ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం – రాజధాని సమస్య – తొలి ఆంధ్ర రాష్ట్ర మంత్రి వర్గం – తొట్టతొలి ప్రకాశం గారి మంత్రివర్గం కూలిపోయిన విధము: వీటన్నిటిలో సంజీవ రెడ్డి గారి పాత్ర
ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం
1913 లో బాపట్ల లో ప్రథమ ఆంధ్ర మహాసభ జరిగింధి. 1917 లో ఆంధ్ర ప్రాంతాలకు ప్రత్యేకంగా రాష్ట్ర కాంగ్రెస్ సంఘం ఏర్పాటయింది. 1939 లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పనికై ఏర్పడిన రాష్ట్రాలను భాషా రాష్ట్రాలుగా సంవిధానం లో ఏర్పాటు చేయడానికి తీర్మానించింది. 1948 లో రాసిన సంవిధానం మొదటి ముసాయిదలో ఆంధ్ర రాష్ట్రం చేర్చబడింది. రెండవ ముసాయిదాలో అది తీసివేయబడింది. రాష్ట్రాల నిర్మాణం లో కావలిసిన పూర్వరంగ కార్యక్రమంగా ఏయే జిల్లాలు ఒక రాష్ట్రంలో చేరవలేనో నిర్ణయమై ప్రకటింపబడాలి. అలా జరగకుండానే ఆంధ్ర రాష్ట్రం పేరు జాబితాలో కలిపితే – అది మిగిలిన రాష్ట్రాలవలే రాష్ట్రంగా నడుచుకొనే అవకాశం లేనందువల్ల ఆ పేరు తీసివేయడమైందని ఆ నివేదిక పేర్కొనింది. ఇట్టి పూర్వకార్యక్రమం జరగకపోవడం, మొదటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వారు చేసిన భాషాప్రయుక్త రాష్ట్రాల తీర్మానానికి ప్రధానమంత్రి నెహ్రూ వ్యతిరేకంగా ఉండడం శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహారదీక్ష చేయడానికి కారణం. శ్రీ రాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధనకై 1952 అక్టోబర్ 19 వ తేదీన ప్రాయోపవేశ దీక్షను పూనారు. డిసెంబర్ 15, 1952 వ తేదీన రాత్రి 11-23 గంటలకు పరపదించారు. నాటికి వారు ప్రాయోపవేశం ప్రారంభించి 58 రోజులు.
డిసెంబర్ 16 వ తేదీన శ్రీ నీలం సంజీవ రెడ్డి గారు, కృషికార్ లోక్ పార్టీ నాయకులు ఎన్.జి.రంగా గారు ఒక సంయుక్త ప్రకటన చేస్తూ శ్రీ రాములు గారి ఆత్మార్పణ పట్ల తమ నిర్వేదాన్ని వెళ్ళబుచ్చారు.
“శ్రీ రాములు గారి ఆత్మార్పణం మూలంగా దేశం అంతటా విషాధ మేఘాలు క్రమ్ముకొన్నాయనీ, అట్టి నిస్వార్థి తన ఈ తపస్సు మూలంగా త్వరలో ఏర్పడునున్న కొత్త రాష్ట్రాన్ని చూచి ఆనందించే భాగ్యానికి నోచుకోకపోవడం విచారకరమని, శ్రీ రాములు గారి ఆత్మార్పణం మూలంగా ప్రధానమంత్రి పండిత్ నెహ్రూకు ఆంధ్ర రాష్ట్ర సమస్యల విషయమై ఒక పట్టుదల ఆసక్తి కలిగినాయనీ, అందువల్ల త్వరలోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుందని మేము విశ్వసిస్తున్నామనీ” వారు ఆ ప్రకటనలో అన్నారు.
డిసెంబర్ 19, 1952 న మద్రాస్ రాష్ట్రంలోని తెలుగుప్రాంతాలతో ఆంధ్రరాష్ట్రాన్ని స్థాపించడానికి భారత ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని నెహ్రూ పార్లమెంట్ ప్రజా సభలో ప్రకటించారు. ఆ విధంగా ఏర్పాటయ్యే రాష్ట్రంలో మద్రాస్ నగరం ఉండదని ఆయన వెల్లడించారు. 1953 జనవరి ఆఖరులోగా ఈ సమస్యకు సంబంధించిన ఆర్ధిక, తదితర అంశాలను పరిశీలించి నివేదిక సమర్పించే నిమిత్తం రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కె.ఎన్.వాంచు గారిని భారత ప్రభుత్వం నియమించింది. అదే రోజు రాజ్యసభలో రైల్వే మంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి ఆంధ్ర దేశంలో శ్రీ రాములు గారి ఆత్మార్పణ తరువాత జరిగిన కల్లోలాల వల్ల రైల్వేకీ, పబ్లిక్ ఆస్తికీ కలిగిన నష్టం 50 లక్షలు వరకు ఉండవచ్చునని తెలిపారు.
