Menu Close

శ్రీరామ
సప్త స్వర నామ ప్రాదుర్భావం
-- పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు

షడ్జమ్ వదతి మాయూరో గావస్త్వృషభ భాషిణః
అజా వికంతు గాంధారం క్రౌంచః క్వణతి మధ్యమమ్
పుష్ప సాధారణే కాలే పికః కూజతి పంచమమ్
ధైవతం హేషతే వాజీ నిషాదం బృంహతే గజః |

ఈ పై పద్యం ఏడెనిమిది ఏళ్ల క్రితం మిత్రులు, సహృదయులు, ద్విభాషావధాని శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారి దగ్గిర మొదటి సారి విన్నాను. అప్పుడు స్వరాల గురించి మాట్లాడుతున్నాము. ఆయన ఈ పద్యం చెప్పటమూ, నా విన్నపం మీద రాసి పంపడమూ జరిగాయి. కాలక్రమేణా మర్చిపోయాను కానీ, దాని ప్రభావం నామీద బాగా ఉన్నది. పోయినేడాది అక్టోబరులో నేను 'వాగ్రూపం' అనే వ్యాసం ప్రచురించడమూ, దాని కోసం వాగ్వైఖరీ స్వరూపం కోసం పరిశోధన చెయ్యడమూ జరిగాయి. శబ్ద, వాక్పదోత్పత్తి మీద నా వ్యాసం 'వాగ్రూపం' ఈ వ్యాసానికి ప్రాతిపదికం. కోరిన వారు దానిని సంప్రదించగలరు.

ఈ శ్లోకాన్ని పరిశోధించేటప్పుడు దీనికి నామ లింగానుశాసనంలో పూర్తి పాఠం దొరికింది:

నిషాదర్షభ గాంధార షడ్జమధ్యమ ధైవతా
పంచమ శ్నేత్యమీ సప్త తంత్రీ కంఠోత్థితా స్వరాః |
షడ్జమ్ వదతి మాయూరో గావస్త్వృషభ భాషిణః
అజా వికంతు గాంధారం క్రౌంచః క్వణతి మధ్యమమ్
పుష్ప సాధారణే కాలే పికః కూజతి పంచమమ్
ధైవతం హేషతే వాజీ నిషాదం బృంహతే గజః
మయూరాదవితేహిమత్తా గాయంతి పంచమం |

భారత దేశంలో సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. కర్ణాటక, హిందుస్తానీ ఒరవడులు రెంటికీ ' సా ' నించి ' నీ ' వరకు ఉన్న సప్తస్వరాలు పునాదులు. (ప్రపంచంలో ఎక్కడ ఉన్న సంగీతానికైనా ఇవే ప్రాతిపదికం వహిస్తాయనుకోండి, కానీ మనం మన దేశం పరిధిలో మాట్లాడుకోవడం సులభం కదా!) ఈ సప్త స్వరాల నామాలు ఎలా పుట్టాయి, వాటి స్వభావం ఏమిటి అనేది కొంచెం వివరంగా తెలుసుకుందాం. అయితే, ఇది సంగీతం మీద వ్యాసం కాదు. ఈ స్వరాల నామాలు ఎలా పుట్టాయి, వాటి వివరణ ఏమిటి అనేది ముఖ్యాంశం. నేను సంగీతం అంటే ఇష్టం ఉన్నవాణ్ణే కానీ, సంగీతజ్ఞుణ్ని కాను.

ఈ వ్యాసానికి కొంత అంశం మిత్రులు నిత్యానంద మిశ్రా రాసిన హిందీ వ్యాసం ' సప్తస్వరోన్ కా నామ్ ' నించి సేకరించాను. వారికి కృతజ్ఞతలర్పిస్తున్నాను.

స్వరాలేడు. అవి " సా - రీ - గా - మా - పా - ధా - ని ". అష్ట అలోమ విలోమ ( ఆరోహణ అవరోహణ) రూపాలు రెండిటి కిందా మళ్ళీ ' సా ' వస్తుంది. ఈ విధంగా పాశ్చాత్యులు వ్యవహరించే ఎనిమిది మెట్ల ' Octave ' తయారవుతుంది. ( ఈ మాట అందరికీ సులువుగా అర్థం అవుతుందని వాడాను). ప్రస్తుతం మనం వినే స్వరనామాలు " సా - రే - గా - మా - పా - ధ - ని " అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఏడు స్వరాలకీ పేర్లున్నాయి. అవి ఏమిటో, వాటి వ్యుత్పత్తి ఎలాగో తెలుసుకుందాము.

