Menu Close
తెలుగు భాష భవితవ్యం 4
- మధు బుడమగుంట

గత సంచికలో తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి శ్రీ అయ్యగారి సూర్యనారాయణ మూర్తి గారు పంపించిన పద్యాలను అందించాను. ఇప్పటికే మన భాష ప్రాభవాన్ని గుర్తెరిగి మనలో కించిత్ గర్వం రావడంలో తప్పులేదు. మన భాష మధురానుభూతుల మనోధైర్యం అని చెప్పుకుంటూ,

ఈ సంచికలో అమ్మ నుడి, అచ్చ తెనుగు కవి అయిన శ్రీ రాఘవ మాస్టారు పంపిన సరళమైన తెలుగు యాసలో తెలుగు మాధుర్యాన్ని చవిచూద్దాము.

తెలుగంటే.....తెలుగే – రాఘవ మాస్టారు కేదారి

తెలుగంటే అమ్మ ఒడి
తెలుగంటే జాతి గుడి
కమ్మనైన తెలుగే
మన భావాల ఊపిరి
తీయనైన తెలుగే
మన జీవన లాహిరి

అమ్మ పెట్టిన గోరు ముద్ద తెలుగు
నాన్న పెట్టిన ప్రేమ ముద్దు తెలుగు
అమ్మమ్మ పెట్టిన గోరింటాకు తెలుగు
నానమ్మ జోకొట్టిన లాలి పాట తెలుగు

చెల్లి పెట్టిన కాకి ఎంగిలి తెలుగు
అన్న కొట్టిన మొట్టి కాయ తెలుగు
తాత చెప్పిన పిట్ట కథ తెలుగు
అవ్వ పెట్టిన సద్దిబువ్వ తెలుగు
బావ బుగ్గకు రాసిన అత్తరు తెలుగు
అక్క వీపునాడిన ఉప్పాట తెలుగు
మనలో వచ్చిన కమ్మని కలలు
మదిలో విచ్చిన ఝమ్మని పిలుపులు
గుండె లోతుల దాగిన చిన్ననాటి గురుతులు
మండు టెండలో కురుసిన వాన చినుకులు
తెలవారి వెలుగులా
చిరుగాలి పిలుపులా
పండిన వరి పొలంలా
పొంగిన పాల పొంగులా
వెన్నెల్లో గోదారిలా
వెన్నలో గోదారిలా
పట్టులంగా ఓణిలా
నుదుట బొట్టు పంచ కట్టులా
చెరువు గట్టు పొలం గట్టులా
పరమాన్నం అంబలి తొక్కులా
జొన్న అంబలి రాగి ముద్దలా
ముద్దు ముద్దు సంక్రాంతి లా
ముద్ద బంతి ముద్దు గుమ్మలా
బతుకమ్మ పండగలా
ఏరువాక సందడిలా
గడప గడపలో విరిసినది
ఎడద ఎడద లో మురిసినది
మన మాతృ భాష ఘనమైన తెలుగు
మన ఆత్మ ఘోషగా మిగిలినది తెలుగు.

అమ్మనుడి మరచిపోతే
అమ్మ మాట వెలసిపోతే
జాతి సంస్కృతే మాయం
ఒక తెగ ఉనికే మాయం
అందుకే......
చేయకు తెలుగును కనుమరుగు
వేయకు తెలుగుకై వెనుకడుగు
అదే మన జాతి పెను వెలుగు

సరళమైన అమ్మ భాషలో రాఘవ మాస్టారు అందించిన ఈ పలుకులు ఎంత హాయిని అందిస్తున్నాయో కదూ! అలాగే మన మాతృభాష మాధుర్యం మరింత తీయగా ఉండగా మరి మనం తెలుగును మరిచిపోగలమా?

ఈ మధ్యన ఒక చిన్న విందు సమావేశంలో కొంతమంది తెలుగు మాట్లాడే స్నేహితులతో చిన్న ఇష్టా గోష్టి చేస్తున్నప్పుడు, మన తెలుగు భాష ప్రత్యేకత గురించిన ప్రస్తావన వచ్చింది. ఒకతను నేరుగా ‘అసలు తెలుగులోనే ఎందుకు మాట్లాడాలి? అందువలన నాకు లాభం ఏంటి? అందరూ నన్ను చులకనగా చూడటం తప్ప’ అని ఒక ప్రశ్నను సంధించాడు. ఒక్క క్షణం అందరం అవాక్కయ్యాం. కారణం అతను వేసిన ప్రశ్న ఖచ్చితంగా నిజమైనది. మనందరిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కాకుండా బయట నివసిస్తున్న మనలాంటి చాలా మందిలో సదా తొలుస్తున్న సందేహమే ఇది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కూడా పరిస్థితి మారుతున్నది. కారణాలు ఏవైనా కావచ్చు.

అప్పుడు నాకు స్ఫురించిన సమాధానాలు, నాలో రేకిత్తిన ఆలోచనలు ఇక్కడ వ్రాస్తున్నాను. ఈ విషయాలనే మా సమావేశంలో కూడా ప్రస్తావించాననుకోండి.

