతోంది. ఇంకా నిద్ర లేవలేదేమిటి? ఒంట్లో బాగాలేదా?” అని ఆదుర్దాగా అడిగింది.

భార్యను చూసి నవ్వుతూ “తొందరదేనికి రాజ్యం? ఇక రోజంతా ఖాళీ సమయమే! ఉదయం 08.30 కల్లా తినేసి స్కూలుకు పరిగెత్తాల్సిన పనిలేదు! విశ్రాంతి తీసుకోమనే కదా రిటైర్మెంట్ ఇచ్చేది” అంటూ మెల్లిగా మంచం దిగారు టీచరుగా గత నెలలోనే రిటైరైన కృష్ణమూర్తిగారు.

సర్వీసులో ఉండగానే ఇల్లు కట్టుకున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో తాము ఉంటూ పై పోర్షన్ అద్దెకిచ్చారు. ఇంటి ముందు చిన్న పూలతోటను పెంచుతున్నారు. పిల్లలులేని ఈ దంపతులకు పైన అద్దెకుండే వాళ్ళ పిల్లలతో కావలసినంతగా సందడి ఉండేది. సరిగ్గా కృష్ణమూర్తిగారి రిటైర్మెంట్ రోజే పైపోర్షన్ వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కొని వెళ్ళి పోవటంతో ఆ పోర్షన్ ఖాళీగా ఉంది.

“రాజ్యం! త్వరగా తెములు! ఈ రోజు డాక్టర్ దగ్గరకు వెళ్ళివద్దాం. నా శిష్యుడని చెప్పటంకాదు గాని డా. రమేష్ హస్తవాసి చాలా మంచిదని మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎంతెంత దూరాలనుండో రోగులు వస్తూంటారు. మన దగ్గర ఫీజు మాత్రం తీసుకోడు, అదే నాకు కాస్త బాధగా ఉంటోందంటే, మీ దగ్గర ఫీజు తీసుకొంటే నాకు పాపం వస్తుంది మాష్టారూ అంటాడు. అతనంత పేరు తెచ్చుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు అతని దగ్గరకు వెడదాం పద” అంటూ హడావిడి చేశారు.

ఆ రోజు ఉదయం పదకొండు గంటలకల్లా ఆస్పత్రికెళ్ళారు కృష్ణమూర్తి దంపతులు. అప్పుడే ఇన్‌పేషంట్లను చూసి వస్తున్న డా. రమేష్ వీరిని చూస్తూనే, “రండి! మాస్టారూ! ఎలా వున్నారు? అమ్మా! మీకెలా ఉంది? కాస్త నీరసంగా ఉన్నట్లుగా ఉన్నారేం?” అంటూ ఆప్యాయంగా పలకరించాడు.

అతని ఆప్యాయతతో కూడిన పలకరింపుకే సగం నీరసం తగ్గినట్లనిపించింది రాజ్యలక్ష్మిగారికి. “ఔనయ్యా! పైన పోర్షన్ ఖాళీ అయ్యింది. దానిని శుభ్రం చెయ్యడం కోసం క్రిందకు పైకు తిరగడంతో కాస్త నీరసంగానే ఉంటోంది” అన్నారు.

“అమ్మా! నేను ఓ మనిషిని పంపిస్తాను. పైన శుభ్రం చేయించుకోండి. ఈ వయస్సులో కష్టపడకండి. మాష్టారేమో అనాధాశ్రమాలలోని పిల్లలకు, పేదపిల్లలకు చదువులు చెప్పాలని విశ్రాంతి లేకుండా ఇంటి పట్టున ఉండకుండా తిరుగుతుంటారు. మీరిద్దరూ మూలపడితే ఎలా?” మందలిస్తున్నట్లు కాస్త కోపంగా అన్నాడు డా. రమేష్.

ఇంతకూ “మా కోడలు, మనవళ్ళు ఎలా ఉన్నారు?” నవ్వుతూ అడిగారు కృష్ణమూర్తిగారు. “ఇవిగో! ఇవి పిల్లలకివ్వు” అంటూ రవ్వలడ్లూ, చేగోడీలున్న ప్యాకెట్ డా. రమేష్ కిచ్చారు.

“మాస్టారు! మీ మాటలనే వేదవాక్యాలుగా భావిస్తూ, సేవయే పరమార్ధంగా ఈ వైద్యవృత్తిని నిర్వహిస్తున్నాను. ఇలా సింపుల్‌గా జీవితాన్ని గడపటం, డబ్బునెక్కువ సంపాదించకపోవటం మీ కోడలికి కష్టం కలిగిస్తోంది. నేను ఏదో ఒకటి సర్దిచెప్పి కాలం గడిపేస్తున్నాను. పిల్లలు బాగానే చదువుతున్నారు. నా కారణంగా నా భార్య మిమ్మల్నెక్కడ ఆడిపోసుకుంటుందోనన్న భయం, ఆమె మాటలకు మీరెక్కడ బాధపడతారోనన్న సంశయంతోనూ అమ్మా మిమ్మల్ని ఇంటికి పిలిచి మీ ఇరువురికి గుప్పెడన్నం పెట్టలేక పోతున్నాను. మీరేమో మా కోడలు, మా మనవళ్ళు అని భావిస్తూ ఏవో ఒకటి తెస్తూంటారు” బాధపడుతూ అన్నాడు డా. రమేష్.

“అవేవి మేము మనస్సులో పెట్టుకోం. నీ నిజాయితి, నీ ధర్మపథం, నిన్ను, నీ కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడుతుంటాయి” అన్నారు కృష్ణమూర్తిగారు.

“అన్నట్లు మాస్టారూ! ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇల్లు కోసం వెతుకుతూ నా దగ్గరకు వస్తే, మీ ఇంటి పైపోర్షన్ గురించి అతనికి చెప్పాను. వచ్చాడా అతను?” అని అడిగాడు డా. రమేష్.

“ఇంకా రాలేదు. అయినా ఆ పోర్షన్ అతనికి నచ్చుతుందో లేదో?” అన్నారు రాజ్యలక్ష్మిగారు.

వాళ్ళిద్దరికి అవసరమైన పరీక్షలన్నింటిని చేసి, మందులను రాసియిచ్చి వాళ్ళని దగ్గరుండి ఆటో ఎక్కించాడు డా. రమేష్.

కృష్ణమూర్తి దంపతులు ఇంటికొచ్చేటప్పటికి ఓ యువకుడు గేటు బయిట అటుఇటు తచ్చాడుతూ కనిపించాడు. వీళ్ళు ఆటో దిగటం చూసి ఎదురొచ్చి “మీరేనా కృష్ణమూర్తి మాష్టారంటే? డా. రమేష్‌గారు మీ ఇంటికెళ్ళమని చెప్పారు. అమ్మా! నేను బెంగళూర్ నుండి ఇక్కడికొచ్చాను. కొత్తగా ఉద్యోగంలో చేరాను. మీ ఏరియా ప్రశాంతంగా ఉంటుందని మా ఆఫీసులో కోలిగ్స్ చెప్పారు. మీ పైపోర్షన్‌లో ఉంటాను. త్వరలో నా కారు బెంగళూర్ నుండి వస్తుంది. మీ ఇంటి వెనుక స్థలంలో నా కారుకి పార్కింగ్ ఏర్పాటు చేసుకుంటాను” ఎంతో పూర్వ పరిచయమున్న వ్యక్తివలే మాట్లాడుతున్నాడు.

గబగబా అంత చనువుగా అతను చెపుతున్న మాటలకు, ఆ సంబోధనలకు తెల్లబోయారా దంపతులు. ఎవరో బంధువుల పిల్లాడిలా ఆశ్చర్యంగా అతనిని పరికించారు. డీసెంట్‌గా ఉన్నాడు. ముఖం ప్రశాంతంగా ఉంది. ఇంటి తాళాలు తీసి లోపలికొచ్చిన మాష్టారు “ముందుగా కాసిని మంచినీళ్ళు తాగు, మంచి ఎండలో వచ్చావు. ఇవాళ ఆఫీసు లేదా? నీ పేరేమిటి?” అని అడిగారు.

“నా పేరు వంశీకృష్ణ, మా స్వస్థలం తెనాలి. వ్యాపారరీత్యా మా అమ్మానాన్నలు బెంగళూర్‌లో ఉంటారు. నాకు అయిదేళ్ళు ఉండగా బెంగళూర్ వచ్చామని, చెల్లి అక్కడే పుట్టిందని అమ్మ చెప్తూంటుంది. నా చదువైన తరువాత ఇక్కడ నాకు ఉద్యోగం వచ్చింది” అని చెప్పాడు.