సంగీత రత్నాకరం అనే కావ్యంలో ఈ శ్లోకమున్నది:

"శృతిభిః స్యుః స్వరాః షడ్జర్షభగాంధారమధ్యమా
పంచమో ధైవతాశ్చ నిషాద ఇతి సప్త తే |"

అంటే ఆ ఏడు స్వరాల పేర్లు:

  1. షడ్జమం
  2. వృషభం
  3. గాంధారం
  4. మధ్యమం
  5. పంచమం
  6. ధైవతం
  7. నిషాదం

ఈ ఏడింటినీ " స-రి-గ-మ-ప-ధ-నీ " అనే సంజ్ఞలతో పిలుస్తున్నాము.

ఇప్పుడు ఈ ఏడింటి గురించీ విడివిడిగా తెలుసుకుందాము. సంస్కృత భాషలో ఒక ప్రత్యేకత ఉన్నది. సంస్కృతంలో ఏ పదమైనా ధాతువులనించే పుడుతుంది. ఈ పదాలకి మూల కారణం ఎప్పుడూ మన చుట్టూ ఉన్న ప్రకృతి మాత్రమే. ఈ పధ్ధతి ప్రకారమే ఈ ఏడు స్వర నామాలూ ఎలా వచ్చాయో తెలుసుకుందాం. మొట్టమొదట ఉదహరించిన 'షడ్జమం మాయూరో' అన్న శ్లోకాన్ని ప్రతి పదానికి కూడా అన్వయ ప్రకారం తీసుకుందాం.

1. షడ్జమం: 'స'

ఈ ' షడ్జ ' లేక ' సా' అనే స్వరం ' షట్ ' అంటే ఆరు, ' జ ' ల సంధి చేత వచ్చింది. ' జనీ ప్రాదుర్భావే ' అంటే పుట్టినది అనే అర్థం వస్తుంది. దీన్ని మూడు రకాలుగా విశ్లేషించవచ్చు. మళ్ళీ సంగీత రత్నాకరం నుంచి:

షష్ణా స్వరాణాం జనకః షడ్భిర్వా జన్యతే స్వరై :
షడ్భ్యోవా జాయతేన్గేభ్య: షడ్జ ఇత్యభిధీయతే |

అ)షష్ణా స్వరాణాం జనకః - మిగతా ఆరు స్వరాలనీ పుట్టించేది అని అర్థం.దీని విగ్రహ రూపం " షట్ జనయతి ఇతి షడ్జ:మీరు ' సా ' అని పలికితే మిగతా ఆరు స్వరాల ఆవృత్తీ నిర్ణయమైనట్టే.

ఆ) షడ్భిర్వా జన్యతే స్వరై : - ఆరు స్వరాలనీ నిర్దేశించేది, అంగీభూతమైన ఆరు స్వరాలతో పుట్టేది. అంటే ఏడూ స్వరాలూ ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో ఉంటాయి కాబట్టి ఒకటి నిర్ణయమైతే మిగతావి నిర్ణయమైనట్లే. పైగా, దీనిలో ఇంకొక మాట అంతర్లీనమై ఉన్నది - ఈ frequency లు ఉక్కులో పోతపోసినవి కావు. వాటి నిష్పత్తి మాత్రమే నిర్దిష్టం. ఎవరు ' సా ' ఏ శృతిలో మొదలెట్టినా ఆ నిష్పత్తి గుర్తుంచుకుని స్వరాలేడూ పలకాలనే నిర్దేశం అంతర్లీనంగా తెలుస్తుంది. ఉదాహరణకి మీరు పంచమంలో స్వరం పలికారనుకోండి; షడ్జమ నిర్ణయమైనట్లే !

