నాన్నను ఒక్కరోజులో పరిచయం చేయమంటే ఎలా...
ఒక్క వాక్యంలో పొదగమంటే ఎలా...!?
నాన్న మండే సూర్యుడై శ్రమలఆకాశంలో ప్రకాశించిన ప్రతి రోజూ
వెన్నెళ్ళు మా గిన్నెల్లో నిండేవి...
పున్నములు మా కన్నుల్లో వెలిగేవి!
నాన్న చెమట చుక్కలు చేటలో బియ్యమై నవ్వినప్పుడు
అమ్మ ఆ నవ్వుల్ని దోసిట పట్టి
బువ్వపువ్వుల్ని చేసేది!
రెక్కల్లో మా భవితను దాచిన
నాన్న తను ముక్కలౌతూ
మమ్మల్ని మొలకెత్తించాడు!
చుక్కల్లో తన బాధల్ని కొండెక్కించి
తను దీపమై మా నటింట్లో వెలిగాడు!
చీకటిని తరగడం నాన్నకు భలే ఇష్టం!
మెల్లగా కొన్ని ఆశల్ని పెరట్లో నాటి
స్వేదజలాన్ని పోస్తూ
తోటమాలై
మా ప్రగతి చిగిర్చే వరకూ
తన కష్టాన్ని కాపలా పెట్టాడు!
నాన్నబావికి ఇంకిపోవడం తెలీదు
ఇప్పటికీ మా గొంతుల్ని తడుపుతూ
తీయని మాటై పెదవుల్లో పూస్తూనే ఉన్నాడు!
ఖాళీ జేబుల్లో
మా కలల్ని నింపుకొని
ఉప్పొంగిపోయే నాన్న
ఒట్టి పిచ్చిమారాజు కాక మరేంటి...?!
ఆ మారాజుకి ఒక్కరోజే పట్టాభిషేకం అంటే
పిచ్చి కాక మరేంటి...?!
నాన్న
వెంట సాగే నీడ...
కడకంట సాకే ప్రేమ!
అమ్మను నిర్వచించినంత
నాన్నను నిర్వచించకపోయినా...
నాన్నో వాడని పూలఋతువు!
ప్రవహించే నెత్తుటిలో ప్రతి బొట్టు ...
శ్వాసించే ప్రతి నిమిషం ఊపిరి పోసే చెట్టూ
నాన్న!
సిరిమల్లె వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు