తీరని దాహపు తుపానులో...
నీ కోరిక తెలిసింది
నా కళ్ళు కాగడాలవుతున్నాయి.
పడమర వాలే సూరీడు
గుటకలు మింగుతున్నాడు.
చిలిపి సంధ్యా కాంతులు ముసురుతున్నాయి.
నీ చల్లని కురులు బంధిస్తున్నాయి.
అలలు అలలు గా చూపులు ఎగసి ఎగసి
మత్తు మత్తు గా ఆశల్ని తాగుతున్నాయి.
కొసరే మాటలతో
పూసే మల్లెల వాగులతో
తేలియాడిన నవ్వుల సాక్షిగా
నువ్వు కాసింత లోతుగా ముంచేస్తావు.
ఈ దేహం నిండా గాజుల గలగలలు నింపుకొని
స్వర్గపు అంచున నిను వెలిగించుకుని
ఈ చూపుల నిండా
నిన్ను తీయగా దాచుకుని
అనుభూతి పడవల్లో పయనిస్తాను.
ఊహలు చినుకులుగా రాలి
నిగారించే మేను పరవళ్లకే
సీతాకోక చిలుకలా వాలి
మకరందపు తహ తహలు తాగి
తీరని దాహపు తుపానులో చిక్కుకుని
మెత్తగా వాలిన ఒక రాత్రి.
ఆతృతగా చలిమంటలు కాగుతూ
క్షణాలు ఆప్యాయంగా మునుగుతున్నాయి.
ఇక ఇద్దరం
ఈ ఒంటరి రాత్రి చిరు నవ్వుల యుద్ధం చేస్తూ
అలసిపోతాం.