భర్తృహరి సుభాషితాలను తెలుగువారికి అందించిన సుకవి "ఏనుగు లక్ష్మణ కవి"
“సుకవి జీవించు ప్రజల నాలుకల మీద” అని అన్న జాషువా గారి మాట ఏనుగు లక్ష్మణ కవి విషయములో నిత్య సత్యం. ఎందుకంటే భర్తృహరి సుభాషితాలను సులభమైన శైలిలో ప్రతి వారికి అర్ధమయేలా తెలుగువారికి పరిచయం చేసిన ఏనుగు లక్ష్మణ కవి చిరంజీవి.
భర్తృహరి సుభాషితములను తెలుగులోకి అనువాదం చేసినవారు ముగ్గురు. 1. ఏనుగు లక్ష్మణ కవి, 2. పుష్పగిరి తిమ్మన, 3. ఎలకూచి బాలసరస్వతి. వీటన్నింటిలోనూ ప్రజాదరణ పొంది అందరి నోళ్లలో నానినవి ఏనుగు లక్ష్మణ కవి అనువాదాలే. భర్తృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రిశతి తెలుగులోనికి "సుభాషిరత్నావళి" పేరు మీద అనువాదం చేశారు. సుభాషిరత్నావళి -నీతి, శృంగార, వైరాగ్య శతకములని మూడు భాగాలు.
ఏనుగు లక్ష్మణ కవి గారు క్రీ.శ.18 వ శతాబ్దికి (1797) చెందిన వారు. ఆయన తల్లిదండ్రులు పేరమాంబ, తిమ్మకవి. వీరి జన్మ స్థలం తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు దగ్గర ఉన్న పెద్దాపురం. శ్రీ లక్ష్మణ కవి గారి ముత్తాత గారు శ్రీ పైడిపాటి జలపాలా మాత్యుడు. పెద్దాపుర సంస్థాన సాధీశ్వరుల నుండి ఏనుగును బహుమానముగా పొందుట చేత కాలక్రమేణ వీరి ఇంటి పేరు "పైడిపాటి" నుంచి "ఏనుగు"వారిగా స్థిరపడినది. ఆ జలపాల మంత్రి ముని మనుమడు లక్ష్మణ మంత్రి. ఆయన మనవడు ఏనుగు లక్ష్మణ కవి. ఈ వంశము కవుల వంశం గానే ప్రసిద్ధి కెక్కింది.
శ్రీ వత్యవాయ తిమ్మజగపతి పాలకుల వద్ద ఉన్న ప్రసిద్ధ కవి, కవి సార్వభౌమ కూసుమంచి తిమ్మకవి, లక్ష్మణ కవి గారి సమకాలికుడు. లక్ష్మణ కవి గారు ఈ సుభాషిత రత్నావళిని లక్ష్మణ కవి అతి మనోహరముగ, యథామూలముగ, ప్రౌఢముగ, సందర్భసముచిత శైలిలో కవి హృదయమును గ్రహించి రచించారని పెద్దల అభిప్రాయం. కానీ దీనిలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయని ఇతర పండితులు గుర్తించారు. పద్యములు రసవంతముగ ఉండటం వలన వాటిని పండితులు పామరులు కూడా పఠించి ఆనందించారు కాబట్టి ఈ లోటుపాట్లు అంతగా పట్టించుకోనక్కర లేదు.
లక్ష్మణ కవి గారి ఇతర రచనలు -- రామేశ్వర మాహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, సూర్య శతకము (ఇది సంస్కృత భాషలోనిది), గంగా మహత్మ్యము, రామ విలాసము, లక్ష్మీనరసింహ శతకము, జాహ్నవీ మాహాత్మ్యము, విశ్వేశ్వరో-దాహరణము, సుభాషిత రత్నావళి. చాలా కాలం మాధ్యమిక విద్యలో ఈ పద్యాలు బోధనాంశాలుగా ఉండేవి. మాధ్యమిక విద్య దశలో కంఠస్థం చేయదగినవి ఉదాహరణకు :-
ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకము నందుండి య
స్తోకాంబోధి, పయోధినుండి పవనాంధోలోకముం చేరె గం
గా కూలంకష, పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్.
