సతత వసంత ఉగాది
ఎన్నో ఉగాదులు ఆశ రేపి తప్పుకున్ననూ
మరెన్నో ఉగాదులను ఆశతో ఆహ్వానించిననూ
నేటికీ, పూట గడవక, పొట్ట నిండక, ఒట్టికడుపుతో
గట్టి నేలనే పట్టుపరుపుగ తలచి, తెన్నుండు వారెందరో!
కట్టు బట్టలేక, ఉనికిపట్టు పట్టు చిక్కక, గుట్టుచెడి
ఈ బ్రతుకెట్టాగనుకునుచూ బ్రతుకీడ్చు వారెందరో!
తమ ఇంద్రియాలపై పట్టు పొనుగువడి
విరాగముతో, వికలతతో కొట్టుమిట్టాడు వారెందరో!
దిక్కులేక ఏ చెట్టు నీడనో, ఓ పుట్ట చాటునో
పుటుక్కున ఊపిరిపై హక్కు వదులు వారెందరో!
రావమ్మా శోభకృతు…
అభినవ ఉగాదిగా, సతత వసంతానివిగా
మూడుపూటలు మాకు బువ్వనివ్వగ
ప్రతి నిశి, సుషుప్తి మా సొంతము చేయగ
నిలకడైన పైకప్పు మా నెత్తిపై నెలకొలపగ
సడలుపడని వలములు మా మేనుపై నిలపగ
స్వస్థత నిలిపెడి ఇంద్రియములు మాకివ్వగ
కట్టె ఖట్టికెక్కినపుడు, ఓ నలుగురి తోడివ్వగ
మా'నవ' జీవితాలలో శోభ నింపగా
రావమ్మా శోభకృతు…!