Menu Close
తెలుగు పద్య రత్నాలు 24
-- ఆర్. శర్మ దంతుర్తి --

పోతన భాగవతం రాయడానిక్కారణం తాను చెప్పుకున్నదే – పలికించెడు వాడు రామ భద్రుడట అనేది. రామావతారం భాగవతంలో కొంత మేర ఉన్నదాంట్లో పద్యం ఇది. పోతన ప్రతి స్కంధం మొదలుపెడుతూ రాముడికి ఒక కందం రాసినా ఇందులో మాత్రం రామావతారం గురించి చెప్తున్నాడు. విశ్వనాధ సత్యన్నారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో అంటారు – ప్రతీసారి అవతారం ధరించినప్పుడు విష్ణువుకి శంఖం చక్రం ఏదో విధంగా సాయపడుతూ ఉంటాయిట కానీ శార్గ్య ధనస్సుకి అలా సులభంగా అవకాశం రావడం లేదు. అందువల్ల రామావతారం లో ధనస్సుదే అంతా వ్యవహారం అని ఆయన చమత్కారం. ఈ పద్యంలో రాముడు ఎలా ఉంటాడో వర్ణన చేయబడింది.

ఉ.
నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ
జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్. [పోతన భాగ. 9-361]

ఈ పద్యంలో గానీ రాముడి గురించి గానీ చెప్పినప్పుడు దాదాపు నూరు శాతం అందరూ చెప్పేది ఒకటే – రాముడి చేతిలో విల్లు – దానికి మరో పేరు కోదండం. ఈ కోదండం రాముడు చేతిలోకి ఎప్పుడొచ్చిందనేది మరో కధ. అసలు రాముడికి విలువిద్య అంతా నేర్పినది కైక అనీ; మంధర వల్ల రాముణ్ణి అడవిలోకి పంపినా అది లోక కళ్యాణం కోసం అనీ అంటారు. రాముడు బయల్దేరుతుంటే అడవిలో బతకడానిక్కావాల్సినవి మాత్రమే పట్టుకెళ్ళాలి అని చెప్తుంది కూడా. మందీ మార్బలంతో బయల్దేరితే రావణుడి దాకా చేరడానికి కష్టం; అదీగాక ఈ మందీ మార్బలం అడవుల్లోకి వెళ్తే అడవులని కొట్టుకుంటూ పోవచ్చు. అదొక పర్యావరణపు గోల. అందుకే నువ్వొక్కడివే వెళ్తే చాలు అంటుంది. అయితే సీతా, లక్ష్మణుడూ రాముడితో బాటు బయల్దేరతారని కైకకి కూడా తెలియదు చివరివరకూ. అలా అడవుల్లోకి వెళ్ళిన రాముణ్ణి, నువ్వు ఇక్కడే ఉండొచ్చు కానీ ఇంకా ముందుకి వెళ్తే మంచిది అంటూ ప్రతీ ఒక్కరూ పంచవటికేసి తోస్తారు ఈ ముగ్గుర్నీ. అలా ఒక్కో ఆశ్రమం ఒక్కో మహర్షినీ దర్శించుకుంటూ మొత్తానికి పంచవటి దగ్గిర తేల్తారు. ఆ వెళ్ళేదారిలో అగస్త్యాశ్రమం తగుల్తుంది. ఆయన రాముడికో విల్లు ఇస్తాడు బాణాలతో సహా – రామా ఇది నీ దగ్గిర ఉంటేనే బాగుంటుంది అంటూ. అంటే అప్పటివరకూ రాముడి దగ్గిర ఉన్నది మామూలు ధనస్సే. ఈ మహర్షులందరికీ తెల్సీ పైకి చెప్పని విషయం ఏమిటంటే ఈ రాముడి వనవాసం అందరికీ మంచిది – రావణాసురుడు పోవాలి. కానీ పైకి చెప్పరు. ఇదిగో అలా వెళ్లండి, ఈ ధనస్సు ఉంచండి అంటూ తోయడమే. అలా అగస్త్యుడు ఇచ్చిన ధనుస్సే రాముడి చేతిలోని కోదండం.

