శ్రీహరి పార్క్ లో వాకింగ్ చేస్తున్నాడు. ఆఫీసు అయ్యి పోగానే, కార్ పార్క్ దగ్గర ఆపి ఒక గంట సేపు నడిచి, ఇంటికి వెళ్ళడం అతని దిన చర్యలో భాగం.
సెల్ ఫోన్ రింగ్ అయ్యింది. నంబర్ చూశాడు. డాక్టర్ సరస్వతి కాల్ చేస్తున్నారు.
“గుడ్ ఈవినింగ్ సర్, నేను డాక్టర్ సరస్వతి మాట్లాడుతున్నాను”
“గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. హౌ ఐ కెన్ హెల్ప్ యు”
“ఇది ఎండా కాలం కదా సార్. గాంధీ హాస్పిటల్ లో చాలా సర్జరీలు రక్తం లేక ఆగిపోయాయి. అంతా చాల పేదవారు సార్. రక్తం బయట కొనలేరు..మా సెంట్రల్ బ్లడ్ బాంక్ సప్లయ్ చేసే రక్తం మీద వారి ఆపరేషన్లు ఆధార పడతాయి. కొంత మందికి ఈ ఆపరేషన్లు అత్యవసరం. ఇంక కొందరు ఆపరేషను అయ్యే వరకు పనికి పోలేరు. ఆదాయం ఉండదు. కుటుంబం గడవడం చాలా కష్టం.
మీ కంపెనీ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి కొన్ని యూనిట్లు రక్తం ఏర్పాటు చేయగలిగతే కొన్ని ప్రాణాలు, కొన్ని కుటుంబాలు నిలబడతాయి. మీ కంపెనీ లో పోయిన సారి మంచి ఆదరణ లభించింది. అందుకే మీకు ఫోన్ చేశా.”
“నా మీద నమ్మకం పెట్టి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. రేపు ఆఫీసు టీంతో మాట్లాడి మీకు డేట్ కన్ఫర్మ్ చేస్తాను. గుడ్ నైట్”
“శ్రీహరి గారు, అడగగానే ఒప్పుకున్నందుకు ధన్యవాదములు.. గుడ్ నైట్”
&&&
పక్క రోజు ఆఫీసు లో టీం తో చర్చించి డేట్ నిర్ణయించి, డాక్టర్ సరస్వతి గారికి ఈ మెయిల్ చేశాడు శ్రీహరి. ఆమె ధన్యవాదాలు చెబుతూ, బ్లడ్ క్యాంప్ కి సంబంధించిన పోస్టర్స్ కంపెనీ నోటీస్ బోర్డు లో పెట్టడానికి ఈ-మెయిల్ కి జత చేసింది. రక్తం ఎవరు, ఎన్ని సార్లు ఇవ్వవచ్చు, అపోహలు, సమాధానాలు, రక్తం ఇచ్చే ముందు, తర్వాత పాటించ వలసిన అంశాలు అన్నీ ఆ పోస్టర్స్ లో చక్కగా పొందుపరిచి ఉన్నాయి.
బ్లడ్ కాంప్ నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లు చేసి, వాలంటీర్లు అందరికీ ఈ-మెయిల్ ద్వారా తెలియ చేశాడు శ్రీహరి. ఈ-మెయిల్ ద్వారా కంపెనీ లో వున్న అందరికీ గ్రూప్ మెయిల్ పెట్టాడు. దాంట్లో ఆరోగ్య వంతులైన మనుషులు తరచుగా బ్లడ్ దానం చేస్తే మనిషి కి కలిగే ప్రయోజనం, ఆ రక్త దానం వల్ల ప్రాణాలు, కుటుంబాలు ఎలా నిలబెట్టవచ్చు విపులంగా రాశాడు.
మొత్తం క్యాంపస్ లో పండగ వాతావరణం. నీవు ఇస్తున్నావా, నీవు ఇస్తున్నావా అనే ప్రశ్నలు, ఇచ్చిన వారి అనుభవాలు, టీ టైమ్ లో, లంచ్ టైమ్ లో ఇదే చర్చలు. ఇంటి దగ్గర కుటుంబ సభ్యులతో కూడా ఇదే చర్చలు.
