Menu Close
రంగ-వల్లి (కథ)
-- G.S.S. కళ్యాణి --

శ్రీరంగకి పదిహేనేళ్ళు. ఉద్యోగరీత్యా అతడి తల్లిదండ్రులు వేరువేరు ఊళ్ళల్లో ఉంటున్నారు. అయితే వారు శ్రీరంగ చదువంతా ఒకేచోట కొనసాగాలన్న ఉద్దేశంతో, తమ దూరపు బంధువుల ఇంట్లో ఒక గది అద్దెకు తీసుకుని, శ్రీరంగని అక్కడ ఉంచి చదివిస్తున్నారు. ఏవో వ్యక్తిగత కారణాలవల్ల శ్రీరంగ బంధువులు శ్రీరంగతో అంటీముట్టనట్టుగా ఉంటూ ఉండేవారు. అందువల్ల శ్రీరంగ తరచుగా ఒంటరితనంతో బాధపడుతూ ఉండేవాడు. ఎప్పుడైనా శ్రీరంగ మనసువిప్పి మాట్లాడాలని తన తల్లి సుజాతకి ఫోన్ చేస్తే, సుజాత కొద్దినిమిషాలు మాత్రమే మాట్లాడి ఆ తర్వాత తనకు వేరే ముఖ్యమైన పనులున్నాయంటూ ఫోన్ పెట్టేసేది. తన భావాలను పంచుకునేవాళ్ళు లేక తీవ్రమైన నిరాశకు లోనయ్యేవాడు శ్రీరంగ. క్రమేపీ అది అతడి పసిమనసు పై ప్రభావం చూపించి, కుంగుబాటు లక్షణాలకు దారితీసింది!

ఒకరోజు పుస్తకాల సంచీని భుజాన వేసుకుని కాళ్ళీడ్చుకుంటూ కాలేజీకి వెడుతున్న శ్రీరంగ దృష్టిని ఒక ఇంటి గుమ్మం ముందు తీర్చిదిద్దబడి ఉన్న ఒక ముగ్గు ఆకర్షించింది.

'అబ్బ! ఈ ముగ్గు ఎంత అందంగా ఉందో!!', అని అనుకుంటూ ఆ ముగ్గు వంక పరిశీలనగా చూశాడు శ్రీరంగ. ఆశ్చర్యం! ఆ ముగ్గులో శ్రీరంగకు ముత్యాలవంటి తెలుగు అక్షరాలు కనపడ్డాయి. ఆ అక్షరాలన్నీ కలిపి చదివితే, 'నిరాశను వీడు! ధైర్యంగా ముందుకు సాగు! విజయం నీదే!!' అని రాసి ఉంది! ఆ వాక్యం చదివిన మరుక్షణం శ్రీరంగలో ఏదో శక్తి ప్రవేశించినట్లయ్యింది. అంతవరకూ దిగులుగా ఉన్న అతడి ముఖం పై చిరునవ్వొకటి విరబూసింది. నూతనోత్సాహంతో హుషారుగా కాలేజీకి వెళ్ళిపోయాడు శ్రీరంగ. ఆ మర్నాడు కూడా కాలేజీకి వెడుతూ అదే ఇంటి ముందున్న ముగ్గును చూశాడు శ్రీరంగ. ఆ రోజు మరొక స్ఫూర్తిదాయకమైన వాక్యం ముగ్గులో రాసి ఉంది. ఆ వాక్యం శ్రీరంగకి కావలసినంత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. మానసికంగా అతడు పడుతున్న వ్యధనుండీ కోలుకోవడానికి ఆ వాక్యంలోని సందేశం శ్రీరంగకి ఎంతగానో ఉపయోగపడింది. ఇక ప్రతిరోజూ కాలేజీకి వెళ్లే ముందు ఆ ఇంటి ముందు ఆగి ముగ్గులో రాసున్న వాక్యాన్ని చదివి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు శ్రీరంగ. అనుకున్న విధంగానే శ్రీరంగ ఆ ముగ్గులోని వాక్యాలు రోజూ చదవడం మొదలుపెట్టాడు. అవి అతడిలో అంతులేని విశ్వాసాన్ని నింపేవి. ఆ ప్రభావం శ్రీరంగ చదువులో కూడా కనపడింది. మంచి మార్కులు సాధిస్తూ ఎప్పుడూ తమ యూనివర్సిటీ టాపర్స్ లో ఒకడిగా ఉండేవాడు శ్రీరంగ. అయితే శ్రీరంగకు అర్ధంకాని విషయం ఏమిటంటే, తను ఎంత కష్టపడి చదివినా తమ యూనివర్సిటీలో అతడు ఎప్పుడూ రెండో స్థానంలోనే ఉండేవాడు. మొదటి స్థానం ఎప్పుడూ 'అమృతవల్లి' అనే అమ్మాయిదే!

