నెల్లూరు ప్రథమ జాతీయ పాఠశాల చరిత్ర
ఒకప్పుడు తిక్కనామాత్యుడు భారతాన్ని తెనిగించిన నెల్లూరులో పందొమ్మిదవ శతాబ్దం ద్వితీయార్ధానికి ఒకే ఒక హైస్కూలు ఉండే పరిస్థితి వచ్చింది. ఆంగ్ల పాలకులు భారత జాతీయ విద్యా విధానాన్ని, గ్రామీణ వ్యవస్థలను విధ్వంస మొనరించినందువల్ల గ్రామ సీమల్లోని ప్రజలకు, అట్టడుగు వర్గాలకు విద్య దూరమయ్యింది.
అప్పట్లో నెల్లూరు పట్టణమున Free Church Mission School అనే క్రైస్తవ పాఠశాల మటుకే ఉండేది. పట్టణ పౌరులు క్రైస్తవ పాఠశాలకు తమ పిల్లల్ని పంపుటకు ఇష్టపడట్లేదని అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ వాఁన్స్ఎగ్నూ ఆగస్టు7,1873న ఒక నివేదికలో పేర్కొన్నారు.అంతకు కొన్ని నెలల క్రితం అంటే ఏప్రిల్ 19,1873న నెల్లూరు మండలంలోనే ప్రప్రథమ పట్టభద్రుడైన శ్రీ సుంకు నారాయణస్వామి శెట్టి గారు మిషనరీ స్కూలులో ప్రథమ ఉపాధ్యాయుడుగా చేరారు. కానీ రెండు సంవత్సరాలకే ప్రిన్సిపాల్ రెవరెండ్ జాన్ మాక్మిలన్ తో సరిపడని కారణంగా పదవీ విరమణ చేశారు.
అప్పటికే నెల్లూరు పౌరులలో ఒక క్రొత్త హిందూ స్కూలు ప్రారంభించవలెనను సంకల్పము ఉధృతమై ఉంది. కొంత మంది జిల్లా ఉద్యోగుల పూనికతో నారాయణస్వామి శెట్టి గారు హిందూ స్కూలు స్థాపనలో భాగమవుటకు అంగీకరించారు. మే,2, 1875న నెల్లూరులో జరిగిన పౌర సభలో హిందూ స్కూలు స్థాపనకు తీర్మాణము, దానికి ప్రధానోపాధ్యాయుడిగా నారాయణస్వామి శెట్టి గారి నియామకము జరిగినాయి. నెల్లూరు పుర ప్రముఖుల సౌజన్యముతో మే 3, 1875న హిందూ ఆంగ్లో వెర్నాకులర్ స్కూలు ఆరంభమయ్యింది.
అయితే F.C.M స్కూలు అధికారులు నారాయణ స్వామి శెట్టి గారిపై వ్యక్తిగత ద్వేషము వహించి, ఈ సంస్థను పోటీ సంస్థగా భావించి దుష్ప్రచారం చేయసాగారు అనేక ఆరోపణలు, విచారణల తరువాత డివిజినల్ ఇన్స్పెక్టర్ Mr.Fortey విచారణకు వచ్చారు. వీరు పట్టణములో రెండు స్కూళ్ళు ఉండటం వలన విద్యాస్థాయి పెరుగుతుందని అంగీకరిస్తూనే, మాక్మిలన్ - శెట్టి గార్లకు ఒకరికొకరికి గిట్టనందువల్ల పై విద్యాలయాలు రెండిటికీ సత్ఫలితాలు కలుగవేమోనని అనుమానం వ్యక్తం చేసి, శ్రీ నారాయణ స్వామి శెట్టి గారిని పదవి నుంచి తొలగించమని, అట్లు కానిచో గ్రాంటు నిరాకరించమని ఫిబ్రవరి 15,1877 న పై అధికారులకు నివేదిక పంపారు. దాంతో పాఠశాలకు గ్రాంటు నిలిపివేయబడింది. కమిటీ వారు ఆఖరి ప్రయత్నముగా మద్రాసు గవర్నర్ డ్యూక్ అఫ్ బకింగ్ హామ్ సహాయం కోరినా ఫలితం లేకపోయింది. అప్పుడు మాజీ వెంకటగిరి దివాన్ గారైన రహిమతుల్లా గారి ప్రమేయంతో వెంకటగిరి రాజాగారు కొంత విరాళం అందజేశారు.
నారాయణ స్వామి శెట్టి గారు తాను హెడ్ మాస్టర్ గా ఉన్నంత వరకు ప్రభుత్వ గ్రాంటు లభించదని, పాఠశాల శ్రేయస్సు కొరకు తన పదవిని 1878లో త్యాగము చేశారు. అందువల్ల స్కూలు ప్రభుత్వ గ్రాంటు పొందగలిగింది.
అయినప్పటికీ స్కూలు యొక్క ఆర్ధిక దుస్థితి తీరనందున సుమారు 1886వ సంవత్సరంలో కొందరు ప్రముఖుల రాయబారము వలన శ్రీ వెంకటగిరి రాజా గారు కొన్ని షరతుల పై ఒక పదిహేను వేల రూపాయలతో ఒక గవర్నమెంట్ బాండ్ కొని స్కూలుకు కార్పస్ ఫండ్ ఏర్పరిచారు. ఆ షరతులలో భాగంగానే ఈ పాఠశాల "వెంకటగిరి రాజా సంస్థాన పాఠశాల" గా పిలువబడింది. ఈ ఏర్పాటు ఫలితంగా స్కూలు ఆర్ధిక స్థితి మెరుగయ్యింది.
స్వాతంత్రానంతరం 1960లో స్కూలు హయ్యర్ సెకండరీ పాఠశాలగా అప్ గ్రేడ్ చేయబడింది. క్రమంగా ఈ జాతీయ పాఠశాలకు, జూనియర్ కాలేజీ, డిగ్రీ, పి.జి కళాశాలలు జతయ్యి వెంకటగిరి రాజా కాలేజీ గా ప్రసిద్ధి గాంచింది. నెల్లూరు నగరంలో ఈ పాఠశాల, కళాశాల భవనాలున్న ప్రాంతం వి.ఆర్.సి సెంటర్ గుర్తింపు పొందింది.