అందరూ అతి ఉత్సాహంగా ఎదురుచూడసాగారు. వచ్చే శుక్రవారం క్యాంప్. గురువారం శ్రీహరి ఏర్పాట్లు మరొక సారి రివ్యూ చేశాడు .
&&&
ఆ రోజు రానే వచ్చింది. అంతా పండగ వాతావరణం. స్టాఫ్ కాంటీన్ కి వెళ్ళి టిఫిన్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ దగ్గరకు వెళ్ళి పేరు రిజిస్టర్ చేసుకొని, ఇచ్చిన టైమ్ స్లాట్ నోట్ చేసుకొని వాళ్ల సీట్ దగ్గరకు వెళ్లారు.
ఇంతలో డాక్టర్ సరస్వతి, ఆమె టీం వచ్చారు అని సెక్రటరీ వచ్చి చెప్పింది. శ్రీహరి రిసెప్షన్ ఏరియాకి వెళ్ళి వారికి స్వాగతం చెప్పాడు. ఆమె టీం లో ఆమె కాక ఇద్దరు డాక్టర్లు, ఒక పది మంది టెక్నీషియన్స్, నలుగురు హెల్పర్స్, ఇద్దరు డ్రైవర్లు వున్నారు. అందర్నీ ఆమె శ్రీహరి, ఆయన టీం కి పరిచయం చేసింది. వారందరికీ శ్రీహరి కాంటీన్ లో టిఫిన్ ఏర్పాటు చేశాడు. అందరూ ఎంతో ఇష్టం గా టిఫిన్ చేసి టీ, కాఫీ తాగారు.
ఆఫీసు స్టాఫ్ సహాయం తో బ్లడ్ బ్యాంక్ టీం తమ సామగ్రి అంతా క్యాంప్ కి నిర్దేశించిన పెద్ద హాల్ లో ఏర్పాటు చేశారు. మొత్తానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. బీపీ అవి చెక్ చేసే డాక్టర్లు, రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు, రక్తం తీసే వాళ్ళు, తీయగానే, బిస్కట్ పాకెట్, డ్రింక్ ఇచ్చే వాళ్ళు, తీసిన సీసాలు ఐస్ లో భద్రపరిచే వాళ్ళు, అంత ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయ్యి వున్నారు. ఆఫీసు జనరల్ మేనేజర్ క్యాంప్ ప్రారంభం చేసి తాను మొదట రక్తం దానం చేసాక, మెల్ల మెల్ల గా మిగతా స్టాఫ్ దానం చేయడం మొదలు అయ్యింది. శ్రీహరి నిలబడి చూస్తున్నాడు.
రక్తం ఇచ్చేవాడు, తీసేవాడు, ఎక్కించ బడే వాడు, ఎవరు ఏ కులమో, ఏ మతమో, ఏ భాష, డబ్బు వున్న వాడో, లేని వాడో, ఎంత సంపాదిస్తున్నారో, ఏ పోస్ట్ లో ఉన్నారో అన్ని కనపడడం లేదు. అందరూ కలిసి ఒక మానవ కళ్యాణం కోసం చేసే యజ్ఞం కనపడుతోంది. అందరిలో నిక్షిప్తమైన దైవం గోచరిస్తోంది.
బ్లడ్ బ్యాంక్ స్టాఫ్, శ్రీహరి టీం కలిసి స్పెషల్ లంచ్ ఎంజాయ్ చేశారు.
సాయంత్రం 4 గంటల వరకు అందరిలో అదే ఉత్సాహం. దాదాపు రిటైర్ కాబోయే వయసు వున్న వాళ్ళు కూడా దానం చేశారు. ఆరోగ్య సమస్య ల వల్ల ఇవ్వలేక పోయిన కొందరు నిరాశ పడ్డారు. ఒకరికి ఒకరు ఉన్నాము అనే భావన అక్కడ కనపడుతోంది. ఆఫీసులో రోజూ ఉండే వృత్తి పరమైన సమస్యలు, ప్రతి ఒక్కరికీ ఉండే వ్యక్తిగత సమస్యలు అన్నీ తాత్కాలికంగా తెర చాటుకు పోయాయి.