ఈలోగా రాజ్యలక్ష్మిగారు టీలు పట్టుకొచ్చారు. “బాబూ! ఒక్కడివేనా ఉండేది. పెళ్ళి...” అంటూ అడిగింది.

“లేదమ్మా! నాకు ఇంకా పెళ్ళికాలేదు. సంబంధాలను చూస్తున్నారు. ఇంతలో ఈ ఉద్యోగరీత్యా ఇక్కడికి రావలసి వచ్చింది”  అన్నాడు వంశీ.

“సరే బాబు! పద ఇల్లు చూద్దువుగాని” అంటూ మెట్ల వైపు నడిచారు కృష్ణమూర్తిగారు.

రాజ్యలక్ష్మిగారు అతనికి కూడా కాస్త అన్నం వండింది. ఈలోగా పైకెళ్ళి చూసివచ్చారు వంశీవాళ్ళు.

“అమ్మా ఇల్లు బాగా నచ్చింది. మంచి గాలివెలుతురు వస్తున్నాయి. ఇంటి చుట్టూ ఉన్న మీ తోటలోని పూవులు, పెరడు బాగుంది. నాకు ఇల్లు సరిపోతుంది. అద్దె ఎంతో చెప్పలేదు? నేను నెలకు రెండువేలు ఇస్తాను. అడ్వాన్స్‌గా ఈ నాలుగు వేలు ఉంచండి. సరేనా? తక్కువా?” అడిగాడు వంశీ.

“అంతా?” ఆశ్చర్యంగా అన్నారు రాజ్యలక్ష్మిగారు.

“అమ్మా! చెప్పాను కదా? నాకు ఆర్ధికంగా పర్వాలేదు” అన్నాడు వంశీ.

“మాకు ఒక నెల అద్దె అడ్వాన్స్‌గా చాలు” అంటూ రెండువేలు తీసుకున్నారు కృష్ణమూర్తిగారు.

“బాబు! కాళ్ళు కడుక్కొనిరా! ముగ్గురం భోంచేద్దాం” అంటూ వడ్డించటానికి లోపలికెళ్ళారు రాజ్యలక్ష్మిగారు.

పెరట్లోకెళ్ళి కాళ్ళు చేతులను కడుకొచ్చారు వంశీ, కృష్ణమూర్తిగార్లు. పక్కపక్కనే కూర్చుని భోంచేశారు.

“అమ్మా! మీరూ భోంచేయండి. చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ఇక మాకేమి వడ్డనక్కరలేదు కదా” అన్నాడు వంశీ. అతని ప్రేమకు “ఏ తల్లి కన్నబిడ్డో? ఎంత సంస్కారయుతంగా ప్రవర్తిస్తున్నాడో?” అనుకున్నారు రాజ్యలక్ష్మిగారు.

భోజనాలు పూర్తయినాయి. వంశీ వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళాక, ఆదంపతుల మనస్సులో ఆప్రేమ ఝరి తడిలా మిగిలిపోయింది.

“ఎవరీ వంశీ? ఏమండీ! ఈ వంశీను చూస్తుంటే మన వాసు గుర్తుకొస్తున్నాడెందుకు?” మనసు పొరల్లో దాగిన ఆ విషాదం వెల్లువలా బయటకు పొంగుకురాగా ఏడుపును దిగమింగుతూ అడిగింది రాజ్యలక్ష్మి.

భార్య మాటలకు కృష్ణమూర్తిగారు కూడా మాట్లాడలేక పోయారు. వారి హృదయం మౌనంగా రోదిస్తోంది. తను డీలా పడితే భార్య మరింతగా బాధపడుతుందని ఆమెనోదార్చుతూ, “గతం గురించి ఆలోచిస్తే బాధే మిగులుతుంది. వర్తమానంలో జీవిస్తే ఆనందం ఉంటుంది. నీకు ఆనందం కావాలంటే మరి ఇక ఏడవకు. రేపు మరలా వంశీ వస్తాడు. మన వాసుని ఈ వంశీలో చూచుకొని ఆనందపడు. వాడు బ్రతికుంటే ఇప్పుడీ వంశీలాగే ఉండేవాడు” అన్నారు కృష్ణమూర్తిగారు.

“ఔనండీ! వంశీ ఉరికే జలపాతంలాగా హుషారుగా మాట్లాడుతూ మాటిమాటికి అమ్మా! అమ్మా! అని పిలుస్తూంటే అచ్చు మన వాసు వచ్చి తిరుగుతున్నట్లే ఉంది” అంది రాజ్యలక్ష్మి.