'ఈ అమ్మాయి ఎవరో! ఆ అమ్మాయికన్నా నేను ఎప్పటికీ ఒక్క మార్కు కూడా ఎక్కువ సాధించలేనా??', అన్న ప్రశ్న శ్రీరంగకు తరచుగా కలుగుతూ ఉండేది. తన ప్రగతికి కారణమైన ముగ్గును చూసినప్పుడల్లా ఆ ఇంట్లోని వాళ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలని అనుకునేవాడు శ్రీరంగ. కానీ ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ మూసి ఉండటంవల్ల ఆ ఇంట్లోవారిని పలకరించడం శ్రీరంగకి సాధ్యపడలేదు. కొన్నేళ్లు గడిచాయి. శ్రీరంగ కాలేజీ చదువు పూర్తయ్యి ఉద్యోగాల కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఒక ప్రముఖ సంస్థవాళ్ళు శ్రీరంగను ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి వెడుతూ దారిలో శ్రీరంగ ముగ్గువంక చూశాడు.

'ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకెయ్! గమ్యాన్ని సాధించు!! విజయోస్తు!!', అని ఉంది. ఇంటర్వ్యూలో శ్రీరంగ సెలెక్ట్ అయ్యాడు! కళ్ళు చెదిరే జీతంతో అందరూ కలలుగనే ఉద్యోగాన్ని సాధించాడు శ్రీరంగ. పట్టరాని సంతోషంతో మిఠాయి తీసుకుని, తన విజయానికి కావలసిన ధైర్యాన్ని ఇచ్చిన ముగ్గున్న ఇంటి ముందు నిలబడి ఆ ఇంటి తలుపు తట్టాడు శ్రీరంగ. ఒక మూడు నిమిషాలు వేచి చూసిన తర్వాత అరవయ్యేళ్ళ వయసున్న మాణిక్యాంబ మెల్లిగా తలుపు తెరిచింది.

శ్రీరంగ మరేమీ ఆలోచించకుండా మాణిక్యాంబ కాళ్లకు నమస్కరించి, మిఠాయి పొట్లం ఆమె చేతిలో పెట్టి, "మీరు ప్రతిరోజూ ముగ్గు ద్వారా నాకిచ్చిన సందేశం ఈ రోజు నేను నా లక్ష్యాన్ని సాధించేలా చేసింది! మీకేమిచ్చినా నా ఋణం తీరదు. దయచేసి నా ఈ చిన్న కానుకను తీసుకోండి!", అన్నాడు.

శ్రీరంగ చెప్తున్న విషయం మాణిక్యాంబకి చిటికెలో బోధపడింది. ఆమె శ్రీరంగవంక చూస్తూ చిన్నగా నవ్వి, "సంతోషం నాయనా! కానీ ఆ ముగ్గులు వేసినది నేను కాదు. మా అమ్మాయి!", అంది.

"మరి నేను మీ అమ్మాయితో ఒకసారి మాట్లాడొచ్చా?", కాస్త మొహమాటంగా అడిగాడు శ్రీరంగ.

