Menu Close
Lakshmi-Iyer
సనాతన భారతీయం
ఆచార్య లక్ష్మి అయ్యర్

మన విశ్వకవి వేమన సామాజిక స్పృహ

ఆయన సిద్ధాంతాలు స్త్రీ పురుష సమానత్వం, స్త్రీజనోద్ధరణ లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఆయన దృష్టిలో స్త్రీ తల్లి.

తల్లి నెరుగు వాడు దైవంబు నెరుగును
మన్ను నెరుగు వాడు మిన్ను నెరుగు
మన్ను మిన్నెరిగిన తన్నుతానెరుగురా

అంటూ ఆనాడు కామాంధ కారంతో కన్నుమిన్ను గానక సంచరించే పురుషులకు స్త్రీ యొక్క పవిత్రతను గుర్తుచేశాడు.

వెలయ భూమితల్లి, విత్తనంబటు తండ్రి,
పంటలరయ సుతులు, పాడి పరము
ధర్మమే తన పాలి దైవంబు తలపోయ... అంటున్నాడు.

వేమన ధర్మ స్వరూపమైన దేవాలయాన్ని చేరుకోవడానికి మూలం తల్లి అన్నారు. పరశురాముడు తండ్రి మాటలను విని తల్లిని చంపి తాను సాధించిందేమిటి? నిలువ నీడ లేక మలయ పర్వతం పై తల దాచుకోవలసి వచ్చింది కదా అతనికి అని అంటున్నాడు వేమన.

స్త్రీల అధోగతికి కారణం పురుషులేనని  గుర్తించిన వేమన;
తరుణి పుణ్యవతిగ నరుని బట్టెయే యగు
పాపి యగును మగని బట్టియే ఇల
భర్త వర్తనంబే పడతికి గ్రాహ్యంబు.. అని స్త్రీల పక్షాన వేమన వాదించాడు.

వేమన దృష్టిలో స్త్రీల యెడ పురుషులు చూపిన దారుణ వివక్ష;
పుణ్యమంత గూడి పురుషుడై జన్మించె
పాపం మంత గూడ పరగునే నతి
కష్టపు సతి యని కనువారు లేరయా!.. అంటూ స్త్రీల పక్షాన కన్నీరు కార్చాడు వేమన.

పురుషుడు ఎలా ఉండవలెను?అని  ప్రబోధిస్తూ

కావవలయు  మగడు కాంత నెల్లప్పుడు
కావలేని నాడు చావవలయు ... అన్నాడు.

వేమన వేశ్యావృత్తిని నిరసిస్తూ భార్యలను ప్రేమించి గౌరవించాలని పురుషులకు బోధిస్తాడు.

ఇంటియాలి విడచి ఇరజార కాంతల
వెంట దిరుగువాడు వెర్రివాడు
పంట చేను విడచి పరిగ యేరిన యట్లు ..అన్నాడు వేమన.

మరొక పద్యంలో

పేదవాడైనను పెంటి నిచ్చెదనని
పైడి నడుగ రాదు పరుసమునను
పైడి గొనుట పెంటి బట్టిన యట్లయా.. అని అన్నాడు.

అలాగే కన్యాశుల్క దురాచారం, ధనవంతుల బహుభార్యాత్వ దురాచారానికి, ముసలి ముప్పు పెండ్లి, వేశ్యా వృత్తులను తీవ్రంగా నిందించాడు వేమన. ఉమ్మడి కుటుంబాల వల్ల కలిగే లాభాలు కూడా వేమన తన పద్యాలలో ప్రతిపాదించాడు ఆనాటి స్త్రీలలోని అవినీతి చర్యలను కూడా వేమన దుయ్య పెట్టాడు.

ఆనాడు పొట్ట నింపుకోవడం కోసం స్త్రీలు పురుషుల దగ్గర దాసిగా పడి ఉండటం కంటే పురుషులతో పాటు సమానంగా కష్టించి పనిచేసి సాధించాలి అన్నాడు వేమన.

‘కూలినాలి చేసి గుల్లాము పనిచేసి తెచ్చి పెట్ట నాలు మెచ్చు చుండు..’ అనే పద్యంలో ఆర్ధిక స్థితి బాగాలేక కుటుంబంలో కలతలు వస్తాయి. మగవాడి తోబాటు స్త్రీలు కూడా ఆర్ధిక రక్షణ చేసుకోవాలని అన్నాడు.

వేమన దృష్టిలో లో నిజాయితీ కలవాడే సత్యాన్ని మాట్లాడగలడు. సత్యమే మానవత, మానవతే సత్యము. ఈ రెండింటి కలయికే వేమన పద్యాల్లోని సారం అంటున్నారు డాక్టర్ గోపి. వేమన సత్యాన్ని ప్రతిపాదిస్తూ; కల్లలాడు వాడి కంటే కష్టం
మరి లేదు దుర్వ్యసనపరుడి కంటే
తాగుబోతు కన్నా అపద్దం ఆడే వాడే నీచుడు!

వేమన దృష్టిలో సాహసం ధైర్యం లేని వారు సత్యం పలక లేరు. వేమన వ్యక్తిత్వంలోని సౌందర్యమే సత్యం. ఆయన నిస్వార్థపరుడు. వేమన సర్వసంగ పరిత్యాగి. అతనికి ఎవరి మీద శ్రద్ధ, మమకారాలు కానరావు అని డాక్టర్ ఈశ్వర్ గారు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘సాంఘిక దోషములను సరిదిద్దు తానుగా మానవత్వం సిద్ధాంతములకై పోరాడు’ అని చెప్పి వేమన సర్వ సమానత్వాన్ని నెలకొన్న ఉద్యమనాయకుడు. వేమన వర్ణవ్యవస్థ మనిషి జాతి ఐక్యతను భంగ పరుస్తుందని హెచ్చరించాడు. కులాలు అన్నీ ఒకే కులమని, అదే, మనిషి కులమని వేమన సూచించాడు. ప్రపంచం లోని మానవులు అందరూ కూర్చోని తినే సహ పంక్తి భోజనాలను కూడా వేమన ప్రతిపాదించాడు.

ఉర్వి వారికెల్ల నొక్క కంచము
పొత్తుగుడిపి కులము పొలయజేసి
తలను చెయ్యి బెట్టి  తగనమ్మ జెప్పరా ... అంటున్నాడు వేమన ఇంతకంటే మానవ సమానత్వానికి ఉదాహరణ ఏది ఉండబోదు.

అనేక పద్యాల్లో కులం కన్నా గుణము ప్రధానంబు అంటున్నాడు.

కులములోన నొక్క  గుణవంతుడుoడేనా
కులము వెలయు వాని గుణము చేత
వెలయు వనములోనమలయజంబున్నట్లు.... అంటున్నాడు.

“రామ నామ పఠనచే మహి వాల్మీకి
పరగ బోయడయ్యు బాపడయ్యే”

వేమన ఆనాటి సాంఘిక శాపం ఇంకొకటి అస్పృశ్యత. పరమ కరుణ మనస్సు కలిగిన వేమన దీన్ని తీవ్రంగా ఖండించాడు చతుర్వర్ణాలకు వెలిగా పుట్టిన అస్పృశ్యత సాంఘిక అధర్మానికి చిహ్నమైనది. మానవులందరి మాంసం ఒకటే కదా మరి ఆ అస్పృశ్యత ఎక్కడి నుండి వస్తుంది అని అంటున్నాడు వేమన. వారి దుస్థితి చూసి ఆయనకు ఎంతో నొప్పి కలిగింది అందుకే వేమన అస్పృశ్యుల వారి పక్క వాదించాడు.

