Menu Close
Adarshamoorthulu
-- డా. మధు బుడమగుంట
హ్యూమన్ కంప్యూటర్ శ్రీమతి శకుంతల దేవి
Shakuntala Devi

మనిషి తయారుచేసిన యంత్రాలకు అవధులు ఉంటాయి. స్వయంగా ఆలోచించే సత్తా ఉండదు. కానీ మనిషి మెదడులో జనించే ఆలోచనలు అనంతం. వాటికి ఎటువంటి పరిమితులు ఉండవు. ఇది అందరూ గుర్తించాల్సిన వాస్తవం. పై సూత్రమే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబ స్త్రీని అపర గణిత మేధావిని చేసి ప్రపంచానికి పరిచయం చేసింది. ఎటువంటి సంఖ్యాపరమైన సమస్యలనైనను అతి సులువుగా, అత్యంత వేగంగా పరిష్కరించడమే కాకుండా వివరణ కూడా ఇవ్వగలిగిన సత్తా ఈ మహాసాధ్వికి మాత్రమే సాధ్యమైనది. ఆవిడ ఆలోచనా విధానం ఎంతోమందికి ఆదర్శమై, ఆచరణయోగ్యమైనది. ఆ మహా మేధావే మన భారతావనిలో పుట్టి యావత్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని వెలుగొంది, ‘హ్యూమన్ సూపర్ కంప్యూటర్’ గా బిరుదు గాంచిన శ్రీమతి శకుంతల దేవి, నేటి మన ఆదర్శమూర్తి.

శకుంతల దేవికి ఉన్నత విద్యను అభ్యసించగలిగిన స్తోమత లేదు. తండ్రి చిరుద్యోగి. తల్లి సాధారణ గృహిణి. కానీ ఈ స్త్రీ మూర్తి బ్రిటన్ లోని అత్యంత ప్రముఖ గణిత శాస్త్రవేత్తలతో పోటీపడి వారిని అబ్బురపరించింది. అందుకు తనకు గల అర్హత, తన మేధస్సులో రూపుదిద్దుకున్న యధేచ్చమైన సంఖ్యానుగుణ మహత్తర ఆలోచనా ప్రవాహమే. అది నిజంగా ఒక గొప్ప వరమే. ఆమె దానిని ఉపయోగించుకొని తన ఉనికిని ప్రపంచానికి చాటింది. తన విశ్లేషణలు తన తరువాతి వారికి ఎంతో ఉపయోగపడి సరికొత్త గణిత సిద్ధాంతాలకు మార్గదర్శకమైనది.

1929, నవంబర్ 4వ తేదీన బెంగుళూరు లో జన్మించిన శకుంతల దేవి, చిన్నప్పటినుండే సంఖ్యాశాస్త్రంలో ఎంతో పట్టుకలిగి అందరూ ఆశ్చర్యపడే రీతిలో నెంబర్లతో కూడికలు, తీసివేతలు, గుణింతం మరియు భాగించడం, మొత్తం అంకగణితాన్ని అంతా కూడా ఎటువంటి పేపర్, పెన్ లేకుండానే తన మెదడులో గణనం చేసి వాటికి సమాధానాలు చెప్పేది. పుట్టుకతోనే పరిమళించిన తన ప్రావీణ్యతను చిన్నప్పుడే స్టేజిమీద ప్రదర్శనలు ఇచ్చి అందరి మన్ననలు పొందుతుండేది.

Shakuntala Deviగణితంలో తనకున్న ప్రజ్ఞా పాటవాలను అనేకమంది విద్యార్థులకు కొన్ని క్లిష్ట సమస్యలను అతి సులువైన పద్దతులలో వివరించేందుకు ఉపయోగించింది. విశ్వవిద్యాలయ ఆచార్యులు కూడా అబ్బురపడేటట్లు తన విశ్లేషణలు ఉండేవి. కంప్యూటర్ తో మాత్రమే చేయగలిగిన సంఖ్యా గణాంకాలను కేవలం తన మెదడును ఉపయోగించి అతి వేగంగా చేస్తుండేది. అందులో లాజిక్ మాత్రం మిస్ అవకుండా వివరిస్తూ, మాయ, మంత్రాలు ఏవీ లేవని చక్కగా చెప్పేది. ఉన్నత విద్య పట్టభద్రురాలు కాకున్ననూ, అనేక విశ్వవిద్యాలయాల్లో తన సంఖ్యా పాటవాన్ని ప్రదర్శిస్తూ అనేక మన్ననలు పొందింది.

