Menu Close
manusmrithi page title
రెండవ అధ్యాయము (ఉ)

భిక్షాటన - భోజనము

ఉపవీతులైన వటువులు భిక్షాటనలో భాగంగా సంసార స్త్రీలను యాచించాల్సిన విధానాన్ని కూడా మనువు స్పష్టంగా నిర్దేశించాడు. ఉపవీతుడైన ఒక బ్రాహ్మణ వటువు ‘భవతి భిక్షాం దేహి’ అంటూ భవచ్ఛబ్దాన్ని ముందు పలుకుతూ భిక్షాటనము చేయాలి. ఉపవీతుడైన క్షత్రియుడు ‘భిక్షాం భవతి దేహి’ అంటూ భవచ్ఛబ్దాన్ని మధ్యలో పలుకుతూ భిక్షాటన చేయాలి. వైశ్య వటువు ‘భిక్షాం దేహి భవతి’ అంటూ భవచ్ఛబ్దాన్ని చివరికి పలుకుతూ భిక్షాటన చేయాలి.

ఆ బ్రహ్మచారి ముందుగా తన తల్లి, తోడబుట్టిన అక్క లేక చెల్లెలు, తన తల్లి తోడబుట్టిన పెద్దమ్మ లేక పిన్ని, వీరెవరూ అందుబాటులో లేకుంటే తనకు భిక్ష వేసేందుకు నిరాకరించి తనను అవమానపరచని వేరొక స్త్రీని భిక్ష కొరకు యాచించాలి.

అలా బిచ్చమెత్తి తెచ్చిన మాధుకరములో గురువుకు కావలసినంత మంచి అన్నాన్ని నివేదించి, మిగిలినది తాను తినేందుకు గురువు అనుజ్ఞ పొంది, ఆచమనం చేసి, శుచిగా తూర్పు ముఖంగా కూర్చుని ఆ భిక్షను భుజించాలి.

మధుకరము అంటే తుమ్మెద. ఒక తుమ్మెద ఎలాగైతే పువ్వుపువ్వుకూ తిరిగి తేనె సేకరిస్తుందో, అలాగే భిక్షుకులు ఇంటింటికీ తిరిగి సేకరించే భిక్షతో జీవిస్తారు. అలా సేకరించి తెచ్చే భిక్షాన్నాన్ని మధుకరము, మాధుకరము లేక మాధవకరము అంటారు. మధుకర వృత్తిని మాధుకరము అంటారు. నా చిన్నతనంలో బిచ్చగాళ్ళు ‘మాదా కవళం తల్లీ!’ అనీ ‘సందా కవళం తల్లీ!’ అంటూ అడుక్కునే వాళ్ళు. మాదా కవళం అంటే ‘మాధవ కబళం (కబళము - ముద్ద)’ అనీ, సందా కవళం’ అంటే సంధ్యా కబళం అంటే సాయంత్రం అందరూ తినగా మిగిలిన అన్నమనీ ఆ తరువాతనే  తెలిసింది.

దీర్ఘాయుష్షు కోరుకునే వ్యక్తి ప్రాక్ అంటే తూర్పు ముఖంగా కూర్చుని భోజనం చేయాలి. కీర్తి ప్రతిష్ఠలు కోరుకునేవాడు దక్షిణానికి తిరిగి కూర్చుని భుజించాలి. సంపద కోరుకునేవాడు ప్రత్యఙ్ముఖుడై అంటే పడమటి దిక్కుకు తిరిగి కూర్చుని భోజనం చేయాలి. మోక్షకామి అయినవాడు ఉదచ్ అంటే ఉత్తర దిక్కుకు తిరిగి (ఉదన్ముఖుడై) కూర్చుని భుజించాలి.

మాధుకరములో గురువుకు ఆయన కోరుకున్నంత నివేదించిన తరువాత బ్రహ్మచారి ఆయన అనుమతితో ఆచమనము చేసి, శేషాన్నాన్ని తినాలి. కుడి చూపుడు వేలు పొడవుగా నిలిపి పుడిసిలితో నీటిని మూడుసార్లు పుచ్చుకొనడాన్నిఆచమనం చేయుట లేక ఆచమించుట అంటారు. దీనినే వార్చుట అనీ అంటారు. పుడిసిలి అంటే చేరలో సగం. దీనినే ప్రసృతి అనికూడా అంటారు. భోజనానికి ముందు, భోజనం తరువాత ఆచమనం అంటే మూడు పుడిసిళ్ళ నీరు తప్పక తీసుకోవాలి. భోజనం చేసేటప్పుడు వేరే ఎలాంటి  ఆలోచనలు కూడదు. భోజనం చేసిన తరువాత పాదములు, చేతులు శుభ్రంగా కడుక్కుని, ఇంద్రియములపై నీటిని చిలకరించాలి.

