Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

వృత్తిరీత్యా విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఎంతోమంది విద్యార్థులను భావి శాస్త్ర సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దిన శ్యామసుందర రావు గారు, తెలుగు సాహిత్యం మీది మక్కువను నిరంతరం నిలుపుకొంటూ, ఎన్నో రకాలుగా తెలుగు సాహిత్య సేవలో నిరంతరం శ్రమిస్తూ, నేటికీ మంచి రచనలు చేస్తూ తనవంతు కృషిని చేస్తున్నారు. మన సిరిమల్లె లో ఆయన ధారావాహిక “తెలుగు తేజాలు” ఈ నూతన సంవత్సరం నుండి ప్రారంభం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన సిరిమల్లె తరపున ఆయనకు కృతజ్ఞతలు. – మధు బుడమగుంట

ముందుమాట:

మాతృభాష అయిన తెలుగు భాష మాధుర్యాన్ని నా జీవితంలో నిత్యం ఆస్వాదిస్తూ తెలుగు సాహిత్యం వైపు దృష్టి సారించి, కాలేజీ చదివే రోజుల్లో కాలేజీ మేగజైన్ల కొరకు చిన్న కధలు వ్యాసాలు వ్రాస్తు ఉండేవాడిని ఆ తరువాత ఉద్యోగ, సంసార బాధ్యతలతో రచనా వ్యాసంగము కొనసాగించటం వీలు కాలేదు కానీ పుస్తకాలు చదవటం, అందలి అంశాలు స్నేహితులతో చర్చించటం, సందర్బాను సారముగా పిల్లలకు చెప్పటం అలవాటు అయింది. నేను పదవి విరమణ చేసినాక అంటే 2008 నుండి పూర్తిగా రచనా వ్యాసంగము మొదలు పెట్టడం జరిగింది. నేటి వరకూ అనేక అంతర్జాల పత్రికలలో 800 పైగా నా వ్యాసాలు ప్రచురించబడ్డాయి.

పిల్లలకు సినిమా హీరోలగురించి, క్రికెట్ ఆటగాళ్ల గురించి తెలిసినంతగా వివిధ రంగాలలో ఖ్యాతి గడించిన మన తెలుగు ప్రముఖల గురించి తెలియకపోవటంతో వారికి మన పెద్దలు, వారు సాధించిన విషయాల గురించి తెలియజెప్పటం, వయస్సులో పెద్దవాడిగా నేటి యువతకు తెలియజెప్పటం నా భాద్యత అని భావించి, అవసరము అనిపించి, వారి గురించి ఈ వ్యాసాలు వ్రాయటం మొదలు పెట్టాను. "తెలుగు తేజాలు" అనే శీర్షిక క్రింద తెలుగు ప్రముఖులను పరిచయము చేసే అవకాశము ఇచ్చిన సిరిమల్లె పత్రిక యాజమాన్యము (మధు గారు ఉమా గారికి) నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

మొదటి శీర్షిక క్రింద అయ్యదేవర కాళేశ్వర రావు గారి జయంతి సందర్భముగా ఆయన గురించిన వ్యాసాన్ని మీకు అందిస్తున్నాను. మీ సూచనలు, సలహాలు తెలుప మనవి. - అంబడిపూడి శ్యామసుందర రావు.

శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు

Kaleshwara-Rao

విజయవాడతో పరిచయము ఉన్న వారికి మరియు పాత తరము వాళ్లకు ఈ పేరు సుపరిచితమే. విజయవాడలో కాళేశ్వర రావు మార్కెట్ అని కాళేశ్వర రావు రోడ్డు అని ఉండటం చూసే ఉంటారు. అయ్యదేవర కాళేశ్వర రావు గారు జాతీయోద్యమములో పాల్గొన్న తొలి తెలుగు వాళ్లలో ప్రముఖులు. స్వాతంత్రోద్యమములో భాగముగా స్వదేశీ ఉద్యమము, ఉప్పు సత్యాగ్రహము, క్విట్ ఇండియా వంటి అనేక ఆందోళనలలో పాల్గొన్నాడు. అంతే  కాకుండా స్వాతంత్రము వచ్చినాక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము కోసము కృషి చేసిన వ్యక్తులలో ఈయన కూడా ఒకడు. స్వాతంత్ర్యోద్యమములో పాల్గొన్నందుకు బ్రిటిష్ వారి ఆగ్రహానికి గురై రాజమండ్రి, తిరుచునాపల్లి, కడలూరు, వెల్లూరు, నాగపూర్ జైళ్లలో కఠిన కారాగార శిక్ష అనుభవించాడు.

కాళేశ్వరరావు గారు జనవరి 22,1881 న కృష్ణా జిల్లా నందిగామలో లక్ష్మయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు.1901లో బిఎ పాస్ అయి బందరు నోబుల్ కాలేజీలో కొంతకాలము ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తరువాత మద్రాసు విశ్వ విద్యాలయము నుండి లా పట్టా పుచ్చుకొని 1906 లో విజయవాడలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ఆ సమయములో జమిందారీల చట్టం విషయంలో ఆయనకు గల విశేష పరిజ్ఞానం మూలంగా పలువురు జమిందారులకు లాయరుగా పనిచేసాడు.

