Menu Close
అత్తలూరి విజయలక్ష్మి
దూరం (ధారావాహిక)
అత్తలూరి విజయలక్ష్మి

మరునాడు స్మరణ, బదరీ వారి, వారి లాప్ టాప్ లు ఓపెన్ చేసి లాగిన్ అయ్యారు. స్మరణకి బెంగళూరు మెయిన్ ఆఫీస్ నుంచి మెసేజ్ కనిపించండంతో అలర్ట్ అయింది... మీనన్ నుంచి ఇంగ్లీష్ లో వచ్చిన సందేశం....

This is to inform you that as per the discussions made with our Manager Mr. ….. on …. It is decided that Two employees are to be posted to Main Office with a hike in pay… ఆమె కళ్ళు అక్షరాల వెంట పరుగులు పెట్టాయి... మెయిన్ ఆఫీస్ కి బదిలీ చేయబడే వాళ్ళల్లో తన పేరు, సౌరభ్ పేరు ఉంది..

“నాకు బెంగుళూరు ట్రాన్స్ఫర్” అంది గట్టిగా..

అక్కడ కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్న దీపక్, పూజగదిలో ఉన్న ఆంజనేయులు, వంట గదిలో ఉన్న సంధ్య, ఆమె పక్కనే కూర్చుని ఆఫీస్ పనిలో లీనం అయిన బదరీ అందరూ ఒకేసారి ఉలిక్కిపడ్డారు.

బదరీ పని ఆపేసి “నీకు ట్రాన్స్ఫరా... ఎలా... వన్ ఇయర్ కూడా కాలేదు కదా జాయిన్ అయి..” అన్నాడు.

స్మరణ కుర్చీలో వెనక్కి వాలి “నాకు, మీనన్ ఇద్దరికీ” అంది..

దీపక్ పేపర్ పక్కన పెట్టి “ఎందుకు?” అన్నాడు..

“తెలియదు...అక్కడికి వెళితే కానీ డీటెయిల్స్ తెలియవు.. హెడ్ ఆఫీస్ నుంచి ఇద్దరు ఎంప్లాయిస్ ని depute చేయమని ఆర్డర్ వచ్చింది... నన్ను, మీనన్ ని సెలెక్ట్ చేసారు అంటే బహుశా మా ప్రాజెక్ట్ ప్రెజంటేషన్ బాగా నచ్చి ఉండచ్చు.. నేను ప్రాజెక్ట్ లీడ్ కదా! బహుశా అందుకే వెంటనే రమ్మని మీనన్ సేపెరేట్ మెసేజ్ పెట్టాడు.. వెళ్ళిపోదాం డాడీ...”  అంది లాప్ టాప్ టేబుల్ మీద పెట్టి లేస్తూ..

“అయ్యో... మధ్యాహ్నం పాపికొండలు వెళ్దాం అని ప్లాన్ చేసారా..” అన్నాడు దీపక్.

“ఇట్స్ ఓకే అంకుల్... ఇంకోసారి వెళ్దాం” అన్నాడు బదరీ.

సంధ్య అక్కడికి వచ్చి “బెంగుళూరు ట్రాన్స్ఫర్ ఏంటే ... అక్కడ ఎక్కడ ఉంటావు... ఒక్కదానివే వెళతావా” అంది.

స్మరణ విసుగ్గా చూసింది తల్లివైపు “ఫ్యామిలీ తో వెళ్ళడానికి పిక్నిక్ కాదమ్మా” అంది.

దీపక్ నవ్వి “ఇప్పుడే నువ్వు నస మొదలుపెట్టకు సంధ్యా.. ముందు హైదరాబాద్ వెళదాం.. స్మరణ ఆఫీస్ కి వెళితే కానీ ఏమి తెలియదు... ప్రయాణానికి ఏర్పాట్లు చేయి” అన్నాడు.

సంధ్య ముందు ఏం మాట్లాడలేదు. తరవాత మెల్లగా అంది “మావయ్యగారు ఇల్లు అమ్మకానికి పెట్టారు కదా... ఆ వ్యవహారం ఫైనల్ అవకుండా వస్తారో, లేదో తెలియదు..”

