ధర్మస్థాపన కోసం భగవంతుడు కానీ దేవతలు కానీ పుట్టాలంటే మంచి ముహుర్తం చూసుకున్నాక వాళ్ల జననం జరుగుతుందని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు పుట్టేది మంచి చేయడం కోసం. ఇప్పటికీ పెళ్ళిళ్లకీ మిగతా శుభకార్యాలకీ మంచి ముహుర్తం చూడకుండా ఏమీ చేయరు. మనమే ఇలా ఉంటే రాముడూ కృష్ణుడూ పుట్టిన ముహుర్తాలు ఎలా ఉండాలి? ఈ పద్యంలో నన్నయ చెప్తున్నాడు ఎవరు ఏ సమయంలో పుట్టారో.
ఉ.
క్షత్రయుతుండుగా శశి ప్రకాశజయోన్నతమైన యష్టమిన్
మిత్రముఖగ్రహప్రతతి మేలుగ నాభిజితోదయంబునం
బుత్త్రుడు ధర్మునంశమునబుట్టె నతిస్థిరధర్మమూర్తి యై (ఆది పర్వం పంచమాశ్వాసం. 94)
శాత్త్రవ – శాతృవులని, జైత్ర – జయించే, తేజమున – పరాక్రమంతో, సర్వదిశల్ వెలుగొంగ – దశదిశలూ వెలుగుతో నిండినప్పుడు, ఐంద్ర నక్షత్ర యుతుండుగా – ఇంద్రునికి సంబంధించిన జ్యేష్టా నక్షత్రంలో, చందమామలాగా ప్రకాశిస్తూ (శశి ప్రకాశజయోన్నతమైన) అష్టమిన్ – ఎనిమిదో రోజు, మిత్ర (సూర్యుడు) ముఖగ్రహప్రతతి మేలుగ (మిగతా గ్రహాలన్నీ ఉఛ్ఛస్థితిలో ఉన్నప్పుడు), నాభిజితోదయంబునన్ (అభిజిత్ ముహుర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి సూర్యుడు ఉఛ్ఛంగా ప్రకాశిస్తూ దిశలన్నీ వెలుగుతో ఉన్నప్పుడు) ధర్మునంశమున – యముడు, ధర్మదేవత అంశం తోటి, పుట్టాడు కొడుకు (పుత్త్రుడు). ఎలా పుట్టాడో చెప్పాడు కనక ఇప్పుడు ఎందుకు పుట్టాడనేది చెప్తున్నాడు – అతిస్థిర ధర్మమూర్తియై – స్థిరమైన ధర్మం కోసం పుట్టాడు. ఇంతకీ పుట్టినది ఎవరు? పాండవాగ్రజుడైన యుధిష్టిరుడు లేదా ధర్మరాజు. ఈ పుట్టినదెవరనేది పద్యంలో “ధర్మునంశమున” అనేది చదివేదాకా తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి పుస్తకం లో ఇలా అంటారు. కలియుగం ప్రారంభం చైత్రశుద్ధ పాడ్యమి (యుగాది) అనుకుంటే అంతకు పైన నూట ఎనిమిది ఏళ్ల ఎనిమిది రోజుల ముందు వచ్చినది అష్టమి, జ్యేష్టా నక్షత్రం. సరిగ్గా ఆ రోజున అభిజిత్ లగ్నంలో ధర్మరాజు పుట్టాడు. ఈ అభిజిత్ లగ్నం గురించి ఇంతకు ముందొకసారి చెప్పుకున్నాం. హనుమంతుడు లంకానగరం నుంచి వచ్చి ‘దృష్టా దేవీ’ అని చెప్పగానే రాముడు దండయాత్రకి బయల్దేరినది అద్భుతమైన ఈ అభిజిత్ ముహుర్తంలోనే. గౌతమ బుద్ధుడు పుట్టినది కూడా ఈ అభిజిత్ ముహుర్తంలోనే అంటారు.
ఈ పద్యంలో చెప్పినట్టూ ధర్మరాజు ధర్మాన్ని ఎలా ఆచరించాడో భారతంలో చూడవచ్చు. జీవితం మొత్తంలో ఒకే సారి, అదీ కృష్ణుడు పక్కనుంచి దెప్పుతుంటే, అబద్ధం ఆడాడుట ధర్మరాజు - అశ్వత్థామ హతః కుంజరః అని. ఆశ్వత్థామ చచ్చిపోయాడు అని గట్టిగా చెప్పి ఎవరికీ వినపడనట్టూ ‘ఏనుగు’ అన్నాట్ట. ఈ ‘కుంజరః’ అన్నప్పుడు కృష్ణుడు అక్కడే ఉన్న భజంత్రీలు వాయించేవాళ్లని ‘బాగా గట్టిగా కొట్టండి’ అంటూ ప్రోత్సహించాడని కూడా అంటారు. అప్పటివరకూ ధర్మరాజు రధం అలా భూమికి కొన్ని అడుగుల ఎత్తులో ఎగిరేదిట ధర్మమూర్తి కనక. ఈ అబద్ధం తర్వాత అది కొన్ని అంగుళాలు కిందకి జారిందని చెప్తారు.