మాణిక్యాంబ ఒక్క క్షణం ఆలోచించి, “సరే నాయనా! లోపలికి రా!!", అని శ్రీరంగను తమ ఇంట్లోకి తీసుకెళ్లి ముందుగదిలోని సోఫాలో కూర్చోపెట్టింది.

కొద్దిసేపటి తర్వాత, మాణిక్యాంబ చక్రాల కుర్చీలో కూర్చున్న ఒక యువతిని తీసుకొచ్చి,"ఇదిగో బాబూ! మా అమ్మాయి అమృతవల్లి!", అంది.

"అమృతవల్లా?? మీరూ..?! ఏ కాలేజ్ ??", అమృతవల్లిని ఆశ్చర్యంగా అడిగాడు శ్రీరంగ.

"బీ.ఎస్.ఆర్.కాలేజీ", చిరునవ్వుతో చెప్పింది అమృతవల్లి.

"అరె! అయితే నేను ఊహించినది నిజమేననుకుంటా! మన యూనివర్సిటీ టాపర్ అమృతవల్లి మీరేనా??", ఆత్రంగా అడిగాడు శ్రీరంగ.

"అవును నేనే!", చెప్పింది అమృతవల్లి. ఆశ్చర్యపోయాడు శ్రీరంగ.

అమృతవల్లి అందం విషయంలో శ్రీరంగ అంచనా ఏమాత్రమూ తప్పలేదు. కానీ, అమృతవల్లి చక్రాల కుర్చీలో ఉంటుందని శ్రీరంగ ఊహించలేదు.

"ప్రతిరోజూ ఇంటి బయట ముగ్గులు వేసేది మీ అమ్మగారని అనుకున్నాను. అవి వేసినది మీరని ఆవిడ ఇప్పుడే చెప్పారు!", అన్నాడు శ్రీరంగ.

"అవునండీ. ఆ ముగ్గులు నేనే వేస్తూ ఉంటాను!", అంటూ తన కాళ్ళవంక చూసుకుంటూ, దుఃఖం ఆపుకోలేక ముఖాన్ని తన రెండు చేతులతో కప్పేసుకుంది అమృతవల్లి.

అప్పుడు మాణిక్యాంబ,"బాబూ! మా వల్లికి చిన్నప్పుడు విపరీతమైన జ్వరం వచ్చింది. జ్వరం తగ్గడానికి వాడిన మందులవల్ల రెండు కాళ్ళూ చచ్చుబడిపోయాయి! అప్పటివరకూ అందరు పిల్లలతో హాయిగా తిరుగుతూ, పరిగెడుతూ ఆడిన పిల్ల చక్రాల కుర్చీకి అంకితమైపోవాల్సివచ్చింది! ఇలా జరిగేసరికి తట్టుకోలేక బాగా కుంగిపోయింది వల్లి. అప్పుడు మేము నమ్ముకున్న భగవంతుడు మా గురువు రూపంలో వచ్చి, ప్రతిరోజూ ఒక స్ఫూర్తిదాయకమైన వాక్యాన్ని స్మరిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోమని వల్లికి చెప్పారు. అంతే! ఆ రోజునుండీ ప్రతిరోజూ పొద్దున్న లేచినప్పటినుంచీ రాత్రి పడుకునేదాకా మనోధైర్యాన్ని కలిగించే ఒక వాక్యాన్ని ఎంచుకుని దాన్ని స్మరించుకుంటూ ఉండటం అలవాటు చేసుకుంది మా వల్లి. అలా చెయ్యడం వల్లి జీవితంలో ఎంతో మార్పును తీసుకొచ్చింది. తనపై తనకున్న నమ్మకాన్ని కూడా పెంచింది. ప్రతిరోజూ వల్లి మా ఇంటి బయట వేసే ముగ్గులో తను మననం చేసుకునే వాక్యాన్ని అందంగా రాయడం మొదలుపెట్టింది. అలా చేస్తే తనలాగా మానసికంగా కుంగిపోతున్నవారికి ప్రోత్సాహం ఇచ్చినట్లు ఉంటుందని అనుకుంది వల్లి. తను అనుకున్నట్లే నీ విషయంలో జరిగింది నాయనా! చాలా సంతోషం!!", అంది.

