శ్రీ శుభములిచ్చి తెలుగుళ్ల సిరులు దెచ్చి
చైత్రమాసపు పరువాలు ధాత్రి కిచ్చి
పచ్చని విరిసిన బ్రతుకుల ప్రగతి విచ్చి
తెలుగు ఇండ్లకు రావమ్మ వెలుగులిచ్చి
శ్రీ క్రోధి నామముగా వచ్చుచున్నావమ్మ
నీ కోపతాపాలు మాకు గుచ్చమాకమ్మ
కల్మష కలియుగమిది తెలుసుగదమ్మా
ధర్మము ఒక పాదమునే నిలిచెనమ్మా
అరిషడ్వర్గాలతో అందరూ బంధీలై
హరిహర నామమన్నదసలు చిధ్రమై
భౌతిక సంపదే పరమావధిగా
నైతిక విలువలకిట సమాధిగా
విజ్ఞాన శాస్త్రాలతో విర్రవీగుతూ
అజ్ఞాన తిమిరాల చిందులాడుతూ
ఆరు రుచులు చాలక జనులు
స్వార్ధమనే రుచికిట బానిసలై
సతము సతమతమవుతూ
ఆ సుఖాలకై తహతహలాడుతూ
ఆధ్యాత్మికత మరిచిరమ్మ
ఆత్మానందం విడిచిరమ్మ
శశిర రుతువులు రాల్చినవన్నీ చెట్లకిచ్చుతూ
మనిషి మనసు మార్చిన మలినాలను కడుగుతూ
కొమ్మ కొమ్మల కమ్మని కోయిల కూజితాలతో
రెమ్మ రెమ్మల ఝుమ్మని తుమ్మెద ఝుంకారాలతో
కొత్త పూల నెత్తావుల మత్తు సరాగాలతో
మంచి మానవత మమతల సరాగాలతో
మనుషుల తలపులు యోగ ధ్యాన భక్తులతో
మనసుల మొహాలు వర ఆధ్యాత్మిక డోలికలతో
సిరిమల్లె అందాల చిరునవ్వులతో
విరి జల్లు బంధాల తొలిపువ్వులతో
విశ్వశాంతితో జనులు మురియునట్లుగా
భారతీయ సంస్కృతులు జగాన వెలుగునట్లుగా
గడపగడపకు రావమ్మ కమ్ర రీతిగా
తెలుగు ఇండ్లకు రావమ్మ భవ్య రీతిగా
సర్వేజనా సుఖినోభవంతు
ఓం శాంతి శాంతి శాంతిః