Menu Close
సాహసం (కథ)
-- ఆదూరి హైమావతి --

నరవాడ అనే గ్రామం పక్కనుంచి భాగమతీ నది ప్రవహిస్తుంటుంది. ఆ ఊర్లో పది పన్నెండేళ్ళ బాలురు ఇంచుమించూ ప్రతి పౌర్ణమికీ ఆ నదిలో ఈతలుకొట్టి ఆనందిస్తుంటారు. ఒక పున్నమి రోజున వారు ఈత కొడుతుండగా ఆ నదికి కొద్దిదూరంలో ఉన్న ఒక పాడుపడిన పూర్వపు రాజుల బంగళా నుంచి సన్నటి వెలుగు రావడం ఆ పిల్లలలో అత్యంత చురుకైన వాసు గమనించాడు. తన స్నేహితులతో "ఒరే నేస్తాలూ! అటుచూడండి. ఆ బూత్ బంగళానుంచి వెలుతురు వస్తున్నది. లోపల ఎవరైనా ఉన్నారేమో!" అన్నాడు.

దానికి అతని నేస్తం నాగు ."ఒరే వాసూ అది దయ్యాల బంగళా. లోపల దయ్యాలుండి ఉంటాయి." అన్నాడు.

అరుణ్ "కాదురా లోపల పూర్వపురాజుల పెద్ద అద్దాలు ఉండి వాటిమీద వెన్నెల పడి మనకు వెలుగు కనిపిస్తుండవచ్చు." అన్నాడు. "కాదురా! దయ్యాలు దీపం వెలిగించి ఉంటాయి." అన్నాడు రమణ.

"ఏది ఏమైనా మనం లోపల ఎవరున్నారో తేల్చుకుందాం రా!" అన్నాడు వాసు.

"ఒరేవాసూ! ఆ దయ్యాల భవంతి జోలికెళ్ళను అని మాటిచ్చాకే నన్ను మా అమ్మా నాన్నా పంపారు. మనకెందుకురా ఆ దయ్యాల జోలి. జల్సాగా ఈతకొట్టుకుని వెళదాం" అన్నాడు మధు.

"ఒరే మనం ఇన్నాళ్ళుగా ఈతకొడుతున్నా కనిపించని దీప కాంతి ఈ రోజు కనిపించిందంటే లోపల తప్పక ఎవరో ఉండే ఉంటారు. నేను వెళ్ళి చూస్తాను." అన్నాడు పట్టుదలగా వాసు.

"ఒరేవాసూ! ఆపదలు కొనితెచ్చుకోవడమంటే ఇదే. నోరుమూసుకుని మాతోరా ఇంటి కెళదాం." అన్నాడు గోపి. ఆ పాటికి వారి ఈతలు పూర్తై బయటికొచ్చి బట్టలు మార్చుకున్నారు.

వాసుమాత్రం పట్టుదలగా అందరితో కలసి నడుస్తూ "ఒరే నేస్తాలూ! మనమేం పిరికి పందలం కాము. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ పుట్టిన దేశంలో పుట్టామురా! ఎందరు మహానుభావులు ఎన్నెన్ని గొప్ప పనులు చేయలేదూ! దయ్యాలేం చేస్తాయి రా! హనుమాన్ దండకం చదివితే పారిపోతాయి. ఏమైనా సరే నేను లోపలికెళ్ళి లోపల ఎవరున్నారో చూస్తాను. ఎవరైనా దేశద్రోహులు ఉంటే వారిని పోలీసులకు పట్టిస్తాను." అన్నాడు.

మిగతా వారంతా "నీకేమైనా పిచ్చి పట్టిందా! పన్నెండేళ్ళ వాడివి లోపల నిజంగానే దేశద్రోహులుంటే, వారి దగ్గర  పిస్తోళ్ళూ, బాంబులూ ఇంకా చాలా ఆయుధాలుంటాయి. వారితో మనకెందుకూ పద  వెళదాం." అన్నారు.