ఇ)షడ్భ్యోవా జాయతే - షడ్భ్య సంజాయతే యస్మాత్ తష్షడ్జ స్సఉచ్యతే - అంటే ఆరు చోట్ల నించి పుట్టేది. ఈ ఆరు స్థానాలూఏవి?

i. నాస(ముక్కు), ii.కంఠ (కంఠము), iii.ఉరః (వక్షస్సు), iv. తాళు (చెక్కిలి), v.జిహ్వ(నాలుక), vi.దంత (దంతములు - పళ్ళు).

వీటికి సంబంధించిన ఇంకొక శ్లోకం ఉన్నది:

నాసా కంఠమురస్తాలు జిహ్వా దంతాశ్చ సంస్పృశన్
షడ్బిస్సంజాయతే యస్మాత్ తస్మాత్ షడ్జ ఉదీరితహ:

ఈ ఆరు స్థానాలనీ, వాటినించి స్వరాలు ఎలా పుడతాయనేది ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణగారు వారి "తెలుగు వర్ణమాల - విశిష్టతలు" అనే గ్రంథంలో 3 వ అధ్యాయం - ' ఓనమాలు - యోగరహస్యాలు ' , అనుబంధం - 2 లలో చాలా వివరంగా రాశారు. అవన్నీ మళ్ళీ ఇక్కడ చొప్పించడం సబబు కాదని, చదువరుల్ని ఆ పుస్తకం సంపాదించి, చదవమని ప్రోత్సహిస్తున్నాను.

పై మూడు విధాలుగా వివరించిన షడ్జమం ప్రకృతి లో ఎలా ఉంటుంది? అనేది మొదట ఉదహరించిన శ్లోకం ప్రకారంగా "షడ్జమ్ వదతి మాయూరో" ప్రకారంనెమలి కేక అని గుర్తించవచ్చు. మయూరం అంటే నెమలి.దీనివల్ల స్పష్టం అయ్యేదేమిటంటే ప్రకృతిలో ఉన్న, ప్రకృతిలో మనం వినే పక్షులు, జంతువుల కేకలనే తీసుకుని, తాము చెప్పదలచుకున్న విషయానికి ఉదాహరణగా ఈ కేకలని మన ఋషులు చెప్పారు. ఈ 'సా' అనే రాగాన్ని పాటలో ఎక్కడనించి పలకాలో గురువు దగ్గిర నేర్చుకోవలసిందే.

2. ఋషభం / వృషభం: రి / రే / ఱి / ఱే

ఇది సంస్కృతంలో'ఋష' శబ్దంతో పుడుతుంది. ఋష అంటే వెళ్లడం. ఋషతి - 'గచ్ఛతి' (ఋష గతౌ)అనే సంస్కృత ధాతువు బట్టి ఈ అర్థం వస్తుంది. (ఋషి అన్న పదం కూడా ఇలాగే వస్తుంది). ఱేష అంటే వృషభం (ఎద్దు) అనీ ఉన్నది. "ఋషతి బలీవర్దస్వరసాదృశ్యమ్ గచ్ఛతి"సంగీత కళానిధి కోశమ్ నించి ఈ కింది శ్లోకం చూడండి:

ప్రాప్నోతి హృదయం శీఘ్రమన్యస్మాదృషభ: స్మృతః
స్త్రీగవీషు యథా తిష్ఠన్విభాతి ఋషభో మహాన్
స్వరగ్రామే సముత్పన్న: స్వరోయమృషభస్తథా |

ఈ స్వరం హృదయ కుహరంకి చేరుతుందని తాత్పర్యం. హృదయానికి హత్తుకుపోయేది అని కూడా చెప్పచ్చు. స్వరాలనే ఆవుల మధ్యలో ఉన్న ఋషభం, వృషభం - (ఆంబోతు) లాగా వెలిగిపోయే స్వరమన్నమాట. నామలింగానుశాసనం ప్రకారం :

ఋషతి హృదయం ప్రవిశతీతి ఋషభః
ఋషభస్వర సంవాదిత్వాద్వా ఋషభః

అంటే హృదయాన్ని చేరుకునే స్వరం ఋషభం అనీ, ఋషభం వంటి స్వరాన్ని పలికేది అనీ అర్థాలు ఉన్నాయి.

3. గాంధారం: "గ"

సంస్కృతంలో ' గో ' అనే పదానికి నానార్థాలున్నాయి. గో - అంటే గోవులనీ, వేదాలనీ, వాణి అనీ, కిరణాలనీ .. ఇంకా కూడా అర్థాలున్నాయి. కళానిధి టీకా ప్రకారం:

వాచం గాణాత్మికామ్ దత్త ఇతి గాంధార సంఙ్ఞకః

అ ) వాణి అనే అర్థం తీసుకుంటే, ' గాం ' - 'వాణి కి' అవుతుంది. " గాం యః ధరతి వః గాంధారః ". అంటే, గానాత్మక వాణిని ధరించేది గాంధారం అని అర్థం. అన్య వ్యుత్పత్తుల ప్రకారం,

ఆ ) వాక్య సుధా టీక లోను, ముదిగంటి గోపాలరెడ్డి గారి సంస్కృతాంధ్ర నిఘంటువు లోను చూస్తే గాంధార దేశంలో పుట్టింది కాబట్టి దీనికి గాంధారం అని పేరొచ్చింది. అలాగే గాంధార దేశీయైర్గీయత ఇతి వా గాంధారః |అంటే గాంధార దేశపు జనులచేత పాడబడునది అని అర్థం. గాంధార దేశమంటే ప్రస్తుతం అఫ్ఘానిస్తానులో ఉన్న కాంధహార్ ప్రాంతం. ఒకప్పుడు భారతం లో భాగం.

ఇ ) కళానిధి టీక ప్రకారం - గంధర్వులకి ఆనందం, సుఖం కలిగించేది కాబట్టి దీనికి గాంధారం అని పేరొచ్చింది.

ఇలా అన్నిటిని పరిశీలిస్తే ఈ స్వరం సుఖ ప్రదాతమనీ, ఆనంద దాయకమనీ అర్థం తెలుస్తుంది.

నామలింగాను శాసనంలో: గాం వాచరతీతి గాంధారః ధృ ఇజ్ఞ్ ధారణే | వాక్కులను ధరించునది అని ఉన్నది.

ఇక్కడ ఒక ముఖ్య శ్లోకం ఉన్నది: స్వరాంతరస్య గంధం లేశమ్ ఆరాతివా గాంధారః | దీనికి గా - ఆదానే అన్నది ధాతువు. దీని అర్థం ఏమిటంటే స్వరాంతంలో ఉండే శృతిని పుచ్చుకునేది. ఈ అర్థం చాలా ముఖ్యం. ఒక స్వరం యొక్క శృతి గాంధారంకి సంక్రమిస్తుంది కనుక శృతి నిలపడం సులభం.

ఇక ప్రకృతి నించి ఎలా వచ్చిందని పరిశీలిస్తే గొఱ్ఱె స్వరం గాంధారం అని పై శ్లోకం నించి తెలుస్తుంది. గాంధారం శబ్దంకి గొఱ్ఱె అనీ, అందునా ఆడ గొఱ్ఱె అనీ అర్థం తీసుకుంటే ఇంకా మృదువుగా ఉన్న స్వరం అని అర్థమవుతుంది. ఇది పైన చెప్పిన సుఖప్రదాతమనే అర్థానికి ఎలా సరిపోతుందో అర్థమవుతుంది. ఎంత అర్థం చేసుకున్నారో మనవాళ్ళు ప్రకృతిని!

4. మధ్యమం"మ"

అ ) చూడగానే తెలిసేది - ఏడు స్వరాలలోనూ నడిమిది కాబట్టి మధ్యమం అని. నాలగవ స్వరం.

స్వరాణానాం మధ్యమత్వాచ్చ మధ్యమః స్వర ఉచ్యతే

ఆ ) ఇప్పుడు అమరకోశం ప్రకారం ఇంకొక అర్థం చూడండి:

తద్వదేతోత్థితో వాయురఃకంఠ సమాహతః
నాభిం ప్రాప్తో మహానాదో మధ్యస్థస్తేన మధ్యమః

అంటే ఈ స్వర ప్రాదుర్భావం నాభి నుంచి. పలకబోయేటప్పుడు కంఠం లో సమాహతమై బహిర్గతమవుతుంది గనక మధ్యమం అన్నారు. నాభి దేహంలో మధ్యభాగం కాబట్టి సరిగ్గా సరిపోతుంది.