వనవాసం చేస్తున్నప్పుడు మరోచోట మనం యుధిష్టిరుడి ధర్మ నిరతి చూస్తాం. ఎవరో ఒకాయనకి ఆశ్రమంలో ఉండే ఆరణి అంటే యజ్ఞం చేస్తున్నప్పుడు అగ్ని తయారు చేసే ఒక కర్ర, ఓ లేడి ఎత్తుకుపోతుంది (దాని కొమ్ములకి తగిలి). దాన్ని వెతుక్కుంటూ వెళ్తారు పాండవులు. ఏమీ కనిపించనప్పుడు దాహం వేసి ఓ చోట కూలబడితే ముందు సహదేవుణ్ణీ, తర్వాత ఒక్కొక్కరిగా నకులుణ్ణీ, భీముణ్ణీ అర్జునుడినీ పంపిస్తాడు ధర్మరాజు నీళ్ళు వెతికి తెమ్మని. వీళ్ళు తిరిగిరానప్పుడు తాను బయల్దేరతాడు చూడ్డానికి. ఓ కొలను దగ్గిర ఈ నలుగురూ ప్రాణం పోయి ఉన్నప్పుడు అక్కడే మారు వేషంలో ఉన్న ధర్మదేవత ప్రశ్నలు అడుగుతుంది. వీటికి సరైన సమాధానాలు చెప్పాక ఈ నలుగురిలో ఒకణ్ణే బతికిస్తాను ఎవరు కావాలి అని అడిగితే అప్పుడు ధర్మరాజు అడుగుతాడు – నకులుణ్ణి బతికించు అని. ధర్మదేవతకే ఆశ్చర్యం కలుగుతుంది. అదేమిటి వీరాధి వీరులైన భీమార్జులని, అందరికీ నచ్చిన, చిన్నవాడైన సహదేవుణ్ణీ వదిలేసి నకులుణ్ణి బతికించమంటున్నావేమిటి అని. ధర్మం అంటే అప్పుడు తనకి తెలిసినది వివరిస్తాడు ధర్మరాజు. మా నాయనగారికి ఇద్దరు భార్యలు కదా? కుంతికి పెద్దవాడినైన నేను బతికున్నాను కనక ధర్మం ప్రకారం మాద్రి పెద్ద కొడుకు నకులుడు బతికి ఉండాలి. దీనికి సంతోషించి అందర్నీ బతికిస్తాడు ధర్మదేవత. అంటే అంతటి కష్టంలోనూ ధర్మరాజు బల పరాక్రమాలు ఎంచుకోలేదు. ధర్మం ఎంచుకున్నాడు.
గమనించవల్సినదేమంటే ప్రాణం పోయే స్థితిలో కూడా ధర్మం తప్పకపోవడం. ఆ విధంగా ధర్మం మనం పాటించినట్టైతే అదే ధర్మం మనని రక్షిస్తుంది – ధర్మో రక్షతి రక్షితః అంటే ఇదే. అందుకే పాండవులు పన్నెండేళ్ళ వనవాసం, ఒక ఏడు అజ్ఞాతవాసం ఏ గొడవా లేకుండా చేయగలుగుతారు. ఈ ధర్మరాజు గురించి భీష్ముడు కూడా అజ్ఞాతవాసంలో పాండవుల గురించి వెతికించే దుర్యోధనుడితో చెప్తాడు – “పాండవులూ, ధర్మరాజూ ఎక్కడ ఉంటే అక్కడ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, గొడవలూ అవీ లేకుండా. సకాలం లో వర్షాలు కురుస్తాయి, పాడీ పంటా పెరుగుతూనే ఉంటుంది.” అదీ ధర్మ నిరతి వల్ల కలిగే లాభం. ఈ ధర్మం గురించి మరో సంస్కృత సూక్తి కూడా గుర్తుంచుకోతగ్గదే. యతో ధర్మస్తతో కృష్ణః తతో కృష్ణస్తతో జయః. ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు అటువైపు ఉంటాడు. కృష్ణుడున్నచోటే జయం కలుగుతుంది. ఇదే భగవద్గీత చివరి అధ్యాయం సంజయుడు చెప్పే శ్లోకంలో చూడవచ్చు.
యత్ర యోగీశ్వరః కృష్ణో, యత్ర పార్ధో దనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువానీతిర్మతిర్మమ (మోక్ష సన్యాస యోగం 78)