“అలాగని నువ్వు ఎన్ని రోజులు లీవ్ పెడతావు.. నేనెన్ని రోజులు పెట్టను! వీళ్ళ లాగా మనకి వర్క్ ఫ్రొం హోమ్ ఆప్షన్ లేదుగా.. ఒక్కరోజు, రెండు రోజులు అంటే  పర్వాలేదు.. నాన్న వ్యవహారం ఇప్పుడప్పుడే తేలదు.. కనీసం నెల, రెండు నెలలు పడుతుంది.. ఆయన ఉంటారులే సింహాచలం, లక్ష్మి ఉన్నారుగా. పని అయ్యాక ఫోన్ చేస్తారు.. నేను వచ్చి తీసుకుని వస్తాను” అన్నాడు దీపక్.

“తాతయ్య ఇల్లు అమ్మేస్తున్నారా.. ఎందుకు?” విస్మయంగా అడిగింది స్మరణ.

అప్పుడే పూజ ముగించుకుని వచ్చిన ఆంజనేయుల్ని చూసి సంధ్య లోపలికి వెళ్ళిపోయింది. ఆయన దీపక్ వైపు చూసి “నాకిక్కడ పనేమీ లేదురా.. అన్నీ భవబంధాలు తెంచేసుకున్నాను. సుబ్బారావే ఇల్లు కొంటున్నాడు. వాళ్లబ్బాయితో మాట్లాడి ఫైనల్ చేస్తా అన్నాడు.. అప్పుడు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుందాం... నేను మీతో వచ్చేస్తాను” అన్నాడు.

స్మరణ ఆయన దగ్గరగా నడిచి “ఇల్లు ఎందుకు అమ్ముతున్నావు తాతయ్యా!” అని అడిగింది.

ఆయన నవ్వి ఆ పిల్ల తల మీద చేయెసి నిమిరి “ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నా తల్లి..” అన్నాడు.

స్మరణ మనసు చివుక్కుమంది. దీపక్ కొంచెం కోపంగా అన్నాడు.. “ ఏంటి నాన్నా ఆ మాటలు? ఇప్పుడేం జరిగిందని”

“ఇప్పుడు జరగలేదురా .... రేపు జరగదని గ్యారంటీ లేదుగా” అనేసి నిర్లిప్తంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు.

స్మరణ అయోమయంగా చూస్తూ “ఏమైంది డాడీ?” అంది.

“ఏమో! ఆయనకి ఈ మధ్య కొంచెం పిచ్చి ఎక్కువైంది.. ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదు .. సరేలే రెడీ అవండి ఎండ ఎక్కకుండా బయలుదేరదాము.. సాయంత్రానికి చేరిపోవచ్చు” అంటూ న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు.

బదరీ అది వాళ్ళ కుటుంబ విషయం కదా అనుకుంటూ అక్కడినించి లేచి వెళ్ళిపోయాడు.

స్మరణ తాతగారి మనసులో ఏముందో అని ఆలోచిస్తూ సూట్ కేసు సర్దుకోడానికి వెళ్ళిపోయింది.

స్మరణ మీనన్ ఎదురుగా కూర్చుంది. బెంగుళూరు ప్రయాణానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసాడు మీనన్.. వాళ్ళిద్దరూ కలిసి పూర్తి చేసిన ప్రాజెక్ట్ సి ఇ వో ముందు ప్రెజంటేషన్ చేయాలి. ప్రాజెక్ట్ లీడ్ గా ఆమె మేనేజర్ మీనన్ కలిసి వెళ్తున్నారు. మీనన్ తిరిగి వస్తాడు... స్మరణ మాత్రం బెంగుళూరు లో కొంతకాలం పని చేయాలి. ఇది హెడ్ ఆఫీస్ తీసుకున్న నిర్ణయం.

“ఫ్లైట్ ఎన్ని గంటలకి” అడిగింది స్మరణ.

“ఉదయం ఎనిమిదిన్నరకి... వన్ అవర్ ముందు వెళితే చాలు.. మీ ఇంటినుంచి సెవెన్ కి పిక్ అప్ చేసుకుంటాను. మీ లొకేషన్ షేర్ చేయండి.. ప్రెజంటేషన్ ఎలెవన్ .... అంటే పదకొండు గంటలకి.. ఆయన చాలా పంచువల్ అండ్ స్ట్రిక్ట్ ఆఫీసర్ ... ఒక లేడీ కొంచెం ఓవర్ యాక్షన్ చేసిందని ఆమెని తీసేసాడుట..”

