- దగ్గర ఉన్న దాని విలువ, దూరమైతే తెలియును,
మరణించిన తరువాతనే, మనిషికి విలువ పెరుగును! - ద్వేషమనెడు జాడ్యానికే, ప్రేమ మంచి ఔషధము,
మనసున కలిగే అలజడికి, ఓదార్పే ఔషధము! - విద్యాహీన నాయకులకు, పనివాళ్ళే చదువరులు!
జ్ఞానహీనులవుతున్నారు, సిరితో పట్టభద్రులు! - అప్పు తెచ్చిన ధనమెప్పుడు, ఉచితమంటూ యివ్వకు,
అప్పే పుట్టని తరుణమున, దిక్కు తోచక వగచకు! - సౌందర్యము నిలువదెపుడూ, శాశ్వతముగ భువియందు,
పరిమిత జ్ఞానము చాలదే, పండిత సమూహమందు! - బ్రతుకు పరాన్నభుక్కైతే, హేయమనిపించుకొనును!
పెద్దల దూషణ చేయుటే, నీచమనిపించుకొనును!! - పాషణమును కరిగించు శక్తి, సంగీతముకు ఉన్నది!
మాటలు చెప్పని భాష్యాన్ని, తెలుపును మౌనమన్నది! - అమ్మ పెట్టే గోరుముద్ద, చవులూరించే విందు!
జీవితాలు బుగ్గి చేసే, చెడ్డ వ్యసనమే మందు!! - గురివిందగింజ మనస్కులు, ఒప్పుకొనరే తప్పును!
గాలిమాటలు ఆపకుంటె, వదిలిస్తారు తుప్పును!! - చెప్పుడు మాటలు విందువా, ఎదురయేను సమస్యలు!
కంటికి కనబడేవైనా, కావెప్పుడూ నిజాలు!!
Posted in March 2024, సాహిత్యం