Menu Close
VSRao
అశోక మౌర్య
డా. వల్లూరుపల్లి శివాజీరావు

వృత్తిరీత్యా వ్యవసాయ శాస్త్రవేత్తగా, ఆచార్యునిగా అంతర్జాతీయంగా పేరు గడించినా, మాతృభాష మీది మమకారము అలాగే కొనసాగిస్తూ, సాహిత్య ప్రంపంచంలో తన ఉనికిని తన రచనల ద్వారా పదిలపరుచుకుంటూ తెలుగులో చారిత్రిక రచనలు చేస్తున్న డా. వల్లూరుపల్లి శివాజీరావు గారు ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ సంచిక నుండి అశోక మౌర్య అనే చారిత్రాత్మక ధారావాహికను మనకు అందిస్తున్నారు. మన సిరిమల్లె తరపున ఆయనకు మనఃపూర్వక కృతజ్ఞతలు. మన సిరిమల్లె పాఠకులకు సరికొత్త సంపదను చరిత్ర రూపంలో అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. - మధు బుడమగుంట

ముందుమాట:

భారతదేశ చరిత్రలో కలకాలం నిలిచి, బౌద్ధ మతాన్ని దేశ ఎల్లలు దాటించిన మహామనీషి, ఒక ఉత్కృ ష్టమైన వ్యక్తి గురించి తెలుసుకుందాము. ఆయనే అందరికి తెలిసిన ‘అశోక మౌర్య’ చక్రవర్తి.

ఆఫ్గనిస్తాన్ నుంచి కర్ణాటక వరకు పరిపాలించిన ఈ మహా చక్రవర్తికి తెలుగునాడుతో అవినావ సంబంధము ఉంది. ఈ బంధం కర్నూలు జిల్లాలో ఉన్న 2200 ఏళ్ళ నాటి మూడు శిలాశాసనాల ద్వారా బయటపడింది.

అవి: ‘ఎర్రగుడి’ (‘గుత్తి’ కి దగ్గరలో ఉంది), ఎర్రగుడిలో దూరంగా చూస్తే 100 అడుగుల ఎత్తున ఒక చిన్న కొండ, దాని మీద బండ రాళ్ళు వరుసగా పేర్చిఉన్నట్టు ఈ రోజుకూ కూడా కనపడతాయి. అతి సాధారణంగా కనబడే ఈ రాళ్ళమీద 100 కు మించిన పంక్తులలో బ్రహ్మి లిపిలో వ్రాయబడిన అక్షర క్రమం ఉంది. వీటిల్లో కొన్ని పంక్తులు మాసి పోయినా, మరి కొన్నిటిని ఈనాటి వ్రాతలు (graffiti) మరుగు పరిచినా, మిగిలిన పంక్తులను బట్టి ఈ పంక్తుల సముదాయం ఒక రాజ శాసనం అయిఉండవచ్చని అనిపిస్తుంది. ఈ పద-వాక్య సముదాయంలో అశోక మౌర్యుని ఆదేశాలు, ఆఙ్ఞలు ఉన్నాయని పరిశోధకులు ధృవీకరించారు.

ఎర్రగుడి శిలా-వ్రాతల లాంటివే, కర్నూలు జిల్లాలోనే ఎర్రగుడికి 32 కి.మీ. (20 మైళ్ళు) దూరంలో, పత్తికొండకు సమీపంలో ఉన్న ‘రాజుల మందగిరి’ లోకూడా ఈనాటికీ ఉన్నాయి.

ఈ శిలా-వ్రాతలను బట్టి ఆంద్రనాడు అశోకుడు పాలించిన సామ్రాజ్యంలో ఒక భాగం అని అర్ధమవుతుంది. ఆంద్రదేశమే కాదు, 9 శిలా-శాసనాలున్న కన్నడనాడు కూడా అయన విశాల సామ్రాజ్యం లోని భాగమే.

వీటిని, అనేక ఇతర విశేషాలను తెలుసుకోవాలనే ఉత్సుకతతో అయన గురించి పరిశోధించి తెలుసుకున్న విషయాలను మీతో పంచుకుంటాను. – డా. వల్లూరుపల్లి శివాజీరావు