“ఓవర్ యాక్షన్ అంటే! ఏం చేసింది?” అడిగింది స్మరణ.

“హి ఈజ్ వెరీ హ్యాండ్సం ... లైన్ వేయడానికి ట్రై చేసిందిట.. డ్రెస్ కోడ్ ఉల్లంఘించి పిచ్చి డ్రెస్ వేసుకుని అతడిని attract చేయడానికి ట్రై చేసిందని వినికిడి. “

“అయితే... ఆమె కాదు.. ఈయనే ఓవర్ యాక్షన్ కాబోలు.. ఏదో కొంచెం attract అయితే ఉద్యోగం పీకేస్తాడా! బోడి అందగాడినని అహంకారం కాబోలు.. ఆ క్రాక్ దగ్గర పని చేయాలా ఖర్మ” మనసులోనే విసుక్కుంది.

“భయపడకు ... అతను చాలా మంచివాడని, డిగ్నిఫైడ్ పర్సన్ అని విన్నాను” ఆమె మనసులో భావాలు గమనించిన వాడిలా నవ్వుతూ అన్నాడు మీనన్.

మధ్యాహ్నం లంచ్ టైం లో దిగులు మొహం వేసుకుని కూర్చున్న బదరీతో అంది “చూస్తుంటే ఆ సి.ఇ.వో క్రాక్ లా ఉన్నాడు బదరీ... నాకు నచ్చకపోతే రిజైన్ చేస్తాను.”

“ఏయ్... కొన్ని రోజులు చూడు.. మంచి పే ఆఫర్ చేసారు... మంచి అవకాశం... బి పేషంట్..” అన్నాడు బదరీ కంగారుగా.

“గాడిదగుడ్డు.. ఇంతకన్నా మంచిదే వస్తుంది.. ఎలాగా బెంగళూరు వెళ్తున్నప్పుడు అక్కడే మంచి కంపనీలో చూసుకుంటా.. నిన్ను కూడా పిలిపిస్తాలే ...”

“థాంక్స్ ... కానీ తొందరపడకు” నవ్వుతూ అన్నాడు.

“ఐ మిస్ యూ బదరీ...” మనస్ఫూర్తిగా అంది.

“ఐ టూ“ అన్నాడు బదరీ ఆమె వైపు అభిమానంగా చూస్తూ..

“నిజం బదరీ మనం కలిసిన క్షణం ఎలాంటిదో కానీ ఇంత ఆత్మీయంగా కలిసిపోతాం అనుకోలేదు.. మా అమ్మకి కూడా నచ్చేసావు విచిత్రంగా” నవ్వింది.

బదరీ కూడా నవ్వి “ఆల్ ద బెస్ట్ స్మరణా!” అన్నాడు చేయి చాస్తూ..

అతని చేతిలో చేయి వేసి “థాంక్ యూ...” అంది.

ఇంటికి వెళ్ళగానే చక, చకా సూట్ కేసు సర్దుకుంది.. కొంచెం ఎగ్జయిటింగ్ గా, మరి కొంచెం టెన్షన్ గా ఉంది. సి ఇ వో దగ్గర ప్రెజంటేషన్ అంటే ఉద్వేగంగా ఉంది. ఆయనకీ నచ్చితే తన జాతకం మారిపోతుంది.. నచ్చక పొతే! ముందు కొంచెం భయం వేసినా “ఆ ఇదొక్కటే కంపెనీ ఉందా..అమెజాన్, గూగుల్, లాంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి.. మనసుకి సర్ది చెప్పుకుని తాతగారి గదిలోకి వెళ్ళింది. ఆయన పడుకుని ఉన్నాడు.. స్మరణ మంచం దగ్గరగా వెళ్లి అంచు మీద కూర్చుని మృదువుగా పిలిచింది “తాతయ్యా”

ఆంజనేయులు కళ్ళు తెరిచాడు.. “నువ్వా తల్లి.” లేవబోతుంటే ఆపుతూ “పడుకో.. లేవకు అంది.

ఆయన నిస్సత్తువగా తిరిగి తలగడ మీదకి జారాడు.

