Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

అలాగే ఉపదేవతలైన సిద్దేశ్వరుడు, త్రిదశేశ్వస్వరుడు మొదలైన వారి కథలు ఎన్నో ఉన్నట్లు ఆరుద్ర తెల్పారు. పవిత్రమైన కాంచీపుర వైభవాన్ని దుగ్గన ఎంతో శ్రద్ధా భక్తులతో వ్రాయబట్టే గంగయ మంత్రి దుగ్గన రచనను గూర్చి దుగ్గన గద్య పద్యాలలో వేదాలు విహరిస్తాయని, శాస్త్రాలకు తావులనీ ఎంతో ఘనంగా పొగిడాడు.(నా.సి.---1—18-19) అని ఆరుద్ర తెల్పుతూ ఆ స్తుతి పద్యాలను తెల్పారు.

దుగ్గన రచనా విధానం:

కవులు తమకు పూర్వమున్న కవులను అనుసరించడం, మక్కికి మక్కి దించడం జరిగే విషయమే. ఆ విషయం చెప్తూ ఆరుద్ర దుగ్గన నాసి(చి)కేతోపాఖ్యానం లో (1-9) వ్రాసిన ఒకే ఒక పద్యం నన్నెచోడుని పద్యానికి ప్రతిబింబంలా ఉందని తెల్పాడు. ఆ పద్యం నన్నెచోడుని కుమారసంభవం లోని (1-30) పద్యం. అయితే దుగ్గన ఇంతచేసి పూర్వకవుల స్తుతి లోనూ ఎక్కడా నన్నెచోడుని ప్రసక్తే తేలేదు.

దుగ్గనపై కవిత్రయం వారి ప్రభావం బాగా ఉందని చెప్తూ నాసి(చి)కేతోపాఖ్యానం లో అది బాగా కనపడుతుందని ఆరుద్ర తెల్పారు. నాసి(చి)కేతోపాఖ్యానం యమలోక ప్రాధాన్యతగా చెప్పబడింది. కాని దుగ్గన ఆ కథను వేరే అభిప్రాయంతో తీసుకున్నాడు అన్నారు ఆరుద్ర. ఆ మార్పులో దుగ్గన ఇలా రచించాడు. మానవునికి నిరంతర బ్రహ్మచర్యం తగదని మునులు సహితం గృహస్థాశ్రమం స్వీకరించ వలెనని ప్రభోదించడానికే తన రచనలో ప్రయత్నించాడు. ఇందులో ఉద్దాలకుడు సూత్రధారి. ఇతని కథను ఆరుద్ర ఓపికగా అవసరమైన చోట్ల దుగ్గన వ్రాసిన పద్యాలను తెల్పుతూ వివరించారు.

తండ్రి వెళ్ళగొడితే అడవికి వచ్చిన చంద్రవతి (నాయిక) గూర్చి వ్రాసిన దుగ్గన పద్యం తిక్కన గారు తన నిర్వచనోత్తర రామాయణం లో సీతమ్మ వారి గురించి వ్రాసిన పద్యం (9-38) వలె ఉన్నదని ఆరుద్ర తెల్పారు.

‘ఎవ్వరే నిక్కాన కేల వచ్చితి వన్న నేమని యుత్తరం బిచ్చుదాన
నేరీతి విఫల సంసారంబు నపకీర్తి ముంచుచు వెడలంగ బొవుదాన?’... (నాచి 1-207)

అన్న పద్యం దుగ్గనకు తిక్కన రచనపై మక్కువ ఉన్నదనడానికి సాక్షంగా చూపారు. (స.ఆం.సా. పుట 774).

నాసి(చి)కేతోపాఖ్యానం కథ భారతీయ తత్వశాస్త్ర చరిత్రలో ఒక సంధి యుగానికి చెందినదన్నారు ఆరుద్ర.

శ్రీనాథుని రచనలలో ఎన్నో చారిత్రక విషయాలు ఉన్నాయని, కాని దుగ్గన శ్రీనాథుని కి శిష్యుడైననూ, తన రచనలలో చందలూరి మంత్రుల వంశ వర్ణనలో నున్న 53 గద్య పద్యాలలో (1-22 నుంచి 1-75 వరకు) ఒక్క చారిత్రక విషయం కూడా చెప్పలేదన్నాడు ఆరుద్ర. దుగ్గన తన రచనలో ఇంకా అల్లసాని పెద్దనను, ఆడిదం సూరకవిని మొదలైన వారిని స్మరించి తన రచనలో వారి పద్య ఛాయలను నింపి తనకు వారి పట్ల గల గౌరవాన్ని అభిమానాన్ని చాటుకొన్నాడని చెప్పవచ్చు. ఈ విషయాన్నే చెబుతూ ఆరుద్ర ఇలా అన్నారు.

‘కవులు పూర్వకవులను తలంచి ఆ స్ఫూర్తితో తమ రచనలు సాగించడం మంచి విషయం. శృంగార కవి తిరుమలానాథుడు, మిక్కిలి మల్లికార్జునుడు, తోలేటి వెంకట సుబ్బారావు మొదలైన వారు నాసికేతోపాఖ్యానాలు దుగ్గన ప్రభావం వల్ల కూడా రచించారు.’

