చదవాలి -- పద్మావతి రాంభక్త
మొట్టమొదట ఒకింత సరదాగానే మొదలైంది
పేజీల గుండా పసిపిల్లలా
తప్పిపోతూ
గాలిపటంలా ఎగరడం
కథాచినుకులలో తడిసిపోయి
కవిత్వపు గొడుగు నీడలో సేదదీరడం అలవాటైంది
అక్షరసౌరభాలను
తనివితీరా ఆఘ్రాణిస్తూ
వాక్యాల విరులను హృదయానికి పొదువుకుంటూ
నడవడం
దినచర్యగా మారింది
ఎన్నో తలుపులను తెరచుకుంటూ
మరెన్నో వింత కిటికీల గుండా
తొంగిచూస్తూ వెడుతుంటే
అప్పటివరకు
ముడుచుకున్న పువ్వు
వికసించడం ఆరంభమైంది
పాత దుఃఖాలను జోకొట్టుకోడానికి
ప్రయాణపు ఉక్కపోతలో
అలసిన బ్రతుకును
ఆరబెట్టుకోడానికి
తోటలో యదేచ్ఛగా తిరుగుతూ
మైమరచి పోవడం
మంత్రముగ్ధవడం జరిగింది
అపురూపమైన వాటిని వెతుక్కుంటూ
విరిగి ముక్కలైన స్వప్నాలకు అతుకులేసుకుంటూ
సాగడంతో
పయనం కొంత సులభతరమైంది
కనురెప్పల పిట్టల రెక్కలను
దివారాత్రులు
ఎంత ఆడించినా
ఇంకా ఎంతో మిగిలే ఉంటుంది
ఇప్పుడిక సముద్రాలలో మరింత ఈదాలి
కొత్త నదులలో స్నానమాడాలి
అరచేతిలో మిగిలిన
కాసిని జీవితపు క్షణాలను
అపురూపంగా దొరకపుచ్చుకుని
చేజారిపోయిన కాలాన్ని
లెక్కించడం మాని
విస్తృతంగా
వనంలో విహరించాలి
ఎన్నడూ చూడని
అసలేమాత్రం ఊహించని ప్రపంచాన్ని స్పృశించడానికి
నిద్రిస్తున్న ఆత్మను తట్టిలేపి
మరింత లోనికి తొలుచుకుని
తెలుసుకోవడానికి శ్రమించాలి
అణువంత దానిని
ఆకాశమంత విస్తరించడానికి
చీకట్లను తోలుకుంటూ
సూర్యరశ్మిని
గుండెల నిండా శ్వాసించాలి.
.
దృష్టినిబట్టే దృశ్యం -- అరుణ నారదభట్ల
అతనంటాడు
ఏడిపించేదే నిజమైన కవిత్వమని
నేనంటాను
ఆనందం కవిత్వమని
నిజమే అతిగా ఆవహించనిది
కవిత్వమెలా ఔతుంది?
తీరంకోసం వెతుకులాటలో పుట్టుకొచ్చే సునామీ కవిత్వం
మెలికపడి మరణపు అంచును అనుభవించడం కవిత్వం
కాలిన కడుపులోని వేదన కవిత్వం
ప్రేమలో మునిగి పిచ్చెక్కినప్పుడు పుట్టుకొచ్చే బాధ కవిత్వం
మనసుకుండ నిండి నెర్రెల ఆనవాళ్ళ నుండి శ్రవిస్తున్న
ద్రవాల వెలుగు ప్రవాహ తరంగమే కవిత్వం
ఔను ఏడవటమే ధ్యేయంగా బ్రతుకుతున్నవాళ్ళం...
చింతల చితిని ఆస్వాదిస్తున్న వాళ్ళం
ఆనందాలను ఎలా స్వాగతించగలం?
పువ్వులను... పక్షులను... చినుకులను...
మట్టిముద్దను...నక్షత్రాలను... ఆకాశాన్ని.... చల్లగాలినీ... చందమామనూ
ముత్యాల జల్లులను... పచ్చని చిగురాకులనూ
అన్నింటినీ ఆ ఉప్పునీటిలోనే తెగముంచి పరిచయం చేయడానికి అలవాటు పడ్డవాళ్ళం...
ఇప్పుడు కొత్తగా
హిమశిఖరాలవైపుకు ఎదురీదడం సాహసమే...
ఐనా నా ప్రతి అక్షరం
ఓ హిమనీనదం
నడక సుస్వర చలనం
హృదయం వసంత కుసుమం
గమనం ఒక విశాలగగనం
లక్ష్యం అనంత విశ్వం!!
నా కవిత్వం -- డా. రవూఫ్
నా ప్రపంచంలో.....
పక్కకి జరిపిన
వెలసిన కర్టైన్ లుంటాయి
వెల వెల బోతున్న
వెల్లవేయని గోడలుంటాయి
కొన్ని మాటలూ;
మాటల మధ్య పూరించని
ఎన్నో ఖాళీలూ;
ఖాళీల్ని అల్లుకొంటూ
పరచుకున్న మౌనం
తెరచిన తలుపులూ,
కిటికీలూ .....
విప్పారిన ఆకాశం
ఉప్పొంగే ఉత్తుంగ సముద్రాలూ
ప్రవహించే చెట్ల పచ్చదనాల
గల గలలున్న గది!
ఆ గదిలో ఒక దివ్వె వెలుగుతూ ఉంటుంది
అది నా ఆత్మ వినా ఇంకోటి కాదు.
అది ఎగసి పడే హృదయమై
కవిత్వాన్ని పలుకుతుంటుంది.
మనసు కిటికీ – పాతూరి అన్నపూర్ణ
ఒక్కోసారి స్థబ్దత నన్ను దుప్పట్లా చుట్టుకుంటుంది
గాలి ఆడనట్లు ఉక్కిరి బిక్కిరవుతుంటాను
ఊరడించే మనసు
జ్ఞాపకాల కిటికీ తెరుస్తుంది
ఊరట దొరికేది ఎక్కడో తెలుసుకుని
ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది
ఎప్పటి ఊసులో బాల్యం రూపంలో
బంతిపూల తోటలాంటి మధుర స్మృతులు
ఆటలాడిఆడి అలసిపోయి వస్తే
పైటకొంగుతో చెమట తుడిచి
అన్నంముద్దలు కలిపి పెట్టే అమ్మ ప్రేమ ముందు
వెన్నెల వెల వెల పోయేది
సంద్రంలో కెరటాల్లా కొట్టుకొ స్తున్న గుర్తులన్నీ
దాచుకున్న రంగుల గవ్వల్లోంచి తొంగి చూస్తున్నాయి
అవ్వ చెప్పే ఏడు చేపల కధలు
నాన్న భుజాల నెక్కి ఆడిన గుర్రం ఆటలు
కరిగిపోయిన బాల్యం ఆనవాళ్ళైనాయి...
తూర్పు చెరువులో ఈత కొట్టడాలు
బంకమన్ను పిసికిన చేతుల్లో వెలిసిన
వినాయకుడి బొమ్మలు
ఊరంతా సందడిగా తిరిగే పండగల సంబరం
మలయ మారుతంలా నన్ను తాకుతుంది
నాలో కొత్తనీటిని ఒంపుతుంది...
యాంత్రికమైన జీవితంలో
గతం పంచే జ్ఞాపకాలు
ఎండా కాలంలో కురిసే వాన జల్లులు.