అశోకుడి మూలాలు

చంద్రగుప్త మౌర్య

మౌర్య సామ్రాజ్య స్థాపన, విస్తరణ

అశోకుడి పితామహుడు చంద్రగుప్త మౌర్య (పాలన: క్రీ.పూ. 321-298). పురాతన గ్రంధాలను బట్టి చంద్రగుప్త క్రీ.పూ. 350 ప్రాంతం లో జన్మించాడు. ఈయన 'మౌరియ' (Mouriya) వంశానికి చెందిన వ్యక్తి. ఈ వంశం గౌతమ బుద్ధుడి శాక్య వంశంలోని ఒక తెగ. పాలి (Paali) భాషలో నెమలిని ‘మోర’ అంటారు. నెమళ్లను పెంచే వృత్తుల వారిని ‘మౌరియలు’ అని పిలిచేవారు. చంద్రగుప్తుడి తల్లి రాజుల కొరకు నెమళ్లను పెంచే వ్యక్తి కుమార్తె. పేదకుటుంబంలో జన్మించిన చంద్రగుప్త తన జీవితంలో రాజరికం పొందాలని కలగన్నాడు. యుక్తవయస్సులో ఉన్నపుడు గిట్టని తన బంధువులు ఈయనను అడవులకు తరిమివేశారు.

ఆ సమయంలో 25 ఏళ్ల వయస్సులో ఈయన భారతావని మీద క్రీ.పూ. 326-325 లో దండెత్తిన అలెగ్జాండర్ ను తక్షశిల నగరంలో కలిసినట్లు చరిత్రకారులు ధృవీకరించారు. ఈ మాసిడోనియన్ రాజు పాటలీపుత్ర ను రాజధానిగా చేసుకుని మగధ రాజ్యాన్ని పరిపాలించుతూ నిరంకుశుడు, కౄరుడుగా మారిన నంద వంశ రాజు ‘ధనా నంద’ ను ఓడించమని చంద్రగుప్తుడికి సలహా ఇచ్చాడు.

తన ప్రవాస కాలంలో చంద్రగుప్త భారీ సైన్యాన్ని వాయువ్య (Northwest Frontier) సరిహద్దులో సమీకరించి తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. క్రీ.పూ. 323లో అలెగ్జాండర్ మరణించిన తరువాత ఈ మాసిడోనియా రాజు నియమించిన సేనాధిపతులను చంద్రగుప్త ఓడించి క్రీ.పూ. 322 లో పంజాబును వశపరచుకుని అధికారం సాధించాడు. ఈ ప్రక్రియలో గ్రీకు గవర్నరులు ‘సెల్యూకస్ నికేటర్-1’, మరొకరిని ఓడించాడు.

ఆ తరువాత ధనా నంద మీద దాడి జేసి, ఆయనను పదవీచ్యుతుడిని చేసి, వధించి, నంద కుటుంబం లో ప్రతివ్యక్తిని కూడా వధించి క్రీ.పూ. 321 లో మగధ సింహాసనాన్ని అధిష్టించాడు.

ధనా నంద నుంచి చంద్రగుప్తకు విశాల సామ్రాజ్యం సంక్రమించింది. దీనితో పాటు భారీ సైన్యం కూడా సంక్రమించింది. ఈ సైన్యాన్ని ఇంకా పెంచి చివరకు 30,000 అశ్వదళం, 9,000 గజబలం, 6 లక్షల కాల్బలం సమాయత్తం చేసాడు. ఈ సైన్యం తో ఉత్తర భారతావని అంతా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. సింధు నది తూర్పువైపున ఉన్న ప్రాంతాన్నంతా జయించాడు. ఆ తరువాత మధ్య భారత్ తో పాటు దక్షిణా పథాన కర్ణాటక, తమిళనాడు వరకు స్వాధీనపరచుకున్నాడు. ఉత్తరపథాన మహారాష్ట్ర, గుజరాత్ లను కూడా తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు.

ఈ విజయాలతో చంద్రగుప్తుడి కీర్తి విశ్వవ్యాప్తి చెందింది. మగధ రాజధాని పాటలీపుత్రలో ఇతర దేశాల రాయబారులు కూడా ఉన్నారు. వీరిలో ముఖ్యులు రోమ్, ఈజిప్ట్, పర్షియా, సిరియాకు చెందినవారు.

ఈ వరుస విజయాలతో మౌర్య సామ్రాజ్యం పశ్చిమ సముద్రం (అరేబియన్ సముద్రం) నుంచి తూర్పు సముద్రం (బంగాళా ఖాతం) వరకు విస్తరించింది. ఈ కారణంగా పశ్చిమదిశ దేశాలతో సముద్ర వాణిజ్యం జరపటానికి వీలయింది. ఈ వాణిజ్యం ద్వారా కలప, వస్త్రాలు, మణులు, సుగంధ ద్రవ్యాలు, విలువయిన లోహాలు, తదితరమైన వాటిని ఈ దేశాలకు ఎగుమతి జరిగింది. ఈ వాణిజ్యం 2,000 సంవత్సరాల క్రితం పశ్చిమ రేవుల నుంచి హరప్పా రాజులు ఈ దేశాలతో జరిపిన వాణిజ్యాన్ని తలపించింది.

చంద్రగుపుడు స్థాపించి విస్తరించిన రాజ్యాన్ని ఆయన పుత్రుడు ‘బిందుసార’, మనుమడు ‘అశోక’ మరింత విస్తరించారు. అశోకుడి సామ్రాజ్యం 1,800 ఏళ్ల తరువాత వచ్చిన అక్బర్ సామ్రాజ్యం కంటే, 2,000 ఏళ్ల తరువాత ఉద్భవించిన బ్రిటిష్ సామ్రాజ్యం కంటే కూడా చాలా విశాలమైనది. అది దక్షిణాపథం మొన నుండి ఉత్తరాన పర్షియా సరిహద్దు వరకు విస్తరించి ఉండేది.

మౌర్యుల కాలంలో రాజధాని ‘పాటలీపుత్ర’ ప్రపంచంలో అతి పెద్ద నగరంగా పేరుగాంచింది. 570 గోపురాలు, 64 ద్వారాలు ఉన్న ఈ నగరం 13 కి.మీ. (8 మైళ్ళు) నిడివి, 2.4 కి.మీ. (1.5 మైళ్ళు) వెడల్పు తో ఉంది. ఈ భారత రాజధాని అశోకుడి కాలంలో రోమ్ నగరం కంటే రెట్టింపు పెద్దది.

నిర్మాణాలు, అబివృద్ది, పరిపాలన

చంద్రగుప్త తో సహా అందరు మౌర్య రాజులు గొప్ప నిర్మాణదార్లు. ఈయన వాయువ్య దిశలో ఉన్న తాను విద్యనభ్యసించిన తక్షశిలను తూర్పున ఉన్న పాటలీపుత్ర తో కలుపుతూ సుమారు 1600 కి.మీ. (1000 మైళ్ళు) పొడవు రహదారి నిర్మించాడు. ఇటువంటి వ్యూహాత్మిక రహదారి మౌలిక సదుపాయాలను అనేక దిక్కులలో చంద్రగుప్త కల్పించటం జరిగింది. వీటిల్లో ముఖ్యమైనవి నేపాల్, కపిలవస్తు, డెహ్రా డూన్, మీర్జాపూర్, ఒడిశా, ఆంధ్రనాడు, కర్ణాటక. ఈ అనుసంధాన వ్యవస్థ వల్ల వాణిజ్యం, వర్తకం అభివృద్ధి అవటమేగాక సైన్యాలను వేగంగా, సమర్ధవంతంగా గమ్యాలు చేరటానికి వీలయింది.

చంద్రగుప్త పాలనలో ఆయుధ నిర్మాణ కేంద్రాలను తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. కాని గనుల నిర్వహణ, లోహాలను వెలికితీయడం ప్రైవేట్ వ్యక్తులతో చేయించేవాడు. ఆయన దృష్టిలో ఆర్థికాభివృద్ధి, ధర్మాన్ని నిలబెట్టటానికి, అనుసరించడానికి అత్యవసరం. ఈ మొదటి మౌర్య రాజు ఎల్లప్పుడూ సైన్యాన్ని అప్రమత్తత చేస్తూనే, యుద్ధాలను నివారించటానికి దౌత్యానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది.

చంద్రగుప్త యుద్ధ శిబిరంలో కనీసం 40,000 సైనికులు వెంట ఉండేవారు. ఇంతమంది ఉన్నా అందరు క్రమశిక్షణతో ఉండేవారు. చోరత్వం అరుదుగా ఉండేది. ఈ మౌర్యుడు కఠినాత్ముడైన రాజు. క్రూరత్వానికి పేరొందిన రాజులను జయించి అధికారం సంపాదించిన ఈయన కూడా క్రమక్రమంగా క్రూరుడయిన రాజుగా మారాడు.

తనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరుగవచ్చనే చంద్రగుప్తకు భయం ఉండేది. గ్రీకు చరిత్ర కారుడు, ఆర్ధిక శాస్త్రవేత్త ‘మెగస్తనీస్’ (Megasthenes) వెల్లడించిన వివరాలను బట్టి మహిళా బానిసలు చంద్రగుప్తను ఎల్లప్పుడూ కాపలా కాచేవారు. కుట్రదారుల పన్నాగాలను నివారించటానికి ఈయన తరచు రాత్రివేళల్లో తన శయనాగారాలను మార్చేవాడు.