‘అన్నమ్’ అనే సంస్కృత శబ్దానికి ‘ఆహారము’ అని అర్థం. మనం తినే ఏ ఆహారాన్నైనా సాధారణ అర్థంలో అన్నమనే అంటాం. మన ప్రాచీనులు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించారు. మనం ఎల్లప్పుడూ అన్నాన్ని ధ్యానించాలి. అన్నాన్ని ఎట్టి పరిస్థితులలోనూ దూషించకుండా ప్రేమగా తినాలి. ప్రతి ఒక్కరూ  భోజన సమయంలో నిర్మల మనస్కులై ఉండాలి. అన్నం భుజించడం కూడా ఒక పవిత్రమైన కార్యంలా నిర్వర్తించాలి. మనం ఏ ఆహారం భుజించినా ‘ఇలాంటి అన్నం మాకు  ఎల్లప్పుడూ కలుగుగాక’ అని స్తోత్రం చేయాలి.

ఇలా నిత్యం స్తుతించబడి భుజించే అన్నం మనకు బలాన్నీ, వీర్యాన్నీ ఇస్తుంది. అయితే అలా స్తుతించకుండా అన్నం తింటే అది మన బలాన్నీ, వీర్యాన్నీ నశింపజేస్తుంది.

మనం ఉచ్ఛిష్టము (తినగా మిగిలిన ఎంగిలి అన్నం) ను ఎవరికీ పెట్టరాదు. మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనము తప్ప మధ్యమధ్యలో ఏది పడితే అది తినకూడదు. ఆ రెండు భోజనవేళలలో కూడా మితంగానే  భోజనం చేయాలి. భోజనం చేశాక పైన తెలిపిన విధంగా శుద్ధి చేసుకోకుండా బయటికి ఎక్కడికీ వెళ్ళరాదు.

అతి భోజనం ఆరోగ్యాన్ని కలిగించకపోగా పాడుచేస్తుంది. అది అనాయుష్యం అంటే ఆయుష్షును నశింపజేస్తుంది. అతి భోజనం అస్వర్గ్యం కూడా అంటే స్వర్గప్రాప్తి కోసం చేసే పుణ్యకార్యాలకు అతి భోజనం ఆటంకం కలిగించే విరోధి. పైగా తిండిపోతులను లోకులు తిట్టిపోస్తారు. కనుక ఎవ్వరూ అతి భోజనం చేయరాదు.

భోజనానికి ముందు, భోజనం తరువాత కాళ్ళు, చేతులు శుభ్రపరచుకొనమనీ, ఆచమనం (మూడు పుడిసిళ్ళ నీటిని తీసుకోవడం) చేయమనీ మనువు చెప్పిన ఆరోగ్య నియమాలు నేడు కూడా పాటించదగినవే. మిత భోజన నియమం ఇప్పుడూ అందరూ అనుసరించదగినదే. అతిభోజనం అనారోగ్యకరమనీ, అది ఆయుష్షును క్షీణింపజేస్తుందనీ మనువు చెప్పింది అక్షరసత్యం. అయితే ఆ సందర్భంగా అతిభోజనం స్వర్గప్రాప్తికి ఆటంకం కలిగిస్తుందని చెపితేనేగానీ ప్రజలు అతిభోజనం మానరని మనువు అలా చెప్పి ఉండవచ్చు. మధ్యాహ్న భోజనానికీ, రాత్రి భోజనానికీ మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు తినడం అనారోగ్యకరమనేది కూడా  శాస్త్రీయ సత్యమే. నియమితకాలంలో భోజనంచేయడం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుందని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. మనం తిన్న ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టినప్పుడు వ్యాధికారక క్రిములు మన ఎంగిలి అన్నం ద్వారా అది తిన్న ఇతరులకు సోకే అవకాశముంది. కనుక మనం ఎంగిలి చేసిన ఉచ్చిష్టాన్నాన్ని ఎవరికీ పెట్టవద్దని మనువు విధించిన నియమం కూడా నేడూ అందరూ అనుసరించదగినదే. మనం అన్నం తినే సమయంలో వేరే ఆలోచనలు చేయకుండా,మనం తినే ఆహారం మీదనే మనసును లగ్నం చేసి, దాని పట్ల ఇష్టంతో  తినమని మనువు చెప్పిన విషయమూ అందరికీ ఆమోదయోగ్యమే. అలా ఇష్టంతో తిన్నప్పుడు కడుపులో జీర్ణరసాలు మరింతగా ఉత్పత్తి అయ్యే కారణంగా ఆ ఆహారం చక్కగా జీర్ణం అవుతుందనే విషయం నిర్వివాదాంశం. మనం తీసుకునే ఆహారాన్ని ప్రస్తుతిస్తూ తినాలనీ, ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని భావిస్తూ భోజనం చేయాలనీ  మనువు చెప్పింది కూడా ఆరోగ్యసూత్రాలకు ఆధ్యాత్మిక విశ్వాసాలను జోడించి చెప్పిందే.

