ఆచారాలు-ఆచరణీయ వాస్తవ దృక్పధాలు 2
మతం ముసుగులో లేనిపోని హంగులూ ఆర్భాటాలు చూపించి విపరీతమైన ప్రచారాన్ని చేయడం ఒక ప్రత్యేక విధానం అయిపోతున్నది, దేవుని దృష్టిలో జీవులందరూ ఒక్కటే. మనుషులమైన మనం మన జీవన విధానాన్ని, నివసించే భౌగోళిక సామాజిక అంశాల పరంగా ఆ దైవశక్తి ని మన ఆలోచనల పరిమితుల ఆధారంగా ఒక రూపంతో ఊహించుకొని పూజిస్తున్నాము. కానీ భగవంతుడు సర్వాంతర్యామి ఆయనలోనే అన్ని జీవరాసులు ఒదిగి ఉన్నాయి. మనకు జీవన సౌఖ్యాన్ని అందిస్తున్న పంచభూతాలు ఆయన కనుసన్నలలో మసలుతున్నాయి. మన మనసును ఒక సరైన క్రమ పద్ధతిలో నడవాలంటే మన ఆలోచనా విధానం సవ్యంగా సాగాలి. అందుకు మంచి సరైన ఆయుధం దైవ చింతన. ఆ చింతనతో పాటు ధర్మబద్ధమైన కనీస సామాజిక సూత్రాలు.
మన తరువాతి తరం వారు, మనం వారిని అత్యంత గారాబంగా, అమిత చనువుతో మసలుకునే విధంగా పెంచుతున్న తరుణంలో, మన ఆచార వ్యవహారాలకు సంబంధించిన ప్రశ్నలను వారు నేరుగా మనలను అడుగుతారు. మనం చెప్పే సమాధానం శాస్త్రీయ విశ్లేషణతో కలిసి కొంచెం అర్థవంతంగా వుంటే వారు దానిని పరిగణలోకి తీసుకొంటారు. అంతేగాని, మా అమ్మ చెప్పింది, మా నాన్న పాటించాడు కనుక మీరూ పాటించాలి అంటే దానిని వారు ఖచ్చింతంగా పాటించరు. ఒక వేళ ఆచరించిననూ అది కేవలం నటన మాత్రమే. మన మనసుకు నచ్చిన పనిని చేసే విధానం, ఆత్మతృప్తి తో చేసే ఏ కార్యమైనా కలకాలం నిలిచి ఉంటుంది. అంతేకానీ ఎదుటివారి కొరకు, వారిని సంతృప్తి పరిచేందుకు చేసేది తాత్కాలికమే అవుతుంది. అది సొంత కుటుంబంలో నైనా, తల్లిదండ్రులు, పిల్లల మధ్యనైనా కేవలం యాంత్రిక స్పందనే అవుతుంది.
అసలు ఆచారాలు, దైవచింతన, సనాతన సంప్రదాయ ధర్మాలు ఇవన్నీ మనిషి జీవితం ఒక సక్రమమైన జీవన క్రమంలో సాగుతూ మానవతా విలువలతో జీవన సాఫల్యాలను సిద్ధింపజేసుకొని తద్వారా పరిపూర్ణ మానవుడిగా తన ఆలోచనల ఆదర్శాలను అత్యంత సులువుగా పాటిస్తూ, ఆనందకర జీవితాన్ని పొందాలని నిర్దేశించడం జరిగింది. ఆ ధర్మాలను సృష్టించి, సకల మానవాళి వాటిని పాటించే విధంగా చేయుటకు సిద్ధపురుషులు, దేవదూతలు, మహాపురుషులు, యోగులు ఈ భూమిమీద మానవ రూపంలో జన్మించడం జరిగింది. ప్రతి సంస్కృతి, సంప్రదాయాల వెనుక ఒక క్రమశిక్షణతో కూడిన జీవితార్థం ఉంటుంది. అలాగే ప్రతి ఆచారానికి ఒక శాస్త్రీయమైన పరమార్థం ఉంటుంది. దానిని స్వయంగా విశ్లేషించుకోవడానికి తగిన సమయం తీసుకొని ఆలోచనతో ఆచరించడం జరిగితే ఆ ఫలితం అద్భుతం.
ఎంతోమంది మహా దైవాంశ సంభూతులు ఈ భూమిమీద మానవరూపంలో జన్మించి, మనిషి జీవితానికి, సామాన్య మానవుని ధర్మబద్ధ ఎదుగుదలకు తగిన సూచనలను, ఆ సూచనల ఆచరణలో సహజంగా ఏర్పడే సందేహాలకు సరైన సమాధానాలను పొందుపరుస్తూ విలువైన ఇతిహాసాలను మనకు అందించారు. అవన్నీ మానవ దైనందిన జీవితాలను ప్రతిబింబిస్తూ అవసరమైన విధివిధానాల ఆవశ్యకతను కలిగి మనలో ఎందరికో సరైన దిశా నిర్దేశాన్ని చూపించాయి. అదేవిధంగా నాలుగు వేదాలు మనిషి జీవితం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, విశ్వదర్శన సిద్ధాంతాలు, సకల జీవుల సాంగత్య జీవన సరళి యొక్క వైశిష్ట్యము, ఇలా ఎన్నో రకాలుగా మనిషి జీవన ప్రస్థానంలో అవసరమైన ఫలాలను పొందటానికి అనువైన వనరులను అందించే మూలాధారాలుగా మన వెన్నంటే ఉండి మనలో స్ఫూర్థిని నింపుతున్నాయి.
ఇన్ని వనరులు కలిగివున్ననూ మనలో ఎందుకు నిరాసక్తత ఏర్పడుతున్నది అని ప్రశ్నించుకుంటే జవాబు చాలా సులభం. ఆ విషయాలను సరైన రీతిలో అర్థం చేసుకోలేక భాషాపరమైన ఇబ్బందులతో మనం నమ్ముకున్న గురువులను ఆశ్రయిస్తున్నాము. వారు కూడా సమయాభావం వల్ల లేక మరేఇతర కారణాల వల్ల మన సందేహాలను సరిగా నివృత్తి చేయలేకపోతే ఆ ధర్మసందేహం అలాగే మన మస్తిష్కం లో వట వృక్షమై కూర్చొని మనకు మరో ఆలోచన లేకుండా చేస్తుంది. ఆ సమయంలో వేరెవరైనా ఆ సందేహాన్ని మరో రకంగా వివరిస్తే మన ఆలోచనలు అటువైపు మరలుతాయి. మానవులమైన మనకు ఆ చపల చిత్తం అనేది అత్యంత సహజ గుణం. మనందరం దీనికి అతీతులం కాదు. ఈ విధమైన ఆలోచనల చిక్కుముడులు మన మెదడంతా అల్లుకుంటాయి. మరి దీనికి పరిష్కారం?
వచ్చే సంచికలో చూద్దాం.
‘సర్వే జనః సుఖినోభవంతు’