“నీ ఆరోగ్యం ఎలా ఉంది తాతయ్యా.. ఈ మధ్య ఎందుకు బాగా డల్ అయావు.. అస్తమానం పడుకునే కనిపిస్తున్నావు...”

“ఏమిలేదమ్మా వయసు పెరుగుతోంది కదా.. ఓపిక సన్నగిల్లుతోంది అంతే” అన్నాడు.

“నిజమేనా.. ఏదన్నా ప్రాబ్లం ఉంటె చెప్పు తాతయ్యా..”

“నీ నవ్వంత నిజం” ఆ పిల్ల చెక్కిలి నిమిరాడు.

“నేను రేపు ఉదయం ఏడు గంటలకల్లా వెళ్ళిపోతాను.. ఒక నెల దాకా వీకెండ్ కూడా రాలేనేమో.. నన్ను దీవించు తాతయ్యా..” ఆయన పాదాల మీద తల వాల్చింది.

ఆయన గబుక్కున లేచి ఆమెని దగ్గరగా తీసుకుని తలమీద చేయి పెట్టి దీవిస్తూ “అభిష్ట సిద్ధిరస్తు.. ఉద్యోగాభివృద్ధి రస్తు” అన్నాడు.

“రోజూ ఫోన్ చేస్తాను.. సరేనా..”

“అలాగే తల్లి.. జాగర్తగా ఉండు... ఎవరిచేతా మాట పడకు.. ఎత్తి పరిస్థితుల్లోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకు..”

“అలాగే తాతయ్యా.. నువ్వు పడుకో ...నేను బుక్స్ సర్దుకోవాలి.. వస్తాను.. బై గుడ్ నైట్”

అక్కడినుంచి లేచి బయటకు నడిచింది.. ఆమె వెళ్ళిన వైపు చూస్తున్న ఆయన కళ్ళు తడి అయాయి. భగవంతుడు నీ కోరిక తీర్చాలి తల్లి... తీరుస్తాడు.. నీ ప్రేమ ఫలించాలి..” అనుకున్నాడు.

దీపక్ దగ్గర, సంధ్య దగ్గర కూడా అప్పుడే సెలవు తీసుకుంది.. “నీ ప్రాజెక్ట్ ప్రెజంటేషన్ విజయవంతం అవాలని, నీ లక్ష్యం నేరవేరాలి” అని ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందాలని దీవిస్తున్నా అన్నాడు దీపక్ దగ్గరకు తీసుకుని ఆమె తల మీద ముద్దుపెట్టుకుంటూ.

“థాంక్ యూ డాడీ” అంది.

“జాగ్రత్త... ఒక్కదానివే వెళ్తున్నావు.. ఎవరినీ నమ్మకు.. ఏంటో ఈ పాటికి పెళ్లి అయి ఉంటే నాకీ దిగులుండేది కాదు” అంది సంధ్య.

నవ్వింది స్మరణ... “ఈ రోజుల్లో ఆడపిల్లలు వాళ్లకి వాళ్ళే పెద్ద ప్రోటేక్షన్... ఎవరో వచ్చి ఉద్దరించేది ఏమి లేదు.. ఒక జీవితకాలం తోడుండే ఫ్రెండ్ గా తప్ప మా మీద పెత్తనాలు చేసే మొగుళ్ళను మేము ఇష్టపడము. నా పెళ్లి గురించి వర్రీ అవకు..” అంది స్మరణ.

సంధ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.. చెంపల మీద జారిన ఒక కన్నీటి చుక్క తుడుస్తూ, ఆవిడని గట్టిగా కౌగలించుకుని.. “నాకు నా భవిషత్తు మీద క్లారిటీ ఉంది మమ్మీ.. నాకేం కావాలో నాకు తెలుసు..” అభయం ఇస్తున్నట్టుగా అంటున్న స్మరణ పెదాల మీద వేలు అడ్డం పెట్టి.. నుదుటి మీద ముద్దు పెట్టుకుంది.

ఉదయం ఏడు గంటలకి ఇన్నోవా కారులోంచి దిగిన మీనన్ ని తల్లి, తండ్రులకి పరిచయం చేసింది. సంధ్య ఇచ్చిన కాఫీ తాగి ఇద్దరూ బయలుదేరారు.. వాళ్ళ కారు కదులుతుంటే దీపక్ కళ్ళు కూడా చెమర్చాయి.