జక్కన

“ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సాహసవీరుడు ఉంటాడు...అతడు అద్భుత కార్యాలను సాధించగలడు...అటువంటి వీరుడు లేకపోతే జనులు అతణ్ణి సృష్టించుకొంటారు...మన భారత దేశానికి ఏకైన వీరుడు విక్రమార్కుడు. అతన్ని గూర్చి చెప్పుకొనే కథలు అనేకం. భట్టి విక్రమార్కుని కథలు, విక్రమార్కుని సింహాసనం వద్ద ఉన్న బొమ్మలు చెప్పిన కథలు, భేతాళ కథలు ఇలా ఎన్నో వున్నాయి.” అంటూ ప్రారంభించిన ఆరుద్ర, జక్కనను గూర్చి ఆయన రచనలలోని గొప్పతనాన్ని గూర్చి కథలను గూర్చి విపులంగా చర్చించాడు.

ఆదిమ యుగంలోనే శూద్రకరాజ చరిత్ర పేరుతో విక్రమార్కుని కథ తెలుగు, కన్నడ భాషలలో ప్రాచుర్యం పొందిందని, క్రీ.శ.1400 లోని విక్రమార్కుని కథలు అతని పేరుమీదనే తెలుగు దేశంలో ప్రాచుర్యం చెందాయని ఆరుద్ర తెల్పారు. వీటిని గ్రంథ రూపంలోకి తెచ్చినవాడు జక్కన. ఇతని రచన పేరు విక్రమార్క చరిత్రము.

జక్కన బహుశా నెల్లూరి వాడు. జక్కన తాత పెద్దయామాత్యుడు. తండ్రి అన్నయ. తాతగారు చిత్రకవి వివిధ భాషా కోవిదుడైతే, జక్కన తండ్రి మంచి మాటకారి. అఖిల రాజ కుంజర సభలలో మాటాడి వారిచే కొనియాడబడ్డాడు.(స.ఆం.సా పేజీ 78౦).

అలాగే జక్కన నెల్లూరును, బెల్లంకొండ, సిద్ధపట్టణ స్థానం మొదలైన పాకనాటి ప్రదేశాలను పేర్కొన్నాడు. ఈ ప్రదేశాలలో వెన్నెలకంటి వంశస్థులు రాజోద్యోగులుగా ఉండేవారు. అందులో ఆ వంశస్థుడైన సిద్ధన మంత్రి ఒకడు.

సిద్ధన మంత్రి జక్కనను పిలిపించి ఇలా అన్నాడు. పురాణాలు, రామాయణాది కావ్యాలు అన్నీ విన్నాను. అందువల్ల

తలప దదీయమేకతవితానముకంటెను సాహసక్రియా
కలితవదాన్య తాదిగుణ గౌరవరేఖల విక్రమార్క భూ
తలపతి యెక్కుడై నెగడె దచ్చరితంబు బ్రబంధశయ్యగా
దెలుగున జెప్పి యా కృతిపతిత్వము మా కొడగూర్చు నేర్పునన్ (విక్రమ 1-28)

అని చెప్పగా అందుకు అంగీకరించి జక్కన విక్రమార్క చరిత్రము వ్రాసి సిద్ధన మంత్రికి అంకితమిచ్చాడు.

విక్రమార్క చరిత్ర ఎనిమిది ఆశ్వాసాల కావ్యం. ఇందులో 1519 గద్య పద్యాలున్నాయి. జక్కన జనులలో ఆనాడు బహుళ ప్రచారంలో ఉన్న విక్రమార్కుని కథలను ఒకచోట చేర్చి చక్కని కథలు రచించాడు.

ఆరుద్ర “విక్రమార్క చరిత్ర” అని శీర్షిక పెట్టి ఆశ్వాసాల వారీగా ఎనిమిది ఆశ్వాసాల లోని కథను వివరించారు. నేను ప్రస్తుతం మొదటి ఆశ్వాసం లోని విషయాన్ని క్లుప్తంగా పొందు పరుస్తాను.

శృంగార శేఖరుడనే రాజు మధురానగారాధిపతి. ఆయన వద్ద చంద్రగుప్తుడనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతడు ఎంతో అందగాడు, పండితుడు. ఆ రాజ్యపు దండనాథుని చెల్లెలు మదనరేఖ చంద్రగుప్తుని తనను పెళ్ళిచేసుకోమని అడిగింది. అతడు కులం తక్కువ దానివైన నిన్ను నేను వివాహమాడను అని చెప్తాడు. మదనరేఖ కోర్కె తీర్చడం కోసం, ఆ బ్రాహ్మణుడు శాస్త్రరీత్యా నాలుగు కులాల కన్యలను క్రమంగా వివాహం చేసుకోవచ్చని దండనాధుడు పండితుల చేత చెప్పించిన తరువాత చంద్రగుప్తుడు ఒప్పుకొని మొదట పురోహితుని కుమార్తె శీలవతిని, రాజుగారి కుమార్తె రాగామంజరిని, ధనగుప్తుడనే వైశ్యుని కుమార్తె సుమతిని పెండ్లి చేసుకొన్న తర్వాత చంద్రగుప్తుడు మదన రేఖను వివాహమాడాడు. ఆ నలుగురికి క్రమంగా (కులాలవారీగా)బ్రాహ్మణ స్త్రీ కి వరరుచి, క్షత్రియ స్త్రీ కి విక్రమార్కుడు, వైశ్య స్త్రీ కి భట్టి, శూద్ర స్త్రీ కి భర్తృహరి జన్మించారు.

**** సశేషం ****

Posted in March 2024, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!