మే 4 ,1952 న ఆంధ్ర కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం విజయవాడలో జరిగింది. ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా సంజీవ రెడ్డి గారు ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గమును నియమించుకునే సర్వాధికారమును శ్రీ సంజీవ రెడ్డి గారికే ఇచ్చారు. సంజీవ రెడ్డి గారిచే నియమింపబడ్డ కార్యవర్గం జూన్ 7,1952 న కాకినాడలో సమావేశమయ్యి – ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం విషయంలో ఆంధ్రప్రదేశ్ కార్యవర్గం 1949 నవంబర్లో చేసిన తీర్మానం ఇంకా అమలులో ఉన్నట్లేననీ, దాని ఆధారంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడానికి వెంటనే చర్య తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది.
1949 ఆంధ్ర కాంగ్రెస్ కార్యవర్గం తీర్మానం
నవంబర్ 12, 1949 విజయవాడలో శ్రీ దుర్గా కళామందిరం లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘం సాయింత్రం 7.30 గం.కు సమావేశమయ్యి జె.పి.పి రిపోర్టును ఒప్పుకొనుచూ 12 తెలుగు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణము చేయవలసిందిగా, చెన్నపట్నము, పరిసర ప్రాంతములను ప్రత్యేక రాష్ట్రముగా నిర్మించవలెనని ఏకగ్రీవముగా తీర్మానించారు. సమావేశం మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీ ఎన్ .జి.రంగా గారి అధ్యక్షతన ప్రారంభమైంది. శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు తీర్మానం ప్రతిపాదించారు. శ్రీ పి.తిమ్మారెడ్డి గారు బలపరిచారు. బులుసు సాంబమూర్తి గారు కూడా చెన్నపట్నం పై ఆంధ్ర జాతికి గల హక్కును ఎన్నటకీ వదులుకోజాలమని ఉధ్ఘాటిస్తూ తీర్మానాన్ని బలపరిచారు. సమావేశానికి మొత్తం 167మంది రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులు, పలువురు ప్రముఖులు, ప్రేక్షకులు హాజరయ్యారు. సమావేశానంతర౦ శ్రీ నీలం సంజీవ రెడ్డి గారు, అప్పుడు మద్రాస్ ప్రభుత్వ మద్య నిషేధం మంత్రి, ఆంధ్ర పత్రిక విలేఖరితో మాట్లాడుతూ:-
“వెంటనే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం జరుగుట వల్ల రాయలసీమ వాసులు కొంత నష్టమును పొందుచున్ననూ ఈ సమయంలో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణంలో రాయల సర్కారు సోదరులు ప్రదర్శించిన ఏక మనస్కత, స్నేహ భావము, సామరస్యత ప్రశంసనీయమైనవి. రాష్ట్ర కాంగ్రెస్ సమావేశంలో రాయలసీమ సోదరుల యెడల ఆదరాతిశయములు వర్షింపజేసిరి. రాష్ట్రము ప్రాప్తించిన తోడనే రాయసీమ ఆర్ధికాభివృద్ధికి ఈ ఆదరమంతయు వినియోగపడునని ఆశించున్నాను. శ్రీ బాగ్ ఒడంబడికను పాలింతుమని కోస్తా నాయుకులు పునశ్చరణ చేయుట ముదావహము. రాష్ట్రం వచ్చిన మీదట ఆ షరతులు పాటింపబడునని నేను ఆశించుచున్నాను. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్రయ నివేదికను ఆమోదించి రాష్ట్ర నిర్మాణమును సులభము చేసినందుకు అందరూ సంతోషిస్తున్నారు” అని అన్నారు.
