ఒకప్పటి సంక్రాంతి సంబరాలు
నింగికెగరే శాంతి కపోతాలు..
పల్లె పల్లెలో ఆనంద కాంతులు
ప్రతి మనిషిలో అనురాగ మాలికలు..
పుష్యమంటేనే చలి గాలులు
పొలం గట్టున రైతన్నల చలి మంటలు..
తొలికోడి కూయగానే
పల్లెల్లో సంక్రాంతి శోభలు..
చలి చీకటిలోనే ఇంటి ముంగిట
అమ్మ కల్లాపి జల్లులు..
గడప ముంగిట చుక్కల ముగ్గులు
ముగ్గుల్లో ముస్తాబైన గొబ్బిళ్లు..
బంతి చేమంతుల్లో
గొబ్బెమ్మల సింగారాలు..
అన్నమయ్య కీర్తనల్లో
హరిదాసు చిందులు..
పొగమంచుల్లో
ప్రకృతి అందాలు
పచ్చటి పైరుల్లో
పుడమి పులకరింతలు
ఇవి ఒకప్పటి సంక్రాతి కాంతులు..
నేడు..
ప్రకృతిని ఆవరించిన కాలుష్యాలు
కలుషితమైన పర్యావరణాలు
పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ లు ,
దాని పర్యవసానాలు..
గతి తప్పిన రుతుపవనాలు..
అనుకోని ‘మిగ్ జామ్‘ తిత్లీ తుఫానులు
కుండపోత వానలు
చెరువులైన వరి చేలు
చేతికందని ధాన్యరాశులు
గుండెలవిసేలా రైతన్నల రోదనలు..
మిగిల్చే అన్నదాతలకు,
కన్నీళ్లు, కడగండ్లు..
అందుకే..
కనిపించవు పంట పొలాల్లో
ఆనాటి పచ్చదనాలు..
అగుపించవు పల్లె సీమల్లో
అప్పటి తళుకులు..
మనిషి జీవనం యాంత్రికమైన రోజులు
సాటి మనిషికి సాయపడని
ఇరుకైన మనసులు..
ఆప్యాయతలకు, అనురాగాలకు
పెరుగుతున్న దూరాలు..
సంస్కృతి, సంప్రదాయాలు ,
మృగ్యమవుతున్న వైనాలు..
అందుకే..
కానరాకున్నాయి కలుపుగోలు తనాలు..
దూరమవుతున్నాయి ఆత్మీయతలు..
కనుమరుగవుతున్నాయి
మన సంప్రదాయాలు..
లేవు సంక్రాంతికి
ఆనాటి శోభలు, సొబగులు..
సందడులు, సంతోషాలు..
అందుకే..
ఒకప్పటి సంక్రాతి కాంతులు..
అవి నేడు కొడిగట్టిన దీపకాంతులు
సంక్రాంతి పండుగ నాడు – నేడు తేడాలు తో అందరికి చాలా చక్కగా భోదపడేలా సరళ భాష లో చెప్పినారు.Really super👌.
సంక్రాంతి సంబరాలు కథానిక చాలా బాగుంది