శిశిరానికి వీడ్కోలు
వసంతానికి స్వాగతాలు
వసంతం రాకతో
పచ్చదనాలు...
పచ్చని తివాచీ పరచినట్టు
మామిడి వనాలు..
మామిడి వనాల్లో
కోయిలల మధుర గాన తరంగాలు..
ఊరంతా వేపచెట్లు
వేపచెట్ల నిండుగా పూలు
పూల గుత్తులను చూసి పులకిస్తున్న
సీతాకోకచిలుకలు…
వసంతమంటేనే మల్లెలు
మల్లె పందిరిలో పూల పరిమళాలు
ఆ పూల పరిమళాలలో
సయ్యాటలాడు తూనీగలు...
ఇలా...
కాలచక్రంలో ఋతువులు
వస్తుంటాయి, వెళుతుంటాయి..
కాలాన్ని కరగిస్తూ ,
కను మరుగుచేస్తూ..
కాలంతో పాటు . .
తియ్యటి జ్ఞాపకాలు,
చేదు అనుభవాలు
విడిచిపెడుతూ...
అలా గతంలో,
చేదు జ్ఞాపకాలు మిగిల్చిన శార్వరి
చేసింది విశ్వాన్ని చీకటి రాతిరి..
పాకింది కరోనా,
చాప కింది నీరులా ఈ ధరిత్రి అంతా..
చేసింది జన జీవనాన్ని
నిదురలేని రాత్రి...
మిగిల్చింది కడగండ్లు, కన్నీళ్లు
ఈ మహమ్మారి…
ఎన్నెన్నో ఆశలతో
ఎదురు చూసిన ప్లవ ఉగాది
కరోనా చీకట్లను దాటించింది
అందరినీ వెలుగు లోకి నడిపింది..
ఎంతో శుభప్రదమైంది
గడచిన శుభకృతు ఉగాది
మనలని మరపించింది
కరోనా జ్ఞాపకాలని ..
పంచింది అందరికీ
ఆనందాలని..
జీవితం అంటే ఇదే అంటుంది
ప్రతి ఉగాది..
కష్టాలు సుఖాలనేవి
ఉగాది పచ్చడి లోని
తీపి, చేదుల్లాంటివేననీ..
అందుకే..
గతాన్ని వీడాలి
భావికి బాటలు వేయాలి..
మనో ధైర్యాన్ని పెంచుకోవాలి .
ఆత్మ విశ్వాసంతో..
అడుగులు ముందుకు సాగాలి....
కొత్త ఆశలతో,
కొంగ్రొత్త ఆశయాలతో..
ఆనందంగా
శోభకృతుని స్వాగతిద్దాం...
ఆ ఆనందాలు
అందరం పంచుకుందాం..
Very nice poem!! చాలా బాగుంది!!
చక్కటి కవిత శోభకృతుని స్వాగతించడానికి !! చాలా బాగుంది!!