అయితే తూర్పు దిక్కుకు తిరిగి కూర్చుని అన్నం తింటే దీర్ఘాయుష్షు, దక్షిణానికి తిరిగి కూర్చుని తింటే కీర్తి, పడమటి దిక్కుకు తిరిగి కూర్చుని తింటే సంపద, ఉత్తరదిశగా తిరిగి కూర్చుని భుజిస్తే మోక్షం లభిస్తాయని మనువు చెప్పడంలో ఏ మాత్రం శాస్త్రీయత కనపడదు. ఇక భిక్షాటన చేసే వటువు ‘భవతి’ అనే శబ్దాన్ని వాక్యంలో ముందుగా, మధ్యలో లేక చివరికి - ఈ మూడింటిలో ఏ విధంగా ఉచ్చరిస్తాడనే దాన్నిబట్టి గృహస్థులు ఆ వటువు బ్రాహ్మణుడా ? క్షత్రియుడా ? లేక వైశ్యుడా ? అని గ్రహించడానికి వీలవుతుందే తప్ప,  మనువు రూపొందించిన ఆ నియమానికి వేరే ప్రయోజనమేమీ ఉన్నట్లు కనిపించదు.

ఆచమనం

ఆచమనం చేస్తూ మనం పుడిసిలితో నీటిని స్వీకరించేటప్పుడు మన అరచేతిలోని ఒక్కొక్క ప్రదేశం నుంచి నీటిని స్వీకరిస్తే ఒక్కో రకమైన ఫలితం ఉంటుందని మనువు పేర్కొన్నాడు. మన అరచేతిలోని వివిధ  ప్రదేశాలను మనువు తీర్థాలు అన్నాడు. బొటనవ్రేలి యొక్క మొదట్లో బ్రాహ్మ తీర్థం ఉందట. చిటికెనవ్రేలి మొదట్లో కాయ తీర్థం ఉందట. వ్రేళ్ళ కొనలయందు దైవ తీర్థముందట. తర్జని అంటే చూపుడు వ్రేలు లేక జుట్టన వ్రేలు. అంగుష్ఠము అంటే బొటనవ్రేలు. తర్జన్యంగుష్ఠముల మధ్య ప్రదేశములో అంటే చూపుడు వ్రేలుకూ, బొటనవ్రేలుకూ  మధ్య పిత్ర్య తీర్థం ఉందట.

బ్రాహ్మణాదులు ఆచమనంలో ఎప్పుడూ బ్రాహ్మ తీర్థంలోని నీటినే స్వీకరించాలి. లేని పక్షంలో కాయ తీర్థం నుంచి కానీ లేక త్రైదశిక తీర్థం (త్రిదశ అంటే దేవత. త్రైదశిక అంటే దైవ తీర్థం) నుంచి గాని నీటిని తీసుకోవాలి. అంతేగానీ ఆచమనంలో పిత్ర్య తీర్థం ఏ పరిస్థితులలోనూ తీసుకోరాదు.

పైన చెప్పిన విధంగా మూడుసార్లు తీర్థం స్వీకరించి, ఆచమనం చేయాలి. ఆ తర్వాత నోటిలోకి నీటిని తీసుకుని, పెదాలు మూసి నోటిని నీటితో శుద్ధి చేయాలి. అంటే బాగా పుక్కిలించాలి. ఆ తరువాత నీటిని ఎడమచేతిలో ఉంచుకుని కళ్ళు, చెవులు, ముక్కు, ఛాతీ, శిరస్సులను నీటితో తుడవాలి.

శౌచమును కోరుకునే బ్రాహ్మణుడు ఒక ఏకాంత ప్రదేశములో తూర్పుకు లేక ఉత్తరమునకు తిరిగి కూర్చుని వేడిగాలేని, నురుగులు కట్టని నీటిని బ్రాహ్మ తీర్థం నుంచి స్వీకరించి ఆచమనం చేయాలి. నీటిపై తెట్టగా కట్టిన నురుగులు నీటిలోని మాలిన్యాలకు సంకేతం. ఆచమనానికి ఎప్పుడూ మాలిన్యరహితమైన స్వచ్ఛ జలాలనే వాడాలి.

ఒక బ్రాహ్మణుడు తన హృదయానికి చేరేటంత పరిమాణపు నీటిని ఆచమనం చేస్తేనూ, క్షత్రియుడు గొంతు తడిసేటంత నీటితో ఆచమిస్తేనూ, వైశ్యుడు నీటిని నోటిలోకి పుచ్చుకున్నంత మాత్రం చేతనేనూ, శూద్రుడు నాలుక, పెదవికి ఆచమన జలం తాకినంతమాత్రం చేతనేనూ పరిశుద్దులవుతారట. ఇదీ ఆచమన జల పరిమాణం.

***సశేషం***

Posted in September 2020, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *