Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --

ముందుమాట: సంస్కృతాంధ్ర సాహిత్య పిపాసి, నిత్య సాధనా పారంగతుడు, మాతృభాషాభిమానం మెండుగా కలిగి సాహిత్య సేవకై తపించేవాడు, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన ఘనుడు, అమ్మవారి అనుగ్రహ పాత్రుడై బహుభాషా కోవిదుడుగా ప్రభవించి నేటికి వేలపద్యాలను చక్కటి వ్యాకరణ శుద్ధితో రచించి ఎంతోమంది తెలుగు భాషాకోవిదుల మన్ననలను పొందిన శ్రీ అయ్యగారి సూర్యనారాయణమూర్తి గారి విరచితమైన పద్యాల గ్రంథాలయం నుండి వారి అనుమతితో కొన్ని ఆణిముత్యాలను సేకరించి మరల మన సిరిమల్లె పాఠకుల కొఱకు ఇక్కడ పొందుపరుస్తున్నందుకు ఎంతో ఆనందముగా ఉన్నది. శ్రీ అయ్యగారి సూర్యనారాయణమూర్తి గారి ప్రతి పద్యమూ ఒక అద్భుతమే. ఆయన దేవీకటాక్ష వరసిద్ధుడు. అందులో నుండి కొన్నింటిని మాత్రమే ఇక్కడ అందిస్తున్నాము. ఈ నవంబర్ నెల సంచిక పద్యాలను చదివి ఆనందించండి.

సరస్వతీదేవి

మత్తకోకిల

పల్లవాధరమంజులస్మితభాసురానన! పద్మభూ
వల్లభా! కరజామృతాంశువిభావిరాజితవల్లకీ
తల్లజక్వణరాగరంజితధాతృమానసవాసినీ!(1)
తల్లివై పలికింపరావె సదా సువర్ణకవిత్వమున్ (2).............................................................................21
.........(1) చేతిగోళ్ళు అనే చంద్రవంకల కాంతితో విరాజిల్లే శ్రేష్ఠమైన
.............,,వీణాతంత్రులు పుట్టించే ధ్వనిరాగాలచే రంజింపబడిన
...............బ్రహ్మదేవుని మనస్సులో నివసించేది
........(2) మంచి అక్షరాలతో నిండిన కవిత్వము
చం.
కులుకుచు నిక్కుచున్ జిలుక కోమలమౌ మణిబంధవాసియై(1)
పలుకులతల్లిహస్తమున భాసిలు దృశ్యము నేఁడు కాంచితిన్
కలికికిఁ జిల్క తోడగుచుఁ గమ్మని గీతము లాలపించుటన్
సలలితరాగమాధురికిఁ జక్కనిమేళన(2) మయ్యెనో యనన్...................................................................22
.............(1) మణికట్టుపై వసించునది (2) రాగస్వరతాళముల కలయిక
కం.
చిలుకకె పలుకులు నేర్పిన
పలుకులచెలిహస్తవాసి(1) పలికెడి వేళన్
తొలకరి చినుకులఁ బులకలు
కలిగిన యిల వలెను మదినిఁ గలిగెడుఁ గులుకుల్.............................................................................23
(1) చేతిలో వసించునది
ఉ.
నీపదతాండవంబునకు నిత్యము నోఁచిన నాకవిత్వమే
ఈ పదనీరజార్చనకు(1) నిచ్చును బ్రాణముఁ; దెల్లవాఱఁగా
ద్రాపమణిద్యుతుల్(2) కితకితల్ గలిగింపఁగఁ బద్యపద్మముల్
చూపుల తూపులన్ విసరు సుందరమై వికసించి భారతీ!......................................................................24
.............(1) మాటలు అనే కమలములతో పూజకు
.............(2) ఆకాశమణి అయిన సూర్యుని కాంతులు

లక్ష్మీదేవి

రవికాంతము

వరలక్ష్మీస్ఫుటపావనదర్శనభాగ్యము గల్గెఁ బ్రభాతమునన్
అరవిందాసన దిగ్గజసేవిత హారసుశోభితకంఠియునై
అరవిందానన యష్టవిభూతికరాభయహస్తవిరాజితయై
సురబృందావన విష్ణుమనోహరి చూడ్కుల ధన్యము సేసెఁ గదా...................................................................25
కం.
కలుములచెలి తలఁచిన యెడ
కలుముల కిలఁ గలదె కఱవు? గలగల మనుచున్
జలజనిలయ తిరిగెడు నెడ
చెలిమియుఁ గలిమియును బలిమి చెలువుగ వెలయున్...........................................................................26

త్రిప్రాసచంపకమాల

కరములు సాఁచి పిల్చినను గాంచి కరంబు ముదంబు నొంది తా
కరములు సాఁచి పిల్చి ననుఁ గాచెడి తల్లికి వేనవేలుగా
కరములు మోడ్చి మ్రొక్కె దను గాంచనరత్నవినూత్నభూషణా
కరముల దీధితిన్(1) హృదయగహ్వర మెల్లను దేజరిల్లఁగన్......................................................................27
.............(1) కాంతితో

రవికాంతము

వరలక్ష్మీకరకంకణనిస్వనభాగ్యము నొందిన శ్రోత్రములున్
హరివక్షస్స్థితకనదానన్యశుభాకరవిగ్రహఁ గాంచు కనుల్
సురరాజస్తుతహేమకలాపసుశోభితసుందరధామ రమన్
నిరతంబున్ భజియించు మనంబుఁ బునీతములై తరియించుఁ గదా..........................................................28
కం.
రక్షణలక్షణవీక్షణ!
పక్షిగమా!(1) లోకకుక్షి! వల్లభవిష్ణో
రీక్షణలక్ష్య! కటాక్షని
రీక్షణ యీక్షణమె తొలఁగ నీక్షింపు మమున్..........................................................................................29
.............(1) లక్ష్మీదేవి వాహనము గుడ్లగూబ
మ.కో.
చేతు లెత్తి నమస్కరించెదఁ జిన్మయాకృతితోడ నా
చేత మందున నిల్చి మోమునఁ జిన్ని నవ్వులు చిందుచున్జ్ఞాతవై ద్యుతిజాతవై(1) వనజాతజాతగ(2) మాతవై
శాతకుంభపునీతరూపిణి!(3) సర్వభాగ్యద! యేలుమా!...............................................................................30
.............(1) కాంతి పుంజము (2) పద్మములో పుట్టిన లక్ష్మి
.............(3) పవిత్రమైన బంగారురంగు రూపము కలది
Posted in January 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!