కారు సగం దూరం వెళ్ళిందాకా దిగులుగానే అనిపించింది స్మరణకి. మొదటిసారిగా తల్లి, తండ్రులను, తాతయ్యను వదిలి ఒంటరిగా ఉండడానికి వెళ్తుంటే దుఃఖం వస్తోంది.. తోబుట్టువులు లేకపోవడంతో స్మరణ తన ప్రేమాభిమానాలను ఆ ముగ్గురి చుట్టూనే అల్లుకుంది.. తల్లితో అభిప్రాయభేదాలు ఉన్నా, తరచూ వాదోపవాదాలు అవుతున్నా ఆవిడని వదిలి మాత్రం ఉండలేని ఆడపిల్ల మనసే..

“ఏం మాట్లాడవేంటి స్మరణా అంత మౌనంగా ఉన్నావేంటి” అని మీనన్ పలకరించడంతో నవ్వి “మీ ఇల్లెక్కడ” అని అడిగింది.

“బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టూ”

“ఆర్ యు మారీడ్..”

“అఫ్కోర్సు... మై వైఫ్ ఈ జ్ డాక్టర్..”

“ఓహ్... పిల్లలు?”

“ఇద్దరు... పాప ఫోర్ ఇయర్స్, బాబు వన్ ఇయర్.. “

“ఓ గుడ్... ఇంతకీ మన బాస్ పేరేంటి..”

“మాధవన్ ... తమిళియన్ ..”

“బెంగుళూరులో ఉంటాడా..”

“ఆయనకీ ఒక చోటు అంటూ లేదు.. సింగపూర్, యు ఎస్, ఆస్ట్రేలియా తిరుగుతూ ఉంటాడు..చాలా షార్ప్ ... ఎప్పుడూ ఏవో కొత్తగా కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు.”

స్మరణ వింటూ అతన్ని ఊహించుకునే ప్రయత్నం చేసింది.

బెంగుళూరు చేరాక ఎయిర్ పోర్ట్కి కంపెనీ కారు వచ్చింది .. ఇద్దరూ కార్ ఎక్కారు.. నేరుగా వాళ్ళని దమ్మలూరు రోడ్డులో ఉన్న స్టార్ హోటల్ కి తీసుకుని వెళ్లి “మీరు త్వరగా ఫ్రెషప్ అయితే ఆఫీసుకి వెళదాం”  అన్నాడు కారులో ఉన్న వ్యక్తి.

స్మరణ నేరుగా తనకి అలాట్ చేసిన రూమ్ కి వెళ్ళిపోయింది. హాయిగా అనిపించింది రూమ్ చూడగానే.. గబ,గబా ఫ్రెష్ అయి డ్రెస్ మార్చుకుంది. ఆమె కిందకి వచ్చేసరికి మీనన్ రెడీగా ఉన్నాడు. అక్కడి నుంచి ఆఫీస్ కి వెళ్లేసరికి ట్రాఫిక్ లో గంట అయింది. పదకొండు గంటలకి అనుకున్న మీటింగ్ పదకొండు దాటినా ఆఫీస్ చేరకపోవడంతో ఇద్దరూ కొంచెం కంగారు పడ్డారు. చండశాసనుడు ఏమంటాడో అనుకుంది స్మరణ.

“బెంగుళూరు ట్రాఫిక్ ఆయనకీ కూడా తెలుసు కదా... అర్థం చేసుకుంటాడు” అన్నాడు మీనన్.

పదకొండు ఇరవై నిమిషాలకి కారు ఆఫీస్ బిల్డింగ్ చేరింది.

అద్భుతమైన ఆ బిల్డింగ్ చూస్తూ లిఫ్ట్ దగ్గరకు నడిచారు.

మేనేజర్ విశ్వనాథ్ లాంజ్ లోకి ఎదురువచ్చి ఇద్దరికీ వెల్కం చెప్పాడు.

“సారీ... మీ ప్రెజంటేషన్ రేపటికి పోస్ట్ పోన్ చేసారు .... లేట్ అయింది కదా ఈ రోజు.. ఆయన వేరే మీటింగ్ లో ఉన్నారు” అన్నాడు విశ్వనాధ్..

స్మరణ, మీనన్ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.

