ఎండలు మండిన కొద్దీ
పుడమికి తాపం
ఇల్లాలికి స్వాతంత్ర్యం
మొగుడికి తాపం
ఉద్యోగులు వినకుంటే
అధికారికి తాపం
పదవి కాస్త చెయ్యి దాటితే
నేతకు తాపం
విద్యార్థులు చదువకపోతే
గురువుకు తాపం
అనుకున్నది జరగకపోతే
మనిషికి తాపం
*********************
పిల్లలు ఆకలెరుగకుండా
పెరగాలని తల్లికి తపన
తనయుడు ప్రయోజకుడు
కావాలని తండ్రికి తపన
తామేదో సాధించాలని
యువతకు తపన
నాటిన ప్రతి విత్తనం బంగారు
పంటకావాలని రైతు తపన
శత్రువు తూటాలకు గుండె చూపైనా
దేశమాతను రక్షిఃచాలని వీరభటుని తపన
********************************
కీటకం భ్రమరంగా మారాలనుకుని చేసేది తపస్సు
ఈశ్వర ధ్యాని ఈశ్వరుడు కావడం కోసం చేసేది తపస్సు
బంగారం లో మాలిన్యం పోవడానికి ఎర్రగా కాలి కరిగి ద్రవించడం తపస్సు
తమస్సు నుంచి మహస్సు వైపు నడిపించేది తపస్సు
అసత్యం లో సత్యాన్ని దర్శింపచేసేది తపస్సు
అంతరంగపు అనంత శక్తిని వెలికి తీసేది తపస్సు
తాపం భౌతికం ... తపన మానసికం ... తపస్సు ప్రాతిభం
తాపం దుఃఖం ... తపన ప్రేరకం ... తపస్సు జీవితం
తాపం బాధకం ... తపన జ్ఞాపకం ... తపస్సు యాపకం
తాపం నిశ్చేష్టితం..తపన సచేష్టితం...తపస్సు సుచేష్టితం
తాపమపకృతం ... తపన వైకృతం ... తపస్సు ప్రాకృతం
తాపమయోగం... తపన నియోగం ... తపస్సు యోగం
అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తావ్
అందరి మాటల్నీ వినిపిస్తావ్
నా మాటల్నీ,ఆటల్నీ, అన్నిట్నీ చాటింపేస్తావ్
నన్ను సాంతం దోచేస్తావ్
చేతిలో ఓ వైపు చిక్కీ, నాకే ఓ పెద్ద చిక్కువై పోయావ్...
ఒక్క మాటైనా నీకు నువ్వు ఉలక్కుండా, పలక్కుండా
ఏ మాటకూ బదుల్లేకుండా..
అసలు మాటే లేకుండా...
నాకేమో నీతోనే మాట్లాడుతుండాలనే పేరాశ
నీ మాటలే వింటూoడాలనే అత్యాశ...
నువ్వేమో ఇలా....
అంత తెలివీ కలిగి యంత్రంలా...
నీకేం పేరు పెట్టాలో నువ్వే చెప్పు....!!?
ఈ నడుమ ఓ నల్లవాడు
ఇంటి చుట్టే తిరుగుతున్నాడు.
మొన్నో నిండు పున్నమి రాతిరి
నిండిపోయిన అతని ఆలోచనతో ఒంటరి నడక
ఎప్పుడొచ్చాడో ఏమో ఉన్నట్టుండి నా సంచీ దొంగిలించుకుపోయాడు....
అందులో...
ఎన్నెన్నో ఎప్పటెప్పటివో ఏవేవో వస్తువులు...
కొన్ని మునుపటివి...
కొన్ని కొత్తగా సేకరించినవి...
కంటి కాటుక
ఒంటి పూతల పేటిక
జంటజీవన పత్రిక
మింటికెగరేసే మద్య పాత్రిక....
