తరాలు-అంతరాలు
మనిషి జీవితం ఎంతో ఉత్కృష్టమైనది. ప్రతి మనిషి పుట్టుకకు ఒక నిర్దిష్టమైన కారణం ఉంటుంది. దానిని పరిశీలించి, అవగతం చేసుకుని తదనుగుణంగా జీవనశైలిని అలవరుచుకుని స్థిర సంకల్పంతో పయనించిన వారు అందరికీ ఆదర్శప్రాయులుగా నిలుస్తారు. అది అంత సులువు కాదు. కనుకనే మనం అటువంటి వారిని ఆదర్శమూర్తులు అని నిర్వచిస్తాము. ప్రతి మనిషి ఆలోచనలు తను పెరిగిన వాతావరణానికి అనుగుణంగా ఉంటాయి. కాకుంటే ఆ ఆలోచనల పరిధిని పెంచి సామాజిక జీవనశైలి యొక్క అనుప్రాసలను మనం గుర్తెరిగిన నాడు మనలోని సామాజిక స్పృహ మరింతగా బలపడుతుంది. నిజ జీవితంలోని ప్రాయోజిత అంశాలలో కేవలం పదిశాతం మనం పాటించిననూ ఎల్లవేళలా మానసిక ధృడత్వం తో మసలుతాము. తద్వారా భౌతికంగా కూడా చైతన్యవంతంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అదే నిత్య ఆరోగ్యసూత్రమౌతుంది.
అయితే పైన చెప్పిన విధంగా ఒక నిర్దేశిత జీవనశైలిని అలవర్చుకుని మంచి జీవితానికి కావలిసిన కనీస సూత్రాలను పాటించాలంటే ముందుగా మన ఆలోచనా విధానంలో ఒక స్థిరత్వం కనబడాలి. అలాగే, మనకు అనుగుణంగానే ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి, ప్రతి కార్యం జరగాలి, ప్రతి విధానం మన చాదస్తాలను త్రుప్తిపరచాలి అనే భావనను ముందుగా విడనాడాలి. ప్రస్తుత కాలంలో ఇటువంటి ఆలోచనల వలననే మన తరానికి మన తరువాతి తరానికి అభిప్రాయబేధాలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరి జీవితాలను మనమే నిర్ణయించాలనే అపోహను వదిలితే అది ఒకందుకు మనకే మంచి చేస్తుంది. అనవసరమైన మానసిక వత్తిడులు తగ్గుతాయి. దైవనిర్ణయం అని మనం నమ్ముకునే మన సిద్ధాంతాలలో ఇది కూడా ఉంది. మన పిల్లలు మనకు తగినట్లుగానే మన నిర్ణయాలను గౌరవించి ఉండాలంటే ముందుగా మనం చేయవలసిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఆ తరువాత ఫలితాల కొరకు వేచివుండడమే ఉత్తమం. ఫలితాలు అనేవి ఎల్లప్పుడూ మనకు తగినవిధంగా రావు. రావలసిన నియమం కూడా ఏమీ లేదు. ఆ ఫలితాలు మన నియంత్రణలో ఎల్లవేళలా ఉండవు. మన ఆలోచనల విధి విధానాలలో మార్పులు అవసరం అయినప్పుడు, సర్దుకునే మనస్త్వత్వం ఏర్పరుచుకుంటే అది మనకే మంచి చేస్తుంది. మనకు దక్కవలసిన గుర్తింపు, గౌరవం రెండునూ లభిస్తాయి.
ఈ మధ్యనే నా వాట్స్ అప్ సమూహాలలోని ఒక సమూహంలో ఒక చర్చ జరిగింది. అందలి సారాంశం ఏంటంటే;
ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు బాధపడుతున్నారు అమెరికా పోయి బిర్యాని తినే కంటే ఇండియాలో అన్నం తింటే చాలు. కన్న తల్లితండ్రుల ను చూసుకోకుండా ఎందుకీ మానవ జీవితం. ప్రతి బిడ్డ ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. ఇది ఒక పేరెంట్ ఆవేదన.
ఆ ఆవేదనకు అర్థముంది. అది నిజమే. కానీ నేటి సమాజ స్థితిగతులను పరిశీలిస్తే ఆ విధానాలను ప్రోత్సహించేది కూడా మన తరంవారే కదా. అందుకు సామాజిక భద్రత మరియు హోదా అనే అంశాలు ప్రథమ పీఠాన్ని వేస్తాయి. అక్కడే రెండు తరాల మధ్యన ఆలోచనల విధానంలో అవకలనం గోచరిస్తున్నది. మన ముందు తరం వారి ఆలోచనలకు మన తరం ఆలోచనలకు తేడా ఉన్నట్లే మనకు మన తరువాతి తరం వారికీ కూడా ఆలోచనలలో, జీవనశైలిలో, అలవాట్లలో ఎన్నో అసమానతలు కనబడతాయి. అందుకు కారణం సమాజంలో వస్తున్న జీవన ప్రమాణాల మార్పులు, జీవనశైలిలో జరుగుతున్న అభివృద్ధి పోకడలు. ఆ సమాజంలోనే మనమూ ఉన్నాము కనుక వాటి ప్రభావం మనమీద ఖచ్చితంగా కనపడుతుంది. ఒక చిన్న ఉదాహరణ మన తరం చిన్నప్పుడు మైళ్ళ కొద్ది నడకతో చదువులను కొనసాగించాము. నేడు మన పిల్లలు నడిస్తే కందిపోతారనే మనమే వారిని వాహనాలలో తీసుకొని వెళుతున్నాము. ఆధునిక సౌకర్యాలతో ఆ ఆలోచనా విధానాలను వారి మెదడులో చిన్నప్పటి నుండి సృష్టిస్తున్నాము. అందుకు సామాజిక హోదా అనే ముసుగును అపాదిస్తున్నాము.
ఈ ఆలోచనల అంతరాలను పట్టించుకోకుండా కేవలం మన స్థానిక ఇబ్బందులు, పనిచేసే విధానాలు తదితర సామాజిక అంశాలు, సమాజ పోకడల ఆధారంగా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఒక చిన్న ఆశ అందరిలోనూ జనించి అందుకు తగిన విధంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాము. మరి అటువంటప్పుడు మనం చేసే ప్రతి ప్రయత్నం వెనుక, మంచి, చెడు రెండూ వస్తాయి కదా. సమతుల్యంతో వాటిని భరించి మనకు అనుగుణంగా మన జీవన విధానాన్ని మార్చుకోవలసిన అవసరం కూడా ఉంది. వీటన్నిటి సారాంశం ఒక్కటే, ఏదో సినిమాలో చెప్పినట్లు ‘అందరూ బాగుండాలి అందులో మనముండాలి’ మనం ఆనందంగా ఉంటూ పదిమందికి ఆనందాన్ని పంచే స్థాయికి మనం ఎదగాలి.
‘సర్వే జనః సుఖినోభవంతు’