దేశ విదేశాలలో ఎంతో పేరును గడించిన శకుంతల దేవి, 1950 దశకంలోనే పేరుగాంచిన గణిత మేథావులతో చర్చలు చేస్తూ మరియు ప్రదర్శనలు ఇస్తూ, యావత్ ప్రపంచాన్ని చుట్టేసింది.

ఆమె మేధాసంపత్తి కి ఒక చిన్ని ఉదాహరణ: 1977 వ సంవత్సరంలో సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయం లో 23rd root of a 201-digit number కి సమాధానాన్ని తను 50 సెకెన్లలో 546,372,891 అని చెప్పగా, అదే సమాధానం US Bureau of Standards వారి UNIVAC 1101 computer కి 62 సెకన్లు పట్టింది. అప్పటినుండే ఆవిడను ‘హ్యూమన్ సూపర్ కంప్యూటర్’ అని పిలవడం మొదలుపెట్టారు. 1980 జూన్ 18 న 13 అంకెలు కలిగిన రెండు అతిపెద్ద సంఖ్యలను గుణించి 26 సెకెన్ల లోనే సమాధానాన్ని చెప్పినందుకు గాను ఆవిడ పేరును 1982 గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదుచేశారు. ఇంతకన్నా గొప్ప పురస్కారం వేరే ఏముంటుంది? తన పరిజ్ఞానాన్ని అంతా క్రోడీకరించి భావితరాల కోసం ‘Figuring: The Joy of Numbers’ అనే గ్రంధాన్ని రచించారు. దురదృష్టవశాత్తూ అది ఇంకా ముద్రణకు నోచుకోలేదు.

సంఖ్యాశాస్త్రం మీద తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి జ్యోతిషశాస్త్రం మీద కూడా పట్టును సాధించారు మన శకుంతల గారు. ఎంతో మంది ప్రముఖులకు ఆస్థాన జ్యోతిష్కురాలుగా వెలుగొందారు.

ప్రతి మనిషి యొక్క వ్యక్తిగత లక్షణాలు తను పెరిగిన వాతావరణం, తన చుట్టూ ఉన్న సామాజిక కుటుంబ వ్యవహారాలూ, కట్టుబాట్లు, స్థితిగతుల ఆధారంగా ఏర్పడతాయి. అయితే తన శాస్త్రీయ పరిజ్ఞానం మరియు మేధోసంపత్తి మాత్రం తన సహజసిద్ధమైన శాస్త్రీయ అంశాలతో అలవడుతుంది. శకుంతల గారి కీర్తి, ప్రతిష్ట నలుదిశలా వ్యాపించింది. కానీ ఆవిడ వ్యక్తిగత జీవితం ఎన్నో ఒడిదుడుకులు, వత్తిడులు, మగవారంటే ద్వేష భావం తోనే చివరివరకు ముడిపడింది. కొన్ని వాస్తవ విషయాలు ఆవిడ జీవిత చరిత్రను క్షుణ్ణంగా చదివిన వారికి మాత్రమే అర్థమౌతాయి. ఈ మధ్యకాలంలో ఆవిడ బయోగ్రఫీ మీద ఒక మంచి చిత్రాన్ని కూడా నిర్మించారు. అందులో మనకు తెలియని శకుంతల గారి జీవిత గాథ ను కూడా చూడవచ్చు. ఎందుకంటే ఆ నిర్మాణంలో శకుంతల గారి ఏకైక కుమార్తె కూడా వాస్తవ విషయాలతో ఎంతగానో సహకరించారు. ఎన్నో వినూత్న గణిత ప్రక్రియలకు శ్రీకారం చుట్టిన శకుంతల గారు 21 ఏప్రిల్ 2013 న పరమపదించారు. కానీ ఆవిడ ఆత్మ సంఖ్యల రూపంలో మన ఆలోచనలలో సదా నిలిచే ఉంటుంది

Posted in September 2020, వ్యాసాలు

2 Comments

 1. Reddy

  As a astrologer she. Toured some countries —cheated people
  She is not astrologer —to make money —she acted. Like ——
  True story

 2. అనుపమ

  మహామేధావి గురించి గుర్తుచేసి, చాలా విషయాಲು చెప్పారు మా ఆండరికి.
  కృతజ్ఞతగಲು మధు గారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *