Menu Close
Lakshmi-Iyer
సనాతన భారతీయం
ఆచార్య లక్ష్మి అయ్యర్

బహుభాషావేత్తగా భారతీయ భాషలు, సంస్కృతిని అర్థం చేసుకొని, నాలుగు దశాబ్దాలుగా విశిష్ట సేవలను ఆచార్య లక్ష్మీ అయ్యర్ అందిస్తున్నారు. భాషా బోధన మరియు పరిశోధన రంగంలో ఎంతో మంది విద్యార్థులకు దిశానిర్దేశం సూచిస్తూ, ఆచార్య వృత్తిలో అనితర కృషి సల్పి, భావితరాలకు, భాషాభిమానులకు తన వంతు సాహితీ సంపదను అందించాలనే తపనతో నిత్యం శ్రమిస్తూ, తన పరిశోధనా అంశాలను అనేక వ్యాసాలు, కథల రూపంలో వివిధ అంతర్జాతీయ పత్రికలలో, సామాజిక మాధ్యమాలలో, పరిశోధనా గ్రంథాలలో ప్రచురించడం జరుగుతున్నది. ఆచార్య లక్ష్మీ అయ్యర్ కలం నుండి వెలువడుతున్న మరో పరిశోధనా వ్యాసం ‘సనాతన భారతీయం’  మన సిరిమల్లె లో ఈ నూతన సంవత్సర ప్రారంభ సంచిక నుండి ప్రచురిస్తున్నాము. ఇది మన సాహిత్య సంపదకు మరో కలికితురాయి అని అనడంలో సందేహం లేదు. – మధు బుడమగుంట

ముందుమాట:

ఎంతోమంది తత్వవేత్తలకు, భాషాకోవిదులకు, వేదపారంగతులకు, ఆధ్యాత్మిక గురువులకు, సామాజిక సేవా మూర్తులకు కాణాచి అయిన ఈ భారతావని యొక్క ఉనికిని సూచిస్తూ, ఈ గడ్డపై జన్మించి, సనాతన సంప్రదాయాలను వ్యాప్తి చేసిన మహానుభావుల గురించి నా మెదడులో కలిగిన ఆలోచనలను వ్యాస రూపంలో అందరికీ అందించాలనే తపనతో ఈ ‘సనాతన భారతీయం’ అనే శీర్షికను మన ‘సిరిమల్లె’ లో ఈ నూతన ఆంగ్ల సంవత్సరం నుండి ప్రచురించడం జరుగుతున్నది. మొదటి వ్యాసంగా, తెలుగు లోని ఆటవెలది దేశీయ ఛందస్సును ప్రయోగించిన శతక కర్త, ప్రజారంజక, లోక కవి విప్లవ కవి, మొదట మానవతావాది, ‘యోగి వేమన’ గారి గురించిన వ్యాసం మీకు అందిస్తున్నాను. మీ సందేహాలు, సూచనలు తప్పక అందించమని మనవి.

నమస్కారములతో – ఆచార్య లక్ష్మి అయ్యర్.

మన విశ్వకవి వేమన సామాజిక స్పృహ

నైతిక విలువలు మానవ మనుగడ వృద్ధికి తోడ్పడుతూ సమాజాన్ని మంచి దిశలో ముందుకు తీసుకు వెళ్తుందనడంలో సందేహం లేదు. ఈనాటి మనిషి ఇంటర్నెట్ ఇంద్రజాలంలో డబ్బు సంపాదించే యంత్రంలా ముందుకు పరిగెత్తుతూనే ఉన్నాడు. ఆ పరుగులో తన సంస్కారం, సంస్కృతి, మానవ గుణాలు అన్నీ మరచి ఒంటరితనం, విచ్చలవిడితనం, స్వార్థం, కుళ్ళు వంచనలకు లోబడి పచ్చి తాగుబోతు లాగా విచక్షణాజ్ఞానం, సామాజిక స్పృహ  లేకుండా ప్రవర్తిస్తున్నాడు. వైజ్ఞానిక ప్రగతికి బానిసై తన ప్రక్కన ఉన్నకనీస రక్త సంబంధీకులను (తల్లిదండ్రులు, అమ్మమ్మ బామ్మ, తాతయ్య లాంటి పెద్దవాళ్ళను) చుట్టూ ఉన్న మనుషులు లెక్కచేయక తన సెల్ ఫోన్ లో, వాట్సాప్ లతో ఇయర్ ఫోన్ పెట్టుకొని ఏదో కృత్రిమ సంతోషాలతో నిర్జన ప్రదేశంలో ఒంటరిగా జీవిస్తూ అత్యాధునిక సభ్యసమాజంలో ప్రపంచంతో ఐక్యత నెలకొన్నట్లు భావిస్తూ అపోహ పడుతున్నాడు. ఇలాంటి యుగంలో తన అస్తిత్వాన్ని, సంస్కారాన్ని, మానవ ధర్మాన్ని మరచి స్వార్థపరుడి గా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి ప్రదర్శన ప్రియ, ఆడంబర, పాశ్చాత్య సమాజపు జీవన పద్దతులతో నిండిన మన భారతీయ సమాజానికి అత్యంత అవసరం, నైతిక విలువలతో కూడిన మానవ గుణాలు. అవే సామాజిక ప్రగతికి నాంది పలుకుతాయి. ఇలాంటి సత్యాలను సాటి చెప్పేమేటి సాహిత్యాలే కాలాన్ని జయించే సాహిత్యాలు అనబడ్డాయి. నీతి సాహిత్యo, శతక, భక్తి సాహిత్యం ఈ కోవకు చెందినవి.

భారతదేశంలోని అన్నీ భాషల సాహిత్య వినీలాకాశంలో సమాజంలో నైతిక విలువలు నెలకొల్పడానికై నీతి శతకాలు, నీతి పద్యాలు అవతరించాయి. తెలుగు లోని ఆటవెలది దేశీయ ఛందస్సును ప్రయోగించిన శతక కర్త, ప్రజారంజక, లోక కవి విప్లవ కవి, మొదట మానవతావాది, “యోగి వేమన” తెలుగు రాష్ట్రాలకే కాక సమస్త విశ్వ మానవ మనుగడ ఐక్యతకే ఓ తార్కాణం. వేమన చర్చించిన మానవత్వం గూర్చి వాటిలోని సామాజిక తత్వాలు ఓసారి స్మరించి, ఆయన ప్రతిపాదించిన విశ్వమానవ ఐక్యత ద్వారా ఆ సమాజపు వికాసానికి ఎలా దోహద పడ్డారని  ప్రస్తావించడమే ఈ పరిశోధనాత్మక వ్యాస ముఖ్య లక్ష్యం. వేమనలోని ఔన్నత్యాన్ని ప్రప్రథమంగా గుర్తించినవారు పాశ్చాత్య పండితులైన ఎం .ఆర్ .మ్యాక్ డోనాల్డ్, శ్రీ హావర్డ్ క్యాంబెల్, శ్రీ జే . దుబాయ్, శ్రీ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సి.పీ.బ్రౌన్) మొదలగువారు. సి.పీ.బ్రౌన్ గారు ఆంధ్ర దేశపు నలుమూలల నుండి వ్రాత ప్రతులను తెప్పించి వేమన పద్యాలను సేకరించి ఆంగ్లంలోకి అనువదించి ఆంధ్ర సాహిత్య లోకానికి వేమన పద్యాలను పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి. తర్వాత అతన్ని మహా కవిగా గుర్తించిన వ్యక్తీ డా.కట్ట మంచి రామలింగా రెడ్డిగారు. తర్వాత శ్రీ వంగూరి సుబ్బారావు వేమనను శతక కవిగా గుర్తించారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వేమన గురించి ప్రస్తావిస్తూ “వేమన కవిత్వం గాలి వంటిది, అది చూడని చోటులేదు, దొరకని తావులేదు”. ఇదే వేమనను ఎరుక పరిచిన అధ్యయన గ్రంథం కానీ దీనిలో వేమన నారీ ద్వేషి గా చిత్రింపబడ్డాడు . “ప్రజాకవి వేమన” డాక్టర్ ఎన్.గోపి గారి పరిశోధన గ్రంథంలో వేమన 17వ శతాబ్దికి చెందిన వాడని రాయలసీమకు చెందిన వాడని నిర్ధారణ చేసి ఆయన మానవతా వాదాన్ని విశ్వమానవ దృక్పథాన్ని వివరించారు. వేమనపై పరిశోధనా గ్రంథం సమర్పించిన గుర్రం వెంకటరెడ్డి, పోచన రామిరెడ్డి గారు వేమనను, వేమన చింతనను, వేమన పద్యాలను నిశితంగా పరిశీలించి సమగ్రంగా క్రోడీకరించి వ్యాఖ్యానించారు. “రాళ్లపల్లి వారికి, నార్ల ఆరుద్ర కానీ, నూతన గ్రంథకర్త డాక్టర్ గోపీచంద్ గాని అలవి కాని బ్రౌన్ కాలంనాటి 1839లో ని 1164 పద్యాలను తెలుగు ప్రపంచానికి అందించిన ఘనత కీర్తి కీర్తిశేషులు బంగోరె గారికే దక్కుతుంది అని తేల్చి చెప్పారు. నేటి సమాజంలో చొరవ సాహిత్య స్థాయి గల సాహసకవి కి స్థానం లేదు. నాగరికత ఉన్న స్థానం మానవతకు లేదు, నీతికి నిలువ నీడ లేదు. ప్రతిభా సంపన్నులను ఆదరించక, ఆర్థిక, రాజనీతి, అధికార ప్రయోగము ఇవన్నీ సమాజాన్ని పాలిస్తున్నాయి.

“విశ్వదాభిరామ వినురవేమ” గూఢార్థాన్ని వెల్లడిస్తూ “లోకమందు ప్రజలకు ఆదర్శాలను నీతులను మనోహరంగా మనసుకు ఆకట్టుకున్నట్లు బోధించుటకు నిర్ణయించుకున్న ప్రజాకవి వేమన విశ్వ మానవత్వపు ప్రతీక.”

మనుష్యులంతా ఒకటే: వేమన, అశ్వఘోషుని మానవుని జన్మ హక్కుల గ్రంధంలో చెప్పబడ్డ సత్యాలను గ్రహించాడు. ఒకే చెట్టుకు పండిన పండ్లలో ఇది బ్రాహ్మణ ఫలం, ఇది క్షత్రియ ఫలం అని చెప్పడం సాధ్యం కాదు, అదేలా మానవులందరూ ఒకే మహాశక్తికి  జన్మించినవారు. ఇదే సత్యాన్ని లోకానికి చాటిన ఘనత మన వేమన కే దక్కుతుంది. వేమన మాట ఇలా ఉన్నది;

తొలుత బొమ్మ గుడ్డు పరికించి చూడగ
కులము లన్ని గూడ  తోడబుట్టె
అంద రొకట గలయ నన్నదమ్ములె గదా
విశ్వదాభిరామ వినురవేమ.

జాతి భేద మెంచి జన్మముల్ తెలియక
ముక్తి గాన లేరు మూఢ జనులు
జాతి లెంచ నేల  జన్మంబు తెలియుము
విశ్వదాభిరామ వినురవేమ.

ఇక్కడ ముక్తి అంటే మానవ ముక్తి అంటే మానవజాతి అంతా ఒకటే. వేమన సమాజంలో శైవ వైష్ణవ బ్రాహ్మణ వాదం అగ్రకులాలవారి వల్ల ప్రజలు హింసించ బడ్డారు. ఇవిగాక జమీందార్లు, షావుకార్లు నిరుపేదలను ఆర్థికంగా మానసికంగా హింసించారు. దానిపై వేమన కఠినoగా విమర్శించారు. గొడ్డు చాకిరీ చేసే పేదలపై వేమన కరుణ నిండిన హృదయం బాధతో విలపించింది వేశ్య వృత్తి తో నిండిన సమాజం అది. స్త్రీలు విధవలు చెప్పనలవి కాని శోకానికి గురయ్యారు. వాటన్నింటినీ చూసి వేమన కంఠంలో విరక్తి తో బాటు విప్లవం జన్మించింది. ఆనాడు శూద్రులు, స్త్రీలు వేద పాఠానికి అనర్హులన్నారు. దానిని నిరసిస్తూ వేమన ఈ వైరుధ్యాన్ని సాంప్రదాయ రీతిలో ఎత్తిపొడిచాడు.

తల్లి గన్న తల్లి తన తల్లి పిన తల్లి
తండ్రి గన్న తల్లి తాత తల్లి
యెల్ల శూద్రులైరి యేటి బాపడు తాను

‘వేద పాఠేన విప్రాణాం బ్రహ్మజ్ఞానాత్తు బ్రాహ్మణం’ అన్న స్మృతి వాక్యం వేమన దృష్టిలో ఉన్నది. స్త్రీల స్వాతంత్ర సమరంలో శంఖం పూరించిన ప్రథమ వ్యక్తి వేమన మాత్రమే. బ్రాహ్మణ కులంలో స్త్రీ పురుషుల మధ్య భేదం జంగం ధరించినందు మాత్రమే కదా అని వేమన అంటాడు. ఉపనయనం రోజు జంధ్యాన్ని వేయడం జ్ఞానానికి చిహ్నమా? అని అడుగుతున్నాడు వేమన. వేమన జ్ఞాన పిపాసి. ఆనాటి బ్రాహ్మణులు ప్రజలకు తమకు తెలిసిన శాస్త్ర భోధనలు చేయలేదు. అందుకే ఆయన బ్రాహ్మణులను ఇలా ఎత్తిపొడిచాడు.

“జాతి వార లెల్ల జాతి విద్యల నేర్చి
జాణలైరి మిగుల జగతిలోన
బ్రాహ్మణులగు వారు బ్రహ్మంబు నెరుగరు”

ఇక్కడ జాణలు అనగా ప్రవీణులు అన్న అర్థంలో సూచించబడినది. వేమన మానవత్వం, జాతి మత బేధాలు లేని సర్వ సమాన సోదరత్వం. వేమన జ్ఞానం అందరికీ అందించాలనే దీక్ష కలవాడు. సుజ్ఞాన బ్రాహ్మణత్వమే నిజమైన బ్రాహ్మణత్వం. వేమనకు బ్రాహ్మణ ద్వేషం లేదు కానీ అగ్ర కులాల ఆధిపత్యం పోవాలని ఎలుగెత్తి చాటాడు. దానివల్ల కులమత బేధాలు సమాజంలో లేకుండా జనులందరూ అన్నదమ్ములలా మెలగాలని ఆయన చిరకాల వాంఛ. అగ్ర కులాల ఆధిపత్యం పోవాలి అని వేమన అన్నప్పుడు అగ్రకులాలవారు ఆగ్రహించినప్పటికీ, సామాన్య ప్రజలు ఆయన పద్యాలను వేద సూక్తులుగా గౌరవించారు. వేమన పద్యాలలో  ఆనాటి రాజకుటుంబాల వ్యవస్థలు, సంప్రదాయాల పేరిట ప్రజల మనసులను పీడించిన బ్రాహ్మణ వాదాలు , ఆనాటి సామాజిక, సాంఘిక, కుటుంబ వ్యవస్థలు అద్దం పట్టినట్లు కనిపిస్తుంది. వేదం వల్లించే బ్రాహ్మణులు చేసే కార్యాలు వేద పఠనము, దేవతార్చన, వేద మంత్రాల అర్థం అనేక మంది బ్రాహ్మణులకు తెలీదు. దక్షిణ తీసుకుని ప్రజలను కొల్లగొట్టే బ్రాహ్మణుల మీద ఆయన ద్వేషం పెంచుకున్నారు. దేవతార్చన మంత్రాలు చదివి ప్రజల ముందు తమను దేవతలుగా భావించి నటించే పండితులు, వెర్రి వెంగళప్పలుగా  ప్రజలను అనుకుంటున్నారు అని ఆయన అంటున్నారు. ఆయన దృష్టిలో బ్రాహ్మణుడంటే తన విద్యను పదిమందికి పంచి పెట్టి అందరికీ చదువులు మంచి చెడ్డలు నేర్పించే నిస్వార్థ పరుడుగా వుండాలి. సమాజంలో అందరూ అన్నీ సుఖధుఖాలను సమానంగా పంచుకుంటూ సర్వ సమాన సమాజాలను సృష్టించాలని వేమన కోరిక.

బ్రాహ్మణులకు సకల భాగ్యంబు లీయవచ్చు
గౌరవింప వచ్చు  కలయ వచ్చు
జ్ఞాన మొసగి జనుల కడతేర్చు నటులైన

అంధ విశ్వాసం లో ఒకటి -పెండ్లికి ముహూర్తాలు పెట్టడం అనే పేరుతో, జాతకాల పేర్లతో ప్రజలను హింసించడం, ఏమార్చడం. శ్రాద్ధ కర్మ, ముహూర్తాల పేరిట ఏమార్చే మూఢ నమ్మకాలను తుద ముట్టిస్తూ వేమన;

“పిండముల్ చేర్చి పితృ ల తల పోసి
కాకులకు పెట్టు గాడిదలారా
పియ్యి తినేది కాకి పితృ లెట్టాయే?
విప్రులెల్ల చేరి వెర్రి కూతలు కూసి
సతిపతుల కూర్చి సమ్మతంబుగా
మును ముహూర్తమున ముండెట్లు మోసేను?

ఆ కాలంలో కరణాలకు కాపులకు ఐక్యతతో వుంటే క్షేమం లేకుంటే ఇద్దరికీ నష్టమే. అందుకే వేమన అంటున్నాడు;

‘కాపు లేని యూరు కరణమ్మునకు  కీడు
కరణము పగ చేత కాపు కీడు
కాపులు కరణాలు కావడి కుండలు’ అని.

ప్రజలను పీడించే నియోగి బ్రాహ్మణుల ను విమర్శిస్తూ;

‘వేము కంటే విషము వెలనాటి కరణాలు
పాము కంటే విషము ప్రథమ శాఖ
అంతకంటే విషము ఆరువేల నియోగులు’ అని అన్నారు.

సామాన్య ప్రజలకు ఆయన ఇచ్చిన సందేశం;

విశ్వము నడుపంగ విశ్వేశ్వరుoడుoడ
బ్రాహ్మణులకు నేల పట్టుదలలు
వనము లోని కోతి వసుమతి నడుపునా?

ఏ ఒక్క కులం తోను ఈ ప్రపంచం నడుస్తుందనే వాదనలను వేమన  పటాపంచలు చేశాడు. ఆయన దృష్టిలో సర్వ మానవులు సమానులు. విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని వేమన తన సిద్ధాంతాలకు మూలంగా తీసుకున్నాడు

రామ నామ పఠనచే మహి వాల్మీకి
పరగ బోయడయ్యు బాపడయ్యే
గుణంబు ఘనము కానీ కులంబు కాదు ||విశ్వ||

కరక కాయలు తిని కాషాయ వస్త్రముల్
బోడినెత్తి కల్గి బొరయు చుండు
తలలు బోడులైన తలపులు బోడులా ... అని దొంగ సాధువులను వేమన ప్రశ్నించాడు.

అతని దృష్టిలో సర్వ మానవులు సమానులు. దేవుడొక్కడే  ప్రభువు. ఆ  కాలం నాటి రాజ కుటుంబాలకు, సంప్రదాయ బ్రాహ్మణ వాదులకు ఆనాటి సామాజిక వ్యవస్థలకు వేమన విసిరిన సవాళ్ళకు ఈ నాటికీ  జవాబు దొరకలేదు. రాజ కుటుంబాల్లోజరిగే కలహాలు, కుట్రలను అన్నింటిని తన రచనల్లో చూపించిన వేమన సంఘజీవి.

ఎరుకలేని దొరల నెన్నాళ్ళు గొలిచిన
బ్రతుకు లేదు  వట్టి  భ్రాంతి  గాని
గొడ్డుటావు పాలు గోకితే చేపునా

తెలుగు సాహిత్యంలో రాచరిక వ్యవస్థ పోవాలని సవాలు చేసిన తొలి కవనం వేమనదే.

భూమి నాది యన్నపుడమి ఫక్కున నవ్వు
దానహీనుని చూచి ధనము నవ్వు
కదన భీతు జూచి కాలుండు నవ్వురా.

ఆనాటి పిరికిపందలు లోభిగా వున్న వాళ్లకు వినాశనం తప్పదని, వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోతారని ముందే జ్యోతిష్యం చెప్పిన కవి వేమన. వేమన గ్రామీణ భాషలో విప్లవం అనే శబ్దానికి ఉప్పలం అనే వికృతి శబ్దాన్ని ప్రయోగించాడు. వేమన ఆశించిన సమాజం, జాతి కుల మత భాషా విభేదాలు లేని, ఆడ మగ బేధాలు లేని సర్వమానవ సమానత్వంగల ఆదర్శ సమాజం. మానవులందరూ సమానులు అనే వేమనకు  బ్రాహ్మణులను, భూసురులననడము, మాల మాదిగలను అస్పృశ్యులనడము బొత్తిగా నచ్చదు. ఆయన దృష్టిలో అందరూ సమానులే ఆ భగవంతుడు ఒక్కడే అందరికి ప్రభువు, స్వామి. కష్ట జీవితంలో ఎప్పుడూ సుఖం ఉంటుంది. కష్టం చేస్తేనే కాని మనిషి  ముందుకు సాగడు అనే  సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తి తన పూర్వీకులైన తెలుగు కవులందరికంటే వేమన దూరదృష్టిగల విప్లవ కవి.