మాలవాని నేలమరిమరి నిందింప
ఒడలనున్న మాంసం మొకటి గాదె
వానిలోన వెలుగు వాని కులంబేది?.. అని వేమన అడిగాడు.

మాలవానినంటి మరి నీళ్ళ మునిగేరు
మాల కర్మచేత మాలడయ్యే
ఏమి తెలియలేరో ఈ నర పశువులు అని వాపోతున్నాడు వేమన.

అతని విశాల మానవ ప్రేమను శబ్దాలలో బంధించడం వీలుకాదు. సాధ్యం కాదు. వేమన సమాజంలోని రాజకీయ, ఆర్థిక, ప్రజా జీవన సామాజిక పద్ధతులలోని అంధ విశ్వాసాలు, మతం పేరిట మనుష్యులను నొప్పించే ఆచారాలను ఖండించి వ్రేళ్ళతో సహా పెకిలి పారవేసిన విప్లవ కవి, మానవతవాది. దైవాన్ని ప్రతి మనిషిలోను దర్శించేవాడే నిజమైన మానవుడు అన్నది వేమన విశ్వాసం. దాన్నే గీతాచార్యులు శ్రీ కృష్ణ పరమాత్మ సమాదార్శిగా పేర్కొన్నాడు.

వేమన మానవత్వ స్థాపనకై సమాజం లోని కుళ్ళులను, వంచనలను, జాతి మతం పేరిట మనుష్యులను కించ పరిచే విధానాలను చూసి ఉద్రేక జ్వాలలను కురిపించాడు. కానీ దాని వెనుకగల వేమన మానవప్రేమ యనే అనుకోవాలి. వేమన మనస్సు వెన్నపూసని మరువరాదు.

వేమన మనసును శుభ్రంగా, నిస్స్స్వార్థంగా, నిర్మలంగా, ఉంచుకోమని పదే పదే చెబుతున్నారు

చిత్తశుద్ధిలేని చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు కొరవగాదే
విత్తనంబు మర్రి వృక్షంబునకెంత

వేమన మానవత్వం మానవతావాది సిద్ధాంతం. పవిత్రమైన మనస్సుతో మానవత్వం ముడివడి వున్నది. అందుకే వేమనగారు అన్నారు “ఆత్మ శుద్ధి లేని ఆచారమదియేల?

అలాగే, గుళ్ళు, గోపురాళ్ళు, మసీదుల వెంట తిరిగే జనాన్ని వెర్రి వాళ్ళని వేమన పరిహసించాడు.

హృదయమందున్న ఈశుని తెలియక
శిలల కెల్ల మ్రొక్కు జీవులారా
శిలలనేమివుండు, జీవులందేగాక.
మనస్సును నొప్పించేవారిపై వేమన ద్వేషాని కురిపించాడు.
ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు
కాచి అతుకవచ్చు కమ్మరీడు
మనసు విరిగెనేని మరియంత నేర్చునా.. అని అన్నారు.

ఎక్కడ  మానవత్వం లోపిస్తుందో అక్కడ నిలదీసి ప్రశ్నల వర్షం కురిపించే సాహస విప్లవ కవి వేమన. మానవత్వాన్ని ప్రతిపాదిస్తూ

పసుల వన్నె వేరు, పాలేక వర్ణమే
పుష్ప జాతి వేరు పూజలొకటి
దరిశనంబులు వేరు దైవమొకటే.. అని అన్నాడు.

సమాజంలో కుటుంబపు విలువలను గుర్తించి దాన్ని పదిమందికి తెలిపిన వ్యక్తి వేమన. గృహము సమాజపు భాగం. సమాజం ఓ రాజ్యపు భాగం. అందుకే సమాజంలోని చెడులను ఏకధాటిగా విమర్శించిన విప్లవకారుడు, సమాజ సంస్కర్త వేమన. వేశ్యావృత్తితో నిండిన ఆ సమాజంలో పతివ్రతలను గుర్తించిన మహోన్నతుడు. ఉత్తమ ఇల్లాళ్ళను ప్రశంసిస్తూ ఇలా అన్నారు –

గుణవతి యగు యువతి  గృహంబు
చక్కగనుండ, చీకటింట దివ్వె చెలగురీతి
దేవియున్న గృహము దేవార్చన గృహము.