డిసెంబర్ 7, 1949 న మద్రాస్ మంత్రి వర్గం వారు సమావేశమై రాష్ట్ర విభజన సమస్యల పరిశీలన పరిష్కారమునకు 8 మంది సభ్యులు గల విభజన సంఘమును నియమించరి. ప్రధాని కుమారస్వామి రాజా ఆ సంఘ అధ్యక్షులుగా నియమింపబడిరి. శ్రీ ప్రకాశం, కళా వెంకట రావు, గోపాల రెడ్డి, సంజీవ రెడ్డి గారలు ఆంధ్రుల తరపున, ఆంధ్రేతరుల తరపున కుమారస్వామి రాజా, భక్తవత్సలం, మాధవమీనన్, టి.టి కృష్ణమాచారి గారలు సభ్యులుగా నియమింపబడిరి.
15 డిసెంబర్, 1949 న జనవరి 26, 1950 కే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నామని మద్రాస్ ముఖ్యమంత్రి కుమారస్వామి రాజా ప్రకటించారు. నూతన రాష్ట్ర ఆర్ధిక స్థితి ఆంధ్ర, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం అని కూడా అన్నారు. విభజన సంఘం పని చేస్తూ ఉన్న సమయంలోనే తమిళ ప్రముఖులు ఏప్రిల్ 1 తరువాత ఏ ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయం చెన్నపట్నం లో ఉండరాదని హెచ్చరిక చేశారు. విభజన సంఘంలోని తమిళ సభ్యులు ఆంధ్ర రాజధాని సమస్యను గూర్చి రాసియిచ్చిన సమస్యలకు సమాధానమివ్వడానికి ఆంధ్ర సభ్యులు డిసెంబర్ 25, 1949 న మద్రాస్ మౌంట్ రోడ్డు లోని ప్రభుత్వ అతిధి గృహమున శ్రీ కళా వెంకట రావు గారి బసలో ఆంధ్ర సభ్యులైన శ్రీ ప్రకాశం పంతులు, గోపాలరెడ్డి, సంజీవ రెడ్డి గారలు సమావేశమయ్యారు. ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయాలు చెన్నపట్నం లో ఉండకూడదు అన్న తమిళ నాయకులది విచిత్రవాదనై వున్నదని, రాజధాని వుండడానికి వేరే ఏర్పాట్లు లేని స్థితిలో ఇట్టి సంకటమైన షరతులు పెట్టడం తమిళ నాయకులకు తగదని, ఇట్లా ఒక్కొక్కటిగా ఆంధ్రుల హక్కులకు తిలాంజలులు అర్పించుట శోచనీయమని ఆంధ్ర నాయకుల అభిప్రాయం. డిసెంబర్ 29, 1949 న జరిగిన విభజన సంఘ సమావేశం తరువాత ఆంధ్ర నాయకులు తమ రాష్ట్ర తాత్కాలిక రాజధాని స్థలమును నిర్ణయించి, ఆంధ్ర మంత్రులు, గవర్నరు అచటనే ప్రమాణస్వీకారము చేయుటకు, శాసన సభ సమావేశములను జరుపుకొనుటకు ఆ రాజధానిలో ఏర్పాట్లు చేసుకొనిన, ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయములు, ఆంధ్ర హైకోర్టు, అన్ని హంగులతో రాజధాని ఏర్పడు వరకు మద్రాస్ లోనే ఉండవచ్చునని తమిళ నాయకులు హామీ ఇచ్చారు. జనవరి 2, 1950 న జరిగిన విభజన సంఘ సమావేశంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు విభజన సంఘంలో తమిళుల వాదనకు ఆక్షేపణ తెలుపుతూ ఆంధ్ర రాష్ట్ర రాజధాని వెంటనే మద్రాస్ నుండి తరలిపోవుటకు సమ్మతించలేదు. ఇది నవంబర్ 11 న చేసిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘ నివేదికకు వ్యతిరేకముగా ఉన్నదని అన్నారు. నాయకత్రయ నివేదిక అన్వయం ప్రకారం చెన్నపట్నం, తత్పరిసర ద్విభాషా ప్రాంతములు కేంద్ర పరిపాలన క్రింద ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని, అట్టి ఏర్పాటు జరిగే వరకు ఆంధ్ర రాష్ట్ర తాత్కాలిక రాజధాని చెన్నపట్నం లోనే ఉండాలని ఆ తీర్మానం స్పష్టం చేస్తుందని అన్నారు. మద్రాస్ గురించి ప్రకాశం గారు పట్టుదల వహించగా సంజీవ రెడ్డిగారితో సహా మిగతా ముగ్గురు సభ్యులు మౌనం వహించారు. జనవరి 3, 1950 న ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం జనవరి 26 న జరగాలని, రాష్ట్ర సరిహద్దులోపలే రాష్ట్ర రాజధాని ఉండాలనే షరతులతో, నూతన రాజధాని నిర్మాణం నిమిత్తం కోటి రూపాయలు కేటాయిస్తూ విభజన సంఘం నివేదిక ఇచ్చింది. ప్రకాశం గారు దాఖలు చేసిన భిన్నాభిప్రాయమును కూడా కమిటీ నివేదికలో పేర్కొనబడింది. జనవరి 4,1950 న విభజన సంఘం నివేదికను మద్రాస్ రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించింది. అదే రోజు రాత్రి విమాన సర్వీసులో డిల్లీకి పంపుతున్నట్లు ముఖ్యమంత్రి కుమారస్వామి రాజా ప్రకటించారు.