నామలింగానుశాసనం: తద్వదేవోత్ఠితోవాయుఱురః కంఠ సమాహితః నాభి ప్రాప్తో మహానాదో మధ్యస్థత్వాత్తుమధ్యమః - అంటే వక్షస్సు, కంఠములతో కూడి, మధ్యావయవమైన నాభివలన పుట్టునది అని అర్థం.

ఇ ) కళానిధి కావ్య టీక ప్రకారం ఇంకొక అర్థం ఉన్నది:

అథవా మధ్యోమో రోగః ఇతి మధ్యమః |

ఇది చాలా మహత్వ పూర్వకమైన వివరణ. మధ్యో అమః రోగః అంటే ఇక్కడ బుద్ధి యొక్క 'రోగ' మున్నది అనే అర్థం వస్తుంది. అంటే బుద్ధిని ప్రకాశింప చేస్తుంది, అని అర్థం. నేను 'వాగ్రూపం' అనే నా వ్యాసంలో వివరించినట్లు, శబ్దరూపమైన ప్రాణశక్తి కుండలినిలో పైకి ప్రయాణం చేస్తూ, నాభి దగ్గిర మనస్సు అధీనంలో ఉండి, హృదయం చేరేసరికి బుద్ధి వల్ల నియంత్రితం అయినప్పుడు, బుద్ధిని ప్రకాశింప చేసే స్వరం మధ్యమం.

ఇక ప్రకృతి పరంగా చూస్తే " క్రౌఞ్చ క్వణతి మధ్యమం " - అంటే క్రౌంచ పక్షి కూత లాగా ఉండేది మధ్యమం. గద్దలు వాటి ఎర కనబడినప్పుడు ఒక అరుపు అరుస్తాయి. అలాంటి శబ్దంమధ్యమం.

5. పంచమం: 'ప'

పంచ అంటే సంస్కతంలో పూర్ణ అని అర్థం. పంచ అంటే 5 వది అని తెలుస్తుంది. ఐదవ స్వరం కాబట్టి పంచమం. ఐనా దీనికి ఇంకా అర్థాలు ఉన్నాయి.

అ ) అమరకోశం ప్రకారం దీనికి ప్రమాణం ఈ శ్లోకంలో ఉన్నది:

వాయు: సముద్గతో ( సముత్థితో) నాభేరురోహృత్కంఠమూర్ధసు
విచరన్పంచమస్థానప్రాప్త్యా పంచమ ఉచ్యతే |

ఈ స్వర ఉచ్చారణలో వాయువు అయిదు స్థానాల నించి బయటకి వస్తుంది కాబట్టి దీనికి పంచమం అని పేరు. ఆ అయిదు స్థానాలు - నాభి, ఉరస్సు, హృదయం, కంఠం, మూర్ధన్యం.

ఇంకొక వివరణం: పికై : పంచ్యత ఇతివా పంచమః ( పచ్ - విస్తారే) - కోయిలల చేత విస్తరింపబడునది.

ఇంకా కళానిధి టీక లో ఇంకొక విషయం కూడా ఉన్నది:

స్వరాంతరాణాం విస్తారం యో మిమీతే స పంచమః
పాఠ క్రమేణ గణనే సంఖ్యయా పంచమోతథా |

స్వరముల మధ్య ఉండే విస్తారాన్ని కొలిచేది పంచమం. కాబట్టి ఈ పంచమ స్వరం పలికేటప్పుడు మిగతా స్వరాలగురించి, అవి పంచమం నించి ఎంత దూరంగా ఉన్నాయో, వాటి రేంజ్ ఏమిటో పాడేవాళ్లకి తెలుస్తుంది. 'మిమీతే' అంటే కొలవటం అని సంస్కృతార్ధం. అలాగే ఇది ఐదవ స్వరం కాబట్టి పంచమం అని పేరొచ్చింది.

ఇక ప్రకృతి లో పంచమాన్ని ఎలా తెలుసుకుంటున్నాం? ' పుష్ప సాధారణే కాలే పికః కూజతి పంచమం ' - అంటే వసంతంలో కోయిల పంచమంలో కూస్తుంది అని అర్థం. ఎంత అందమైన భావన? ఎంత సులభంగా ఈ పంచమాన్ని పట్టుకోగలం!