వేమన పద్యాలలో మానవత్వం పేదవాళ్ళ పేదరికంలో, ఆడవాళ్ళ కష్టాలలో, అప్పుల పాలబడ్డ రైతుల కన్నీళ్ళలో తారసిల్లుతుంది. అదే మానవత్వం, కపట సన్యాసులను, మతం పేరిట అఘాయిత్యం చేసే బ్రాహ్మణులపై ,పేదోళ్ళ నోరు కొట్టే రాజులు, భూస్వాములపై అగ్నివర్షమై కురుస్తుంది. వేమన లాంటి మానవతావాది సామాజిక స్పృహ కలిగిన మహనీయ, విశ్వ బంధుత్వ కవి, నిర్మల మనస్కుడైన కవి ఎవరూలేరు అంటే అది అతిశయోక్తి కాదు. వేమన సాహిత్యంపై భారతీయ భాషలన్నీ పరిశోధనా కేంద్రాలు స్థాపించి వేమన కీర్తిని విశ్వమంతా చాటి చెప్పాలి.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

Bibliography:

Primary works:

Telugu Books:

  1. Andhra Vagnmaya Charitra _Dr.Divakarla Venkawadhani-Andhra Sahitya parishad Hyderabad-1979
  2. Vemana padyalu(Telugu) –Bangore T.T.D.Publication Tirupathi.-1978
  3. Mana Vemana -Arudra –Vemana foundations-Hyderabad 2nd & 3rd edition-2006,2010(first edition by sri venkateshwara universityTirupathi-1985)
  4. Vemana Bodha –G.V.subrahmanyam –Spoorthi Publishing house –Guntur-Dec2013
  5. Praja kavi Vemana –Dr. N.Gopi ,Vishalaandhra Publishing House,Hyderabad(April 2000,2005,2012)
  6. Telugu Sahityam lo Vemana-Veera Brahmam-oka sambhashana-G.KalyanRao-Praja Shakti book House,vijayawada2017
  7. Vemana-Ralla palli Ananta Krishna Sharma- Vemana foundations-Hyderabad-10th edition-2010.
  8. Vishwa kavi Vemana Gurram Venkata Reddy,Pochana Rami Reddy- Vemana foundations-Hyderabad-7th edition(2010)
  9. Loka kavi Vemana –Kaa Prapoorna Maruvooru Kodanda Rami Reddy Vemana foundations-Hyderabad-4th edition(2009)
  10. Kabiru Vemana Tulnatmaka Adhyaanamu Dr.Y.V.S.S.N.Murthy
    Sandhya publication Madras -1994, with the financial assistance of T.T.D Tirupathi.

Tamil:

  1. A comparative study of Tiruvalluvar-kabirdas-Yogi Vemana by Dr. N.Lakshmi Aiyar Manivachakar publications, Chennai.

English Books:

  1. Vemana-V.R. Narla- Vemana Foundations, Hyderabad reprinted- 2006 (prime publisher-sahitya academy Delhi 1969,1997 .
  2. Vemana through western eyes – Edited by V.R. Narla Vemana Foundations, Hyderabad reprinted-2006 (prime publisher-Sahitya academy Delhi 1969.

Reference Books:

  1. FACTS OF Indian Literature—K.M.George
  2. Glimpses of Indian Culture-Manmohanopaadyay ,Dr.Dyanesh Narayan .Chakravarthy.
  3. Ethics, Erotics and Aesthetics – Ed Prafulla , K. Mishra.

 

****సశేషం****

Posted in February 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!