జనవరి 23 వ తేదీన ఆ నెల 26 లోగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుగాదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం వర్తమానం పంపింది. విభజన సంఘం నివేదికను భారత ప్రభుత్వ మంత్రి వర్గం తాలుకు వివిధ శాఖలు క్షుణ్ణంగా పరిశీలించినవని, నూతన రాష్ట్ర నిర్మాణానికి ఆర్థికంగా ఉన్న అవరోధాల మాట అటుంచితే, కోస్తా ఆంధ్రులకు, రాయలసీమ ఆంధ్రులుకు ఏకాభిప్రాయం కుదరక పోవడం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వాయిదా వేయడానికి ఒక ప్రధాన కారణం అని తెలిపారు. ఆంధ్రులు తమిళులూ బహుశా మరికొన్ని సంవత్సరాల పాటు ఒకే రాష్ట్రంలో కలిసి ఉండక తప్పదని విషయజ్ఞులు ఆనాడు అన్నారు. అదే సమయంలో భాషాప్రయుక్తంగా రాష్ట్రాలను పునర్విభజించడం వాంఛనీయమా అన్న అంశాన్ని భారత జాతీయ కాంగ్రెస్ పునఃపరిశీలన చేయాలని సర్వ సాధారణంగా ఒక అభిప్రాయం కాంగ్రెస్ వర్గాలలోనే గాక ప్రముఖ కాంగ్రెస్ నాయకులలో కూడా ప్రబలింది.
సర్దార్ పటేల్ సహితం డిసెంబర్ 2, 1949 తనను కలిసిన కేరళ రాయబార సంఘం తో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి సవ్యంగా పరిపాలన వ్యవహారాలు సాగేతంట వరకూ, మరియే భాషా రాష్ట్రన్నైనా నిర్మించాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని తెలిపారు. నెహ్రూ గారికి భాషా రాష్ట్రాల వల్ల దేశం బాల్కనైజ్ అయిపోతుందని సంశయం.
శ్రీ రాములు గారి కన్నా ముందుగా 1952, మే నెలలో స్వామి సీతారాం ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేశారు. సీతారాం గారు 1952 ఫిబ్రవరి లో దేశ ప్రధాని, అధ్యక్షులతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆంధ్ర రాష్ట్ర స్థాపనకు అశక్తత తెలియజేసింది. మద్రాసు నగరం బళ్లారిలో 3 తాలుకాలు ప్రతిబంధకాలని తెలియజేసింది. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రతిపాదన బుట్ట దాఖలయ్యి, శ్రీ పొట్టి శ్రీ రాములు గారి ఆత్మార్పణ మూలంగా జీవం తెచ్చుకొని అక్టోబర్ 1, 1953 న పురుడు పోసుకుంది.
రాజధాని సమస్య – తాత్కాలిక రాజాధానిగా కర్నూలు
విజయవాడ లో మే 27, 1953 న ఆంధ్ర రాజధాని విజయవాడలోనూ, హైకోర్టు అనంతపురంలోను నెలకొల్పాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించాలని ఆంధ్ర శాసన సభ్యులకు విజ్ఞాపన చేస్తూ ఆంధ్ర కమ్యూనిస్ట్ కమిటీ తీర్మానించింది.