6. ధైవతం: 'ధ'

అసలు ఈ వ్యాసం రాయడానికి ఒక విధంగా ఈ స్వరం కారణం. ఇక్కడ కాలిఫోర్నియాలో చాలామంది పిల్లలు సరిగమలు ప్రాక్టీసు చేస్తుంటే విన్నాను. వాళ్లకి 'ధ' పలకదు. 'ద' అని పాడతారు. పూర్తిగావాళ్ళతప్పని అనను కానీ, స్వరం, స్వర నామం సరిగ్గా నేర్చుకోవాలి. టీచర్లు సరిగా నేర్పాలి. ఇది ఆరో స్వరం.

ఈ కింది శ్లోకం చూడండి:

ధీర్యస్యాస్తి స ధీవాంతత్సంబంధీ ధైవతః స్మృతః
షష్ఠ స్థానే ధృతో యస్మాత్తత్తోసౌ ధైవతో మతః |

సంస్కృతంలో 'ధీ' అంటే బుద్ధి. బుద్ధి ఎవరి దగ్గిర ఉన్నదో వారిని 'ధీవాన్' లేక 'ధీమాన్' అంటారు. ధీవాన్ అనిపించుకునే వారితో సంబంధమున్నది ధైవతం. అంటే సంగీత శాస్త్రంలో ప్రవీణులూ, బుద్ధి శాలులెవరో వారికి ప్రియమైనది ధైవతం అని ఒక అర్థం. రెండో అర్థం ఆరవ స్థానంలో స్థిరంగా ఉన్నది ఏ స్వరమో, దానిని ధైవతం అంటారు.

నామలింగానుశాసనం: ధీమద్భిర్గీయతి ఇతి ధైవతః | బుద్ధిమంతుల చేత పాడబడునది. ధావతి నాభ్యాదిస్థానేభ్య ఆగచ్ఛతీతివా ధైవతః దీని ధాతువు ధావు- గతిశుధ్యో: నాభి ఆది స్థానముల వలన పుట్టునది.

ఇక పైన ఉదహరించిన శ్లోకం ప్రకారం ప్రకృతిలో ఈ స్వరం గుఱ్ఱపు సకిలింపు నించి గుర్తించారు.

7. నిషాదం: 'ని'

ఇది ఆఖరు స్వరం. ఏడవ స్వరం. దీని గురించి అమర కోశంలో ఇలా ఉన్నది:

నిషీదన్తి స్వరాః సర్వే నిషాదస్తేన కథ్యతే | రామకృష్ణమాచార్యుల వారి గురుబాల ప్రబోధిక - నామలింగానుశాసనంలో కొంచెం తేడాతో ఇంకొక పాఠమున్నది: నిషీదన్తి స్వరాః అస్మిన్నితి నిషాదః |

అంటే స్వరాలన్నీ ఏ స్వరంలో కలిసిపోతాయో దాన్ని నిషాదం అంటారు. ని-షద్ అంటే కూలబడడమనే అర్థం కూడా ఉన్నది. అంటే అన్ని స్వరాలూ దేనిలో సమాహితమవుతాయో (లయమవుతాయో) అది నిషాదం. షద్ ల్ - విశరణ గత్యవసాదనేషు - కడపటి స్వరం కనుక మిగతా అన్ని స్వరాలూ దీనిలో చేరి ఉంటాయి.

కళానిధి టీకలో - నిషీదతి మనోస్మిన్ అనే అర్థం ఇచ్చారు. అంటే మనసు దేనిలో లయం అవుతుందో ఆ రాగాన్ని నిషాదం అన్నారు. అంటే ఈ స్వరంతో మనసు ఏకీభూతమై, లయం అవుతుందని అర్థం.

ఇక పై శ్లోకానుసారం ప్రకృతిలో ' నిషాదం బృంహతే గజః ' - నిషాద స్వరంలో ఏనుగు ఘీమ్కరిస్తుంది అని చెప్పారు.