చంద్రగుప్త తన రాజభవనాన్ని కొన్ని కార్యాలకొరకే వినియోగించేవాడు. అవి యుద్ధాలకు, న్యాయ నిర్వహణకు రాజ-న్యాయస్థానికి, దైవ క్రతువులకు, ఉత్సవాలకు, వేటలకు మాత్రమే. ఉత్సవాలు, వేడుకలు, వేట సమయాలలో ఆయన చుట్టూ స్త్రీలు రక్షణ వలయాలుగా ఏర్పడి తమ రాజును రక్షించేవారు.

కుటుంబం

చంద్రగుప్తకు చాలామంది భార్యలుండేవారు. వారిలో ‘దుర్ధర’ (Durdhara) మాత్రమే మహారాణి స్థానం పొందింది. ఈ భార్యల ద్వారా అనేక మంది కుమారులు కలిగారు. వీరిలో దుర్ధర కు జన్మించిన ‘బిందు సార’ మాత్రమే చంద్రగుప్తకు వారసుడయ్యాడు.

క్రీ.పూ. 305 లో సెల్యూకస్ నికేటర్ (Seleucos Nikator) బాబిలోన్, పర్షియా, ఇతర రాజ్యాలను జయించి పంజాబులో సింధు నదిని దాటి మౌర్య సామ్రాజ్యంలో ప్రవేశించినప్పుడు చంద్రగుప్త అతనిని ఓడించి గ్రీకువీరునికి అవమానకర రీతిలో కాబుల్, గాంధార, హెరాత్ (ఇప్పటి ఆఫ్ఘనిస్థాన్ లోని భాగం), బలూచిస్తాన్, తదితర ప్రాంతాలను తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఫలితంగా మౌర్య సామ్రాజ్యం ఉత్తరాన ఆఫ్ఘానిస్తాన్ వరకు విస్తరించింది. ఈ సంధి ఒడంబడికలో భాగంగా సెల్యూకస్ తన కుమార్తె, 15-17 మధ్య ఏళ్ల వయస్సు ఉన్న ‘హెలెనా’ (Helena) ను 45 ఏళ్ల వయస్సున్న చంద్రగుప్తుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. మెగస్తనీస్ ను మౌర్య ఆస్థానంలో రాయబారిగా సెల్యూకస్ నియమించాడు.

ప్రతిగా చంద్రగుప్త మౌర్య సెల్యూకస్ కు 500 ఏనుగులు, భారీగా బంగారం, మణులు, వజ్రాభరణాలు, ఇతర విలువయిన వస్తువులను బహుమతిగా ఇచ్చాడు. తద్వారా మౌర్య-గ్రీకు సామ్రాజ్యాల మధ్య సత్సంబంధాలు బిందుసార కాలం వరకు నెలకొన్నాయి. చంద్రగుప్త-హెలెనా లకు ఒక కుమారుడు (జస్టిన్: Justin) కలిగాడు.

జైన సన్యాసిగా మారటం, మరణం

క్రీ.పూ. 298 లో జీన (జైన) మతం సన్యాసి ‘భద్రబాహు’ దక్షిణాదిన కర్ణాటకలో 12 ఏళ్ల పాటు రాబోవు కరువును దివ్యదృష్టితో చూశాడు. దీనిని తెలుసుకున్న చంద్రగుప్త అమితంగా కలవరపడి తన సింహాసనాన్ని కుమారుడు ‘బిందుసార’ కొరకు త్యజించి, భద్రబాహు, ఆయన12,000 శిష్యులను కర్ణాటకకు అనుసరించాడు. వీరందరూ జంట శిఖరాలున్న ‘శ్రావణ బెళగొళ’ లో స్థిరపడ్డారు. ఈ పట్టణం బెంగుళూరుకు 140 కి.మీ. (87 మైళ్ళు) దూరంలో ఇప్పటి హస్సన్ జిల్లాలో ఉంది.

అక్కడకు చేరిన తరువాత చంద్రగుప్త తన శేష జీవితాన్ని అత్యంత నిరాడంబరంగా జీవించి, సమస్తం త్యజించి జైన భక్తుడుగా గడిపాడు. చివరి కాలంలో ఒక గుహలో ఒంటరిగా జీవిస్తూ, ఆహారాన్ని కూడా త్యజించి, సమాధి స్థితిలో ఉండి క్రీ.పూ. 297 లో (53 ఏళ్ల వయస్సులో) మరణం ఆసన్నం చేసుకున్నాడు. ఆయన మరణం తరువాత అక్కడి రెండు పర్వతాలలో ఒకటి ‘చంద్రగిరి’ గా ప్రసిద్ధి చెందింది.

Chandragupta-Maurya-Empire
Photo Credit: Wikipedia

క్రీ.పూ. 298 లో చంద్రగుప్త మౌర్య నుండి తన పుత్రుడు బిందుసారకు సంక్రమించిన సామ్రాజ్యం.

****సశేషం****

Posted in January 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!