“మనకంత అదృష్టమే ఉంటే వాడంత అర్ధంతరంగా మనలనొదలి వెళ్ళి పోయేవాడా? అప్పటికి వాడికి నిండా పధ్నాలుగేళ్ళ వయస్సు కూడా లేదు. స్కూలు బస్సు దిగి రోడ్‌క్రాస్ చేస్తూండగా వాడిని మృత్యు రూపంలో లారీ గుద్దేయటం ఏమిటి? రోజూ చక్కగా ఇంటికొచ్చే బిడ్డ ఆసుపత్రిలో పదిరోజులు కోమాలో పడివుండటం, మన ఆత్మీయ పిలుపులకు స్పందించలేకపోవటం, డాక్టర్లు దానిని బ్రెయిన్‌డెత్‌గా నిర్ణయించటం జరిగింది” అనుకొంటూ గతాన్ని నెమరేసుకున్నారు కృష్ణమూర్తిగారు.

అదే సమయంలో బెంగళూర్ ‘హృదయాలయ’ హాస్పటల్ డాక్టర్ల నుండి ఫోన్ రావటం, అత్యవసరంగా ఓ పది సంవత్సరాల అబ్బాయికి 'గుండె మార్పిడి’ ఆపరేషన్ చేయాలని, ఎవరైనా దాతలుంటే ఒక ప్రాణాన్ని కాపాడవచ్చని, అందుకు అవసరమైన అన్ని చర్యలను వెంటనే ప్రారంభించాలని కోరటం జరిగింది. హాస్పటల్ డాక్టర్లంతా వచ్చి ‘అవయవదాన విశిష్టత’ను కృష్ణమూర్తి దంపతులకు వివరించి చెప్పి, వాసు గుండెను బెంగళూర్ లోని బాలునికి మార్పిడిచేయటానికి ఒప్పించే ప్రయత్నం చేశారు.

తన కుమారుని గుండెను మరొకరికి దానం చేస్తే ఆ మారిన గుండెతో ఆ వ్యక్తి చిరంజీవిగా మారి నూతన జీవితాన్ని ప్రారంభించగలడని ఆలోచించి, మరో తల్లికి తనలాగా కడుపుకోతకు గురి కావలసిన పరిస్థితి ఏర్పడకూడదనే తలంపుతో, ఆ బాధను తప్పించే బాధ్యతను దేముడు తనకు కల్పించాడని భావించిన రాజ్యలక్ష్మిగారు, భర్తతో మాట్లాడి వెంటనే దంపతులిద్దరూ అవసరమైన కాగితాలపై సంతకాలు చేసి ఇచ్చారు.

ఓగంటలో వాసుగుండెను ఓ ప్రత్యేక విమానంలో బెంగళూర్‌కు తీసుకెళ్ళిపోయారు. గుండెమార్పిడి విజయవంతమైనదన్న మాట వినటం కోసం కృష్ణమూర్తి దంపతులు ఇంటికెళ్ళకుండా నిద్రాహారాలు లేకుండా ఎదురుచూస్తూ ఇక్కడ హాస్పటల్ లోనే ఉండిపోయారు.

ఆరాత్రి భారంగా గడచి, తెల్లవారుఝామున బెంగళూర్ నుండి ఫోన్ వచ్చింది. ఆపరేషన్ విజయవంతమైనదని, ఆ పిల్లవానికి వాసుగుండె చక్కగా అమరి సక్రమంగా పనిచేస్తోందని డాక్టర్లు చెప్పారు.

“అమ్మా! ఎంత గొప్పమనసు మీది! నా బిడ్డకు నూతన జీవితాన్నిచ్చారు” అంటూ ఫోనులో కృష్ణమూర్తి దంపతులకు ధన్యవాదాలను తెలియజేశారు ఆ పిల్లవాని తల్లితండ్రులు.

ఒక్కసారిగా ఆ పాత విషయాలు కృష్ణమూర్తి దంపతులనిద్దరిని అల్లకల్లోల పరచినాయి. రేపు వంశీ వచ్చి మన కళ్ళముందు తిరుగుతూంటే మన మనస్సులు ఎంతగా ఆనందపడతాయోననుకుంటూ ఒకరినొకరు సముదాయించుకున్నారు. “ప్రస్తుతం మనసుకు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందో వెతుక్కుందాం” అనుకొన్నారు.