అయితే ఈ కోదండం వాడే ముందే రాముడికి శస్త్రాస్త్రాలు ఇవ్వబడ్డాయి. అవి వాడకుండానే ఆయన ఖర దూషణులనీ, తాటకినీ మిగతావార్నీ కడతేర్చాడు. కానీ రావణుడి సంగతి వేరు. వాడికి బ్రహ్మ వరాలున్నాయి. మామూలు ధనస్సు పనికిరాదు. అందుకే కోదండం ఇవ్వడం. రాముడు నీలమేఘశ్యాముడు కదా? అందువల్ల ఈ పద్యంలో ఆయన నల్లనివాడు; పద్మనయనంబులవాడు, కలువపూవుల్లాంటి కన్నులుగలవాడు; మహాశుగంబులు – గొప్పవైన బాణములు; విల్లును ధరించెడివాడు; ఇదే కోదండం. కడువిప్పగు వక్షమువాడు - విశాలమైన రొమ్ము గలవాడు, అడిగినవారి మీద శుభములు కురిపించువాడు (మేలుపై జల్లెడువాడు); యశస్సుని దిక్కులవరకు జల్లెడివాడు. రాముడు పుట్టడమే రాక్షస సంహారం కోసం; అండువల్ల వాళ్లని కడతేర్చాక యశస్సు చుట్టూ ప్రసరింపచేసేవాడు.  ఇటువంటి రఘుసత్తముడు - రఘువంశ తిలకుడు; ఇచ్చుత మాకభీష్టముల్ – మా కోరికలు తీర్చుగాక.

ప్రసక్తి వచ్చింది కనక రాముడి గురించి మరో కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఎవరైనా రాముడితో కలిస్తే రాముడికి కొత్త పేరు వస్తూ ఉంటుంది. అలా వచ్చిన పేరే కోదండ రాముడు. సీతని చేసుకున్నాడు కనక సీతారాముడు. రాముణ్ణి చిన్నపిల్లవాడుగా ఎత్తుకుని చంద్రుణ్ణి అద్దంలో చూపిస్తూ రాముణ్ణి కలిపితే రామచంద్రుడు. అలా ఎత్తుకుని చూపించిన భద్రుడు అనే మంత్రితో కలిపితే రామభద్రుడు. అయోధ్యని పాలించాడు కనక అయోధ్యరాముడు. తండ్రి దశరధుడు కనక దశరధరాముడు. రఘువంశంలో పుట్టాడు కనక రఘురాముడు. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. అయితే గమనించ వల్సిన విషయం ఏమిటంటే చంద్రుడితో కానీ మిగతా వారితో కానీ కలిపినపుడు రాముడికే మరో కొత్త పేరు వస్తుంది కానీ రాముడితో కలిసినవారికి కాదు. అందుకే రాముడి పేరు రామచంద్రుడు అయింది కానీ చంద్రుణ్ణి ఎవరూ కూడా చంద్రరాముడు అనడం మనం వినం.  దీని అర్ధం ఏమిటంటే భగవంతుడే ముందు. మిగతా విషయాలు కాదు. పోతన పద్యంలో చెప్పినట్టే రాముడి గురించి చెప్తూ ఆయన ఆజానుబాహుడు అనడం వింటాం. ఆజానుబాహుడంటే – చేతుల వేళ్ళ చివరలు మోకాలి దాకా వస్తాయిట తిన్నగా నిల్చుంటే. కృష్ణుడి గురించి చెప్తూ అంటారు భగవంతుడి లక్షణాలు ఎలా ఉంటాయనేది – మానవ జన్మ ఎత్తినప్పుడు భగవంతుడికి ముప్ఫైరెండు మహా పురుష లక్షణాలు, ఎనభైనాలుగు అనువ్యంజనాలు ఉంటాయిట. ఈ ఆజానుబాహువులనేవి మహాపురుష లక్షణాలలో ఒకటి. అరికాలిలో వికసించిన పద్మం ఉండడం అవీ మిగతావి. ఈ లక్షణాలని పోతన చాలా చోట్ల వాడాడు భాగవతంలో.

****సశేషం****

Posted in June 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!