రఘుపతి వెంకట రత్నం నాయుడి గారి ప్రభావముతో సంఘ సంస్కరణల మీద ఆసక్తితో బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఆ తరువాత గాంధీ గారి నాయకత్వములో జరిగిన అన్ని స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని జైళ్లకు వెళ్ళాడు ఆ విధముగా స్వాతంత్ర ఉద్యమము సంఘసేవలలో చురుకుగా పాల్గొనేవారు. గాంధీజీ పిలుపు మేరకు లక్షలు ఆర్జించి పెట్టె న్యాయవాద వృత్తిని వదులుకొని స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న నిస్వార్ధ రాజకీయ వేత్త కాళేశ్వరరావు గారు. ఈయన విశేషముగా కృషి చేసిన మరో రంగము గ్రంధాలయ వ్యవస్థ. విజయవాడలోని రామమోహన గ్రంధాలయ స్థాపనలో ముఖ్య పాత్ర పోషించాడు. కొమర్రాజు లక్ష్మణరావు నెలకొల్పిన విజ్ఞాన చంద్రికా గ్రంథమండలిలో కార్యదర్శిగా పనిచేసాడు. రచయితగా ఈయన జైలులో ఉండగా 'ఫ్రెంచి విప్లవ చరిత్ర', 'అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర', 'తురుష్క ప్రజాస్వామికం', చీనా జాతీయోద్యమ చరిత్ర', 'ఈజిప్టు చరిత్ర' అను పుస్తకాలను రచించి రచయితగా ప్రజానీకానికి పరిచయము అయ్యాడు. ఈయన పలు పుస్తకాలను తెలుగులో రచించాడు. వేదాంతం, చరిత్ర, రాజకీయాల నేపథ్యం పై అనేక రచనలు చేసాడు. జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలో చైనా జాతీయోద్యమ చరిత్ర, ఈజిప్ట్ చరిత్ర, ప్రెంచ్ విప్లవ చరిత్ర, అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర లను రచించారు. ఈయన జీవిత చరిత్ర "నవ్యాంధ్రము నా జీవిత కథ” అనే పుస్తక రూపంలో వెలువడింది.

రాజకీయ రంగము విషయానికి వస్తే ఆయన 1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయవాడకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రజా ప్రతినిధిగా ఇతను విజయవాడ పురపాలక సంఘానికి అధ్యక్షుని గా ఎన్నుకోబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మొదటి శాసనసభాధిపతిగా ఎన్నుకోబడ్డాడు. 1939లో మద్రాసు శాసనసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ- బందరులకు ప్రాతినిధ్యం వహిస్తూ పోటీ చేసి ఘన విజయం సాధించాడు. రాజగోపాలాచారి ప్రధాన మంత్రిగా మద్రాసు ప్రావిన్స్ ప్రభుత్వమేర్పడింది. దానిలో కాళేశ్వరరావు గారు రాజగోపాలాచారికి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. మద్యపాన నిషేధ చట్టం, సేల్సుటాక్సు, హరిజన దేవాలయ ప్రవేశ చట్టాల రూపకల్పనలో కాళేశ్వరరావు తన మేధాసంపత్తిని, భాషానైపుణ్యాన్ని ప్రయోగించి అందరి మన్ననలూ పొందాడు. మద్రాసు శాసనసభకు చీఫ్ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.1946లో విజయవాడనుండి శాసనసభకు ఎన్నిక అయినారు. ఎంతోమందికి విద్యాదానం కూడా చేశారు. నేషనల్ ఎడ్యుకేషనల్ కమిటీ ప్రెసిడెంట్ గాను, హిందీ భాషాభివృద్ధి సంఘ ఉపాధ్యక్షుడిగాను ఎనలేని సేవలు అందించారు. గాంధీ, నెహ్రు లు విజయవాడ వచ్చినప్పుడు వారి ఇంట్లోనే ఆతిధ్యము పొందేవారు. 1948 లో హైద్రాబాద్ రాష్ట్రము జాతీయ యూనియన్ విలీనము కావటానికి కాళేశ్వర రావు గారి కృషి కూడా ఉంది.

ఆంధ్రరాష్ట్రం అవతరించిన తరువాత 1955లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభకు అయ్యదేవర కాళేశ్వరరావు తొలి సభాపతిగా ఎన్నికయ్యాడు. 1962 వరకు ఆ పదవిలో కొనసాగాడు. ఆ పదవిలో ఉండగానే 1959 లో శాసనసభలో తెలుగు భాషనే వాడాలి అని రూలింగ్ ఇచ్చిన భాషాభిమాని కాళేశ్వర రావు గారు. అంతే కాకుండా 1961 లో శాసనసభ సభాపతి అనుమతి లేకుండా ఎవరు శాసన సభలో ఎటువంటి ప్రకటనలు ఇవ్వరాదని రూలింగ్ ఇచ్చాడు. 1962 లో జరిగిన ఎన్నికలలో తిరిగి శాసనసభకు ఎన్నిక అయినప్పటికీ ఫలితాలు వెలువడక ముందే అంటే ఫిబ్రవరి 26, 1962 లో తుది శ్వాస విడిచారు. ఆయన జ్ఞాపకార్ధము విజయవాడలోని పేరొందిన మునిసిపల్ మార్కెట్ కు కాళేశ్వర రావు మార్కెట్ గా నామకరణము చేశారు. గొప్ప కర్మయోగి అయిన అయ్యదేవర కాళేశ్వర రావు గారి జీవితము నేటి యువతకు స్ఫూర్తి దాయకం. అటువంటి గొప్ప దేశభక్తుడు నిస్వార్ధ రాజకీయ వేత్త సంఘ సంస్కర్త, రచయిత అయిన కాళేశ్వర రావు గారిని ఆయన జయంతి సందర్భముగా స్మరించుకుంటు నివాళులు అర్పిద్దాము.

****సశేషం****

Posted in January 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!