మరునాడు కృష్ణమూర్తిగారు వాకింగ్‌కు వెళ్ళబోతూండగా ఇంటి ముందు ఆగిన ఆటోలో నుండి ఒక బ్యాగ్, ఒక సూట్ కేస్ పట్టుకొని వంశీ దిగాడు. అతనికెదురెళ్ళిన మాష్టారు అప్రయత్నంగా “రా! వాసూ!” అంటూ లోపలకు పిలిచారు. “రాజ్యం! ఎవరొచ్చారో చూడు” అంటూ దొడ్లో పూలుకోస్తున్న భార్యను పిలిచారు.

ఆ పిలుపుకు గబగబా వస్తున్న రాజ్యలక్ష్మిగారు గుమ్మం తట్టుకొని పడబోయారు. చేతిలో సామాను కింద పడేసి ఒక్క ఉదుటున పరుగున వచ్చిన వంశీ ఆమెను పట్టుకొని, “ఏమిటమ్మా! సమయానికి నేను పట్టుకోక పోయుంటే మీకు దెబ్బతగిలేది! ఇక్కడ ఉండే వాణ్ణే కదా ఆ తొందర దేనికి?” అన్నాడు.

ఆ మాటలకు చాలా ఏళ్ళకు మనసారా నవ్వింది రాజ్యలక్ష్మి. “పైన రూంలో సామాన్లను సర్దుకొని కిందకొచ్చేసెయ్యి. ఇక నుండి నువ్వు మా అబ్బాయివే సరేనా!” ఉద్వేగంతో నోటిలోని మాటలు పెదవి దాటటంలేదు రాజ్యలక్ష్మికి.

“అమ్మా! ఎక్కడి బెంగళూర్? ఎక్కడి హైదరాబాద్? ఏదో పూర్వపరిచయం ఉన్నట్లుగా నా మీద మీరింతగా ఆపేక్ష చూపిస్తున్నారు” అభిమానం, ఆశ్చర్యం కలగలసిన గొంతుతో అడిగాడు వంశీ.

“ఆ సంగతులన్నీ తరువాత, అవతల మాష్టరుగారికి ఆకలివేసి అరుస్తున్నారు. నీకు వినిపించటంలా పదపద” అంటూ వంశీను తొందరపెట్టి మేడమీదకు పంపింది రాజ్యలక్ష్మి.

“రాజ్యం! ఇప్పుడే డా. రమేష్ ఫోన్ చేసి కుశలం కనుక్కున్నాడు. వంశీ గురించి అడిగాడు. ఇవాళే వచ్చి పైపోర్షన్లో జేరాడు అని చెప్పాను” అన్నారు కృష్ణమూర్తిగారు.

“ఏమండీ! ఇప్పుడు దేముడు మనకిద్దరు కొడుకులను వంశీ, రమేష్‌ల రూపంగా ఇచ్చినట్లే కదా” మురుస్తూ అంది రాజ్యలక్ష్మి.

వంశీ కిందకు రాగానే టిఫెన్లు కానిచ్చారు. కాసేపు బెంగళూర్ కబుర్లనూ, ఆఫీసు విషయాలను చెప్పాడు. అలా వంశీ ఆ ఇంట్లోకొచ్చి రెండు నెలలు గడిచిపోయినాయి.

వంశీ చనువుతో ఇంటికి కావలసిన కూరగాయలు, పండ్లు, రాజ్యలక్ష్మిగారు అడిగిన ఇతర సరుకులు శని ఆదివారాలలో తెచ్చి పెడుతున్నాడు. అలాగే కృష్ణమూర్తిగారికి బ్యాంక్ పనులున్నా, ఇతర బజారు పనులకు తోడుగా వెళ్ళివస్తున్నాడు. ఈ రెండుమూడునెలలలోనూ ఒక్కసారి మాత్రమే బెంగళూర్ వెళ్ళి వచ్చాడు.

“హైదరాబాద్ వెళ్ళినాక మమ్మల్ని మరచిపోతున్నావు” అంటూ తల్లిచెల్లి అతనితో దెబ్బలాడుతున్నారు. వంశీ బెంగళూర్ నుండి వచ్చేటప్పుడు కృష్ణమూర్తిగారి దంపతులకు కొత్త బట్టలను, స్వీట్స్ తెచ్చాడు.

**** ముగింపు వచ్చే సంచికలో ****

Posted in September 2020, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!