"లేదురా నాకు పిరికి మందుపోయకండి. నేను లోపలికెళతాను. అక్కడ నిజానికి ఎవరైనా దేశ ద్రోహులే ఉంటే వారి ఆనుపానులు కనుక్కుంటాను. ఒకవేళ వారికి దొరికిపోతే నేను ఆకనిపించే చిన్న కిటికీకున్న కన్నం నుంచీ ఏదైనా ఉత్తరం వ్రాసి రాయికి కట్టి బయటికి పడేస్తాను. మీరు రోజూ ఇటువచ్చి చూసి ఏదైనా ఉత్తరం కనిపిస్తే తీసుకెళ్ళి మన సైన్స్ మాస్టారి కివ్వండి. ఆయనకు అపరాధ పరిశోధనలంటే అభిమానం. మీరెన్ని చెప్పినా నేను లోనికెళ్ళడం తధ్యం. మా తాతగారికి నేను మీరెవరి ఇంట్లోనో ఈ రోజు పడుకుంటానని చెప్పానని చెప్పండి." అంటూ ఎప్పుడూ తన జేబులో ఉండే తన పెన్ నోటుబుక్కు మాత్రం  జేబులో ఉంచుకుని మెల్లిగా వెనుక నుంచి గోడదూకి లోపల ప్రవేశించాడు.

మిగతా వాడి నేస్తాలంతా భయభయంగా కొద్ది సేపుమాత్రం చూసి ఇళ్ళకు బయల్దేరారు. లోపల ప్రవేశించిన వాసు మెల్లిగా ఒక్కోరూమూ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఒక పక్కన ఉన్న తమకు కాంతి కనిపించిన గది ముందుకు వెళుతుండగా అక్కడున్న ఒక బల్ల కాలికి తగిలి శబ్దమైంది. వెంటనే వాసులేచి ఒక మూలనక్కే లోపలే నలుగురు బలమైన వారు వచ్చి వాడిని పట్టుకుని గదిలోకి తీసుకెళ్లారు.

ఒకడు చెంపపై కొట్టి "ఎవరు  నీవు? ఎందుకొచ్చావిక్కడికి ? ఇంకానీతో ఎందరున్నారు" అంటూ ప్రశ్నించాడు. ఆ దెబ్బకు చెవిగూబ దిమ్మెక్కి వాసు కొద్దిసేపు ఏమీ మాట్లాడలేక పోయాడు. కాస్త సేపయ్యాక "నాకు దయ్యాలను చూడాలని ఆశ. దీనికి దయ్యాల భవంతి అని పేరు. ఒకమారు దయ్యాలను చూసి పోదామని నేనొక్కడినే వచ్చాను." అన్నాడు వారు నలుగురూ విరగబడి నవ్వి "చూడరా భడవా! మేమే దయ్యాలం" అంటూ వాడి చేతులుకట్టేసి ఒక కుర్చీలో కూలేసి, ఏవేవో కాయితాలు చూసుకోసాగారు. తెలతెలవారుతుండగా "ఇక్కడే పడుండు మళ్ళా రాత్రికి వస్తాం. నీకూ తిండి తెస్తాంలే. అప్పటిదాకా ఈ నీళ్ళు తాగి నిద్రపో" అంటూ ఒక చేతికట్టు తీసేసి, బయట తాళం వేసేసి పోయారు.

వారటు వెళ్లగానే, వాసు మెల్లిగ రెండో చేతికట్టు వదులు చేసుకుని, వారు చూస్తున్న కాయితాలు జాగ్రత్తగా చదివాడు. వారు విద్రోహులే. దేశంలో అక్కడక్కడా బాంబులు వేసి ప్రజలను భయావహులను చేసి రాత్రులు ఎవరూ వీధుల్లో తిరక్కుండా చేశాక పెద్ద బ్యాంకులను దోచుకునే పథకం వేసుకుని కాయితాల్లో గుప్తవ్రాత వ్రాసుకున్నారు. వాసుకు గుప్త వ్రాతలు చదివే తెలివి ఉంది. వెంటనే తానూ ఒక గుప్త వ్రాతలో అక్కడి వారి గురించీ తనకున్న అనుమానం చిన్న కాగితంలో వ్రాసి, కొన్ని ఉత్తకాగితాలు కూడా వ్రాసి కొన్నిటిమీద ఏవేవో పిచ్చి వ్రాతలువ్రాసి ఒక్కోటీ బయటకు రాయికి కట్టీ కిటికీ నుంచి విసిరేశాడు. గది కిటికీ ఎక్కి తన మాటప్రకారం తన స్నేహితులు వచ్చి తాను విసిరేసిన ఉండలను చూస్తారా లేదా అని గమనించ సాగాడు. మధు, గోపీ అక్కడ తచ్చాడుతూ ఉండటం చూసి సంతోషంగా మరో కాయితం ముక్కలో తాను ఇక్కడే క్షేమంగా ఉన్నట్లు వ్రాసి విసిరేసి, వారిని వెళ్ళిపొమ్మని వ్రాశాడు. ఆ కాయితం ముక్కా వారు తీసుకుని చదివి చెయ్యూపి ఊరికేసి పరుగెత్తడం గమనించాడు వాసు.