“ప్లీజ్ కం .... స్టాఫ్ ని పరిచయం చేస్తాను” అంటూ లోపలికి తీసుకుని వెళ్ళాడు విశ్వనాథ్.

ఆఫీస్ వాతావారణం, యామ్బియన్స్, అక్కడక్కడా ఇత్తడి కుండీల్లో పచ్చ, పచ్చగా నవ్వుతున్న ఇండోర్ ప్లాంట్స్,. ఇవి కాక సి.ఐ.వో ఛాంబర్ కి కుడి పక్క  చాలా అందమైన ఎయిర్ ప్యురిఫయర్ ప్లాంట్స్...చిన్న పాండ్... బుద్ధుడి విగ్రహం... మనసుకి శాంతిని, ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. స్టాఫ్ అందరూ ఎంతో క్రమశిక్షణతో పని చేసుకుంటున్నారు. అందరికీ చిన్న, చిన్న క్యుబిక్స్, కంప్యూటర్స్.. సెంటర్లైజేడ్ ఎ.సి... ఎంత బాగుంది ఆఫీస్... ఇలా ఉంటే ఎంత పని చేసినా చేసినట్టు ఉండదు అనుకుంది స్మరణ.

అందరూ చిరునవ్వుతో స్వాగతం చెప్పారు.. ప్రేమగా, ఆత్మీయంగా మాట్లాడారు. స్మరణ అక్కడికి రావడం వాళ్ళందరికీ చాలా ఆనందంగా ఉన్నట్టు పాజిటివ్ భావాలను వ్యక్తం చేసారు. వాళ్ళందరినీ చూస్తుంటే ఒక విధమైన రిలీఫ్ కలిగింది. అయితే ఆమె దృష్టి ఒక దగ్గర మ్లానమైన మొహంతో, ఎవరితో మాట్లాడకుండా మౌనంగా కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్న ఆర్తి మీద పడింది. మేనేజెర్ ఆమె మొహం లో కదలాడిన భావం చూసి “మీరు ఆ ప్లేస్ లోకి వస్తున్నారు.. ఒకసారి జాయిన్ అయాక ఆమె దగ్గర ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఆమెని రిలీవ్ చేస్తాము” అన్నాడు.

స్మరణకి అర్థం అయింది... ఈమెనే కాబోలు తిక్కశంకరయ్య తీసేసాడు అనుకుంటూ ఆమె వైపు నడిచి నవ్వుతూ “హాయ్ ఆర్తీ అయాం స్మరణ” అంది చేయి చాపుతూ.

ఆర్తి పల్చగా నవ్వి “హాయ్!” అంటూ, అంటీ అంటనట్టు ఆమె చేయి తాకింది.

స్మరణ కొంచెం నెమ్మదిగా అంది.. “ఈవెనింగ్ మనం కలుద్దాం.. నేను కింద రిసెప్షన్ లో మీకోసం వెయిట్ చేస్తాను.”

ఆర్తి ఆశ్చర్యంగా చూసింది... “వై” అంది..

“చెప్తాను... మర్చిపోవద్దు.. నేను కింద ఫైవ్ నుంచి వెయిట్ చేస్తాను... బై” అంటూ అక్కడి నుంచి కదిలి మేనేజర్, మీనన్ మాట్లాడుకుంటున్న దగ్గరకు వచ్చింది.

“మీరు వెళ్లి లంచ్ చేయండి... మీటింగ్ అవగానే కాల్ చేస్తాను” అన్నాడు మేనేజర్..

స్మరణ మీనన్ వైపు చూసింది.. “ఓ కే లెట్స్ గో“ అన్నాడు మీనన్.

అందరి వైపు చూసి చేయి ఊపి బయటకు వచ్చేశారు ఇద్దరూ.

“మీటింగ్ ఆఫీస్ లోనే కదా” అడిగింది స్మరణ మీనన్ ని.

“అవును” అన్నాడు మీనన్.

“మరి అంత పోజేంటి ఆయనకి పది నిమిషాలు లేట్ అయితే పోస్ట్ పోన్ చేస్తాడా.. టూ మచ్” కోపంగా అంది.

“ఆయన ప్రిన్సిపుల్స్ ఆయనవి... మనం కాదనలేము కదా!”