ఇక్కడ కొన్ని ముఖ్య విషయాలు గుర్తించవలసిందిగా మనవి. మన పూర్వీకులు ప్రకృతిని ఎంతగా పరిశీలించారో చూడండి. మీది ఆటవిక జాతి, కాబట్టి ప్రకృతికంటె ఇంకేదీ అందుబాటులో ఉండేది కాదు కాబట్టి అన్నీ ప్రకృతికి ముడిపెట్టార'నే పాశ్చాత్త్యుల మాట చాలా చోట్ల వింటుంటాము. దాని కంటే మనల్ని కించపరిచేది ఇంకేమీ లేదు.మన చుట్టూ ఉండి, మనల్ని పోషించే ప్రకృతిని గౌరవించి, మన జ్ఞాన, విజ్ఞాన, సాంస్కృతిక, మత, సామాజిక పరిజ్ఞానం అంతా ఒక పూర్ణ పరిజ్ఞానంగా రూపొందించుకున్నాం మనం. మనకు విజ్ఞానమూ, 'మతమూ' వేరు కాదు. కాబట్టి సంగీతమైనా, నాట్యమైనా, జంతు, వృక్ష, కీటక న్యాయంతో కూడుకుని ఉంటుందన్నది పై ఉదాహరణవలన రూఢి అవుతుంది.

ఇంకొక మాట ఏమిటంటే, మనుషులలో ఉండే త్రిగుణాలు - సత్వ, రజస్తమో గుణాలు విశ్వములో అన్ని గణాల్లోనూ ఉంటాయి. వృక్షాల్లోనూ, జంతువుల్లోనూ, ఆఖరికి రాళ్లలోనూ ఈ మూడు గుణాలూ కనిపిస్తాయి. అదే విధంగా ఈ స్వరాలతో కూర్చిన రాగాలన్నీ కూడా ఈ మూడు గుణాలతో ఉంటాయి. రెండేళ్ల క్రితం ప్రముఖ సంగీతజ్ఞులు, వాగ్గేయకారులు శ్రీ వైజర్సు సుబ్రహ్మణ్యం గారితో ఈ విషయం ఒక సభలో చర్చించడమయింది. వారు నిర్ద్వంద్వంగా రాగాలలో గుణాల గురించి చెప్పారు. ఆ రాగ గుణాలు కూడా ఈ సప్త స్వరాలు ఏవైతే జంతువుల స్వరాలో వాటినించే వచ్చి ఉంటాయన్నది నా ప్రతిపాదన. ఆయా జంతువులలో ఉండే ఉత్కృష్ట గుణం - వాటి గురించి తలచుకోగానే మనకి తట్టే మంచి గుణం ఏదుందో అదే రాగ గుణానికి హేతువవుతుంది అని నాకు అనిపిస్తుంది. అన్ని రాగాల్లోనూ అన్ని స్వరాలుంటాయన్నది విదితమే. అలాంటప్పుడు ప్రతి రాగానికి ఈ స్వర గుణాలెట్లా అబ్బుతాయి? అని ఒక ప్రశ్న వచ్చింది నాకు. ప్రతి రాగంలో స్వరాలు అన్ని గుణాలనీ ఆపాదించవా? అంటే, జన్యు జనితమైన మానవ ఉపాధిలో గుణాలెలా మిశ్రీతమై ఉంటాయో అలాగే ప్రతి రాగంలో మూడు గుణాలూ ఉన్నా, స్వరాల వల్ల ఏ గుణం ఎక్కువో దానివల్ల సత్వ, రజో , తామస రాగాలు తయారవుతాయి. అంతే కాదు; ఆయా రాగాలు మళ్ళీ మనలో (అంటే మనుష్యులలో) అవే గుణాలని రేకెత్తిస్తాయి. ఒకొక్క రాగం ఒకొక్క సందర్భం బట్టి వాడడం మన దక్షిణాది సంగీతంలోనూ, ఉత్తరాది సంగీతంలోనూ చూస్తూనే ఉంటాం. అంతే కాక, సంగీత శాస్త్రంలో రాగ - భావ సమైక్యత ఎలా ఉంటుందో వివరింపబడ్డది. ప్రతి రాగం మనుషులలో ఒకొక్క ఉద్రిక్తతని రేకెత్తిస్తుందన్నమాట కూడా నిజమే. ఇంతే కాక ఈ రాగాలు జంతువులలో, చెట్లలో కూడా ఇవే గుణాలని ప్రేరేపిస్తాయి. అవి మనం సులభంగా గుర్తించలేమన్నది వేరేమాట.

Posted in September 2020, సాహిత్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!