రాత్రయ్యే సరికి వారు తప్పక వస్తారని ఊహించి వాసు తన చేతికట్టు బిగించుకుని నిద్రపోతున్నట్లు నటించి పడుకున్నాడు. వారు నలుగురూ వచ్చి నిద్రపోతున్న వాసును లేపి కాస్త తిండి పెట్టి "భయమేసిందా!" అని అడిగారు.

"దయ్యాలను చూడాలని వచ్చాను కదా! నాకు భయమేయ లేదు." అని ధైర్యంగా చెప్పిన వాసును చూసి "వీడిని మన పనయ్యాక మనతో తీసుకెళితే మనకు బాగా పని కొస్తాడు. తెలివీ ధైర్యమూ ఉన్న పిల్లలే మనకు కావాలి . అందాకా వీడినిక్కడే ఉంచి తిండిపెడుతూ ఉందాం." అనుకున్నారు. "నిద్రపోరా!" అంటూ వాడిని పక్క గదిలో ఉంచి తాళం వేశారు. ఏవేవో చిత్రాలూ, పటాలూ చూసుకుంటూ తమతో ఉన్న ల్యాప్ ట్యాప్ లో ఏవేవో టైప్ చేసుకుంటూ ఏదో మాట్లాడుతూ రాత్రంతా గడిపేసి తెల్లారే ముందు వెళుతూ వాసు చేయికట్టేసి నీళ్ళ సీసా పక్కనే పెట్టి వెళ్ళారు. అదేవారు చేసిన తెలివి తక్కువపని.

వాసు వారువెళ్ళినట్లు నిర్ధారించుకున్నాక తాను వారు చేయబోతున్న పనులూ తాను విన్నవన్నీ కాయితాల్లో వ్రాసి బయటికి పడేసి, త్వరలో వారి పధకం అమలు చేస్తారనీ, ఈరోజు రాత్రే నిశ్శబ్దం గా సైన్స్ మాస్టారు కొందరు ధైర్యమున్న ఊరి వారితో వచ్చి ఆనలుగురినీ  పట్టుకోవాలనీ వ్రాసి కాయితం ఉండ బయటికి విసిరేశాడు. దాన్ని వారు తీసుకుని చదివి పరుగు పరుగున ఊర్లోకెళ్లారు. ఆ రాత్రి వాసును వారు గదిలో ఉంచగానే వాసు ముందురోజు గమనించిన పక్క గది వాకిలి తీసుకుని మరో గదిలోకీ అలా పదిగదులు దాటుకుని హాల్లో కొచ్చి, అక్కడినుంచి వెనుక ఉన్న బంగళా బాల్కనీ లోంచి బయటికి ఉన్న తలుపు తెరిచి ఉంచాడు. సుమారుగా 20మంది బలిష్టులైన, కర్ర సాములో ఆరితేరినవారితో సైన్స్ మాస్టారు కలసి వచ్చి ఒక్క ఉదుటున ఆనలుగురిమీదా పడి తాళ్ళతో పెడరెక్కలు విరిచి కట్టేసి, అందరినీ బయటికి నడిపించారు.

ఆతర్వాత జరిగిన సభలో ‘బాల వీర బిరుదిచ్చి వాసును, అతని కోరికపై అతని స్నేహితులనూ సన్మానించారు కలెక్టరు గారు.

భయపడితే ఏమీ సాధించలేము. దేనికీ భయపడక బాలలంతా ధైర్య సాహసాలు ప్రదర్శించి దేశమాతను కాపాడుకోవాలి. ధైర్యే సాహసే లక్ష్మీ.

********

Posted in March 2023, కథలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!