అందుకు శ్రీరంగ, "అమృతవల్లిగారు! మీరు చేసిన మంచి పని నాకు ఎంతటి ప్రోత్సాహాన్ని ఇచ్చిందో నేను మాటల్లో చెప్పలేను. మీలాంటి మంచివాళ్లకు ఆ భగవంతుడు తప్పకుండా మేలు చేస్తాడు! నాకు ఈరోజు నేను కలలుకన్న ఉద్యోగం వచ్చిందంటే అందుకు మీరు నాలో నింపిన ధైర్యమే కారణం!", అన్నాడు.

అమృతవల్లి కళ్ళు తుడుచుకుని "కంగ్రాట్స్ అండీ!", అంది శ్రీరంగతో.

శ్రీరంగ కాసేపు అమృతవల్లితోనూ, మాణిక్యాంబతోనూ కబుర్లు చెప్పి వెళ్ళిపోయాడు. ఒక వారం రోజులు గడిచాక మళ్ళీ మాణిక్యాంబ దగ్గరకు వచ్చాడు శ్రీరంగ.

"ఏమిటి బాబూ విశేషం?", అడిగింది మాణిక్యాంబ.

"ఆంటీ! మీరూ, అమృతవల్లీ ఒప్పుకుంటే నేను అమృతవల్లిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అమృతవల్లిని నేను జీవితాంతం కంటికి రెప్పలా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు సరేనంటే మా పెద్దవాళ్లకు విషయం చెప్తాను. వాళ్ళు నా మాట ఎన్నడూ కాదనరు!", అన్నాడు శ్రీరంగ.

ఆ మాట విన్న మాణిక్యాంబ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. అమృతవల్లికి కన్నీరు ఆగలేదు. వాళ్ళ అంగీకారం పొందిన శ్రీరంగ తన పెద్దవాళ్ళకు వివరాలన్నీ చెప్పి అమృతవల్లిని పెళ్లి చేసుకున్నాడు.

"బాబూ రంగా! మా వల్లిని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని ఆనందమయం చేశావు! నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకు అర్ధం కావట్లేదు!", అంది మాణిక్యాంబ.

అందుకు శ్రీరంగ, "నా భావాలను పంచుకునేందుకు ఎవరూలేక ఒంటరితనంతో పోరాడుతూ నాలోనేను కుమిలిపోతున్నప్పుడు, ముగ్గులోని చక్కటి వాక్యాలతో నాలో ఉత్తేజాన్ని నింపి నాకు ఆత్మస్థైర్యాన్ని కలిగించింది వల్లి. తను చేసిన మంచిపనివల్ల జీవితంలో సంతోషం, ఉత్సాహం, విజయం వంటివి ఎలా ఉంటాయో నేను కూడా అనుభవించగలిగాను. కాబట్టి నేనే వల్లికి కృతజ్ఞతలు చెప్పాలి అత్తయ్యగారూ! ఇకపై వల్లికి ఏ లోటూ రాకుండా చూసుకుంటే తనపట్ల నా ఋణం కొంతైనా తీరినట్లే!", అన్నాడు నవ్వుతూ.

"ఏదైతేనేం నాయనా! ఆ రంగవల్లి ఈ రంగనూ మా వల్లినీ కలిపింది! మీరు నూరేళ్లపాటూ సుఖసంతోషాలతో, ప్రేమానురాగాలతో వర్ధిల్లండి!!", అంటూ మధుపర్కాలలో ఉన్న అమృతవల్లినీ శ్రీరంగనూ మనస్ఫూర్తిగా దీవించింది మాణిక్యాంబ.

********

Posted in January 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!