క్లోజ్ అయ్యే సమయానికి 700 యూనిట్లు కలెక్ట్ అయ్యాయి. అందరి మొహాల్లో ఆనందం. ఒక మంచి కార్యానికి తమ వంతు కృషి చేశాము అన్న తృప్తి.
చివరగా అందరికీ స్వీట్, కేక్, సమోసా, కూల్ డ్రింక్, టీ, కాఫీ అరేంజ్ చేశారు.
శ్రీహరి, సరస్వతి ఒక టేబుల్ దగ్గర కూర్చొన్నారు. తింటూ మాట్లాడుకొన్నారు.
శ్రీ హరి మేడమ్ తో “డాక్టర్ గారు, మీరు, మీ స్టాఫ్ అందరూ గవర్నమెంట్ ఉద్యోగులు. ఏదో టైమ్ ప్రకారం 10 నుంచి 5 వరకు పని చేస్తారు అని అందరూ అనుకుంటారు. కానీ 15 మంది, ఉదయం గంటలకే లేచి, ఈ క్యాంప్ కోసం రావడం, ఇంటికి వెళ్ళేటప్పటికి క్యాంప్ వున్న రోజుల్లో రాత్రి కనీసం 9 అన్నా ఔతుంది అనుకుంటాను. మరి వాళ్లని ఎలా మోటివేట్ చేస్తారు??
సరస్వతి “నిజమే కష్టమే. నేను వాళ్లను నా కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాను. ఆఫీసు లో రూల్స్ లేకపోయినా, వారు అంత పొద్దునే ఆఫీసు కి రావడానికి, రాత్రి లేట్ గా వెళ్లడానికి, వాళ్ల టిఫిన్, భోజనం వసతులు అన్నీ నా స్వంత డబ్బులతో కానీ, మీ లాంటి కంపెనీ సహకారంతో కానీ ఏర్పాటు చేస్తాను. క్యాంప్ లేని రోజుల్లో ఆఫీసుకి లేట్ గా కానీ, అసలు రాక పోయిన లీవ్ పెట్టకుండా ఉండే వసతి మా డైరెక్టర్ సహాయం తో ఏర్పాటు చేసాను. అలాగే ఎవరికైనా ఇంట్లో పెళ్లి లాంటి పెద్ద పనులు ఉంటే లీవ్ పెట్టకుండా ఒక పది పదిహేను రోజులు ఆఫీసు కి రాక పోయినా పరవాలేదు అనే స్కీమ్ మా డైరెక్టర్ గారి సహకారంతో అమలు పరుస్తున్నాము.
ఈ డైరెక్టర్, ఈ మేడం మన మంచి చెడ్డలను చూసుకుంటారు. వాళ్ళు చేపట్టే మంచి పనులకు మనం సహకరించాలి అనే భావన అందరిలో ఏర్పడింది.”
“అమేజింగ్” శ్రీహరి స్పందన.
“మేడం, పోయిన సారి చెప్పినట్లు గుర్తు. మీరు, మీ భర్త సురేశ్ గారు ఇద్దరు ఎం.డి. చేశారు. ఇద్దరు గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే పని చేస్తున్నారు. మీ చదువుకు, అనుభవానికి కార్పొరేట్ హాస్పిటల్ లో మీకు వచ్చే జీతం కంటే కనీసం మూడు వంతులు ఎక్కువ వస్తుంది అనుకుంటా. మరి మీరిద్దరూ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయాలని నిర్ణయం తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా, ఇఫ్ యు డోంట్ మైండ్.”
సరస్వతి చాలా క్లుప్తంగా “ప్రజా సేవ చేయడానికి ఎవరు ఇస్తారు నెలకు లక్ష పైన జీతం చెప్పండి. అదే కాక, అవసరం లో వున్న వాడి సేవ చేయడం లో వచ్చే ఆనందం విలువ ఎన్ని లక్షలు”.