Menu Close
SirikonaKavithalu_pagetitle

•3•
నేను
అవసరాలను గణించనివాడిని
అనవసరాలను పరిగణించనివాడిని.
.....అవసరంలోని అనవసరత
...........అవగతమైనవాడిని
.....అనవసరంలోని అవసరత
..........అర్ధమైనవాడిని.
.....అవసర తొందరనూ కాను
.....అనవసర వేగాన్నీ కాను.
అవును, నేను
...పారదర్శక ధ్యాసను పర శ్వాసను.
•4•
నేను
ఐహికాన్ని, అయినా విదేహ విజేతని
భౌతికాన్ని, అయినా దేహ సేనానిని.
.....కాను సేవకుడను, అవును నిజ యజమానిని
.....దేహ యాజమాన్యాన్ని, కాను మనసు అల్లరిని
.........ఆంతర్య మేధను అధిరోహించినవాడ్ని
.........అంతర్గమన మెళకువలను మథించినవాడ్ని
అవును, నేను
.....గెలవటం తెలిసిన మనీషి పార్శ్వాన్ని.

ఒక తియ్యని మాట
ఎప్పుడైనా
ఒక తియ్యని మాట ఎంత ఇంపుగా ఉంటుంది
వెన్నెల మెత్తగా పరిమళం చేసి ఒంటికి అద్దుకున్నట్టు
తొలకరి చినుకుల్లో తనివితీరా నడి వేసవి సేద దీరినట్టు
హరిత పవనపు కొండ గుండెల్లో తూనీగై పరుగులు తీసే
ఊహ రెక్కలపై వాలి ఆద్యంతాలను తడిమి తడిమి వచ్చినట్టు
ఒక తియ్యని మాట ....

తేనెలో నాని నాని ఊరించే సుమధుర స్వప్న సీమ
ఉదయం స్వర సీమను సవరించుకు కలకూజితమైనట్టు
సెలయేటి నీటి వాలున దూదిపింజల్లా నునుపు బారిన
గులకరాళ్ళ సుతిమెత్తని అలవోక పలకరింపుల్లా
అంతర్లీనంగా ఒక ఆవిష్కరి౦పబడని అద్భుత చిత్రం
రాగాల తునకలను గులాబీ రేకుల్లా పెదవులపైన వెదజల్లినట్టు
ఒక తియ్యని మాట ............

ఎక్కడి కల్పవృక్ష జలజలా రాల్చిన పారిజాతాల్లా
మంచు పూ రెక్కలు మధ్యలోనె కరిగి
చుక్కలు చుక్కలుగా బీటలు వారిన
మౌనపుటవని పొరల్లోకి ఇంకి
కనురెప్పలపై లాలిపాటై
నేనున్నానంటూ గుండెకు హత్తుకునే
ఒక తియ్యని మాట ..............

వగరు పిందెలు సమయాన్ని ఆస్వాదించి
మధురఫలాలుగా మాగినట్టు
అక్షరాలూ మనసు భాషను మేసిమేసి
హరివిల్లు రాగాలుగా సాగినట్టు
ఒక తియ్యని మాట
దిగంతాల ముంగురులు సరిచేసే
సముద్రపుటలలా
కాస్త కాస్త ఉనికిని ఆక్రమించి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ...........

ఇంకా గడ్డకట్టుకునే ఉంది
ఇక్కడికి తిరిగిరాలేని మనసు!

పాలుగార్చుతూ
పరవళ్ళతో ప్రవహించే తను
దారంతా వెంటనడిచిన తను నన్నొదిలేసింది...

********

ఎవ్వరూ లేరక్కడ
గుండ్రని పాలరాళ్ళపై దొర్లుతూ
గలగలా మాట్లాడుతూ ....
సుదీర్ఘ పయనం తనది!

నల్లనిమట్టి గుట్టల బురద రాళ్ళ నుండి తప్పించుకుని
కాసింత కిందికి నడిచాను తనకోసం
ఎంతగా పులకరింతో....
చాలా కాలంతరువాత కలిసిన నేస్తం!

గులకరాళ్ళన్నీ
అడుగుల అలికిడికి
చెల్లాచెదరుగా పక్కకు జారుతున్నాయి
ఐనా పర్లేదు... నేను మాత్రం తన చేతికి చేయందించి ఒక్కసారైనా ప్రేమను ప్రకటించాలనే తపన....

******

ఒంటరి ప్రయాణం ఎప్పుడూ
ఆసక్తినే నింపుతుంది
భయంకరంగా పలకరిస్తున్న ఏకాంతం
తలెత్తి చూడలేనంతటి పొడుగాటి ప్రకృతి
నదీపర్వత నాగరికతలోకి చొచ్చుకుపోయి
ఒదిగిన లోయను నేను!

మౌనంగానే కనబడుతున్నానుగానీ
నానుండి యెవరో భయపడుతున్నారు
నవ్వుతున్నారు
ఆనందంగా కళ్ళనుండి బైటికి వెళ్ళి
నదిలో మునిగి చల్లగా మంచైపోతున్నారు...
పర్వత శిఖరాల చెట్ట ఆకుల ఆనవాళ్ళు వెదుకుతున్నారు
గడ్డకట్టిన మంచునుండి జారిపోతున్నారు
మంచుపెల్లలు పెక్కిలించి మట్టివాసన చూస్తున్నారు
నేను మాత్రం  నదిఒడ్డునే నిలబడ్డాను

ఒక గాఢమైన నిట్టూర్పుతో
తనను వెచ్చగా తాకాను.
నాలుగు వేళ్ళను జొప్పించి
తన మనసును తడిమాను

జివ్వుమని
నాదోసిలి తీసుకుని గట్టిగా పట్టుకుంది
నా ఆందోళనంతా లాక్కొని
తీయగా నవ్వింది నాలో తన ఉత్సాహాన్ని నింపి!

ఆ పాలరాయినైనా బాగుండేమో
తనతో పాటు స్వేచ్చగా ,స్వచ్చగా అక్కడే ఉండేందుకు...
ఈ అడుగులు ఇటు పడగానే తను నన్నొదిలేసింది

దిగిరావాలి
దగ్గరకి
గాలి చొరనంత దగ్గరకి
వెలుగు దూరనంత దగ్గరకి
చీకటిలో లీనమయ్యేంత
దగ్గరకి
వాయులీనాల సందుల్లోకి
స్నాయునీలాల మూలాల్లోకి
రావాలి గద్దె దిగి రావాలి

అప్పుడుగానీ
అంధకార
బంధురంధరుల
నీడలు మాయం కావు
మాయామేయాల
వ్యామోహాల నుండి
రావాలి
గద్దె దిగిరావాలి

బద్దెనలూ వేమనలూ దించలేరు
సుద్దుల సద్దులూ
ముద్దుల చద్దులూ
దించలేవు
గుణ కారులూ
భాగ హారులూ
కొమ్ము కాయరు
వదల్లేనివాటిని వదల్చాలి
కదల్లేనివాటిని కదల్చాలి
విదిల్చాలి
విధినీ వీధినీ నిశీధినీ
విదిల్చి పారేయాలి

రంగులన్నింటినీ కలబోసేదెలాగో తెలుపు
విడగొట్టేదో చెడగొట్టేదో తొడగొట్టేదో కాదు నలుపు
నిన్ను నీలోకి లాక్కుపోయే
కృష్ణబిలమది
నీలోంచీ నిన్ను బయటికీడ్చే
తృష్ణబిలం తెలుపు
జయించు
తెలుపుని జయించు
పూయించు
నలుపుని పూయించు

గుర్తుంచుకో
దిగిరావలసింది
గద్దెమీదున్న వారు కాదు

మనిషి
మొలకెత్తు తున్నాడు
మట్టితడి బంధంలా
మంజుల భూపాలరాగ తరంగంలా..

మనిషి
శిరసెత్తుతున్నాడు
మహోన్నత హిమగిరి శిఖరంలా
బాల భానూదయ కిరణంలా..

అడుగేస్తున్నాడు
చిచ్చర పిడుగులా
పడి లేస్తున్నాడు
ఉప్పెన తరగలా ..

నడక సాగిస్తున్నాడు......
మహోజ్వల జ్వాలా ఝంఝానిలంలా

ఎవరో సరదాగా
విహాయసంలోకి ఎగుర వేసిన
వింత పతంగం ఈ మనిషి ..

అంతలోనే
రెక్కలు కత్తిరించగా
నేల రాలుతున్న
కాల విహంగం ఈ మనిషి..

మల్లెల పరిమళంలా
...... ఈ మనిషి!
కాలకూట విషంలా
.....ఈ మనిషే!

కర్పూరదీపంలా
......ఈ మనిషి
నిప్పుల జలపాతంలా
.......ఈ మనిషే...

ఊపిరిలో
వసంతాలు లయించుకొని
ఉర్విపై
...జైత్రయాత్ర  ముగించుకొని
ఎగిరి పోతున్నాడు
...ఒక మనిషి
..........మరణం దిశగా
తిరిగి వస్తున్నాడు
....మరో మనిషి
..........మరింత కసిగా

బాబు, తల్లి యనుచు బ్రతిమాలగా నేల?
మంచి దారి కనుము మాట వినుము,
పోరు బెట్ట కుండ, పోగొట్టుకొనకుండ,
పొంచి యున్న ముప్పు పోల్చుకొనుము..

తెలుగు నేర్చుకొనుము తెలివి దెచ్చుకొనుము,
తెప్పరిల్లి నంత తేజమొప్పు,
తాయిలములు దెత్తు తాంబూలములనిత్తు,
పొలుపు మాట చెప్పి, ప్రోత్సహింతు..

పద్యమొకటి చెప్పు పట్టుకో డాలరు,
పరగ రెండు నుడువ పౌండు నీది,
అర్థమునకు రూక లైదు వందలివియె,
వెలను కట్ట లేని విద్య నీది..

పైక మిచ్చి నేడు బ్రతికించ వలయునా?
తల్లి విలువ గనని తనయు లేల?
వందనములు జేసి ప్రాధేయ పడుచుంటి,
వారసత్వ నిధుల వదల వలదు..

తేట గీతుల పాడి, ఆట వెలదులాడి,
...కంద మందు కలసి చిందు వేసి,
సీసపాదములను చిత్ర గతుల జూపి
...వృత్త ములను క్రొత్త వేడ్క జేసి,
శ్లేష చమత్కార భూషణ ములయంద
...లంకార భావార్థ లాస్య మొప్పు
పలుకు నాది యనుచు నెలుగెత్తి చాటగా,
...దిద్దుకో తిలకమ్ము తెలుగు వాడ..

శతక పద్యమొకటి చాలనీతుల జెప్పు,
చాటు వొకటి బ్రతుకు చక్కబరచు,
భక్తి బాట జూపు భాగవతము గాచు,
భాష నేర్చు కొనిన భవిత వెలుగు..

విశ్వ మందుఁ జూడ వేవేల భాషలన్
మేటి దయ్య నీదు మేరు నగము,
సాటి లేదు నీకు కోటీశ్వరుడవీవు,
విడువ నేల సిరులు? వెడఁగు వగుచు..

Posted in January 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!