తెలుగు భాషాపరమైన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రస్తుతం మనం వాడుతున్న నిఘంటువు, రాబర్ట్ బ్రౌన్ అనే ఆంగ్లేయుడు రచించాడు. కారణం తనకు ఆంగ్ల భాషమీద విసుగెత్తి కాదు. తన మాతృభాషలో లేని ఎన్నో అద్భుతమైన ప్రక్రియలు మన తెలుగు భాషలో వున్నాయి. మనిషి జీవించడానికి భాషే అక్కరలేదు. భాషలేకుండా కూడా మనగలడు, ఆది మానవునివలె, మన తోటి పశుపక్షాదుల వలె. మన సంస్కృతి, సంప్రదాయ విలువలను పరిశోధించుటకు మన భాషను నేర్చుకొని, భాషమీద పట్టును సాధించి అది భావి తరాలకు కూడా అందాలని ఆ నిఘంటువును తయారుచేశాడు. ఈ సందర్భంగా గౌరవనీయులైన వక్కంతం సూర్యనారాయణ గారు మన తెలుగు గొప్పతనం ఈ విధంగా విశ్లేషించారు.

  • దేశభాషల్లో గానీ, దేవభాషలో గానీ లేని ఒక విశిష్టమైన అలంకారం తెలుగు భాషకు ఉంది... అదే శ్రీ కారం. ఆదికవి నన్నయ్య నుండి మనకు సంక్రమించిన ఒక దివ్య వరం.
  • అచ్చులతో అంతమయ్యే ఏకైక భాష ఈ భువిలో తెలుగు ఒక్కటే
  • తెలుగు భాషలో ఎన్నో మాండలికాలు, యాసలు ఉండవచ్చు కానీ, వాటిని కూర్చినది ఆ ఏభైఆరు అక్షర వర్ణమాలే. ముఖ్యంగా అచ్చులతో అలరారినా, ఎన్ని అక్షరాలు అంటామో, ఎన్ని అక్షరాలు వింటామో అన్ని అక్షరాలతో వ్రాయగలిగిన జీవ చైతన్య భాష తెలుగు!
  • తెలుగు భాష రాగాలాపనకి చాలా అనువైన భాష!

కనుక, ముమ్మాటికీ! ‘తెలుగు పలుకు తేనెలొలుకు

ఇంతటి మాధుర్యాన్నికలిగివున్న మన తెలుగును ప్రేమించకుండా ఉండలేము. కానీ ప్రస్తుత కాలంలో ఆంగ్ల భాష, మన భాషలో పూర్తిగా మిళితమై, తేట తెనుగు స్వచ్ఛతను కోల్పోవుచున్నది.

ఈ మధ్య అంతర్జాలంలో ఒక చిన్న వ్యంగచిత్రం చూడటం జరిగింది. అందులో ఒక వ్యక్తి, “‘దేశభాషలందు తెలుగు లెస్స అన్నాడు కన్నడ ప్రభువు శ్రీ కృష్ణదేవరాయలు, ‘సుందర తెలుంగు’ అన్నాడు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి, ‘తెలుగు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అన్నాడు ఇటలీ వాడు నికోలో కోంటి. మరి ఇహ తెలుగును గుర్తించాల్సింది తెలుగువాడే” అని ఎంతో ఆవేదనతో చెప్పాడు. ఈ చిన్ని ఉదాహరణ చాలు మన తెలుగు భాష ప్రస్తుత పరిస్థితి.

చివరగా, ఇంత గొప్ప తేనెలొలుకు తెలుగు భాష మన మాతృభాష అయినందుకు మనందరం గర్వపడాలి. అలాగే మన భాషను పరిరక్షించేందుకు మన వంతు కర్తవ్యాన్ని గుర్తెరిగి అందుకు కార్యోన్ముఖులు అవ్వాలి. అది ఎలాగో వచ్చే సంచికలో చర్చించుకుందాం.

**** సశేషం ****

Posted in April 2024, ఆరోగ్యం

2 Comments

  1. Krishna Kumar Pillalamarri

    గౌరవనీయులు మధు గారికి,
    నమస్కారములు, ఉగాది శుభాకాంక్షలు. మీరు రాస్తున్న ఈ వ్యాస పరంపర చాలా ముఖ్యమైనది. మీ మిత్రులెవరో ఎందుకు తెలుగులో మాట్లాడాలి? అని ప్రశ్నిస్తే అవాక్కయ్యానన్నారు. అమెరికాలో నివసిస్తున్న మనలాంటి వాళ్ళం అందరం ఎప్పుడో అప్పుడు ఈ ప్రశ్నని విన్నవాళ్ళమే. దానికి మీరు చెప్పిన మాటలన్నీ సబబైనవే. కానీ అంతకన్నా మూల ప్రశ్న ఒకటి ఆయనకీ వెయ్యండి:

    “తెలుగులో ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు మీరు చిన్నతనం అనుభవిస్తున్నారు?”
     
    దీని సమాధానాన్ని చివరి వరకు లాగితే, మీకు లభించేమాట అతని Insecurity లేక తెల్లవాడు మనమీద తొక్కిన ఆత్మ న్యూనత మాత్రమే. తెలుగులో మనకి అర్థమయేమాటలకి చాలావాటికి ఇంగ్లీషు అర్థాలు లేవు. కాబట్టి మన భావాలు, మనదైన సాంస్కృతిక, భౌగోళిక, సామాజిక వాతావరణాన్ని, మాటలని మనం వ్యక్తపరచలేము. మనం కనిపెట్టి, పెంచుకున్న భాషని వదిలేసి, వేరేవాళ్ళ భాషని తెచ్చుకోవడం కన్నా తెలివితక్కువతనం ఉండదు. పుట్టిన బిడ్డకన్నా పెంపుడు పిల్లమీద ఎక్కువ ప్రేమ ఉన్నట్లు ప్రవర్తించవచ్చు గాక, మనసులో మనకే నిజం ఎప్పుడూ తెలుస్తుంది. 

    • Sirimalle

      చాలా చక్కగా సెలవిచ్చారు కృష్ణ కుమార్ గారు. మీరన్నది అక్షరాలా సత్యం. ధన్యవాదాలు.

      – మధు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!