వివేకము కోల్పోయిన వ్యక్తి ఏ రకముగా పతనము అవుతాడో ఈ పద్యములో చక్కగా వివరించాడు.
ఈ పద్యం రాని తెలుగు వారు ఉండరేమో! అలాగే "ఆరంభింపరు నీచ మానవులు", "గ్రాసము లేక స్రుక్కిన ", "తివిరి ఇసుమున తైలంబు","క్షమ కవచంబు" మొదలైన పద్యాలన్నీ చాలామందికి కరతలామలకాలే.
లక్ష్మణ కవి సంస్కృత పద్యానికి తెలుగు అనువాద ప్రతిభకు ఉదాహరణగా ఒక పద్యాన్ని చెప్పుకుందాము.
భర్తృహరి సంస్కృత పద్యం:-
క్షీరేణాత్మగతోదకాయ హి గుణాదత్తాః పురాతే ఖిలాః
క్షీరోత్తాప మవేక్ష్య తేన పయసా స్వాత్మా కృశానౌ హుతః
గన్‌తుం పావక మున్మన స్తదభవ ద్దృష్ట్వాతు మిత్రాపదం
యుక్తం తేన జలేన శామ్యతి నతాం మైత్రీ పున స్త్వీదృశీ-
పై పద్యానికి ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు అనువాదం
ఉ. క్షీరము మున్ను నీటికొసఁగెన్ స్వగుణంబులు దన్నుఁజేరుటన్
క్షీరము దప్త మౌట గని చిచ్చుఱికెన్ వెతచే జలంబు దు
ర్వారసుహృద్విపత్తిఁ గని వహ్నిఁ జొరం జనె దుగ్ధ్హ మంతలో
నీరముఁ గూడి శాంతమగు నిల్చు మహాత్ములమైత్రి యీగతిన్.-
అర్ధం-నీళ్ళకు పాలంటే కృతజ్ఞత. తనకంటూ ఆశ్రయ మిచ్చినందుకు, పాలకు నీళ్ళంటే కృతజ్ఞత. తనలో ఇట్టే కలిసి పోయినందుకు, తన ఒంటరి జీవితంలో తోడై నిలిచినందుకు. నీళ్ళకు పాలు చక్కని రంగునిస్తాయి. కమ్మని రుచిని ప్రసాదిస్తాయి. పొయ్యి మీద పాలు మరిగిపోతుంటే నీళ్ళు తట్టుకోలేకపోతాయి. నీళ్ళు ఆ బాధను తమంతట తామే స్వీకరిస్తాయి. మౌనంగా ఆవిరై ఇంకిపోతాయి. అప్పటిదాకా తోడు నీడగా నిలిచిన స్నేహితుడు ఆవిరైపోతుంటే ఆ బాధను తట్టుకోలేక పాలు ఉద్వేగంతో బుస్సున పొంగుతాయి. పొయ్యిలోని మంటను ఆర్పటానికి సమాయత్తమవుతాయి. ఇల్లాలు దోసెడు నీటిని చల్లగానే, పాలు-నీరు మళ్ళీ కలుసుకుంటాయి. మిత్రుడు తిరిగి వచ్చిన సంతోషంలో పాల ఉద్వేగం తగ్గిపోతుంది. పాలు చల్లబడుతాయి.
ఈ విధంగా ఏనుగు లక్ష్మణ కవి భర్తృహరి సుభాషితాలను సంస్కృతం రాని తెలుగు వారికి కూడ సులభముగా అర్ధమయే రీతిలో సుభాషితాలను సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించి తెలుగు వారికి అందించారు. అందువల్ల ఈ సుభాషిత పద్యాలు ఎల్లకాలం చిరస్థాయిగా ఉంటాయి. పాఠశాల దశలో ఈ పద్యాలను కంఠస్థం చేస్తే భవిష్యత్తులో బాలుడు నీతివంతమైన పౌరుడిగా, సత్ప్రవర్తన కలిగిన వాడుగా సమాజంలో ఎదుగుతాడు. కాబట్టి పాఠశాల దశలో ప్రతి పిల్లవాడు విధిగా చదవాల్సిన పద్యాలు ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి సుభాషితాలు.