“హు...”  విసుక్కుంటూ విండోలోంచి బెంగుళూరు రోడ్స్ చూస్తూ మౌనంగా ఉండిపోయింది. ఎంతసేపు ఆలోచించినా అతని మనస్తత్వం అంచనా వేయలేకపోయింది.

లంచ్ అయాక తిరిగి ఆఫీస్ కి వచ్చి రిసెప్షన్ లో వెయిట్ చేస్తూ కూర్చున్నారు ఇద్దరూ. ఆ రోజు ఎలాంటి ఫోన్ రాలేదు. సి.ఇ. వో మీటింగ్ నాలుగింటి వరకూ కొనసాగింది. ఫారెన్ డెలిగేట్స్ తో కొత్త ప్రాజెక్ట్ విషయమై చర్చలు జరుగుతున్నాయి అని చెప్పాడు మేనేజర్.

“ఇంక ఇవాళ మనం ఆయనని కలిసే ఛాన్స్ లేదు.. వెళ్ళిపోదామా సైట్ సీయింగ్ కి వెళదాము” అన్నాడు మీనన్.

తను ఆర్తికి సాయంత్రం కలుద్దాం అని చెప్పిన విషయం స్మరణ మర్చిపోలేదు. అందుకే అంది “మీరు వెళ్ళండి.. నేను లేడీస్ తో కొంచెం సేపు మాట్లాడి వస్తాను.. మీరు కార్ తీసుకుని వెళ్ళచ్చు. నన్నెవరన్నా డ్రాప్ చేస్తారు”.

“ఓ .... ఓ.కే” మీనన్ వెళ్ళిపోయాడు.

స్మరణ ఆర్తి కోసం ఎదురుచూస్తూ కూర్చుంది.

సరిగ్గా ఐదు గంటలు దాటిన నాలుగు నిమిషాలకు ఆర్తి వచ్చింది.

“మీకు కార్ ఉందా” అడిగింది స్మరణ..

“లేదు బైక్” చెప్పింది ఆర్తి.

“ఎక్కడికి వెళదాం” స్మరణ ప్రశ్నకి కొంచెం విచిత్రంగా చూసింది ఆర్తి.

“ఇక్కడే కూర్చోవచ్చుగా” అంది.

“వద్దులే మీ సి.ఇ వో... అదే మన సి.ఇ వో చూస్తే గుండె బాదుకుంటాడెమో!” అంది స్మరణ నవ్వుతూ.

ఆర్తికి ఆమె మొదటి పరిచయంలోనే అంత చనువుగా మాట్లాడుతుంటే చిత్రంగా అనిపించింది. మాధవన్ ని ఆమె అలా చిన్నబుచ్చడం కూడా నచ్చలేదు. కానీ పైకి మాత్రం “మీ ఇష్టం పక్కనే కాఫీ డే ఉంది వెళదాం పదండి” అంటూ బయటకి నడచింది. స్మరణ అనుసరించింది. ఇద్దరూ కాఫీ డే  లో కూర్చున్నాక అడిగింది స్మరణ. “మిమ్మల్ని....” అనబోయి తల విదిలించి “మన మధ్య ఈ అండీ ఒద్దు గానీ నువ్వు అంటాను నన్ను కూడా నువ్వు అనచ్చు... ఇంతకీ మీ ఇద్దరి మధ్య ఎం జరిగింది?” అడిగింది.

“ఎవరిద్దరి మధ్యా...” అయోమయంగా అడిగింది ఆర్తి.

“అదే మీ బాస్ సారీ మన బాస్ కీ నీకూ...”

ఆర్తి తలవంచుకుని కాఫీ మీద నురగ చూస్తూ మౌనంగా ఉండిపోయింది.

స్మరణ కాఫీ సిప్ చేసి ఆమె సమాధానం కోసం ఎదురుచూడసాగింది.

“నువ్వు చూసావా మధుని “ అడిగింది ఆర్తి.

స్మరణ ఉలిక్కిపడింది “మధునా!” సంభ్రమంగా అడిగింది.. ఆ రెండు అక్షరాలు చాలు ఆమెని చుక్కల లోకంలో విహరింప చేయడానికి.

“అదే మాధవన్... నేను మధు అని పిలుచుకుంటాను నా ఊహల్లో..”

“ఓ..... “ స్మరణ ఊపిరిపీల్చుకుంది.

****సశేషం****

Posted in January 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!