మే 28, 1953 న మద్రాస్ లో శ్రీ బాగ్ ఒడంబడిక ననుసరించి రాయలసీమ ప్రతినిధుల సభ ద్వారా రాయలసీమ వాసులు కోరుకున్నట్లు తిరుపతిలో ఆంధ్ర రాజధాని నెలకొల్పాలని ఆంధ్ర శాసనసభ్యులకు విజ్ఞప్తి చేస్తూ కృషికార్ లోక్ పార్టీ వారు తీర్మానించారు. అదే రోజు మద్యాహ్నం మద్రాస్ లో ఆంధ్ర కాంగ్రెస్ లిజిల్లేచర్ పార్టీ సమావేశమై శ్రీ నీలం సంజీవ రెడ్డి గారి నాయకత్వం పై పరిపూర్ణ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ నూతనాంధ్ర రాష్ట్రంలో మంత్రి వర్గాన్ని స్థాపించవలసిందిగా ఆయనను కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. మరల మే 29 న సమావేశమై రాయలసీమలోనే ఆంధ్ర రాజధాని స్థాపించడానికి ఆంధ్ర కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ తీర్మానించింది. రాయలసీమ లో ఎక్కడ రాజధానిని నెలకొల్పాలో నిర్ణయించడం విషయంలో ప్రజా సోషలిస్టు పార్టీ నాయకునితో సంప్రదింపులు జరపడానికి శ్రీ సంజీవ రెడ్డి గారికి పార్టీ అధికారమిచ్చింది.
మే 31 న ఆంధ్ర రాజధాని సమస్య పై కాంగ్రెస్, ప్రజా సోషలిస్ట్, కృషికార్ లోక్ పార్టీలు తుది నిర్ణయానికి రాలేకపోయాయి. జూన్ 1 న జరగవలిసిన ఆంధ్ర శాసనసభ్యుల సమావేశానికి ప్రకాశం పంతులు గారు అధ్యక్షత వహించాలని వివిధ పక్షాల నాయకులు నిర్ణయించారు. అదే రోజు సాయింకాలం అయిదు గంటలకు మద్రాస్ లోని ప్రకాశంగారి బసలో ప్రకాశం గారు, సంజీవరెడ్డి గారు, విశ్వనాధం గారు, గౌతు లచ్చన్న గారు సమావేశమై ఆంధ్ర రాజధాని సమస్య పై చర్చ జరిపారు.
మే 31 ఉదయాన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తరిమెల నాగిరెడ్డి , పిల్లల మర్రి వెంకటేశ్వర్లు,కాల్రుగడ్డ రాజా గోపాలరావు గార్లు ప్రకాశం పంతులు గారిని కలుసుకొని అరగంటసేపు రాజధానిని గురించి చర్చించారు.చర్చానంతరం శ్రీ నాగి రెడ్డి గారు పత్రికా ప్రతినిధులకు ఇలాచెప్పారు.”రాజధాని విషయమై ప్రజల అభిప్రాయం, రాయలసీమ వారిలో కొందరితో సహా, రాష్ట్ర మధ్యగానున్న విజయవాడ లోనే ఉండాలన్న వాంఛ గాఢంగా ఉందని శ్రీ ప్రకాశం గారికి చెప్పాము. శ్రీ బాగ్ ఒడంబడిక మన్నించాలని ఉంటే, హైకోర్టు రాయలసీమ వారికి ఇవ్వవచ్చు అన్నాము.
ఆంధ్ర రాష్ట్ర తాత్కాలిక రాజధాని నిర్ణయానికి గాను ప్రజా సోషలిస్ట్ పార్టీ నాయకుడు శ్రీ ప్రకాశం పంతులు గారి అధ్యక్షతన ఆంధ్ర శాసన సభ్యులు జూన్ 1, 1953 న మద్రాస్ లో ఉదయం 9.50 గంటలకు సమావేశ మయ్యారు. కర్నూలు పట్టణం తాత్కాలిక ఆంధ్ర రాజధాని కావాలన్న తీర్మానానికి శ్రీ తెన్నేటి విశ్వనాధం గారు ప్రతిపాదించగా, శ్రీ కడప కోటి రెడ్డి గారు దాన్ని బలపరిచారు. సంజీవ రెడ్డి గారు సభకు రాలేదు. ఆ రోజు ఉదయాన్నే ప్రకాశం గారి బసకు వచ్చి వారితో మాట్లాడి, తమ కారులోనే శ్రీ ప్రకాశం గారిని అసెంబ్లీ హాలుకు పంపించి వెళ్ళిపోయారు.
అయిదు రోజులు చర్చ పిమ్మట జూన్ 5 న శ్రీ తెన్నేటి విశ్వనాధం గారి ప్రతిపాదనను శాసన సభ్యులు నోటి మాట ద్వారా ఆమోదించారు. కర్నూలు కాక విజయవాడలో ఆంధ్ర రాజధాని నెలకొల్పాలని కమ్యూనిస్ట్ పార్టీ తెచ్చిన సవరణ కు అనుకూలంగా 53 ప్రతికూలంగా 79 ఓట్ల పడ్డాయి. విజయవాడ – గుంటూరులు ఆంధ్ర రాజధాని కావాలని శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు తెచ్చిన సవరణ కూడా నిరాకరింపబడినవి.