“అన్యాయ కాలము దాపురించినప్పుడు అందరూ మేల్కోవాలి” అని “మాన్యాలు, భోగాలు మనుషులందరికీ లభించేందుకై మార్గాలు వెతకాల”ని సామాజిక ఐక్యతను సూచించిన వ్యక్తి వేమన.

మాలవాని నేల మహిమీద నిందింప
నొడల రక్తం మాంసం మొకటి గాదె?
వానిలోన మెలగువాని కులంబేది?... అని ప్రశ్నించిన మహోన్నత మానవతావాది వేమన.

చిలుక గర్భమందు శ్రీ శుకుండుదయించి ......అన్న పద్యములో ఇదే సత్యాన్ని చూపించాడు వేమన.

మిగతా కవులందరూ నారీ ద్వేషిగా వేమనను పరిగణిస్తే ‘విశ్వకవి వేమన’ రచనలో గుర్రం వెంకటరెడ్డి పోచన్న వేమా రెడ్డి గార్లు, వేమనను స్త్రీజనోద్ధరణ నాయకునిగా వక్కాణించారు. అందుకై వేమన పద్యాలను  ఉదహరిస్తూ ఎన్నో సిద్ధాంతాలను స్త్రీ జనోద్దరణ కు వేమన ప్రయోగించాడు అని తేల్చి చెప్పారు.

Bibliography:

Primary works

Telugu Books:

  1. Andhra Vagnmaya Charitra _Dr.Divakarla Venkawadhani-Andhra Sahitya parishad Hyderabad-1979
  2. Vemana padyalu(Telugu) –Bangore T.T.D.Publication Tirupathi.-1978
  3. Mana Vemana -Arudra –Vemana foundations-Hyderabad 2nd & 3rd edition-2006,2010(first edition by sri venkateshwara universityTirupathi-1985)
  4. Vemana Bodha –G.V.subrahmanyam –Spoorthi Publishing house –Guntur-Dec2013
  5. Praja kavi Vemana –Dr. N.Gopi ,Vishalaandhra Publishing House,Hyderabad(April 2000,2005,2012)
  6. Telugu Sahityam lo Vemana-Veera Brahmam-oka sambhashana-G.KalyanRao-Praja Shakti book House,vijayawada2017
  7. Vemana-Ralla palli Ananta Krishna Sharma- Vemana foundations-Hyderabad-10th edition-2010.
  8. Vishwa kavi Vemana Gurram Venkata Reddy,Pochana Rami Reddy- Vemana foundations-Hyderabad-7th edition(2010)
  9. Loka kavi Vemana –Kaa Prapoorna Maruvooru Kodanda Rami Reddy Vemana foundations-Hyderabad-4th edition(2009)

 

10.Kabiru Vemana Tulnatmaka Adhyaanamu Dr.Y.V.S.S.N.Murthy

Sandhya publicationMadras -1994.with the financial assistance of T.T.D Tirupathi.

Tamil:

  1. A comparative study of Tiruvalluvar-kabirdas-Yogi Vemana by
  2. Dr. N.Lakshmi AiyarManivachakar publications,Chennai.

English Books:

  1. Vemana-V.R. Narla- Vemana Foundations, Hyderabad reprinted- 2006 (prime publisher-sahitya academy Delhi 1969,1997.
  2. 5. Vemana through western eyes – Edited by V.R. Narla Vemana Foundations, Hyderabad reprinted-2006 (prime publisher-Sahitya academy Delhi 1969.

Reference Books:

  1. FACTS OF Indian Literature—K.M.George.
  2. Glimpses of Indian Culture-Manmohanopaadyay, Dr.Dyanesh Narayan. Chakravarthy.
  3. Ethics, Erotics and Aesthetics – Ed Prafulla, K. Mishra:

****సశేషం****

Posted in January 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!