ప్రియ అతిధి – ఉగాది
శ్రీ శోభకృతు కు స్వాగతమంటూ
మరలి పోయింది శుభకృతు నామ వత్సరం
తరలి వచ్చింది తెలుగు సంవత్సరాది- ఉగాది సంబరం
వెరసి చైత్ర శుద్ధ పాడ్యమి నాటి పర్వదినం
దక్షిణాయణ – ఉత్తరాయణ పుణ్య కాల అనుసంధానం.
షడ్రుచుల మేళనం ఉగాది నాటి పత్యేక నివేదనం
పచ్చి మామిడి, చింతపులుపు, కారాల సమ్మిళితం
చెరుకు తీపి, వేప చేదు, వగరు ౘవుల సంకలనం
జీవితాన ఒనగూడు ఒడిదుడుకులకివి సంకేతం.
తిధి, వార నక్షత్ర కరణం- యోగం - పంచాంగ శ్రవణం
వాడ వాడలా జ్ఞాన ప్రచోదనం - కవి సమ్మేళనం
ఇంటింట గుమ్మానికి అలంకృతం - లేలేత ఆమ్ర పర్ణ తోరణం
ఆకర్ణాంతమ్ అమృత సేవనం - కలకూతల కోకిల సుస్వర గానం.
యుగ యుగాల సంధి ఉగాది
వచ్చి పోతుంది ప్రతి ఏడాది
తెలుగు వారింటి ప్రియ అతిధి ఉగాది
ఆంధ్రుల సాంస్కృతిక పెన్నిధి ఉగాది.
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
తెలుగు వారి ఉగాది పండుగ విశిష్ఠతను గురించి
” ప్రియ అతిధి ఉగాది ”
కవితలో స్పష్టంగా చెప్పారు.