ఆంధ్ర శాసనసభ్యులు నిర్ణయానికి హర్షం వెల్లడిస్తూ నీలం సంజీవ రెడ్డి గారు “రాజధాని రానందుకు సర్కారు జిల్లాల వారు ఆశాభంగం చెందనక్కరలేదు. ఆ ప్రాంతం లో నెలకొల్పాలంటే హైకోర్టు, ఇంకెన్నో ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉండనే ఉన్నవి, ఆ ప్రాంతానికి గల ప్రాముఖ్యతను ఎవరూ పోగొట్టలేరు” అని అన్నారు.
విశాలాంధ్ర ఏర్పాటుపై సంజీవ రెడ్డి గారి ఆశాభావం
జూన్ 19, 1953 న మద్రాస్ లో సంజీవ రెడ్డి గారు మాట్లాడుతూ- భాషా రాష్ట్రాల సమస్య అందరికీ సంతృప్తికారంగా పరిష్కారం కావాలంటే హైదరాబాదు విచ్ఛతి తప్పక జరగాలని అన్నారు. ఇండియా ప్రభుత్వం వాగ్దానం చేసిన ఉన్నతాధికారి సంఘం ఈ ఏడాది ఆఖరులోగా నియమింపబడగలదని తాము ఆశిస్తున్నామన్నారు. ఆ కమిటీ నివేదిక సిద్ధం చేయడానికి ఒకటి, రెండేళ్ళు పట్టవచ్చునన్నారు. ఏమైనా రాబోవు జనరల్ ఎన్నికలలోగా, అనగా 1956 నాటికి “విశాలాంధ్ర” ఏర్పగలదని తాము ఆశిస్తున్నామన్నారు. హైదరబాద్ విభజన జరగనిదే సంతృప్తికరమైన విధంగా కన్నడ, మహారాష్ట్ర రాష్ట్రాలు ఏర్పడవనీ అన్నారు. హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రం లో చేరగానే రాజధాని, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ అచ్చటకు తరలింపబడగలవనీ, అచ్చట అన్ని హంగులు అమరి ఉన్నాయని తెలిపారు.
జూలై 7,1953 న ముఖ్య మంత్రి రాజాజీ గారు మద్రాసు అసెంబ్లీలో ఆంధ్ర రాష్ట్ర బిల్లును ప్రతిపాదిస్తూ భారత ప్రజలకు ఆగష్టు 15 వ తేదీ వలె అక్టోబర్ 1 వ తేదీ ఆంధ్రులకు చరిత్రాత్మక దినం కాగలదని అన్నారు.
మద్రాసు అసెంబ్లీలో ఆంధ్ర రాజధాని విజయవాడ ప్రాంతంలో పెట్టాలని శ్రీ వావిలాల గోపాల కృష్ణయ్య గారు ప్రతిపాదించిన సవరణ ఒక ఓటు తేడా తో జూలై 25, 1953 న వీగిపోయింది. సవరణకు ప్రతికూలంగా 63, అనుకూలంగా 62 ఓట్లు వచ్చాయి. ఆంధ్రేతర సభ్యులు 5 గురు సవరణకు ప్రతికూలంగా ఓటు చేయడం వలననే సవరణ ఓడిపోయింది. ఆ విధంగా రాజధాని సమస్య పరిష్కరింపబడ్డాక ఆంధ్ర రాష్ట్ర బిల్లు ఆగష్టు 27, 1953 న ప్రజాప్రతినిధులు సభ ఆమోదం పొందింది. తరువాత సెప్టెంబర్ 12, 1953 స్టేట్ కౌన్సిల్(రాజ్య సభ) ఆమోదం పొందింది. రాజధాని, హై కోర్టులపై తుది నిర్ణయం ఆంధ్ర శాసన సభ్యులదేనని హోం మంత్రి కట్టూ గారు హామీ ఇచ్చారు.
***సశేషం***
అవతరణి – రచయిత మనో నేత్రం
నేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.
నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.
నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.
ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.
అచ్చుకు నోచుకున్న తొలి కవిత "విడివడని బాధ్యత" విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ "వై" సిరిమల్లెలో, తొలి విమర్శ "పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి" ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం "మునసబు నుండి రాష్ట్రపతి దాకా..." ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు
So nice