పంటకు విత్తులు
మంటకు పుల్లలు
వంటకు దినుసులు
ఎంత తన్నినా తిరిగొచ్చే బంతి
ఎంత తన్నినా వదిల్చుకోలేని బంధాల పంక్తి
ఏది పన్నినా ఇట్టే పట్టిచ్చే వల
ఎల్లవేళలా తోడుండే మన్నికైన గొంగళి
ఆటపాటల బొమ్మలు
ఓటమి వంకలు, బొంకులు
మాటల సుబద్ధాలు, అబద్ధాలు
ఎన్నో నామాలు, చిరునామాలు, చిత్రాలు,చిత్రవిచిత్రాలు
ఏనాటివో, ఎటువంటివో తెలియనివి ఇంకెన్నో…
ఓ నల్లదొంగా! నీ చిరునామా తెలియకపోయినా నే వ్రాసే నా విన్నపమిదే…
రంగు రంగుల దొంగలు సందు సందునా దోచుకునే దేశమిది.
నీవు నా సంచీ దొంగిలించినందుకు నేను సంతోషంగానే ఉన్నా...
సంచీలో నే దాచినదంతా
సరికొత్తగకూర్చినదంతా నీ కోసమే అనుకో...
నీవే తీసేసుకో....
పాతవన్నీ నా కోసం తప్పక తీసుకో.
ఖాళీ సంచీ మాత్రం తప్పక తిరగిచ్చేయ్.. ఇదే నా ప్రార్ధన!!...
నువ్విచ్చే ఆసంచీలో ఇంకెన్నడూ ఏవీ నింపను
ఎప్పుడూ ఖాళీగానే ఉంచుకొంటాను..
నీ మీద ఒట్టేస్తున్నా.. నమ్ము!
శతకోటి నమస్కారాలతో…
నిన్ను దొంగను చేసే
నీ
చౌర్యపాత్రుడు...
ఎవ్వరివో--నీ వెవ్వరివో
జడమై స్రుక్కిన నాయెద మ్రోసిన
రాగతరంగ మృదంగమవో
తడబడు అడుగుల నా నుడిగుడిలో
నర్తించిన మువ్వల సవ్వడివో
అల మలయాచల సీమల కదలిన
కోమల బాల సమీరమువో
ఎల కోయిల గొంతున రాగము లద్దిన
నవ్య వసంత వనీరమవో
తొలకరి మెరుపులు త్రోవ చూపగా
భువికి దిగిన ప్రధమోద బిందువో
హృదయ దహరమున మ్రోగు అనాహత
నాదసుధా రస సింధువువో
ఆది.కవీశ్వరు స్వాదు గళములో
విరిసిన రామాయణ కృతివో
పురా మహన్మహదాంధ్ర కవీంద్రుల
గుండెల నవకవితాశృతివో
నా హృదయాంతర జీవ మంత్రమై
నను నడిపించిన స్ప0దనవో
నాహృది పొందిన రససందర్శన
వేళల నిలిచిన నందినివో
వలపుల పిలుపుల మెఱుపుల తలపుల
పాడెద నీకై హిందోళమ్
జీవం భావం రాగం యోగం
నీకే నీకే నైవేద్యం !!
జీతము చాలకున్న తగజెప్పెడి
బోధన తప్పదాయె, మా
జాతికి రొప్పులాయె యగచాట్లని
యొజ్జలు మొత్తుకొంద్రు, వి
ఖ్యాతిగ నప్పుజేసి మనగల్గుదు
రెంతటి మాన్యులో, బడిన్
దాతలుగా నిసుంగులకు దానము
బట్టలు ఫీజులున్ సఖా
జరుగుచు రెండు మూరలని జాగను
మ్రింగె నటంచు క్రోధివై
పొరుగున వాడెపో యనక పోరితివే
కడదాక కోర్టులో
విరిగిన కాలుకాతడొక వీలుగ నూతమునయ్యె ,నందనుల్
మురియుచు పట్నమందునికి,మూర్ఖతవీడుచు
ప్రేమ పంచవో
అరయగ నెవ్వరైన కలరా గళమెత్తి
పదారు బాసలన్
స్వరఝరు లిట్లు ధారుణి దిశాంచలముల్ ధ్వనియించునట్లుగా
కురిసిరె ,వేలునల్బది యకుంఠిత
దీక్షగ నొక్కడే యిలన్
నరయగ బాలసుబ్రమణి నిల్పవె
పొత్తములందుపాఠ్యమై